మనసు పొరల జల

pulipati
కథా ఆరంభానికి ,
ముందు జరిగిన కథ
ఎప్పుడో బయటకు రాక తప్పదు
*       *       *
ఎందుకో పసిగట్టే పరికరాలు నా కాడ లేవు
నిన్ను చూడంగానే
ఎక్కడో పేరుకుపోయిన దుఃఖం
ఊపిరాడనివ్వదు
ఇంత వేసవి తీవ్రతని తడుపుతూ
నీ తలపొకటి
లోపల ప్రవహిస్తే తప్ప
దుఃఖం కోలుకుంటుంది
నిరాసక్త క్షణాలకి మనమే కదా ప్రాణం పోసి
జ్ఞాపకాల వరుసకి చేర్చేది
ఆ దుఃఖ భాండాగారం
ఎప్పటికీ తొణికిసలాడాలి
అది జీవిస్తున్న ఉనికిని నిలుపుతుంది
నువ్వు ఆనందాన్ని
వెంట తెచ్చుకున్నట్టే
నేను దుఃఖాన్ని కలిగివున్నట్టు
నిన్ను కలిసిన పిదప తెలిసిపోయింది
రెండూ కలిసిన సందర్భాలు
పూల మీదికి ఎట్లా చేరుకున్నాయో
ఇప్పటికీ సందేహమే నాకు.
పక్వ అపక్వత శరీరానికి అంటుతుంది కానీ
మనసెప్పుడూ దుఃఖపునురగతో
ఎప్పటికప్పుడు తేటమౌతుంది
555792_533520886738947_1575508102_n
నువ్వు నన్నుగా
 నా మనసుకి కోరుకుంటావు కదా!
దాన్ని అలా స్వచ్చంగా నీకందించటం కోసం
దుఃఖంలో మునిగితె తప్ప కుదరదు
*     *     *
కథ ప్రారంభానికి ,
ముందు ఒంటరిగా,కారణం లేని వెలితి
ఎడారి వ్యసనంలా
పగుళ్ళు బారిన దాహం ఎదురుచూసేది
దుఃఖమే ఒక పాయలా
కథనంతా ప్రవహించి
పచ్చని ప్రపంచాన్ని నవ్వులతో పువ్వులతో
కళకళా ప్రకటిస్తుంది.

డా.పులిపాటి గురుస్వామి
చిత్రరచన: రామశాస్త్రి

మీ మాటలు

 1. స్వచ్చంగా ఉందండి మీ కవిత !

 2. bhasker koorapati says:

  ‘స్వచ్చమూ, శుబ్రమూ మీ హృదయ కోశము…’ అన్నంత స్వచ్చంగా, వినిర్మలంగా ఉందండీ మీ కవిత!
  మీ నిర్మలమైన నవ్వులానూ ఉందండీ మీ కవిత, పులిపాటి గారూ!!
  మీ మిత్రుడు,
  –భాస్కర్ కూరపాటి.

  • dr pulipati guruswamy says:

   నమస్తే భాస్కర్ గారు …మీ అబిమానానికి కృతజ్ఞతలు .

 3. “దుఃఖమే ఒక పాయలా
  కథనంతా ప్రవహించి
  పచ్చని ప్రపంచాన్ని నవ్వులతో పువ్వులతో
  కళకళా ప్రకటిస్తుంది” అనే ముగింపు వరుసలు బాగున్నాయి. కానీ “ఇంత వేసవి తీవ్రతని తడుపుతూ
  నీ తలపొకటి
  లోపల ప్రవహిస్తే తప్ప
  దుఃఖం కోలుకుంటుంది” అనే వరుసల్లో ‘లోపల ప్రవహిస్తేనే/దుఃఖం కోలుకుంటుంది’ అంటే అర్థవంతంగా ఉండేది.

  • dr pulipati guruswamy says:

   నమస్తే సర్.ధన్యవాదములు .మీ సూచన గమనించాను.

మీ మాటలు

*