ఆ రోజు “గోముఖ్” ఒక మార్మిక చిత్రం…

1

బదరీనాథ్ వెళ్ళే దారిలో చమోలీ జిల్లాలో పిపల్ కోటి అనే ఓ మాదిరి ఊరుంది. అక్కడో చిన్న అందమైన హోటల్ లో మేం ఒక రాత్రి గడిపాం. విశ్రాంతిగా అందరం ముచ్చట్లు చెప్పుకుంటున్న ఆ రాత్రి వేళ దూరాన ఉన్న ఓ కొండ మీద మోదుగ పూల మాలలా మంటల చార వెలుగుతూ కనిపించింది. అంటుకున్న అడవి ఎప్పటికి చల్లారుతుందోననుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

మర్నాడు పొద్దునే మా స్నానాలకు బకెట్లతో వేడినీళ్ళు కాచి ఇచ్చేందుకు ఇద్దరు పిల్లలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ నీళ్ళు తెచ్చుకుందుకు మేడ మెట్లెక్కి నేనూ వెళ్లాను. హోటల్ గదులు కింద ఉన్నాయి. పైనున్న అంతస్తుతో సమానంగా ఉన్న విశాలమైన కొండ భాగం. చూస్తే అక్కడో అందమైన దృశ్యం కళ్ళ ముందు పటం కట్టింది… ఒక వెయ్యి గజాల స్థలంలో వేసుకున్న రక రకాల పంటలు… వాటిలో పసుపు, వెల్లుల్లి దగ్గర్నుంచి గోధుమ వరకూ ఉన్నాయి. చిన్న గుడిసె పక్కనే విశ్రాంతిగా నెమరేసుకుంటున్న ఆవూ, పక్కనే దూడ… ఆ పక్కనే పొయ్యిమీద వేడినీళ్ళు కాగుతున్నాయి. ఈ చక్కని చిన్న ప్రపంచాన్ని పోషిస్తున్న వ్యక్తి ఎవరా అని చూస్తే, ఓ ముప్పయ్యేళ్ళ స్త్రీ నీళ్ళు మోసుకొస్తూ ప్రత్యక్షమైంది. రాత్రి అంటుకున్న అడవి గురించి అడిగితే, ‘నిర్లక్ష్యంగా విసిరేసిన చిన్న బీడీ నిప్పు చాలు అడవిని తగలబెట్టడానికి’ అంది. ఇలా అడవి అంటుకోవటం వల్ల వాగుల్లో నీళ్ళు తగ్గిపోతాయంటుంది. నీళ్ళు లేక తన ఆ చిన్న వ్యవసాయం ఎంత కష్టంగా ఉందో వివరించింది.

2

బదరీనాథ్ ఒక పది కిలోమీటర్ల దూరం ఉందనగా దారి చాలా ఇరుగ్గా మారింది. సూదిగా ఉన్న రాతి పలకలు ఒకదానిమీద ఒకటి పేర్చినట్టుగాఉన్న కొండచరియలు ఒకవైపు, లోయల అగాధాలు మరోవైపు… ఆ మధ్య దారిలో జాగ్రత్తగా బస్సును పోనిచ్చాడు మా డ్రైవర్. చినుకులతో పాటు సన్నని చలిని అనుభవిస్తూ మాకు ఏర్పాటు అయిన బసలో చక్కని భోజనం చేస్తుంటే, మా వెనుక బస్సులో వచ్చినవాళ్ళు తమ కళ్ళ ముందే ఒక ఇన్నోవా లోయలో పడిపోయిందని చెప్పారు. నోరంతా చేదెక్కింది. ఇలా వాహనాలు లోయల్లో పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకోవటం తరచుగానే జరుగుతుందట. మా డ్రైవర్ ఈ విపరీతాలకు కారణం వివరించాడు. వీలైనంత తక్కువ సమయంలో ఈ యాత్రలు పూర్తి చేసేద్దామని అనుకుంటూ డ్రైవర్ లకు రాత్రి సరిగ్గా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వకుండా, వెళ్ళకూడని వేగంతో కొండదారుల్లో పరుగులు తీయించే వాళ్ళ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని అతను చెప్పాడు. పరుగుల జీవిత వేగాన్ని కొండల్లోని నిదానపు నడక దారుల మీద overlap చెయ్యబోతే గమ్యం ప్రతీసారీ అనుకున్నట్టుగా అందదు.

బదరీనాథ్ దగ్గర అలకనంద పరవళ్ళు తొక్కుతోంది. గుడికి వెళ్లేందుకు నది మీద కట్టిన వంతెన పైన నించుని తదేకంగా నీటి ఉరవడి చూస్తుంటే ఒక్కసారిగా అందులోకి దూకేసి సుడి తిరిగి ముక్కలైపోదామనే వింతైన భయపు కోరిక… నది ఒడ్డున పితృదేవతలకు పిండాలు పెడుతున్న తంతు నిర్విరామంగా నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ వేడినీటి గుండంలో మెడలోతు మునిగి చాలాసేపు చేసిన స్నానం ఒంటిని తేలికపరిచింది. ఆలయంలో బదరీనాధుడు సుందర మూర్తి .

మా తరువాతి గమ్యం గంగోత్రి వెళ్ళే దారిలో విశాలం గా పరుచుకున్న లేత గడ్డి మైదానాలూ, ఎండలో మెరిసే మేరు పర్వతం కనువిందు చేశాయి. గంగోత్రి దగ్గర గంగమ్మ పేరు భాగీరథి. భగీరథుడు ఈ ప్రాంతంలోనే గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణ గాథ. సాయంత్రం వేళ నది వొడ్డున గుడిలో గంగాదేవికి ఆరతులూ పూజలూ జరిగాయి. గంగ భువికి దిగిన ఈ ప్రదేశం నుంచీ కాశీ వరకూ ‘గంగా మయ్యా’ అని గౌరవంగా పిలిపించుకుంటూ అన్నిచోట్లా సాయంత్రంవేళ ఆరతులు అందుకుంటూనే ఉంటుంది. హరిద్వార్ లో మే నెలలో గంగ దసరా అనే పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది.

3

కేదార్, బదరీ, గంగోత్రి యాత్ర అనుకున్నప్పుడే మా అన్నయ్యతో ‘గంగోత్రి వరకూ వెళ్లి గంగా నది జన్మస్థానం ‘గోముఖ్’ వెళ్ళకుండా ఎలా?’ అన్నాన్నేను. బయలుదేరిన 15 మందిలో గోముఖ్ వెళ్ళేవాళ్ళు అయిదుగురం లెక్క తేలాం. ‘సరే మీరు ఒక రోజులో గోముఖ్ వెళ్లి రండి. మిగతా వాళ్ళు గంగోత్రిలో మీ కోసం ఒక రోజు ఆగుతారు. తరువాత అందరం తిరిగి వద్దామ’ని తను ప్లాన్ చేశాడు. గంగోత్రి నుండి గోముఖ్ వెళ్లి రావటం మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణం. కొండల్లో ఎక్కేటప్పుడు గంటకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేము. ఒక రోజులో నడిచి వెళ్లి రాగలిగే పని కాదని అర్ధం అయింది. కానీ గంగోత్రి నుండి గోముఖ్ కు గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు. గుర్రాల మీద అయితే తెల్లారుజామునే బయలుదేరి చీకటి పడేలోగా వచ్చెయ్యగలమనే ఊహతో ముందు రోజే పర్మిట్లు తీసుకున్నాం. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, రోజుకు 15 గుర్రాలకూ 150 మంది వరకూ మనుషులకూ మాత్రమే గోముఖ్ వెళ్ళటానికి పర్మిట్లు ఇస్తారు. దీనికి కారణం, గోముఖ్ గ్లేసియర్ గడిచిన 70, 80 ఏళ్ళలోనే ఒక కిలోమీటరు దూరం వెనక్కు వెళ్ళిపోయిందని తెలుసుకోవటం… ఇంతకు ముందు గోముఖ్ కూడా మంచి ఆధ్యాత్మిక టూరిస్టు ప్రాంతం. జనం రాక పోకలూ, వ్యాపారాలూ, చెత్త కుప్పలతో కేదారనాథ్ లాగే ఉన్నట్టు అప్పట్లో వెళ్ళినవాళ్ళ అనుభవాల వల్ల తెలిసింది. మనుషుల దాడి తట్టుకోలేకేమో, గ్లేసియర్ బెదిరిన ఆవులా వెనక్కి అడుగులు వేస్తోందని గుర్తించాక, ప్రభుత్వం కళ్ళూ, చెవులూ తెరిచి, గోముఖ్ ప్రయాణాల మీద ఈ ఆంక్షలు పెట్టింది.

వెళ్ళే దారంతా తినటానికి ఏమీ దొరకదని తెలిశాక మరీ హాయి అనిపించింది. ముందురోజే గంగోత్రిలో రెస్టారెంట్ వాళ్ళను పొద్దున్నే మాకోసం పరాఠాలు తయారు చేసిపెట్టమని అడిగి, అవి తీసుకుని బయలుదేరాం. కొండల్లో వాతావరణాన్ని ఏమాత్రం నమ్మటానికి లేదు. ముందురోజు రాత్రే సన్నగా చినుకు మొదలై, వదలటం లేదు. అది ముసురు వాన లాగే అనిపించింది. ఎత్తుగా బలంగా ఉన్న అయిదు గుర్రాల మీద నేనూ, జయసూర్యా, శంకర్, జానకి, కాశ్యప్, మాతోపాటు గుర్రాలను నడిపించేవాళ్ళూ … అందరం తెల్లవారుజామునే బయలుదేరాం. నన్ను ఓ ఆడగుర్రం మీద ఎక్కమన్నారు. దాని పేరు భూరీ. కేదారనాథ్ దారిలో నేనెక్కిన పెంకి గుర్రాన్ని తలుచుకుంటూ, భయంగానే గుర్రం ఎక్కి కూర్చున్నాను. కాసేపటికి దాని వీపు మీద స్థిరంగా కూర్చున్నట్టు అనిపించిందో లేదో, ఒక్కసారిగా ఎత్తు రాళ్ళ మీదకు ఎగిరి, గట్టి చప్పుళ్ళతో డెక్కలు ఊని, నన్ను గాభరా పెట్టింది. భూరీని అదిలిస్తూ, అది నెమ్మదైన, తెలివైన గుర్రమేనంటూ నాకు ధైర్యం చెపుతున్నాడు భోలా.

4

వాన కాసేపు ప్రేమికుడి ప్రియవచనాల్లా మెత్తగా తాకుతోంది. కాసేపు పెద్దవాళ్ళ అదిలింపులా గుచ్చుకుంటోంది. లోపలి బట్టల్లోకి ఇంకటానికి అడ్డు పడుతున్న రెక్సిన్ జాకెట్ల మీదినుంచి అలుగుతూ బొట్లుగా జారిపోతోంది. పల్చని రెయిన్ కోట్లు ఒంటి నిండా వేసుకోవటానికి ప్రయత్నించినా ఆవంత సౌకర్యంగా అనిపించలేదు.

ఎక్కడా ఎండ పొడ వచ్చే ఆస్కారం కనిపించలేదు. ప్రకృతి నిశ్శబ్దంగా, సన్నని మబ్బుపొరలని ఆచ్చాదనగా చుట్టుకుని స్నానిస్తోంది. మేము తప్ప ఇంకెవరి అలికిడీ లేదు. చిన్నగా పడుతున్న చినుకులు గడ్డి పూలను వణికిస్తున్నాయి. సన్నని దారి దాటి పెద్ద వాగు దగ్గరికి వచ్చాం. నాకేమో గుర్రం దిగి నీటి పరవళ్ళ మీదినుంచి రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వాగు దాటదామని అనిపిస్తోంది. నడిచి వెళ్ళే వారికోసం ఒక దుంగ కూడా నీళ్ళ మీద వేసి ఉంది. కానీ భోలా గుర్రం దిగవద్దని ఆజ్ఞాపించాడు. భూరీ ఆగిపోయి నీళ్ళ వైపు చూస్తోంది. మనం రాళ్ళమీద ఎక్కడ అడుగు వేద్దామా అని ఎలా చూసుకుంటామో సరిగ్గా అలాగే తల తిప్పుతూ అటూ ఇటూ చూసి, టక్ మని నీళ్ళలో అనువైన చోట అడుగు వేసింది. అలాగే నీటి ఉధృతిలో జాగ్రత్తగా నడుస్తూ నది దాటేసింది. భూరీని నమ్మొచ్చనుకుంటూ ఇక నిశ్చింతగా కూర్చున్నాను నేను.

‘చీడ్ వాసా’ చేరుకున్నాం. ఆ పేరుకు అర్ధం పైన్ చెట్ల అడవి అని. నిలబెట్టిన బల్లేల లాగా ఆకాశం వైపు చూస్తున్నాయి పైన్ వృక్షాలు. చుట్టూ కొండల వాలులంతా ఆవరించి ఉన్నాయి. వాటి ముదురాకుపచ్చని సూదుల్లాంటి ఆకుల్ని కూడా కమ్ముతూ మేఘాలు… ఈ రోజుకి ప్రకృతి ప్రసాదించినది ఈ monochrome చిత్రాన్నే. నలుపూ, తెలుపు వర్ణాల లోని అన్ని ఛాయలూ నింగీ నేలా మార్మికంగా పరుచుకున్నాయి. ఆ వెలుగులో, వర్షంలో అడవి నిగూఢంగా ఉంది. నిలువెత్తు ఆరోగ్యంలా కనబడుతున్న ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకుని గబా గబా నడుస్తూ పోతున్నాడు. సాయంత్రంలోగా తిరిగి వచ్చెయ్యాలంటూ మా గుర్రాలు దాటి వెళ్ళిపోయాడు.

పైపైకి పోతున్నకొద్దీ తడిసిన శరీరాలను చలి పొరలు చుట్టుకుంటున్నాయి. చినుకుల దాడి పదునెక్కింది. ‘భుజ్ వాసా’ – అంటే భూర్జ వృక్షాల (birch) అడవి మొదలైంది. భూర్జ పత్రాల మీద ప్రాచీన కవులు కావ్యాలు రాశారని మనం విన్నాం. తెల్లగా ఉండే ఈ చెట్టు కాండం నుండి సులువుగా ఊడే పొరలను కాగితంలాగా ఉపయోగించి చుట్టలుగా భద్రం చెయ్యొచ్చు. మరీ ఎత్తులేకుండా గుబురు అరణ్యంలా ఉన్న లేత చెట్లు ఎక్కువగా కనిపించాయి.

5

6

ఒకచోట ఎవరో చేసిపెట్టిన ఒంటి స్థంభపు మట్టిమేడల్లాగా పెద్ద పెద్ద స్వరూపాలు చాలా కనిపించాయి. కొన్ని ఎప్పుడైనా కూలిపోయేలా ఉన్నాయి. వానలకు కరిగి నీరుగారిన కొండల్లా ఉన్నాయి అవి. వాటి పక్కనుంచి ఇరుకైన దారి, ఒక మనిషి, లేదా ఒక గుర్రం మాత్రమే వెళ్ళేలా ఉంది. అక్కడ చరియలు విరిగి పడటం ఎక్కువేనట. Lord of the rings సినిమా లోని mood photography ని గుర్తు చేస్తోందా ప్రాంతంలోని ఆ వింత వాతావరణం.

‘భుజ్ వాసా’ చేరాక కాస్త కిందుగా ఉన్న లోయలో నది ఒడ్డున కొన్ని కట్టడాలు కనిపించాయి. లాల్ బాబా, రామ్ బాబా ఆశ్రమాలు, GMVN గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయి. నిజానికి గోముఖ్ చూశాక అక్కడ నది ఒడ్డున ఆ రాత్రికి ఉండిపోయి మరునాడు బయలుదేరితే బాగుండేది.

అందరం గుర్రాలు దిగాం. అక్కడి నుండీ గోముఖ్ నాలుగు కిలోమీటర్లు. ఆ నాలుగు కిలోమీటర్లూ గుర్రాలు వెళ్ళటానికి అనుమతి లేదు. ఈ నియమాలు ఖచ్చితంగా ఎంత బాగా అమలు చేస్తున్నారో! ఈ ఆలోచన మిగతా కొండ ప్రాంతాల విషయంలో కూడా చేస్తే… తప్పని వాతావరణ మార్పులు ఎలాగూ తప్పవు, మన పొరపాట్ల వల్ల వచ్చే వినాశనమైనా తగ్గుతుంది కదా! గ్లేసియర్లు మననుంచి దూరం జరిగితే గానీ మనకు అర్ధం కావటం లేదు.

కాస్త తిని నడుద్దామని, తెచ్చుకున్న పరాఠాల పొట్లాలు విప్పి చూస్తే అవీ మా లాగే చలికి బిగుసుకుపోయి ఉన్నాయి. జయసూర్య అంత చలిలోనూ ఫోటోలు తియ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను ఓ సగం పరాఠా తిన్నాననిపించి నడక మొదలు పెట్టాను, అడుగు ముందుకు సాగటం లేదు. చలి వెన్నులోంచి వణికిస్తోంది. ఇలా లాభం లేదని గబగబా నడవబోతే, ఊపిరి అందలేదు. మిగిలిన వాళ్ళంతా ముందు వెళ్ళిపోతున్నారు. కొంతదూరం వెళ్ళాక వెనక్కి చూసి, నాకేమైందో అర్ధం కాక ఆగిపోయారు. వాళ్ళను నడవమని చెప్పి, నేను నెమ్మదిగా నడక సాగించాను. పన్నెండు వేల అడుగుల ఎత్తులో పరుగెత్తడానికి నా ఊపిరి సత్తువ సరిపోవట్లేదని అర్ధం అయింది. దారి చూపించటానికి మాతోపాటు ఒక గుర్రం యజమాని వచ్చాడు. అతను నా అవస్థ గమనించి చిన్న గుబురు పొద నుంచి ‘గంగ తులసి’ ఆకులు కోసిచ్చి, అవి నలిపి వాసన చూడమన్నాడు. ఆ ఆకుల ఘాటైన వాసన గుండెలనిండా చేరి, ఆయాసాన్ని తగ్గించింది. గుర్రాలు కూడా దారిలో ఆ ఆకులు తినటం చూశాను.

ఆవరించిన మబ్బు పొగల మధ్య ఎటు చూసినా రాళ్ళ గుట్టలే. రాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మొక్కలూ, చెట్ల ఆకులను తింటున్న భరల్ (కొండ మేకలు) సమూహాలు కనిపించాయి. గండశిలలు నిండిన ఆ ప్రాంతంలో నడక కష్టంగానే ఉంది. రకరకాల ఆకారాల్లో ఉన్న ఆ రాళ్ళు వింతైన రంగుల్ని చిమ్ముతున్నాయి..   కనిపిస్తూనే రాళ్ళ మలుపుల్లో మాయమౌతున్న గ్లేసియర్ మొత్తానికి దగ్గరయింది. ఆవు ముఖం లా ఒకప్పుడు కనిపించేదని అనుకునే  భాగీరథి జన్మస్థానం ఇప్పుడలా లేదు. నల్ల మట్టి చారలతో నిండిన గ్లేసియర్ నుంచి వస్తున్న నీరు ఆ మట్టిలోని ఖనిజాలనూ ఔషధ లక్షణాలనూ కూడా అందుకుంటూ ఉండవచ్చు. పసుపు పచ్చని ముక్కులున్న బలిష్టమైన కాకులు అదోరకంగా అరుస్తూ తిండి వెదుక్కుంటున్నాయి. గ్లేసియర్ వెనకనున్న శివలింగ్ మంచు పర్వతం మబ్బుల్లో పూర్తిగా దాక్కుంది. మేము కాక ఒకరిద్దరు విదేశీయులూ, సాధువులతో కలిసి మరో పదిమంది దాకా ఉన్నారక్కడ. వాళ్ళు కలలో కదిలే నీడలకు మల్లే అనిపించారు. ఓ పెద్ద కాన్వాస్ మీద ప్రకృతి గీసిన అతి పెద్ద impressionistic painting లో మేం కూడా ఒక చిన్న భాగమైనట్టుంది.

7

8

9

భాగీరథి ప్రవాహం నుంచి కాస్త నీటిని ఒక సీసాలో నింపుకుని వెనక్కు తిరిగాం. వాన మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దిగుతున్నప్పుడు రాళ్ళ మీద నడక నాకు సునాయాసంగా అనిపించింది. గంగ తులసి ఆకులు గుండెకు కొత్త శక్తినిచ్చాయి. ‘భుజ్ వాసా ’ దగ్గర మా గుర్రాలున్న చోటికి చేరేసరికి, వాళ్ళంతా చిన్న చలిమంట వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. అక్కడే కాళ్ళూ చేతులూ కాస్త వెచ్చ చేసుకుని మళ్ళీ గుర్రాలెక్కాం.

నా కాళ్ళ మీద నేను నిలబడటం, నడవటం అప్పుడు నాకెంత ముఖ్యమనిపించిందో ! నేర్చుకున్న వాళ్లకు గుర్రపు స్వారీ లో మజా ఉండొచ్చునేమో కానీ, గుర్రం మీద కూర్చుని కొండలెక్కటం మాత్రం కష్టమే. పోనీ ధీమాగా సోమరిగా కూడా కూర్చోలేం. పెద్ద పెద్ద రాళ్లున్నచోట గుర్రం మీద వెళ్తే, బాలన్స్ తప్పకుండా ఉండటం కోసం అది కిందకు దూకుతున్నప్పుడు మనం వెనక్కు వంగాలి. అది పైకెక్కేటప్పుడు మనం ముందుకు వంగాలి. గుర్రం కిందకు దూకేటప్పటి అదురుకు వెన్నూ, నడుమూ గట్టిగా లేనివాళ్ళకు ప్రమాదమే.

10

నిదానంగా ప్రకృతి నలుపూ తెలుపుల్లోంచి కుంచెను బయటకు తీసి, రంగుల్లో ముంచి విదిలిస్తోంది. సూర్యుడు ముదురు కాషాయ రంగులో బయట పడ్డాడు. ఒక్కసారిగా మార్మికతను వదిలించుకున్న కొండలు పచ్చటి రంగును వెదజల్లాయి. పక్షుల కూజితాలు మొదలయ్యాయి. గడ్డి పువ్వు నీటి రంగుల్లో మెరిసి ఠీవిగా తలెత్తింది. వాన పూర్తిగా వెలిసింది. భాగీరథి పర్వతం బంగారు రంగులో మెరిసింది. గుర్రాలు చిన్నగా పరుగు తీశాయి. అలసట అంతా మరిచిపోయి, ఇన్ని వన్నెచిన్నెలు చూపిస్తూ ఎన్నో రకాల మనస్థితుల్లోకి నెట్టిన ఆ ప్రకృతి దృశ్యాలను మెదడులో భద్రపరచుకుంటూ గంగోత్రికి ఉత్సాహంగా చేరుకున్నాం.

                                                                                             lalitha parnandi   ల.లి.త.

 

మీ మాటలు

  1. kv ramana says:

    మీ యాత్రా దృశ్యాలను గొప్పగా కళ్ళకు కట్టించారు ల.లి.త, గారూ. అంతేకాదు, మీ కవిత్వంతో మనసుకు హత్తుకునేలా చేశారు. యాత్రల మీద ఎంతో ప్రేమ, ఆసక్తి ఉంటే తప్ప ఎవరూ మీలా రాయలేరు, మీ శైలి చాలా బాగుంది. మీరు చూసి ఆనందించలేదు, అనుభవించి ఆనందించారు. అభినందనలు.

    • Lalitha P says:

      రాయటానికి ప్రోత్సాహాన్నిచ్చే మీ స్పందన కు ధన్యవాదాలు రమణ గారూ !

Leave a Reply to kv ramana Cancel reply

*