మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

మీ మాటలు

  1. Vijaya Karra says:

    మంచి కథలన్నింటిని ఓ చోట చేర్చి ఇస్తునందుకు మొదటగా మీ ముగ్గురికి నా థ్యాంక్స్. సమీక్ష బాగుంది. ఓ మంచి పాఠంలా కూడా వుంది.

  2. Vijaya Bhanu Kote says:

    రామా సుందరి గారు మెసేజ్ పెడితే తెలిసింది. ఇక్కడ నా కథ గురించి రాసారని :)
    సమయాభావం వాళ్ళ నేను ఈ సైట్ ని మిస్ అవుతున్నానని తెలుసుకున్నాను.
    ఇంత ఓపిగ్గా కథలను చదివి, వాటికి సమీక్ష రాయడం చాలా కష్టమైనా పని. ఇందుకు మీ ముగ్గురికీ నా ప్రణామాలు.
    ప్రతి నెల ఈ శీర్షిక చదివితే మంచి కథలను గురించి తెలుసుకోవచ్చు కదా!
    నా కథ మీ దృష్టిలోకి వచ్చినందుకు ధన్యురాలిని.
    మరొక్కసారి మీ ఎఫర్ట్స్ కి నా నమోవాక్కాలు….

    • రమణమూర్తి says:

      ధన్యవాదాలు – మీకూ, రమాసుందరి గారికీ!

Leave a Reply to రమణమూర్తి Cancel reply

*