గ్రీష్మంలో కురిసే వాన

Kadha-Saranga-2-300x268

వాచ్ చూసుకుంది లిఖిత.

రైలు సరయిన సమయానికే బయలుదేరింది.

ఎదురు బెర్త్ లోనూ, పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ రాలేదు. ఈ మాత్రం ఏకాంతం దొరికి కూడా చాలా రోజులయింది మరి.

వేగం పెరిగేకొద్దీ చల్లటి గాలి మొహానికి కొడుతుంటే వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది. మనసు , శరీరం రెండూ కొద్ది కొద్దిగా సేద తీరుతున్నట్టు అనిపించింది. నాలుగు నెలలు ఇంజినీరింగ్ ట్రైనీ గా శిక్షణ పేరు చెప్పి, ఎంసెట్ విద్యార్ధుల కంటే దారుణంగా పరీక్షలు పెట్టాడు. ఎంసెట్ కి కూడా ఇంత కష్టపడలేదేమో.

రైలు ఏదో పెద్ద చెరువు పైన బ్రిడ్జ్ మీదుగా పోతుంటే గాలి మరింత చల్లబడింది. అలాంటి వాతావరణంలో తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసుపై పేరుకున్న దుమ్ము తొలగి అతని రూపం మెల్ల మెల్లగా సుస్పష్టమవుతోంది. లిఖిత పెదవులపై అప్రయత్నంగానే అందమైన చిరునవ్వు.

ఎప్పటిలాగే మళ్ళా అదే ఆశ. కనీసం రైల్లో అయినా ఒక్కసారి తనతో ప్రయాణించే అవకాశం రాకూడదూ? మనసులో జాగ్రత్తగా దాచుకున్న పెట్టె తీసింది. ఆరేళ్ళ క్రిందటివైనా, పరిమళించే ఆ క్షణాలని ఆప్యాయంగా తడుముకుంది.

తామిద్దరి మధ్యా ఒక్క మాట లేదు. ఇంటర్ మొదలైన తొలి రోజుల్లో మాత్రం నోట్సు విషయంలో రెండు మూడు సార్లు మాట్లాడుకున్నారు. ఆ మాత్రానికే క్లాసులో అందరూ తామిద్దరి మధ్యా ఏదో ఉన్నట్టు కామెంట్లు చెయ్యడం గమనించింది. వాళ్ళ బుధ్ధికి చికాకుపడి ఇక ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసింది. ఆ సమయంలో తనది ఒకే లక్ష్యం ఉండేది. ఎంసెట్ లో మంచి రాంకు తెచ్చుకుని ఇంజినీరింగ్ చదవాలి. సాఫ్టు వేర్ లో ఉద్యోగం తెచ్చుకోవాలి. పగలూ, రాత్రీ ఆ లక్ష్యంతోనే చదివేది.

సరిగ్గా ఆ సమయం లోనే ఏది జరక్కూడదో అదే జరిగింది. కాలేజీ కి చేరుకుంటూనే అతను కనపడేవాడు. ఫ్రెండ్స్ తో కబుర్లాడుతూనో, ఒక్కడూ సైకిల్ మీద కూచుని ఎవరికోసమో ఎదురుచూస్తూనో. అతనూ తన వంకే చూసేవాడు. ఇద్దరి చూపులూ కలుసుకోగానే వెయ్యి తుమ్మెదలు ఒకేసారి పాట పాడినట్టు తన చెవులకి ఇంకేమీ వినిపించేవి కాదు. ఒంట్లో ఉన్న రక్తమంతా ముఖంలోకి చేరిపోయినట్టు కందిపోయేది. కనురెప్పలు బరువెక్కిపోయేవి. శరీరమంతా వీణగా మారి అన్ని తీగలూ ఒకేసారి మోగుతున్నట్టు మధురమైన ప్రకంపనలు కలిగేవి. అతని ఎదురుగా అడుగులు తడబడేవి. మాట పెగిలేది కాదు. అతన్ని దాటి క్లాసురూములోకి వెళ్ళి తన స్థలంలో తాను కూచునేవరకూ గుండె అతి వేగంగా కొట్టుకునేది.

అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నాడని తెలీడానికి ఎంతో కాలం పట్టలేదు. అతని కళ్ళలోనే విద్యుత్తున్నట్టు అనిపించేది. కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళ అతను ఎక్కడైనా ఎదురుపడితే, గుండె మరలా గెంతులేసేది. ఆ అవస్థ అందరూ చెప్పినట్టే అపురూపంగా ఉండేది. లోకమంతా అకస్మాత్తుగా నందనవనంలా మారిపోయినట్టు తోచేది.

అది ప్రేమో, ఆకర్షణో నిర్ధారించుకునే లోపే అందులో అపశృతి. క్లాసులో తామిద్దరి గురించీ కామెంట్లు ఎక్కువయ్యాయి. తనకది చాలా అవమానంగా అనిపించేది. తామేదో దీర్ఘకాల ప్రేమికులైనట్లు మాట్లాడుకునే వారు అందరూ. దాన్ని అతను ఏ రకంగానూ ఖండించకపోవడం, వాళ్ళు కామెంటు చేస్తుంటే అతను ఆనందించడం తన మనసుని ఎంత ముక్కలు చేసిందో. అతనిది ప్రేమా కాదు, ఆకర్షణా కాదు. ఎందుకో తనను ఏడిపించాలని చూస్తున్నాడు. ఏ శతృత్వమూ లేకుండానే తనను మాత్రమే బాధపెట్టి ఆనందిస్తున్నాడు అనిపించేది. ఇలాంటి ఆకర్షణలకి లోనయి తన భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అంతే ఆ తరువాత కూడా అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ అతని పేరు తల్చుకుంటేనే తనలో కలిగే ఆ మధురమైన ప్రకంపనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది లిఖితకి. ఒక ఆదివారం సాయంత్రం తను సూపర్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేసరికి వర్షం మొదలయింది. వర్షాన్ని చూస్తోంది గానీ తనలో ఏదో తెలీని ఉద్వేగం. ఎప్పుడూ లేని మధురమైన భావన. ఎందుకో అతనే గుర్తొచ్చాడు. అతన్ని చుసి అయిదు సంవత్సరాలయింది. తరచూ గుర్తొచ్చి కలవరపెడతాడు కానీ ఇప్పుడిలాంటి సందర్భంలో గుర్తురావడం, గుండె కొట్టుకోవడం ఎందుకో చుట్టూ చూస్తే ఆశ్చర్యంగా అతను. కారుకి ఆనుకుని నిలబడి తననే చూస్తున్నాడు. కాసేపు తనని తాను నమ్మలేకపోయింది. సినిమాలో చెప్పినట్టు చూపులు గుచ్చుకోవడం అంటే ఏమిటో స్వయంగా తనకారోజు అనుభవమైంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తొలిసారి గాఢంగా అనిపించింది తను అతన్ని ప్రేమిస్తోందని. ఆ తరువాత నుంచీ వర్షమొచ్చిన ప్రతిసారీ అతను మనసు ముంగిట్లోకొచ్చేస్తాడు.

ఉలిక్కిపడి కిటికీలోంచి బయటికి చూసింది లిఖిత. చిరు చీకట్లు పడుతూ ఆకాశం మొహం చాటేస్తున్నట్టుగా ఉంది. తెలీకుండానే కన్నీటి బొట్టొకటి పెదవులపైకి జారి ఉప్పగా తగిలింది.

టి.సి వచ్చాడు. అతను టికెట్ చూసి వెళ్ళాక గమనించింది. సయిడ్ లోయర్ బెర్త్ లో ఎవరో ఒకతను. తననే చూస్తున్నాడు. విసుగ్గా చూపులు తిప్పుకుంది. అతనిలా ఇప్పటివరకూ ఎవరూ తన మనసుకి దగ్గరగా రాలేదు. చదువు చెడకూడదని అతనిమీదున్నదంతా వయసుతో వచ్చిన ఆకర్షణే అని తనిన్నాళ్ళూ నచ్చ చెప్పుకోవడం తనని తాను మోసం చేసుకోవడమే కదూ. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అది ప్రేమని. ఒక మాటా మంతీ లేకుండా కలిగినది ఆకర్షణే అయితే , అది ఇన్నాళ్ళు , ఇన్నేళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్న తరువాత కూడా సజీవంగా ఎలా ఉంటుంది?

ఇంత సేపు తల్చుకున్నవన్నీ ఎప్పటిలా మధురంగా ఉన్నాయి. ఆ పైన తల్చుకోడానికే లిఖితకు బెరుకు. ఏ అలోచనైతే తను తల్చుకోడానికి కూడా భయపడుతుందో మరి తన ప్రేమతో ముడిపడున్న ఆ అంశమే తన జీవితాన్ని ఇప్పుడు శాసిస్తోంది.

ఉన్నట్టుండి కిటికీలోంచి విసురుగా నీళ్ళుపడ్డాయి మొహం మీద. వర్షానికి అందరూ అప్పటికే కిటికీలు దించేస్తున్నారు. లిఖిత లేచి తనూ కిటికీ మూసింది.

“ఇప్పుడే చెబుదామనుకుంటున్నానమ్మా. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావ్. వర్షాన్ని గమనించలేదా?” తనకెదురు బెర్త్ లో కూచున్న ఒక పెద్దావిడ నవ్వుతూ అడిగింది లిఖితని.

లిఖిత చిన్నగా నవ్వి ఏదో చెప్పేలోపే ఆమె సెల్ మోగింది.

లిఖిత తల్లి జయంతి.

“లిఖితా. క్రిందటి నెలలో నీ గురించి అడిగి జతకం తీసుకున్నారని చెప్పాను కదా. వాళ్ళిప్పుడే ఫోన్ చేసారమ్మా. ఆ అబ్బాయి వారాంతమని ఇంటికొస్తున్నాడుట. వాళ్ళందరూ ఆదివారం నిన్ను చూడటానికి మనింటికొస్తున్నారు. ” విషయం చెప్పి ఇంకా ఏవేవో మాట్లాడి ఫోను పెట్టేసింది జయంతి.

లిఖిత అభావంగా నల్లటి ఆకాశాన్ని చూస్తూ కూచుంది. తనకు అతనే తోడుగా కావాలని ఉంది. అతని సమక్షంలో కలిగే ఆ మధురానుభూతులతో మనసు క్షణ క్షణం కొత్తగా వికసిస్తూనే ఉండాలనుంది. అతనికీ తనంటే ఇష్టముందో లేదో తెలుసుకోవాలని ఏ మూలో గట్టిగా ఆశ పడుతోంది. కానీ ఏలా తెలుసుకుంటుంది?

“అంత ఇష్టం నిజంగా ఉంటే ఇన్నాళ్ళూ మళ్ళా తనను కదిలించకుండా ఉంటాడా? ఆ అధ్యాయం ఎప్పుడో ముగిసిపోయింది. ఏదో అతనూ ఆ వయసులో ఉండే ఆకర్షణ వల్ల తననే చూడటం స్నేహితులతో చెప్పుకోవడం చేసుంటాడు. ఏ ఆధారాలతో ఇంత దూరం అలోచిస్తున్నావు? ” వివేకం వేసిన మొట్టికాయ.

ఎందుకో లిఖితకు ఈ విషయం లో వివేకం పనికిరాదనిపిస్తుంది. అతనూ తనని ప్రేమిస్తున్నాడనుకుంటేనే బావుంది.

“ఒకవేళ అతను ప్రేమించినా. ఉమ్మడి కుటుంబం. ఇంతమంది బాబాయిలనీ, తతయ్యనీ కులాంతర వివాహానికి ఒప్పించగలవా? వాళ్ళని బాధపెట్టేంత కఠినమైన మనసు నీకుందా? వేరే కులానికి చెందిన వాడిని ఇంతగా నువ్వు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పే ధైర్యమైనా నీకుందా? ” మరో మొట్టికాయ.

నీరుకారిపోయినట్టు కిటికీకి తలానించి శూన్యం లోకి చూసింది. “లేదు. తనకు అంత ధైర్యం లేదు. ఉద్యోగం వచ్చి ఆరు నెలలయినా కాకుండానే తన భద్రత గురించి భయపడుతూ పెళ్ళి చేసెయ్యాలని చూస్తున్న తనవాళ్ళని ఎదిరించే ఊహ కూడా తనకు రాదు. ”

రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. చాలా మంది ఎక్కారు. లిఖిత కిటికీ దగ్గరగా జరిగింది. కిటికీ అద్దంలో తన ప్రతిబింబం చూసి “నాతో నేను ప్రయాణించక తప్పదని ఇన్నాళ్ళకి తెలుసుకోగలిగాను” అన్న ఇస్మాయిల్ కవితలోని వాక్యాలు గుర్తొచ్చి నవ్వుకుంది.

అంతవరకు కాస్త నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు అందరూ మాట్లాడుకోవడంతో గోల గోల గా మారింది. లిఖిత మనసు పొరలు ఒక్కొక్కటే మూసుకుంటూ వాస్తవంలోకొచ్చింది.

“ఏ అదృష్టమో కలిసొచ్చేసి, అందరూ సానుకూలంగా స్పందించి తను ఇష్టపడిన వాడితోనే పెళ్ళి జరిగినా, ఆ తరువాత సంగతి? పధ్ధతులన్నీ వేరుగా ఉండే ఇంట్లో తను సర్దుకుపోగలదా? చుట్టాలందరూ తనని మెల్ల మెల్లగా పట్టించుకోవడం మానేస్తే బాబాయిలనీ, పిన్నిల్నీ, ఇంత మంది కసిన్స్ నీ కలవకుండా మిగతా జీవితమంతా గడిపేసేంత అలోచన కూడా తను చెయ్యగలదా? చిన్నప్పటినుంచీ ఎంత అనుబంధం తన వాళ్ళందరితో! వాళ్ళకీ తనంటే ఎంత ప్రేమాభిమానాలు? ఈ విషయం తెలిస్తే , ఒక్కసారిగా అందరూ తనతో మాట్లాడటం మానేస్తారు. తను తట్టుకోగలదా? ఈ ఆకర్షణంతా తనకు రాసిపెట్టి ఉన్నవాడు కలవగానే మాయమైపోతుందిలే”

నిస్సహాయత లోంచి పుట్టిన ఓదార్పేమో…

కంటికి కనపడని మనసంటే అందరికీ లోకువే. ఎవరి మనసు వాళ్ళకే ఇంత లోకువ కాబట్టే, లోకంలో ఎవరు ఎవరినైనా తేలిగ్గా బాధించగలుగుతున్నారు. మనసుకి విలువివ్వడం తప్పనిసరని ప్రతి మనిషీ తెలుసుకుంటే, లోకం ఇంకా అందంగా ఉండేదేమో…

**********

pic2

మనోజ్ తో అన్నీ కలిసాయి. సాంప్రదాయ పధ్ధతులు, జాతకాలు, ఈడూ, జోడూ, సంపాదన. మనసుతో శృతీ, గుండెతో లయా తప్ప.

ఎవరితోనూ సంబంధం లేని కాలం శరవేగంగా ప్రవహిస్తూనే ఉంది.

ఏ రోజు కా రోజు దాదాపు ఒకేలా దినచర్య రాజీలతో సాగిపోతూనే ఉంది.

పరుగున వచ్చి రైలు ఎక్కింది లిఖిత. మనోజ్ బేగ్ అందించి జాగ్రత్త చెప్పి రైలు స్టేషన్ వదలగానే ఇంటికి బయలుదేరాడు.

లిఖిత తన బెర్త్ కి వచ్చి సీటుకానుకుని కళ్ళు మూసుకుంది. రైలు అందుకోలేననే భయంతో వేగంగా పరుగెట్టుకుంటూ వచ్చిన అలసట చల్లటి గాలికి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది.

పుట్టింటికి వెళ్ళి దాదాపు ఏడెనిమిది నెలలయింది. అమ్మా, నాన్నలతో, పిన్నీ, బబాయిలతో ఫోనులు కూడా బాధ్యతల నడుమ చాలా తగ్గిపోయాయి. ఇన్నాళ్ళకి సెలవులు కలిసొస్తే వెళ్ళడానికి కూడా ఎన్నో వాదోపవాదనలు. కోప తాపాలు. పుట్టింటికి వెళ్ళాలనీ, రెండు మూడు రోజులైనా తనవాళ్ళందరితో గడపాలనుకునే తన ఆశని అర్థం చేసుకునే మనిషే అక్కడ లేడు.

ఎదురుగానూ , పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ వచ్చినట్టు లేదు.

ఒంటరి తనం…

“సర్. అర్.ఎ.సి వచ్చింది. ఏదైనా బెర్త్ ఖాళీ ఉంటే కొంచం చూడండి ప్లీజ్ ” రైలు శబ్దాన్ని చీల్చుకుంటూ ‘అతని ‘ గొంతు. ఉలిక్కిపడింది లిఖిత. గుండె వేగం పెరిగింది. ముఖం ఎరుపెక్కింది. ఎప్పుడో మర్చిపోయిన మధుర స్పందన మళ్ళీ పలకరించింది. వెయ్యి తుమ్మెదల ఘీంకారం రైలు శబ్దాన్ని మించి హృదయ వీణ పాటకి పోటిగా వినిపిస్తోంది.

టి.సి తన ఎదురుగా ఉన్న బెర్త్ ఖాళీగా ఉందని అతనికే ఎలాట్ చేసాడు.

సంతోషంగా తన ఎయిర్ బేగ్ భుజాన వేసుకుని బెర్త్ లో కూలబడిన అతను ఎదురుగా లిఖితని చూసి రెండు నిముషాలు సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాడు.

“లిఖితా. నువ్వా. ఎన్నాళ్ళయింది చూసి. బావున్నావా? జాబ్ చేస్తున్నావని విన్నాను. పెళ్ళయిందిట కదా. ”

అతను ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. స్పృహలో లేనట్టుగా తను సమాధానాలు చెబుతున్నట్టనిపించింది లిఖితకి. అంతటి ఉద్వేగంలోనూ అతని మొహం లో దేని కోసమో వెతుకుతోంది తను. అయిదు నిముషాలకే దశాబ్దపు సంశయానికి సమాధానం దొరికిందామెకి. లేచి బాత్ రూం వైపు వెళ్ళింది.

అచ్చం అప్పటి లాగే , కాళ్ళింకా వణుకుతున్నాయి. ఇప్పుడు తనకతను పూర్తిగా పరాయివాడైపోయినా.

“సార్. మోకాళ్ళు నొప్పులు నాకు. అరవై ఏళ్ళ వాణ్ణి. నాకు అప్పర్ బెర్త్ అలాట్ అయింది చూడండి. ఇక్కడెవరూ మార్చుకోవట్లేదు. కొంచం చూడండి సార్. ” ఎవరో పెద్దాయన టి.సీ ని బ్రతిమాలుతున్నాడు.

మరో ఆలోచన లేకుండా లిఖిత ఆ పెద్దాయన దగ్గరకెళ్ళింది. “అంకుల్ . నాది ఆ పక్కన లోయర్ బెర్త్. నాది తీసుకోండి. నేను మీ అప్పర్ బెర్త్ తీసుకుంటాను. ”

కృతఙ్ఞతగా లిఖితవైపు చూశాడాయన.

లిఖిత వెంటనే తన బేగ్ తీసుకుని ఆ పెద్దాయన బెర్త్ కి మారిపోయింది.

ఎప్పటిలాగే ఏ స్పందనా లేకుండా, మాటలు కూడా ఇష్టంలేనట్టు వెళిపోతున్న లిఖిత వైపు నిరాశగా చూశాడతను.

“కొన్ని మథుర స్పందనలు ఙ్ఞాపకాలుగా మిగిలిపోతేనే కలకాలం పదిలంగా ఉంటాయనుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలనురా . ” ఎవరితోనో ఫోన్లో అతను చెబుతున్న మాటలు అతను కూచున్న బెర్త్ కి వెనుకవైపున ఉన్న అప్పర్ బెర్త్ ఎక్కుతుండగా లిఖితకి స్పష్టంగా వినపడ్డాయ్.

“ఎంత పాత పరిచయమైనా, ఒక వ్యక్తిని తల్చుకున్నప్పుడల్లా మనసు జోరు వానై కురవగలగడం ఒక వరం. జీవితంలో ఎప్పుడు గ్రీష్మ ఛాయలు కనపడినా , ఇప్పుడు నేను నాలోపలొక వర్షాన్ని తేలిగ్గా ఆహ్వానించగలను. ..” అతనింకా చెప్తూనే ఉన్నాడు.

గుండె దడ కాస్త కాస్తగా తగ్గుతోంది లిఖితకి.

ఎవరి భావోద్వేగాలకూ విలువివ్వని రైలు తన తీరులో తాను పెద్దగా శబ్దం చేసుకుంటూ దూసుకుపోతోంది.

-ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

మీ మాటలు

  1. ఓకే డిఫరెంట్ స్టోరీ! బావుంది. బొమ్మ మీరే వేసారా..అది కూడా బాగుంది :)

    • ధన్యవాదాలు తృష్ణ గారు. అవును బొమ్మ కూడా నేనే వేసాను. :-)

  2. Rajesh Yalla says:

    కథ చక్కగా రాసారు. అభినందనలు.

  3. ramakrishna says:

    చాలా బాగుంది. హెర్ట్ టచింగ్ స్టొరీ.

మీ మాటలు

*