ఎండమావి

Mamata K.
ఎర్రమట్టి కాలిబాట
పక్కన గడ్డిపూలతో ఎకసెక్కాలాడుతోంది
పిల్ల గాలి
నన్ను
ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది
అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది
అనునయంగా
తెలీని భాషలో పాడుతోంది
కమ్మని కబుర్లు.
కరకరమంటూ హెచ్చరికలు పంపుతున్నాయి
బూట్లకింద నలుగుతున్న ఒకటో రెండో గులకరాళ్ళు.
ఉవ్వెత్తున ఎగసి
అబ్బురపరచే విన్యాసాలు చేసి
అల్లంత దూరంలో వాలి
నిక్కి చూస్తున్నాయి
గుంపులు గుంపులుగా నల్ల పిట్టలు.
కీచురాళ్ళతో కలిసి చేస్తున్న సంగీత సాధన
మాని
రెక్కలు ముడుచుకు కూర్చున్నాయి జిట్టలు.
unnamed
దూరంగా మలుపులో
తెల్లపూలతో నిండుగా ఓ చెట్టు.
బొండు మల్లెలు
అని ఆశగా పరిగెత్తి చూస్తే
ఒంటి రేకుల జపనీస్ చెర్రీ పూలు.
సగం ప్రపంచానికావల సొంత ఊరిని
తానుకూడా
గుండెల్లో గుక్కపట్టినట్టుంది
ఆ చెట్టు
మెత్తగా
ఇన్ని పూరేకులను రాల్చింది.
ఎన్నోఏళ్ల్లప్పుడు
విమానమెక్కిస్తూ “మళ్ళెప్పుడు జూచ్చనో నిన్ను”
అంటున్న అవ్వ కళ్లల్లో పొంగిన కన్నీళ్ళు
ఇక ఆగక
నా బుగ్గలపై రాలాయి జలజలా.
– కె. మమత

మీ మాటలు

  1. Thirupalu says:

    పిల్ల గాలి
    నన్ను
    ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది
    అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది
    మంచి అనుభూతి. బాగుంది

  2. kurmanath says:

    అవ్వల జ్ఞాపకాలు అధ్బుతం. నిజానికి, వాళ్లెపుడూ ఎప్పటికీ మనల్ని అంటిపెట్టుకునే కమ్మటి వాసన
    బాగుంది, మమతా

  3. కోడూరి విజయకుమార్ says:

    పోయెం చాలా బాగుంది మమతా !
    ‘పిల్ల గాలి నన్ను
    ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది
    అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది’

    …. దగ్గర మొదలు పెట్టి, అవ్వని జ్ఞాపకం చేసుకుంటూ ముగించడం చాలా బాగుంది … అవ్వల మాటలు తోడుంటాయి ఎల్లప్పుడూ !

  4. మమత says:

    తిరుపాలు గారు, కూర్మనాథ్ గారు, విజయ్ గారు

    పద్యం మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

మీ మాటలు

*