తాకినపుడు

bvv

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు
నీ నవ్వు కొండల్లో పరుగులు తీసే పలుచని గాలిలా వుంటుందని
పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి
చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి

కవీ, ఏం మనిషివి నువ్వు
ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని
రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం
ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు

తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని
నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించాననిపించదు నీకు

నిజానికి, వాటిని తాకకముందటి
వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు
తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు

పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా
జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం
నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు
లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ
జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు

ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా

-బివివి ప్రసాద్

మీ మాటలు

  1. a.nagaraju says:

    చాలా బాగుంది ప్రసాద్ గారూ

  2. సి.వి.సురేష్ says:

    చాలా పోయటిక్ గా ఉ౦ది సార్!
    అయితే,, అతను ..ఆమె నవ్వును కొ౦డల్లో పరుగులుతీసే పలుచని గాలితో పోల్చడాన్ని ఆమె ఎ౦దుకు నెగెటివ్ గా తీసుకొని నవ్వు ఆపేసి౦దో కాస్త స౦కోచ౦గా ఉ౦ది సార్!
    ఇక ఆమె తన నవ్వును కోల్పోవడ౦తో….
    అక్కడి ను౦డి అన్ని స్టా౦జాల్లో ఆ కవికి ప్రభోదిస్తూనే… విమర్శిస్తూనే కవిత సాగి౦ది!
    ఎక్కడో ఏదో కాస్త వెలితిగా ఉ౦ది సార్!
    కవిత మొత్త౦ చాలా కవితాత్మక౦గా సాగి౦ది….బావు౦ది!!
    @ అన్యధా బావి౦చక౦డి. కవిత చదివిన తర్వాత నాకు కలిగిన వ్యక్తిగత భావనే ఇది.!!!

    • మెచ్చుకొన్నపుడు కలిగే బిడియం వలన ఆమె మాటలూ, నవ్వులూ ఆపేసిందని. మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సురేష్ గారూ..

  3. Abdul hafeez says:

    ” మనకో ముఖం వుందని అద్దం చిబితే తప్ప తెలియక పోవడం” … “తాకక ముందటి వివసత్వ క్షణాల్లో మాత్రమె జీవించి వుండడటం”… భావుకత్వానికి మచ్చు తునకలు . సురేష్ గారి అసంతృప్తి లో నిజం వుంది.బిడియమే కారణమని భావిస్తే , ముగింపు లైన్ అలా వుండేది కాదేమో. ఊహు …థాట్ ప్రాసెస్ ఎక్కడో బ్రేక్ అయింది.కవితలో రసాత్మకమైన హృదయం వుంది. దేహం వుంది. రూప దేహాలకు అందని అలౌకిక మైన అందం వుంది, ఆనందం వుంది. ఇలాంటి భావోద్వేగం మిమ్మల్ని కుదిపేసి వివశుడిని చేసినప్పుడు మాత్రమె రాయండి. ఆ సెన్సిబుల్ పోయెట్ ఇన్ ది making

మీ మాటలు

*