పెద్దాపురం అమ్మరసు పెళ్లి – మరికొన్ని విశేషాలూ

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

బాగా చిన్నప్పటి విషయాలలో నాకు బాగా గుర్తున్నది 1953 సెప్టెంబర్ లో జరిగిన మా పెద్దాపురం అమ్మరసు వదిన పెళ్లి. అంటే మా ఆఖరి మేనత్త (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం) రెండో కూతురన మాట. పెద్ద కూతురు జయ వదిన తరువాత అమ్మరసు వదిన, ఆ తరవాత అబ్బులు బావ (నా కంటే రెండేళ్ళు పెద్ద), ఆడపిల్లలు రత్నం, పద్మ….వీళ్ళందరూ కాకినాడ లో మా ఇంట్లో పుట్టిన వాళ్ళే. పెళ్లి కొడుకు పేరు వాడ్రేవు వెంకటేశ్వర రావు గారు…నాకు వరసకి అన్నయ్య. కిందటి సారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు “మా రాజా వచ్చాడు” అని అమ్మరుసు వదినా , అన్నయ్య గారూ నన్ను చూడడానికి మా అక్క ఇంటికి వచ్చారు.

పెద్దాపురం మామయ్య గారు

పెద్దాపురం మామయ్య గారు

ఆ నాటి ఆప్యాయతలు తలచుకుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. వాళ్లిద్దరి పెళ్ళీ పెద్దాపురం లో కొక పెద్ద సత్రం లో జరిగింది. మా మామయ్య గారు పండ్రవాడ సుబ్బా రావు గారు పెద్దాపురం లో అడ్వకేట్. ఆయన ఎప్పుడూ నవ్వుతూ గల గల లాడుతూ మాట్లాడుతూ ఉండే వారు. మా అబ్బులు బావ కాకినాడ లో పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పుడు ..అంటే 1960 లలో గుండె పోటుతో…చిన్న వయసులోనే .. పోయారు. మా దగ్గర ఉన్న ఆయన ఒకే ఒక్క ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. మా పెద్దమ్మరసు, చిన్నమ్మరసు అనే మా అక్క, సత్యవతి అత్తయ్య ఉన్న ఆ నాటి ఫోటో కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. ఇందులో సత్యవతి అత్తయ్య మా తాత గారి (సవితి) తమ్ముడు నారాయణ మూర్తి తాతయ్య గారి కూతురు. మా ఇంటి వెనకాల ఇంట్లో ఉండే వారు.

అంత బాగా జ్జాపకం లేక పోయినా నేను నా చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళలో నా దగ్గర ఉన్న సత్యవతి అత్తయ్య పెళ్లి ఫోటో, సుదర్శనం పిన్ని, భర్త సాంబశివ రావు బాబయ్య గారి ఫోటోలు కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. సుదర్శనం పిన్ని మా బామ్మ గారి తమ్ముడు తాళ్లూరి లక్ష్మీపతి రావు తాత గారు, మహాలక్ష్మి బామ్మ (తణుకు) గారి కూతురు. ఆ కుటుంబం అంతా ….సుదర్శనం పిన్ని, సువర్చల, హనుమ…(మిగిలిన పేర్లు మర్చిపోయాను)   మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. ఎంత అభిమానం అంటే ..ఒక సారి కాకినాడ లో గోదావరి జిల్లాల ఫలపుష్ప ప్రదర్శన భారీ ఎత్తున జరిగింది. తణుకు లో ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, కేంద్ర మంత్రి స్వర్గీయ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి కుడి భుజంలా ఉండే మా లక్ష్మీపతి తాతయ్య గారికి ఆవకాయలు పెట్టడం అంటే చాలా ఇష్టం. అందుచేత ఆ ఎక్సిబిషన్ లో ఆయన మా అక్క పేరిట సుమారు వంద రకాల ఆవకాయలు పెట్టి ..మొత్తం గోదావరి జిల్లాలు అంతటికీ మొదటి బహుమతి మా అక్కకి వచ్చేటట్టు చేశారు.

సత్యవతి అత్తయ్య పెళ్లి

సత్యవతి అత్తయ్య పెళ్లి

 

 

 

ఈ వ్యాసంలో జతపరిచిన ఫోటోలు వారి కుటుంబాల దగ్గర కూడా ఉంటాయి అని నేను అనుకోను. అవి కేవలం నా దగ్గర ఉండడం, ఇలా ప్రచురించుకోగలగడం నా అదృష్టం. ఈ గ్లోబల్ ప్రపంచంలో మరుగున పడిపోయి, ములిగిపోయిన ఆయా కుటుంబాల తాలూకు వారెవరికీ బహుశా నేను ఎవరో తెలియదు…

ఇంతకీ నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మరసు ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిరించిన జుట్టు కనిపించింది. అప్పుడు మా చిట్టెన్ రాజు బాబయ్య, మా నాన్న గారు పంచాయితీ పెట్టి, ఆ పెట్టె తాళం తీయిస్తే ఆ దొంగతనం బయట పడింది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరూ నగలు పెట్టుకుని వెళ్ళడం, ఇలా దొంగతనాలు జరగడం పరిపాటే !

ఇక …ముఖ్యమైనది అని చెప్పను కానీ ….మూడో కారణం నా జన్మలో నేను చూసిన మొట్ట మొదటి భోగం మేళం పెద్దాపురం అమ్మరసు పెళ్లి లోనే! ఆ రోజుల్లో పెళ్లి అనగానే మొట్ట మొదట చూసేది ఏ ఊరి బేండ్ మేళం, ఏ ఊరి భోగం మేళం, ఏ ఊరి వంటవాళ్లు మొదలైన హంగులే. అందులో కాకినాడ లేదా రాజమండ్రి బేండ్ మేళం, కోనసీమ వంటవాళ్లు పేరున్న వాళ్ళు అయితే మా ప్రాంతాలలో పెద్దాపురం భోగం మేళం చాలా ప్రసిద్ధమైనది. పెళ్లి ముందు రోజు రాత్రి ఊరేగింపు లో పల్లకీ బోయీలు, బేండ్ మేళం లో ఉన్న మంగలి వారు చమ్కీ గుడ్డలు వేసుకుని హుషారైన పాటలు వాయిస్తూ ఉంటే పది, పది హేను మంది అమ్మాయిలు సినిమా పాటలకి డేన్స్ చేస్తూ పెళ్లి వారికి వినోదం కలిగించే వారు. ఇప్పుడు ఇదంతా ఏదో సినిమా సీను లా అనిపించ వచ్చు నేమో అది ఆ రోజుల్లో అక్షరాలా నిజంగా అలాగే జరిగేది.

ఇక పెళ్లి వారిలో వయసు లో ఉన్న యువకులు ఈ మేళం వాళ్ల లో బావున్న యువతుల చేత ప్రెవేటు గా రికార్డింగ్ డేన్సులు ..సినిమాల లో లాగా….చేయించుకునే వారుట…నేను అవేమీ చూడ లేదు కానీ, పెట్రోమేక్స్ లైట్ల వెలుగులో మేళం వాళ్ళ డేన్స్ లు అప్పుడే మొట్టమొదటి సారి చూశాను కానీ అంత కంటే ఎక్కువ విశేషాలేమీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ పెళ్ళికి రెండేళ్ళ ముందు పోయిన మా తాత గారి కోరిక మీద మా పెద్దమ్మరసు పెళ్ళీ, మా మేనత్తల అందరి కూతుళ్ళ పెళ్ళిళ్లూ మా అమ్మా, నాన్న గారి చేతుల మీదుగానే జరిగాయి. పెళ్లి కి కావలసిన దినుసులన్నీ మా పొలంలో పండినవే! అన్నట్టు అప్పుడు ధాన్యం ధర “అక్కుళ్ళు” కుంచం ఒక రూపాయి.. బస్తాకి 16 రూపాయల 2 అణాలు. వెల్లుల్లి పాయలు 2 వేసెలకి 2 రూపాయల 10 అణాలు. తాపీ మేస్త్రీ కూలి రోజుకి 2 రూపాయలు. మా పెద్దన్నయ్య నాకూ, మా తమ్ముడికీ కొనిపెట్టిన 4వ క్లాసు ఎక్సెర్సైజ్ పుస్తకాలు – 100 పేజీలు  – 4 పుస్తకాలు కలిసి 2 రూపాయల 3 అణాలు. 50 తారాజువ్వలు 1 రూపాయి 8 అణాలు. తాటాకులు వందకి 1 రూపాయి 10 అణాలు. అదే పెళ్లి లో గాడి పొయ్యి లోంచి కొన్ని పెద్ద నిప్పు కణికెలు పైకి ఎగరగానే పై కప్పు అంటుకుంది అనీ, వెంటనే బిందెలతో నీళ్ళు జల్లి మంటలు ఆర్పేశారు అనీ కూడా చూచాయగా నాకు జ్జాపకం.

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

పెద్దాపురం అనగానే, ఇప్పుడు అప్రస్తుతమే కానీ ఇటీవల మరణించిన అంజలీ దేవి టెంకి జెల్ల విషయం జ్జాపకం వస్తోంది. అంజలీ దేవి ఇల్లు పెద్దాపురం లో మా మేనత్త గారి ఇంటి పక్కనే. నా చిన్నప్పుడు …నా వయసు పదకొండో, పన్నెండో….సువర్ణ సుందరి సినిమా తరువాత….నేను బహుశా వేసవి శలవులకో..మరెందుకో ….పెద్దాపురం మా మేనత్త గారి ఇంటికే వెళ్లాను. ఆ మర్నాడే అంజలీ దేవి తన ఇంటికి పెద్దాపురం వచ్చింది అని తెలిసింది. ఇక చూసుకోండి. నేను ఆ సాయంత్రం ఆ మేనత్త గారి మేడ మీదకి వెళ్లి పోయి, అంజలీ దేవి ఇంటి పెరడు కేసి చూస్తూ , పచార్లు చేస్తూ “పిలువకురా, అలుగకురా..” అనో గొంతెత్తి పాడేస్తూ ఎలాగో అలాగా ఆవిడ కనపడుతుందేమో అనో ఓవర్ ఏక్షన్ చేసేశాను. ఆ మర్నాడు అంజలీ దేవి మా మేనత్త గారి ఇంటికి వచ్చి, “నిన్న సాయంత్రం ఆ గొడవంతా నువ్వేనా?” అని నన్ను దగ్గరకి తీసుకుని ఒక మొట్టి కాయ వేసింది. అంజలీ దేవి చేత మొట్టి కాయ వేయించుకున్న అభిమానిని నేనొక్కణ్ణే అని నాకు భలే గర్వంగా ఉంటుంది…

సినిమాలు అనగానే నేను నా పదేళ్ళ వయస్సులో..అంటే ఏడాది అటూ, ఇటూ చూసిన సినిమాలు “వద్దంటే డబ్బు- భానుమతి, నాగేశ్వర రావు సినిమా”, టేక్సీ డ్రైవర్, “సంఘం (వైజయంతీ మాల), “అగ్గి రాముడు”, పరివర్తన, జాతక ఫలం, దో బీగా జమీన్, విప్రనారాయణ…మొదలైనవి.

ఒక తమాషా జ్జాపకం…..ఆ రోజులల్లో ఒక సారి మా నాన్న గారు కాకినాడ రామారావు పేటలో ఉండే సున్నపు గానుగు వాడి దగ్గర ఒక ఎద్దు కొని పొలం పంపించారు. దాన్ని బండి లాగడానికి కట్టగానే అది అలవాటు ప్రకారం బండి ని గుండ్రం గా తిప్పడం మొదలెట్టింది….ఆ అలవాటు మాన్పించి ఆ ఎద్దుని తిన్నగా నడిపించడానికి మా పాలికాపులు నానా అవస్తా పడుతుంటే మేము నవ్వు ఆపుకోలేక పోయేవాళ్ళం పది రోజుల పాటు…..

ఈ రోజులల్లో మన జీవితాలు కూడా చాలా మటుకు గానుగెద్దు జీవితాలలాంటివే కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు …….మరి మీకో?

-వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

మీ మాటలు

 1. Adavi Visweswara Prasad says:

  రాజు గారు నమస్కారం. ఇక్కడి జ్ఞాపకాలు మీలో ఇంత పచ్చిగా పదిలపరుచుకున్న మీరు “అక్కడ” ఎలా ఉండగలుగుతున్నారు?

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అదే కదా …టెక్నాలజీ అంటే…..ఒక చోట ఉండడం…..మరొక చోటి గురించి ఆలోచించుకుంటూ బతికెయ్యడం….

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అదే కదా టెక్నాలజీ అంటే? ఉండేది ఒక చోట,,,బతికేది మరొక చోట …..

   • yaddanapudi venkata ramana murty says:

    థాంక్స్ బావా! మా అమ్మా నాన్నా ల పెళ్లి ఫోటో చూపించినందుకు ! నేను సత్యవతి కొడుకుని…

 2. Pandravada kutumbam says:

  రాజ మావయ్య,
  Meeru రాసిన ఈ బ్లాగ్ చాల బాగుంది.. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చదివి, అందులోమా Nanna గారిని గురించి చదివి చాలా సంతోషం కలిగింది. మా తాతగారి ఫోటో చూసి చాలా ఆనందం కలిగింది. మా Amma కోడా చదివి చాలా సంతోషించింది. ఒక సరి ఆ మధుర జ్ఞాపకాలలోకి తీసుకుని వెళ్ళిపోయారు.

  శంకర్.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   శంకరూ,

   అస్సలు మీరందరూ అంటే నాకు ఎంత ఇష్టమో నాకే తెలియదు. ఇక మీకేం తెలుస్తుంది? ఇది వరకటి వ్యాసాల్లో అబ్బులు బావ, జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య ఫోటోలు కూడా వేశాను….మా చిన్నప్పుడు మేము అందరం కలిసే అన్ని సినిమాలూ చూసే వాళ్ళం, అన్ని వెర్రి వేషాలూ కలిసే వేసీ వాళ్ళం….

   బట్ …లైఫ్ గోస్ ఆన్

   మీ అమ్మని అడిగాను అని చెప్పు….

 3. మీ చిన్న నాటి తీపి గుర్తులు మాతో
  పంచుకొని మాలోని మరుగుపడిన ఎన్నో
  తలపులు గుర్తుకు తెచ్చారు, ధన్యవాదాలు

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   నా వ్యాసం వలన మీ చిన్నతనం గుర్తుకు వస్తే..ఆమాట కంటే ఏం కావాలి? నా జన్మ ధన్యమే!

మీ మాటలు

*