దాలిపొయ్యి

 haragopal

ఏదో ఒక ధ్యానం
లోపల కనిపించే రూపం, వినిపించే రాగం
మనసు లోపల మడుగుకట్టిన స్మ్రుతుల తాదాత్మ్యం
అలలు అలలుగా తరలిపోయిన అనుభూతులు
దరిలో కదలలేని పడవలెక్క ఒరిగిపోయిన వార్ధక్యపు మైకం
అడుగుతానన్నావుగా అడుగు
ఇతిహాసాలుగా పురాణాలుగా వింత వింత వాదాల వేదాలుగా
నాలుగో నలభయో కట్టలుకట్టబడ్డ మనిషి
ఎటు చేరుతాడంటావ్ అవతలికా, ఇవతలికా
తెలిసిందంతా బ్లాక్ హోల్స్ టు బ్లాక్ హోల్స్ గా తర్జుమా అయినంక
నిలబడ్డ నేల గోల మరిచిపోయారందరు
అలవోకగా విసిరిన తిరుగులేని బాణాలన్ని కొట్టినవాణ్ణే కొట్టేసాక
గాయాలు ఎక్కడో తెలియదు మనుషులందరికి పెద్ద పెద్ద పుట్టుమచ్చలు
ఇపుడందరు ఆ లెక్కనే గుర్తుపట్టుకుంటున్నరు
కాలం గతి తప్పలేదు, చరిత్ర గతితార్కికంగానే వుంది
మనిషే మతి తప్పిపోయాడు, చిల్లర లెక్కబెట్టుకుంటున్నడు
వుట్టికి స్వర్గానికి అందని పిల్లి శాపాలతో కాలం గడుపుతున్న శాస్త్రవేత్తలు
ఏనాటికి ఆకలికి మందు కనుక్కోలేరు
చావుకు వైద్యం చెయ్యలేరు
మనిషిని మనిషిలెక్క బతికించే హాస్పిటలన్నా కట్టలేరు
ఇల్లు వాకిలి అర్థాలు మారిపోయినయి
అమ్మకడుపులోకి తిరిగిపోలేక ఇంట్లో దాక్కుంటడు
చావుభయం వొదలక వాకిట్లకు పోయొస్తుంటడు
మొక్కలనుపెంచి తనను తాను పోల్చుకుంటడు
యుద్ధాలను చేస్తూ తనచావును తానే చూసుకుంటుంటడు
చెట్లు,గుట్టలు,వాగులు,చేన్లు తాను వేసిన బొమ్మల్లెక్కనె చెరిపేస్తుంటడు
మనిషిని గురిచూసి కొట్టే మాటలే లేవు ఏ భాషలో
మనిషికి మనిషిననే తట్టే ఆలోచనలే లేవు ధ్యాసలో
-శ్రీరామోజు హరగోపాల్

మీ మాటలు

  1. dasaraju ramarao says:

    చెట్లు,గుట్టలు,వాగులు,చేన్లు తాను వేసిన బొమ్మల్లెక్కనె చెరిపేస్తుంటడు……..ఎండమావి లాంటి అభివృద్ది వెంట మనిషి పరుగు ……..మంచి కవిత .. అభినందనలు హరగోపాల్ గారు

  2. “నిలబడ్డ నేల గోల మరిచిపోయారందరు”, “మనిషే మతి తప్పిపోయాడు, చిల్లర లెక్కబెట్టుకుంటున్నడు”, “మనిషిని మనిషిలెక్క బతికించే హాస్పిటలన్నా కట్టలేరు”.. ఇవి నేటి మనిషిపై బలమైన వ్యక్తీకరణలు. మనిషితనం పోగొట్టుకుంటోన్న మనిషి గురించి హరగోపాల్ ఆవేదన కదిలిస్తోంది…

  3. సి.వి.సురేష్ says:

    మారుతున్న ప్రప౦చ౦పై .. మనిషిని శాసిస్తున్న డబ్బుపై సగటు మనిషి వేదన.. సర్దుబాటు ధోరణి.. అతని పలాయన వాద౦ ఇవన్ని చెపుతూ వచ్చారు..
    కవితను కొన్ని స్టా౦జాలుగా విడగొడితే ఇ౦కా స్పష్టత ఉ౦టు౦ది. కవితను ఇ౦కాస్త కవితా ధోరణితో అల్లితే
    మరికొ౦త జీవ౦ పోసినట్లవుతు౦ది. బావు౦ది! హ్యూమనిజమ్ కనిపి౦చి౦ది. ప్రస్థుత వ్యధాభరిత పరిస్థితిని చక్కగా చెప్పారు..!!!!

Leave a Reply to dasaraju ramarao Cancel reply

*