ఇంతా తెలిసి యుండి..

 

తృష్ణ

తృష్ణ


మన నలుపు తెలుపు తెలుగు చిత్రాల్లో సాంఘికాలే కాక జానపదాలూ, చారిత్రకాలు కూడా చాలా ఉండేవి కదా. వాటిల్లో తప్పనిసరిగా ఓ శాస్త్రీయపరమైన నృత్యగీతం ఉంటూండేది. ఉపమానం బాగోదు కానీ ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉన్నట్లన్నమాట. కొన్ని చిత్రాలో అయితే రెండు మూడు నృత్యగీతాలు ఉండేవి. అప్పట్లో ప్రేక్షకులు కూడా ఎంతో మక్కువగా అటువంటి నృత్యగీతాలు చూసేవారూ, వినేవారూనూ! అర్థమైపోయిందిగా.. ఈనాటి నేపథ్యం “నృత్యగీతాలు”. పాత సినిమాల్లోని కొన్ని నృత్య ప్రధానమైన గీతాలను గురించి ఇవాళ చెప్పబోతున్నాను..


సినిమాల్లో నృత్యగీతాలు అన్నీ పూర్తిగా శాస్త్రీయమైనవి కావు. కొన్ని సెమీ క్లాసికల్ గీతాలు కూడా ఉన్నాయి. ఇంకా వాటిల్లో కొన్ని పదాలు, జావళీలు కూడా ఉన్నాయి. ‘జావళి’ అంటే నాయకుడిని ఉద్దేశించి నాయిక పాడే శృంగారభరితమైన విరహగీతం. ఐతే, ఎక్కువగా ఇవి శాస్త్రీయనృత్యముపై ఆధారపడి శృంగార రస ప్రధానంగా ఉంటాయి. పదము, జావళీ.. ఈ రెండు నృత్యప్రధానమైన  నాట్యరీతులూ నాట్యప్రదర్శన చివరి భాగంలో ప్రదర్శిస్తూ ఉంటారు. పదములలో భక్తి రసం, అభినయం ఎక్కువగా ఉంటాయి కానీ జావళీలలో మాత్రం సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. తేలికైన భాషలో సులువుగా పాడుకునేలాగ ఉంటాయివి. కర్ణాటక సంగీతంలో కూడా ఎన్నో జావళీలు ఉన్నాయి. పూర్తిస్థాయి కచేరీ అయిపోయిన తర్వాత లాలిత్యంతో కూడిన ఇటువంటి సంగీత రచనలను పాడే అలవాటొకటి ఉంది. మన తెలుగుచిత్రాల్లో జానపదాలు, చారిత్రక చిత్రాల్లోనే కాక సామాజిక చిత్రాల్లో కూడా అందమైన జావళీలను పొందుపరిచారు మన సినీ కవులు. ఈ నృత్యగీతాలను చాలా వరకూ ఆయా చిత్రాల నాయికలే అభినయించేవారు. కొన్నింటిని మాత్రం ప్రత్యేకంగా శాస్త్రీయ నృత్యం తెలిసినవారితో చిత్రీకరించేవారు. నటి ఎల్. విజయలక్ష్మి ఇటువంటి నృత్యప్రధానమైన ఎన్నో గీతాలకు, జావళీలకూ చక్కని అభినయాన్ని అందించారు.


* ముందుగా “మంగమ్మ శపథం” చిత్రంలోని ఈ జావళీ చూద్దాం. ఎల్.విజయలక్ష్మి అభినయం, ఆ వెన్నెల రాత్రి, మండపం సెట్టింగ్.. లతలు.. రెల్లు పూలు..అన్నీ కూడా పాట మూడ్ ని ఎలివేట్ చేస్తాయి.
“అందాల నా రాజ అలుకేలరా..”


* బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గానంతో పాటూ అభినయాన్ని కూడా చూపిన రెండు మధురమైన నృత్య గీతాల్లో ఒకటి మల్లీశ్వరి చిత్రంలోని “పిలిచిన బిగువటరా..”. దేవులపల్లి రచించిన ఈ జావళి ఎంత ప్రఖ్యాతిగాంచిందో వేరే చప్పక్కర్లేదు..


* “పూజాఫలం” చిత్రంలో రెండు నృత్యగీతాలు ఉన్నాయి. రెండింటికీ ఎల్.విజయలక్ష్మే నృత్యం . ఒకటి “మదనా మనసాయెరా”. 
రెండవదైన “శివదీక్షాపరురాలనురా..” చాలా బావుంటుంది. కురంజి రాగంలోని ఈ “పదము” పదిహేడవ శతాబ్దానికి చెందిన ఘనం సీనయ్య రచన. ఇతను మధుర రాజుగారైన విజయరంగచొక్కనాథుని కొలువులోని ఒక మంత్రిట. ఈ పదానికి ఎంతో చరిత్ర ఉంది. ఎందరో గాయనీమణులు ఎన్నోసార్లు రికార్డుల్లో పాడారుట. ఇంతే కాక పలు పాత చిత్రాల్లో కూడా ఈ పదాన్ని వాడుకున్నారు. “పూజాఫలం”లో నాట్యకళాకారిణైన ఎల్.విజయలక్ష్మి అభినయం, ఆ ముద్రలు, హావభావాలు చూచి తీరవలసిందే..! ఇక జానకి గాత్రం గురించి ఎంత మెచ్చినా తక్కువే :)
(పూజాఫలం – శివదీక్షాపరురాలనురా)

* ఇక రెండవది “విప్రనారాయణ” చిత్రంలోని “రారా నా సామి రారా”. ఈ చిత్రంలో రాజుగారి కొలువులో నాట్యకళాకారిణిగా, అహంకారిగా ఒక భక్తుడిని ఓడించడానికి వచ్చి చివరికి తానే అతడికి దాసురాలైయ్యే ప్రేమమూర్తిగా భానుమతమ్మ నటనను మెచ్చి తీరవలసిందే!
“రారా నా సామి రారా.. ” (విప్రనారాయణ)క్రింద లింక్ లో వినవచ్చు:


* బొబ్బిలి యుధ్ధం చిత్రంలోని “నిను చేర మనసాయెరా” కూడా ఎల్.విజయలక్ష్మి అభినయించిన జావళీయే. ఇందులో సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి పి.సుశీల గాత్రాన్నందించారు.
నిను చేర మనసాయెరా నా స్వామి (పి.సుశీల – బొబ్బిలి యుద్ధం) 

* దేవదాసు చిత్రానికి ఆర్.బాలసరస్వతీదేవి పాడిన మరో నృత్యగీతం “ఇంతా తెలిసి యుండి ఈ గుణమేలరా…”. చివరలో “మువ్వ గోపాలా” అని వస్తుంది కాబట్టీ ఇది క్షేత్రయ్య పదమేమో అనుకుంటాను నేను. ఈ సినిమా రికార్డ్ మీద అన్నీ తప్పులే రాసారని వి.ఏ.కే. రంగారావుగారు ఎక్కడో కోప్పడ్డారు కూడా.
క్రింద లింక్ లో ఈ పాటను వినవచ్చు:

 
* “జయసింహ” చిత్రంలో పి.సిశీల పాడిన జావళి “నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామీ..”. అభినయం చేసినదేమో ప్రఖ్యాత హిందీ సినీతార వహీదా రెహ్మాన్.
టి.వి .రాజు సంగీతం, సముద్రాల జూనియర్ రచన.



 * ప్రఖ్యాత కర్ణాటకసంగీత విద్వాంసురాలు ఎమ్.ఎల్.వసంత కుమారి “జయభేరి” చిత్రానికి ఒక నృత్యగీతాన్ని పాడారు. వీరు సినిమాల కోసం పాడిన అతి తక్కువ పాటల్లో ఇది ఒకటి. మరొకటి “భలే అమ్మాయిలు” చిత్రం కోసం “గోపాల జాగేలరా.. నను లాలించి పాలింప రావేలరా..” అని గాయని పీ.లీలతో కలిసి పాడారు.
పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన “నీవెంత నెరజాణవౌరా..”  క్రింద లింక్ లో వినవచ్చు:


* పి.సుశీల “శ్రీ కృష్ణ విజయం” చిత్రం కోసం పాడిన మరో పాట “జోహారు శిఖిపింఛమౌళి ” ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఈ పాటలో సుశీలమ్మ రాగాలాపన, హై పిచ్ కి వెళ్ళినా తరగని ఆ గాత్ర మాధుర్యం నాకెంతో నచ్చుతాయి. పెండ్యాల సంగీతం. ఈ పాటకు నాట్యం చేసినదేమో మరో ప్రముఖ హిందీ నటి “హేమమాలిని”. విడియో దొరకలేదు. క్రింద లింక్ లో ఆడియో వినేయండి:


* దర్శకుడిగా విశ్వనాథ్ మొట్ట మొదట తీసిన “ఆత్మ గౌరవం” చిత్రంలో ఓ చక్కని క్షేత్రయ్య పదాన్ని వాడుకున్నారు. “ముందటివలే నాపై నెనరున్నదా సామీ..” అని సుశీలమ్మ గానం చేస్తుంటే… వినడానికి రెండు చెవులు సరిపోవు అనిపిస్తుంది నాకైతే. అంత బాగా పాడారావిడ. ఈ పాట ఎంత వెతికినా నెట్లో దొరకలేదు :(



* మిస్సమ్మ చిత్రం లో మరో నృత్యగీతం ఉంది. “బాలనురా మదనా” అనే ఈ గీతాన్ని కూడా పి.సుశీల గానం చేసారు. పింగళివారి రచన, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం. 
గీతాన్ని క్రింద లింక్ లో వినవచ్చు..



మరికొన్ని నృత్య గీతాలు:

* తెనాలి రామకృష్ణ: ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా(పి.లీల)
(లిస్ట్ లో ఆఖరి పాట)

* రారా ప్రియా సుందరా (భక్తప్రహ్లద )
*అందని సురసీమనీదేనోయీ (భక్తప్రహ్లద)
*మనసైన దాననురా (వీరాంజనేయ)
సాలూరి, ఆరుద్ర
* ఎంతటి సరసుడవో (మల్లమ్మ కథ)
* అందెలు పలికె (భక్తపోతన)
* సరసాల జవరాలను (పి.లీల)(సీతారామకల్యాణం)
* జోహారు గైకొనరా (పి.లీల) (అప్పు చేసి పప్పు కూడు)
* అందాల బొమ్మతో (పి.సుశీల)(అమరశిల్పిజక్కన్న)
* నగుమోము చూపించవా గోపాలా(అమరశిల్పిజక్కన్న)
* మనసే వికసించెరా (అమరశిల్పిజక్కన్న)


చివరిగా బాపూ కళాత్మక సృష్టి “ముత్యాల ముగ్గు”లోని ఈ పాట చూపెట్టకపోతే ఈ వ్యాసం అసంపూర్ణం అనిపించదూ…:) 
అసలు చీర కట్టులోని అందం బాపూ చూపినట్టుగా ఎంకెవరూ చూపలేరు అని నాకో గట్టి నమ్మకం.
(ముత్యాల ముగ్గు: ఎంతటి రసికుడవో..)


( మరో నేపథ్యంతో మళ్ళీ కలుద్దామేం…)

మీ మాటలు

  1. వేణూశ్రీకాంత్ says:

    పాటల సెలక్షన్ బాగుందండీ, ముత్యాలముగ్గుతో ముగించడం మరీ బాగుంది :-)

  2. kv ramana says:

    మంచి జావళీలు విని ఆనందించామండీ. మంచి సెలక్షన్. ఆ పాటలు రాసిన కవులు అందరి పేర్లూ ఇచ్చి ఉంటే బాగుండేది. అదేమిటో, చాలామంది పాటలు గుర్తుపెట్టుకుంటారు కానీ కవిని మరచిపోతారు. దయచేసి ఇది మీమీద ఆరోపణ అనుకోకండి. మీరు తీసుకున్న సోర్సు లోనే కవి పేరు లేదేమో. ఇక ముందైనా వీలైనంతవరకు కవి పేరు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారని ఆశ.

    • @ కే.వి.రమణ: రమణ గారూ, నాకూ ఇదే కంప్లైంట్ అండీ. చాలా చోట్ల పాడినవారి పేరు,సంగీతం చేసినవారి పేరు చెప్తారు కానీ రచన ఎవరిదో రాయరు. నా బ్లాగ్ టపాల్లో నేను పెట్టే పాటలకు గీతరచయిత పేరు తప్పకుండా రాస్తూంటానండి. ఈ సిరీస్ లో నేను కేవలం ఒకే టాపిక మీద ఉండే కొన్ని పాటలు అని మాత్రమే రాద్దాం అనుకున్నానండి. వివరాలు రాయదలుచుకోలేదు. రాద్దామన్నా కొన్ని పాటలకు వివరాలు దొరకడంలేదు కూడానండీ..:(
      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

మీ మాటలు

*