అనువాద నాటకం ” ఫ్రిజ్ లో ప్రేమ ” – ఒకటవ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

పాత్రల పరిచయం

 

దృశ్యం – 1                                                                                        దృశ్యం – 5

పార్వతి                                                                                            పార్వతి

ప్రసన్న                                                                                            ప్రసన్న

పార్వతీబాయి                                                                                    పార్వతీబాయి

దృశ్యం – 2                                                                                         దృశ్యం – 6

పార్వతి                                                                                              పార్వతీబాయి

ప్రసన్న                                                                                             ప్రసన్న

పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -3                                                                                          దృశ్యం – 7

ప్రసన్న                                                                                             పార్వతీబాయి

అతిప్రసన్న                                                                                        ప్రసన్న

పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -4                                                                                           దృశ్యం – 8

చంద్రుడు                                                                                             ప్రసన్న

సూర్యుడు                                                                                            అతిప్రసన్న

చంద్రుడు

సూర్యుడు

దృశ్యం -1

( పార్వతీ (32) ప్రసన్న (35) ల ఇల్లు. ప్రసన్న తెల్ల కాగితాల కుప్పలో కూర్చున్నాడు. నోట్లో పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నాడు. పార్వతి ఫోనులో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ పచార్లు చేస్తుంటుంది. ప్రసన్న కాగితాలను చింపేస్తుంటుంది. )

 

పార్వతి: నేను పార్వతిని మాట్లాడుతున్నాను. అవునవును, కాదు.. కాదు, అవును.

 

ప్రసన్న: (రాస్తూ రాస్తూ తనలోతాను) నేను ప్రసన్నని రాస్తున్నాను. ఖచ్చితంగా ఏం రాస్తున్నానో తెలీదు. మధ్యలో ఎక్కడో ఒక పక్షం కోసం రాయడం రాదు.

 

పార్వతి: హలో… మొదటి ప్రశ్న జవాబు ‘అవును’, రెండవ ప్రశ్న జవాబు ‘కాదు’. అర్థమయిందా ? నాకిందులో ఏ confusions వద్దు. నాకు నచ్చదది. ఉంటాను మరి.

 

ప్రసన్న: ఎవరితో ఇంత clarity గా మాట్లాడేది ? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా పార్వతి ఫోన్లో. కనీసం ఫోన్లోనయినా.

 

పార్వతి: ప్రసన్నా, ఇవాళేం వారం ?

 

ప్రసన్న: మంగళవారం.

 

పార్వతి: నీకు తెల్సిందేగా. వారమంతా ప్రేమ వ్యక్తంచేయడానికి నాకు సమయం సరిపోదని. చూస్తుంటావుగా నేను పడేపాట్లు? ఇదంతా చేస్తూ కూడా ఆదివారం రోజు నీతో ప్రేమగా ఉంటానా లేదా? మన నిర్ణయమే కదా ఇది ? పూర్తి ఆదివారం అంతా నేనింకేపనీ చేయనుకదా ? అలా కాకుండా నేను వారమంతా నా పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రేమిస్తూ కూర్చుంటే నా కుక్కలేం కాను ? చంద్ర-సూర్యులు ఏమయిపోతారు ?

( ఇంతలో తలుపు నుండి చంద్ర, సూర్యులు అనబడే రెండు కుక్కలు పరుగున వస్తాయి. ప్రసన్న చాలా భయపడిపోతాడు. పరుగెత్తుతాడు. అరుస్తాడు. చంద్ర పార్వతి కొంగు నోట్లో పెట్టుకొని  కూర్చుంటుంది. సూర్య ప్రసన్న వెనకాల పడుతుంది. ప్రసన్న అరుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటాడు. పార్వతి పడీ పడీ నవ్వుతుంటుంది.)

 

పార్వతి:  సూర్య… సూర్య… మా సూర్య  మంచి వాడంట. రా.. ఇటొచ్చెయ్. ఎంత దుష్ట ప్రపంచంరా ఇది … నోరులేని కుక్క మీద కూడా కాస్త ప్రేమ చూపలేరు. రా… నా దగ్గరికి రా ( సూర్య పార్వతి దగ్గరికెళ్ళి నిల్చుంటుంది ) ఎవరంటారండి కుక్కలు మూగ జీవులని. ఏం మెచ్యురిటీ, ఎంత అర్థం చేసుకొనే గుణం.

 

ప్రసన్న: పార్వతీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్, కనీసం ఈ చంద్ర-సూర్యులకి ఓ పట్టా వేసి గొలుసుతో కట్టెయ్. వాటికి నాలుగు ఇంజక్షన్స్ ఇవ్వు. వాటి గోళ్ళు కత్తిరించు. ఓ రోజు ఎప్పుడో అవి నా ప్రాణం తీస్తాయి.

 

పార్వతి: హ్హ… హ్హ… ప్రాణం తీస్తాయండీ. పట్టా అట, గొలుసు అట, ఇంజక్షన్స్ ఇవన్నీ వెధవ పెంపుడు కుక్కల లక్షణాలు. ఇవి స్వేచ్ఛాజీవులు. వాటి స్వేచ్ఛని పరిరక్షించడమే నా కర్తవ్యం. అది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను.

 

( ప్రసన్న చెమటతో తడిసి ముద్దయిపోయాడు. భుజమ్మీది షర్టుతో మొహం తుడుచుకుంటూ నేలమీద కూర్చున్నాడు.)

 

ప్రసన్న: పార్వతీ, నాక్కాస్త ప్రేమనివ్వు.

 

పార్వతి: అలాగే ఇస్తాను, నేను కూడా కాస్త ప్రేమ తీసికొనే బయల్దేరుతాను. ఇవాళ చాలా పనులున్నాయి.

 

(ఆమె బ్లవుజు నుండి తాళంచెవి తీస్తుంది)

 

ప్రసన్న: ఫ్రిజ్ కి తాళం వేయాల్సిన అవసరం ఏమిటి? ఇంట్లో ఉండేది నేనొక్కడినే కదా. నీ ఈ అనుమానం నాకస్సలు  నచ్చదు.

 

పార్వతి: పోయిన ఆదివారం తాళం వేయడం మర్చిపోతే ఫ్రిజ్ లోని సగం ప్రేమ ఖాళీచేసావు కదా ఒకేసారి? మళ్ళీ ఆదివారం వరకు దాన్నెలా సరిపెట్టానో నా బాధ నాకే తెల్సు.

 

ప్రసన్న: (రుద్ధమయిన కంఠంతో) నాకు మరీ ఒంటరిననిపించింది. అమ్మా-నాన్నా, అందరూ బాగా జ్ఞాపకం వచ్చారు. ఇక ఉండలేకపోయాను. తెలీకుండానే ఫ్రిజ్ ముందుకెళ్ళిపోయాను. తలుపు తెరిచి చూద్దును కదా ఫ్రిజ్ లో అంతా ప్రేమే ప్రేమ. కాస్త గడ్డకట్టి ఎండిపోయినట్టుంది. కానీ చేతుల్లోకి తీసుకుంటే మెత్తని, చల్లని ప్రేమ. ఇంకేం రెండు చేతుల్తో తింటూ కూర్చున్నాడు. కడుపునిండా తిన్నాను. ఫ్రిజ్ ముందునుండి లేవడమే రాలేదు. కళ్ళమీదకి మత్తులా వచ్చిందనుకో.

 

పార్వతి: అదే మరి. భావనాలోకంలోకి వెళ్ళి బాధ్యతారహితంగా ప్రవర్తించడం! నాకస్సలు నచ్చదు.

 

ప్రసన్న: భావనా ప్రపంచంలో బాధ్యతారహితంగా ఉండకపోతే ప్రేమ తయారే అవదు మరి.

 

పార్వతి: ఇది కేవలం ఆదివారపు కార్యక్రమం, నీకెందుకు అర్థం కాదు ప్రసన్న… అరే జనాభా ఎంతగా పెరుగుతుందో చూస్తూ ప్రేమని యోగ్యమైన పరిధుల్లో వాడాలని తెలీదా ? లేకపోతే ప్రపంచంలోని ప్రేమ పది పన్నెండేళ్ళలో అయిపోవస్తుంది.

 

ప్రసన్న: బుల్ షిట్! నేను మరీ మరీ చెప్తున్నాను. భావనలోకంలో అందరూ బాధ్యతారహితంగా ఉంటేనే కావల్సినంత ప్రేమ నిర్మాణం జరుగుతుంది.

 

పార్వతి: అది ఆదివారం మాత్రమే. ఆరోజు తప్పితే నాకు మాత్రం సమయం లేదమ్మా. ఇలా ప్రతిరోజూ బాధ్యతారహితంగా ప్రవర్తించడం మీ కళాకారులకి కుదురుతుంది కానీ మాబోటి వాళ్ళకు కాదు. నీకేంటీ. కాలు కదపకుండా ఓ నాలుగొందల పేజీల నవల రాసేస్తే ఒకటీ, రెండు లక్షలొచ్చిపడతాయి ఇంటికి.

( సూర్య-చంద్రులు మొరుగుతుంటాయి)

 

పార్వతి: ఏయ్…. పదండి… ష్.. పదండి. కిందికెళ్ళండి ( అవి రెండూ వెళ్ళిపోతాయి.) నేనొస్తాను.

(పార్వతి లోపలికెళ్తుంది. ప్రసన్న ఉండచుట్టిన తన కాగితాలని ఏరుతుంటాడు. కళ్ళు తుడుచుకుంటుంటాడు. పార్వతి లోపల్నుండి రెండు చిన్న చిన్న గాజు గిన్నెలు తెస్తుంది. ఒకటి ప్రసన్నకిస్తుంది.ఒకటి తను తీసుకుంటుంది. ఇంతలో చంద్ర లోపలికొస్తుంది. పార్వతి దగ్గర మోకరిల్లుతుంది. పార్వతి దానికి తన గిన్నె నుండి కాస్తంత ప్రేమని ఇస్తుంది. ఫోన్ మ్రోగుతుంది. పార్వతి ఫోనెత్తి చంద్ర వీపుమీద గుర్రం మీద కూర్చున్నట్టుగా కూర్చుంటుంది. గదంతా తిరుగుతుంటుంది. ప్రసన్న మాత్రం ఆబగా గిన్నెలోని ప్రేమని నాకుతూ తింటుంటాడు.)

 

పార్వతి: హలో… నేను పార్వతిని మాట్లాడుతున్నాను. చెప్పండి అడ్వకేట్ దేశ్పాండే. అవునండీ… చారుదత్త కులకర్ణీమీద కేసు వేయలనుకుంటున్నాను. లేదు అతన్ని వదిలేది లేదు.మొన్నటి రాత్రి ఏదో డాన్స్ ప్రోగ్రాంకో,సినిమాకో వెళ్ళి రాత్రి ఒంటిగంటా రెండింటికి వస్తుంటే మా సందులోని ఒక కుక్క అతని స్కూటర్ వెనకపడింది. మనిషి కాస్త స్కూటరాపి పాపం ఆ కుక్కకి ఏం కావాలో చూడాలా? లేదా? ఆ పట్టున స్కూటర్ జోరుగా ముందు… ఆ వెనక ఈ కుక్క, దానిక్కాస్త కోపం వచ్చి అతని కాలిని కాస్త గీకినదనుకోండి. దానికి ఆ పెద్దమనిషి ఏం చేసాడో తెల్సా దేశ్పాండే, కర్రతో కొట్టాడా కుక్కని! Can you imagine ? ఎంత అమానుషమయిన హింసా ప్రవర్తన. నేనందుకే అతన్ని వదలదల్చుకోలేదు. కోర్టుకీడ్వాల్సిందే. లేదంటే ప్రక్కింటాయన అయితే మాత్రం, మూగజీవులని కష్టపెట్టే వాళ్ళను నేను క్షమించను. అవును. మీరు అన్ని కాగితాలు తయారుచేయండి. నేను మీ ఆఫీసుకే బయలుదేరుతున్నాను.

(పార్వతి వెనక్కొస్తుంది. ఆలోచిస్తుంది.)

పార్వతి: ప్రసన్న.. ప్రసన్న.. ఆ గిన్నె కిందపెట్టెయ్. అలా నాకుతావేంటి మొహంవాచినవాడిలా. ఆ… అయితే నేననేదేమిటంటే మనం ఇంటిపని కోసం ఓ పనమ్మాయిని పెట్టుకుందాం. ఇటు చూస్తే నా పనా పెరిగింది. ఇదివరకటిలా పని కుదరడం లేదు.

 

ప్రసన్న: సరే.

 

పార్వతి: సరే… వా.. !

(పార్వతీబాయి ప్రత్యక్షమవుతుంది. తొమ్మిది గజాల చీరకట్టు. తల్లో చేమంతిపూలదండ. ఓ దగ్గర కుదురులేని తత్వం.)

పార్వతీబాయి: నాపేరు పార్వతీబాయి. పనిమనిషిని. ఇల్లు తుడుస్తాను. బట్టలుతుకుతాను. కోయడం, చీరడం అన్ని చేస్తాను. రెండువేళలా టీ పెడతాను. పొయ్యి తుడుస్తాను. ఫ్రిజ్ శుభ్రం చేస్తాను.

 

పార్వతి: లేదు. ఫ్రిజ్ ని ముట్టుకోవద్దు. తక్కినవన్నీ చేయొచ్చును.

 

పార్వతీబాయి: సరే. నీ ఫ్రిజ్ ని ముట్టుకోను. నన్ను పనిలో పెట్టుకోండి.

 

ప్రసన్న: పార్వతీబాయి, అసలు నువ్వు మా ఇంటి వరకు ఎలా రాగలిగావు ? ఈ సందంతా వదిలేసిన కుక్కలమయంగా ఉంటుంది. అవి గురగుర మంటాయి. కరుస్తాయి. ఎట్లా వచ్చావ్ ?

 

పార్వతీబాయి: ఈ చేమంతిపూలదండ పెట్టుకుంటే ఈ ప్రాణులభయం ఉండదు. ఒంటె- గుర్రం-ఏనుగు- పిల్లి- ఎలుగుబంటి వీటన్నింటి నుండి ఏ భయము మోసమూ దరిదాపుల్లోకి రావు.

 

పార్వతి: విన్నావా ప్రసన్న… రేపట్నుండి నువ్వు ఓ చేమంతిహారం పెట్టుకుంటే పోలే…

 

ప్రసన్న: పార్వతీ, పరిహాసం చాలించు, పార్వతీబాయి నీ వివరాలేంటే? ఎక్కడదానివి. ఊరూ- పేరూ, కొంపా- గూడూ.. ?

 

పార్వతీబాయి: నేనో బీద- దరిద్ర- అసహాయ అబలని. కానీ నా చేతులకి వేగం ఉంది. ఈ చేతులకి రుచి ఉంది. చేతులకి పని ఉంది.

 

పార్వతి: నీ పరిచయం చాలింక. లోపలికెళ్ళి పని చూసుకో. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఫ్రిజ్ చుట్టు ప్రక్కలకి కూడా వెళ్ళొద్దు. ఈ అయ్యగారు రోజంతా కూర్చుని రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడడిగితే అప్పుడు చాయ్ చేసివ్వు. తక్కిన పనులన్నీ మామూలు ఇండ్లల్లోలానే, ఆ… ఇంకో విషయం. అన్నిళ్ళలో ఆదివారం సెలవు దొరుకుతుందేమో కానీ మా దగ్గర మాత్రం దొరకదు. ఆదివారం రోజు నేను ఇంటిని ఇంటిలా ఉంచాల్సి వస్తుంది.

 

పార్వతీబాయి: నాకర్థం కాలేదు.

 

పార్వతి: ఆదివారం వస్తే అదే అర్థం అవుతుందిలే.

(సూర్య చంద్రులు ఇంట్లోకి పరిగెత్తుకొస్తారు. ప్రసన్న భయపడతాడు అవి పార్వతీబాయి దగ్గరికెళతాయి. సౌమ్యంగా మారతాయి. చేమంతి వాసన వాటికి నిషానిస్తుంది. అవి నవ్వుతూ పార్వతీబాయిని చూస్తూ కూర్చుంటాయి. ప్రసన్న, పార్వతి ఆశ్చర్యచకితులయి పార్వతీబాయి వంక చూస్తుండిపోతారు. ఆమె సిగ్గుపడుతుంది.)

 

పార్వతీబాయి: ఛీ…. పొండి.. బాబూ!

(దీపాలు ఆరిపోతాయి)

( సశేషం )

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

మూల రచయిత : సచిన్ కుండల్కర్

అనువాదం : గూడూరు మనోజguduru manoja

మీ మాటలు

*