ఇంకేమి కావాలి మనకి ?

270935_4171892938756_454406042_n
ఏకాంతమో వంటరితనమో
ప్రపంచం అంతా చుట్టూ కదులుతూ ఉన్నపుడు
కదలికలు లేని మనసులో
జ్ఞాపకాలు తమ వాటా గది ఆక్రమించేసి గడ్డ కట్టేసాక
శ్వాసలు కొవ్వోత్తులే ఆవిరయిపోయాక
వెలుతురు తడి దృశ్యం అస్పష్టంగా కళ్ళని తడుముతుంటే
మాటల గొలుసుల సంకెళ్ళ రాపిడిలో మనసులు నలుగుతుంటే
విరిగింది ఊపిర్లో పెదవులమీద నవ్వులో తేల్చుకోవటం కష్టమే కదూ ?
****
అవిశ్వాసాలు అపనమ్మకాలు చైనా వాల్ లా ద్వేషపు గోడలు అడ్డం కడుతుంటే
ఆనందానికి  బాధకి అర్ధం తెలియని కన్నీటి  ముచ్చట్లు చెంపలను ముద్దాడుతున్నపుడు
ఆత్మలకి అందనంత దూరం లో బ్రతికేస్తూ
నుదిటి రాతల్లో, డెస్టినేషన్ లేని దారుల్లో సముద్రపు ఇసుకలా కలిసిపోతూ
కళ్ళు మర్చిపోయిన కలలని కాలం తో అల్లుకుపోతూ
గుండెలుగుండె చప్పుళ్ళు పూర్తిగా వేరై శ్వాసిస్తూనే ఉన్నా బ్రతికిలేనట్టుగా
ఇత్తెఫాక్ గానే చాన్సులన్నీ  జీవితానికి పోగొట్టుకొని
ఓడి గెల్చానో
గెలుపుల్లో ఓటమికి ఓదార్పయ్యానో  తేల్చుకోవటం కష్టంగానే ఉంది
****
నిన్ను చాలాసార్లు అడగాలి అని అనుకుంటాను జీవితం
నన్నే సంపూర్తిగా సమూలం గా నీకిచ్చెసానుగా ఇంకా ఈ శోధనలెందుకు?
తీరాలు లేకుండా ప్రవహించే నీ జీవనదిలో ఎప్పుడో మునిగిపోయానే
నీకు నాకు మధ్య మొగ్గలు తొడగని తోటల్లా మిగిలిన ఈ ఖాళీలు ఎందుకు
మాటలు మనసులు  నీతో పంచుకోవాలని ఎంతగానో అనుకుంటాను
నీ నిశబ్దపు కేకలు అర్ధం చేసుకోవాలి అని ఎంతగానో ఎదురుచూస్తాను
ఆశాంతి వేదన పడే నిన్ను దూరంగా నిలబడి అయినా ఓదార్చాలి అనుకుంటాను
నీ కన్నీటికి తోడుగా  నాతో దొంగిలించి తెచ్చుకున్న నా ఆత్మని ఒక్కసారి
నీకు తోడు గా ఇవ్వాలి అన్న కోరిక ని దాచుకోలేక ,ఓర్చుకోలేక
ఇచ్చి నీ బంధనాల్లో ఇరుక్కోలేక , నీకై చావాలో నాకై బ్రతకాలో
తేల్చుకోవటం నిజంగా కష్టం గా ఉంది .
****
ఒకటి మాత్రం నిజం
వెన్నెల తడి అరచేతుల్లో మెరిసినపుడో
వేకువ వర్షాలు కళ్ళని తడుపుతూ తృప్తిగా శరీరంలోకి  ఇంకుతున్నపుడో
తెలిమంచుల్లో గాలులని బుగ్గల నిండా నింపుకొని సంబరపడ్డపుడో
నన్ను నేను మర్చిపోయి మైమరచిన ప్రతిక్షణం
నాలో లేని నిన్ను చాలా మిస్ అవుతున్నాను
****
కలవని సరళ రేఖల్లా మన ప్రయాణం ఎంత కష్టమో తెలియదు
విడిపోయిన కాంతి కిరణాల్లా ఎంత మన మధ్య ఎంత దూరమో అసలే తెలియదు
స్పందనలు ప్రతిస్పందనల న్యూటన్ ౩ర్డ్ లా విశ్వ నియమాలు ఉన్నంత  కాలం
నేను ఓడినా, నువ్వు గెలిచిన నీకు నేను తోడుగానే ఉంటాను
నా చీకటి నీడలా నువ్వెపుడు నా వెంటే ఉంటావు.
చాలదూ? ఇంకేమి కావాలి మనకి ?

-నిశీధి

చిత్ర సౌజన్యం: ఏలే లక్ష్మణ్

మీ మాటలు

 1. Rare imges which are only reflected in your poetry nisheedhi garu.great human chemistry in this poem.
  Congrats

 2. ఒంటరితనంలోని చిత్రమైన వేదనతో పాటు కొంత కలగలిసిన స్థైర్యం వడబోసి మైత్రీబంధంలోని చిక్కనైన అల్లికను పొందికగా హత్తుకునేలా సున్నితంగా మీదైన శైలిలో హృద్యంగా చెప్పారు నిశీ.. అభినందనలు..

  • నిశీధి says:

   తిలక్ గారు కొన్ని వాక్యాల వెనక మీ పోఎటిక్ జర్నీ ఇన్స్పిరేషన్ ఉంది :) థాంక్స్ డ్యూడ్
   ,

   • నిశీధి says:

    సర్ జీ ఆత్మీయత కి అర్ధం నేర్పిమ్దే మీరు . స్వేచ్చ లేకుండా నిశీ లేదు . :) థాంక్స్ ఫర్ లవ్లీ వర్డ్స్ @ వర్మ గారు

 3. వాసుదేవ్ says:

  “కలవని సరళ రేఖల్లా మన ప్రయాణం ఎంత కష్టమో తెలియదు
  విడిపోయిన కాంతి కిరణాల్లా ఎంత మన మధ్య ఎంత దూరమో అసలే తెలియదు” మీ కవిత్వవాక్యాలు అలా పైపైనే చదివేసి అర్ధం అయిందని నన్ను నేను ఏమార్చుకోలేను. మళ్ళీ మళ్ళీ చదివి చివరిదాకా వచ్చాక మళ్ళీ వెనక్కెళ్ళీ ఎక్కడో ఓ చోట ఆగిపోతాను. ఇదిగో ఈ సారి ఇక్కడ ఆగిపోయాను ఈ వాక్యాల దగ్గరే. ఇక ఇంతకంటే చెప్పలేనేమొ

  • నిశీధి says:

   సర్ మేఘాలు , మేరు పర్వతాలు ఎక్కడ ఆగవు . ఆగినట్టు అనిపించినా ఒక సెకన్ అంతే గా. మీ ప్రోత్సహం తో నే ఈ చిన్న దూది పింజ ఎగరడం అయినా :) థాంక్స్ అలోట్ . @ శ్రీనివాస్ వాసుదేవ్ గారు

 4. వాహెద్ says:

  జ్ఞాపకాలు తమ వాటా గది ఆక్రమించేసి గడ్డ కట్టేసాక
  శ్వాసలు కొవ్వోత్తులే ఆవిరయిపోయాక
  ఇలాంటి అద్భుతమైన ఇమేజస్ తో వాస్తవాల అద్దం చూపించడం మీకే సాధ్యం.

  • నిశీధి says:

   నలుపు తెలుపుల ను గాలిబ్ మాయం చేసి అందులో సున్నితత్వం నాక్కొంచం అంటించినందుకు కృతఙ్ఞతలు @ వాహెద్ గారు

 5. అక్షరం అక్షరంగా కవిత్వాన్ని నిర్మించడమూ…
  ఒక్కమానవ సంబంధం కోసం కణం కణం క్షణం క్షణం
  తపించిపోవడమూ…వేరు వేరు కాదు

  నిశీ! బ్లెస్డ్

  • నిశీధి says:

   నవీన్ సర్ ఇంత అభిమానం తో ప్రతిసారి భుజం తడుతున్నందుకు చాల థాంక్స్ @ నవీన్ గారు

 6. నిశీధి says:

  “Every child is an artist, the problem is staying an artist when you grow up” – Pablo పికాసో : అలా కనబడని ఆర్ట్ ని కూడా నిద్రలేపే ఇన్స్పిరేషన్ ఇస్తున్న సారంగ కి ముఖ్యం గా అఫ్సర్ గారికి :) హార్ట్ ఫెల్ట్ థాంక్స్ .

 7. సి.వి.సురేష్ says:

  ఆత్మాభిమానాలు ….మొక్కవోని ఆత్మ విశ్వాసాల వెనుక ఎన్నో ఆటుపోట్లు …స౦క్లిష్టతలు సగటు మనిషి ఎదుర్కోక తప్పదు. అలా౦టి జీవన స౦క్లిష్టత అనుబ౦ధాల మధ్య కొట్టుమిట్టాడే ఒక అద్భుత దృశ్య౦ .. ఈ కవిత.! నిశీధి గారు! ఈ కవిత ఒక సగటు మనిషి యొక్క ఆటోబయగ్రఫి లాగా ఉ౦ది. హేట్సాఫ్! మొదటి స్టా౦జాలో సబ్ కాన్షియస్ తో మాట్లాడుతూ ప్రశ్ని౦చుకోవడ౦ కనిపి౦చి…..వె౦టనే రె౦డు మూడు స్టా౦జాలో పడుతున్న వ్యధను భరి౦చడ౦ కష్ట౦గానే ఉ౦దని కన్ఫర్మ్ చేసేశారు. జీవనపోరాట౦ ఎ౦త తీవ్రత గా ఉ౦దో చిక్కటి కవిత్వ౦తో అద్భుతమైన ప్రతీకలతో చెప్పేశారు.. !! అన్ని స్టా౦జాల్లో ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ! అద్భుత౦! దూరమైన దేదో దగ్గరు౦టే బావుణ్ణు అనే బాధను గు౦డెను మెలిపెట్టెలా పదాలను కూర్చి చిక్కగా అల్లారు.. ఈ కవిత గురి౦చి ఎ౦త చెప్పినా తక్కువే.. అత్యద్భుత౦!
  మనిషి తన అ౦తర్ జగత్తులో తనను తాను దర్శి౦చుకోవట౦ , ఎలా౦టి హిపోక్రసి లేకు౦డా, జరుగుతు౦ది. అలా దర్శి౦చుకొన్న క్షణాల్లో చెలరేగిన అ౦త:స౦ఘర్షణ ఈ కవిత౦తా పరచుకొ౦ది..! ఈ కవితలో ఎ౦త విచిత్రమైన నడకో పరిశిలి౦చాల్సిన అవసర౦ ఉ౦ది. తన తీవ్రమైన అ౦త: స౦ఘర్షణ ను గు౦డెలు అవిశిపోయేలా చెపుతూ వచ్చినా… చివరగా… తనను తాను కన్విన్స్ చేసుకొ౦టూ ఆత్మ విశ్వాస౦తో స౦తృప్తి పడుతున్నట్లు ముగి౦చడ౦ ఆశ్ఛర్య౦.!!! ఎ౦దుకో ఆ చివరి మాటల్లో నాకు ఒక సన్నటి హిపోక్రటిక్ పొర అగుపి౦చీ అగుపి౦చన౦త పలచగా కనిపి౦చి౦ది.! ఇ౦కో అద్భుతమైన విషయమేమ౦టే… అ౦తటి వ్యధ లోనూ ఎక్కడా నిరాశావాద౦ కనిపి౦చనీయకు౦డా రాశారు.. యూనిక్ పోయమ్… అద్భుత౦! మార్వలెస్!!! @ సి.వి.సురేష్

 8. తిలక్ says:

  reciprocates the same nisheedhi garu.my pleasure.

మీ మాటలు

*