ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

 

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
https://www.youtube.com/watch?annotation_id=annotation_3277241873&feature=iv&src_vid=4h26GRojjfY&v=v_dz61Nz8_8
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
index
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం

మాటల రచయిత చలం

శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n

మీ మాటలు

  1. Thirupalu says:

    నిజమే! ఓ కొత్త చలాన్ని చూపించారు. ధన్యవాదాలు. అయితే ఒక మాట! చలాన్ని పొగడకండి. ఆయన్నీ ఈ రోజుకు తిట్టే వాల్లున్నారు. మనం పొగిడితే వాళ్లు తిడతారు.

    • ఇప్పుడు చలాన్ని కొత్తగా పొగడాల్సిన అవసరం లేదు. తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యంలోనే చలం లాగా విమర్శకు గానీ, పొగడ్తకు గానీ గురైన రచయిత మరొకరు లేరు. ఆయనను తిట్టేవాళ్లు ఎంతమందున్నారో, ఆయనను సొంతం చేసుకున్నవాళ్లు అంతకంటే చాలా ఎక్కువమందే ఉన్నారు. భయపడాల్సిన పనిలేదు తిరుపాలు గారూ.

  2. Rammohan says:

    చలం గారు సినిమా కు అదీ మాలపిల్లకు రాసారన్న సంగతి ఇప్పుడే తెలిసింది.చలం గారి చేత మాటలు రాయించాలన్న దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారి ఆలోచనకు జోహార్లు .సమాజం లో ముఖ్యంగా ఆలోచనా విధానం లో మార్పును కోరుకున్న రచయిత చలం.ఆయన కలం పదునే కదా ఎందరినో ఆలోచింపజేసింది.దిండ్లకింద దాచుకుని ఆయనపుస్తకాలు చదివే వారని విన్నాను.అలా చదివించించింది ఆయన రచనా పటిమయే కదా.ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది అన్యాయమే అయినా చాలా మందికే అనిపించినా ఆయా వ్యక్తులమనస్తత్వాలనుబట్టి ప్రకటించే తీరు ఉంటుంది.అవన్నీ బాగా తెలిసిన వారు కనుక చలం గారి సంభాషణలు తప్పక బావుంటాయి.ఇప్పుడు ఆ vini maa చూడాలన్న కుతూహలాన్ని రేకెత్తించారు వ్యాస రచయిత బుద్ధి యజ్ఞ మూర్తిగారు .వారికి అభినందనలు.

  3. మణి వడ్లమాని says:

    చలంగారి లోని మరోకోణా న్ని ఈ వ్యాసం ద్వారా అందరికి తెలియపరిచారు.వ్యాసకర్త,యజ్ఞ మూర్తి గారు.
    ఆ సంభాషణ ల కోసమన్నా సినిమాని మరోసారి చూడాలి.

  4. kavitha says:

    మీ వ్యాసం చదివాక చలాన్ని, ఆయన భావాల్ని చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తుల్లో మీరొకరని అనిపిస్తోంది…గొప్పగా రాశారు…అభినందలు.

  5. Manjari Lakshmi says:

    మాలపిల్ల సినిమాకి చలం మాటలు రాసారని ఇది చదివాకే తెలిసింది. అయన ఆత్మకధలో కూడా దీని గురించి ఎక్కడ చదివిన గుర్తు లేదు. చలం గురించి బాగా రాసారు. బాగుంది.

    • థాంక్యూ లక్ష్మి గారూ. అవును. ‘మాలపిల్ల’ సినిమా గురించి ఆత్మకథలో కానీ, మ్యూజింగ్స్‌లో కానీ ఆయన ప్రస్తావించలేదు. మరెక్కడైనా ప్రస్తావించారేమో తెలీదు.

  6. చాలా మంది మాలపిల్ల సినిమా ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల ఆధారంగా రూపొందిందని అనుకుంటారు, కానీ చలం గారు కూడా మాలపిల్ల అనే కథ రాశారన్న మాట. విశేషమే. రచయితకు కృతజ్ఞతలు.

  7. pavan santhosh surampudi says:

    ఏమీ అనుకోకుంటే చిన్న సూచన. మధ్యలో ఇచ్చిన సంభాషణలను మళ్ళీ మీ మాటల్లో చెప్తూ సాగేకన్నా వాటిలోని సరళత, సౌందర్యం, పాత్రోచిత భాష వంటివి విశ్లేషించి ఉంటే ఇంకా బావుండేది. చలం భావాలను ఇచ్చగించని విశ్వనాథ సత్యనారాయణే స్వయంగా చలం రాసిన అపురూపమైన భాషా శైలిని మెచ్చుకుని మురిసిపోయారు. ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆకట్టుకోగలిగిన గొప్ప శైలి చలానిది.

    • మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. నేను చేసిన పని అదే. స్వాతంత్ర్యానికి పూర్వం, సంఘంలో హెచ్చు తగ్గులు రాజ్యం చేస్తున్న కాలంలోనే ఒక సినిమాలో చలం ఎంత శక్తివంతమైన, వాడి వేడి అయిన సంభాషణలు రచించారో చెప్పడం నా వ్యాసం ఉద్దేశం. కథలో ఎలాంటి సందర్భాల్లో ఆ సంభాషణలు రాశారో కూడా వివరించాను. ఆ ఉద్దేశం నెరవేరిందనే అనుకుంటున్నా.

  8. వ్యాసం బావుంది. ఈ సినిమాలో కొంత అసహజత్వం కూడా ఉంది. మాలపిల్లకు శంపాలత పేరు తగదు. శంప నాగరాజు పాడే అష్టపదులను తన్మయంగా వినడం అభాస. కొ.కు దీనిపై రాశాడు.

  9. బాగుంది మిత్రమా

Leave a Reply to Manjari Lakshmi Cancel reply

*