త్రిపురాంతకుడి వలసగానం

 

సిద్ధార్థ

సిద్ధార్థ

 

 

 

 

 

 

 

(మే 24: త్రిపుర నిష్క్రమణ- ఒక ఏడాది)

 

త్రిపురని మొదటిసారి చూసినపుడు బౌద్ధభిక్షువనుకున్నాను.

తెల్లటి సరస్సులా, చలికాలపు ఎండలా ఉందప్పుడు ఆయన మొహం. ఈయన చాలామందికి తెలియరు. తెలుసుకో ఇష్ట పడరు.

త్రిపుర మోపిన కథల బరువుతో, కవిత్వంతో స్థాణువులైపోయి, ఇలా కూడా రాయొచ్చేమో. కథల్నీ, కవిత్వాల్నీ అవి తీవ్ర అంతస్థాపానికి గురయ్యింది తెలుగు పాఠకలోకం. త్రిపుర మొహంలో ఏమీ తెలియదన్నట్టు, అన్నీ తెలుసుకుని చాటుకొచ్చిన అమాయకత్వమూ, త్రిపుర అన్న పేరు చూసి చాలామంది అది ఒక స్త్రీ పేరేమోనని ఊహించడం కూడా జరిగింది. త్రిపురగారి కథల్ని చదివినవాళ్ళు చాలామంది ఆయనకి స్నేహితులూ, శత్రువులూ అయిపోయారు. ఆయన కథల్లో వుండే తీవ్రతా, సాంద్రతా, ద్రవగుణమూ ఇప్పటికీ నెమరుకొస్తాయి. ఆయన్ని రెండుసార్లూ ట్రైన్‌లో, స్టేషన్‌లో ఆగినపుడే కలిశాను. ఐదోసారి… నేనూ నాయుడూ… కలిశాం.

అయితే ఎప్పుడూ అన్పిస్తూంటుంది త్రిపురకీ ట్రైన్‌కీ ఏదో సంబంధం వుందని. హఠాత్తుగా ఏదో ప్రాంతం నుండి మరేదో ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ మధ్యలో తన అలుపుకు ఆగిన రైలు కిటికీలోంచి వొక వలసపక్షిలా తల బయటికి పెట్టే అమాయకపు నవ్వు ముఖం. త్రిపుర కథల్ని చదివి చాలా సీరియస్‌గా, జ్ఞానపు బరువు చూపుల్తో ఉంటాడేమో అనుకున్నవాళ్ళు ఒక్కసారిగా త్రిపురని చూసి ఫరవాలేదు. పాపం యాభై ఏళ్ళు వుంటాయేమో అనుకుంటారు. (ఆయనకు అటూ ఇటూ డెబ్బైఏళ్ళు), జర్దాపాన్‌ వొకటి ఎప్పుడూ నాలిక కిందా, పంటి పక్కనా, దవడ లోపలికీ, ‘ఉండ’లా కదులుతూ ఉంటుంది.

అప్పుడే ఎనస్తీషియాలోంచీ, tranquility నుంచి హఠాత్తుగా తెగిపడిన కంటిచూపు, మాట్లాడుతూ… డుతూ… వుంటే మెల్లమెల్లగా జంకు ఇగిరిపోతుంది. తనపైనే తను detached గా వుండి జోక్స్‌ కట్‌ చేసుకుంటూ వుంటాడు. మాటల్లో ఆవిరయ్యే పసిపిల్లల ఆవిరితనం. కేవలం 15 కథల్లో (త్రిపుర కథల సంపుటి రెండవ ముద్రణ, 1999) త్రిపుర మనల్ని వేళ్ళతో సహా పెరికేస్తున్నాడు. (మనకు ఏమైనా వేళ్లు వుంటే అవే మనల్ని కాపాడతాయని వొక జాతక కత). ముప్పై  వరకూ రాసిన కవితల్లో తన స్థలాకాలాల్ని భద్రం చేసుకున్నాడు.

అవునూ ఈ ‘భగవంతం’ ఎప్పటివాడు. మనకంటే చిన్నవాడేమో అనుకుంటాం. ఇష్టంలేక మాట్లాడుతున్నట్టుగాని, జ్ఞాన భారంతో వంగి ప్రవర్తిస్తున్నట్టుగాని అనిపించదు. త్రిపురతో మాట్లాడుతూ త్రిపురని చదువు కోవడమూ మధ్య ఏ అగాధమూ కనిపించదు.

ఫోన్లో మాట్లాడగానే… మీకూ వ్యాంగో బొమ్మకూ ఏమైనా సంబంధం వుందా అంటే…

‘‘ఏమో నాకూ అర్థంకాలేదు. కాని ఎంతో ప్రేమతో వేశారా పుస్తకాన్ని. పాపంవాళ్ళు పెట్టే ఖర్చుల కయినా డబ్బులొస్తే బాగుండని,’’ బాధపడ్డాడు. లక్ష్మణ్‌ బొమ్మల్నీ… అందులోని నలుపు గాఢతల్నీ, తెలుపుల లోతుల్నీ తడుముతూ…

‘‘నాకు నలుపంటే ఎంతో ఇష్టం. కేవలం నలుపుతో కూడిన ముదురు రంగులంటే ఇష్టం’’ అంటూ వో కుంచె నవ్వును పారేశాడు.

మాట్లాడటం మాట్లాడక పోవడం నడుమ ఒక తెర వుంటుందనీ, ఎవరైనా వచ్చి ఆ తెరని జరిపితే ఎక్కువ మాట్లాడు తుంటాననీ అంటారు. తన రచనల గురించి ఎవరైనా వచ్చి చెప్పి, తనకే తెలియని అంశాల్ని ఆపాదించి మాట్లాడుతూంటే… ఇబ్బందిగా వుంటుందనీ చెప్తాడాయన. వెయిటింగ్‌ ఫర్‌ గొడో (బెకెట్‌ నాటకం) తను భగవంతం కోసం రాసిం తరువాతే చదివాననీ చెప్పారు.

ఫొటోలో ఉన్నవారు ( L to R ) సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నరేష్ నున్నా, గుంటక శ్రీనివాస్ …….వొక ప్లాట్ ఫారం మీది కలయిక…

త్రిపురా… ఇప్పుడేం చేస్తున్నారు… ఏం జీవిస్తున్నారు… ఏం చదువుతున్నారు…? అని అడిగితే, ‘‘ఇప్పుడు బొత్తిగా ఫిక్షన్‌ను ఇష్టపడటంలేదు. పట్టుమని ఓ పదిపేజీల కంటే ఎక్కువ చదవలేక పోతున్నాను. కొంత చదివిం తరువాత అతనేం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. పుస్తకంలో ఏం చెప్పదలచుకున్నాడో తెలిసిం తరువాత ఎలా చదవగలం? ప్రస్తుతానికిక ఫిలాసఫీయే… కవిత్వం కూడా అంతే. ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి కవిత చదివి నాకు కటింగ్‌ పంపు తూంటారు. నా కవితలు ఎక్కడయినా అచ్చయితే నా ఫ్రెండ్సే కట్‌ చేసి పోస్ట్‌ చేస్తారు వాటిని,’’ అంటూ ఇంకో టీలోకి మరో పాన్‌ వేసుకుని కొంచెం ఆపి వొక్కసారి నిశ్శబ్దించిన thought constipation లోకి…

మీ కథల influences on the readers అంటూ ఏదో మాట్లాడబోతే… ‘‘అసలు నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకున్నారంటే ఎంతో ఆశ్చర్యం, సంతోషమూ కలుగుతుంది. నేను నిజంగా తెలుసా అనే సందేహం కూడా కలుగుతుంది. (అవునూ, త్రిపురని అచ్చేసిన కవిత్వం శ్రీనివాస్‌ నువ్వెక్కడున్నావే….) 1990లో త్రిపుర బాధల సందర్భాల్ని అచ్చేసేదాక కథకుడిగా గుర్తుకురాలేదు. ఈ 1999లో రెండోసారి కథల్ని అచ్చువేస్తే కవి గుర్తుకు రావడంలేదు. కథకూ కవిత్వానికీ మధ్య వున్న విభజనను చెరిపేశాడాయన. న్యాయస్థాం ముందు ద్వారపాలకుడిలా… వేచి… వేచి… ఎవర్నీ లోపలకి వెళ్ళనీయక కాపలా కాస్తున్నాడు. కాఫ్కా అయి, trial లోకి తనని పంపించుకుని, ఇదంతా… ఎందుకు? ఏమిటని ప్రశ్నించనివారికే లోపలికి వెళ్ళే ఆజ్ఞ వుందని, చాలామంది ఆగంతకుల్ని వద్దు వద్దు ప్రశ్నలొద్దు. జ్ఞానమొద్దు ఎవరి అనుజ్ఞలకోసం వెంపర్లాడటమూ వద్దని నివేదించు కుంటున్నాడు త్రిపుర.

మీరు రచయిత ఎందుకయ్యారు… కవిత్వం ఎందుకు? అంటే ‘‘నాకు ఎక్కువ inferiority వుండేది. చదూకునేరోజుల్లో నా పేరుకు ముందు ఓ అరడజను initials, affixes  వుండేవి. వాటిని పిలవడానికి అందరూ ఇబ్బందిపడేవాళ్ళు. పేరు అంత పొడుగ్గా వుండి, నా ఆకారమేమో చిన్నగా వుండి, నానా ఇబ్బందులకి గురిచేసేది నా పేరు నన్ను. నేను త్రిపురగా బోధపడటానికి రాయటం మంచి దారిగా కనిపించింది. ఇంగ్లీష్‌లో ఎక్కువగా రాసేవాణ్ణి. ఇప్పుడసలు రాయలేను. నేను రచయితను అవ్వాలనీ అనుకోలేదు.’’ అవునూ ఇప్పుడు మీ memoirs రాయొచ్చు కదా. ‘‘memoirs autobiography గా రాయకూడదు. జీవిత చరిత్రలు పెద్ద మోసం. రాస్తే ‘మో’ బ్రతికిన క్షణాల్లా రాయాలి. నా కది చేతకాదు. రచయితల జీవితాల్ని జీవితచరిత్రల్లో వెదకడం పెద్ద hoax. వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ కథల్లోనే తెలుసుకోవాలి. నేనెక్కువగా నా గురించి మాట్లాడుతున్నానంటే పెద్ద దగా…’’

మీరు దృశ్యాలని కథల్లో కదిలిస్తున్నప్పుడు వాటికి పరిమళాల్ని అంటగడతారు కదా… (ఉదాహరణ- ‘నీలిరంగు, ఛాయల్లో నిద్రిస్తూన్న తటాకంలో ఒక సువాసన, గులకరాయి సృష్టించిన తరంగాల వృత్తాల్లోంచి ప్రసరించిన ధ్వనికిరణం లాగా వుంది,’ వలసపక్షుల గానంలో, ‘ఇది కాఫీ కాదు, ఉత్త వేడిగా వున్న గోధుమరంగు’- భగవంతంకోసంలో) ఏమీ చెప్పలేను. నాకు చిన్నప్ప ట్నుంచీ జంతువులూ, పక్షులతో సాన్నిహిత్యం ఎక్కువ. అన్నిరకాల జంతువులూ నన్ను చూడగానే దగ్గరికొచ్చేస్తాయి. నా కథల పుస్తకంలోని (first print)  భుట్టో (పిల్లి) మీకు జ్ఞాపకం వుందా? అది ఇంచుమించుగా మనిషే… నేను ‘అగార్త’లో ఉన్నప్పుడు అన్నిరకాల పక్షులూ జంతువులూ మా కాటేజీ చుట్టూ వచ్చి వాలి నన్ను పలుకరిస్తూ వెళ్ళేవి. కొన్ని వానసాయంత్రాల్లో పెద్దకప్పలు నా పాదాల మీదికెక్కి నిద్రపోయేవి. బహుశా నా శరీరంలో వొకరకమైన animlas కి వచ్చే smell వాసన ఉందేమో, తెలీదు. లేక క్రితం జన్మలో ఏ పామునో, కప్పనో పక్షినో అయ్యుంటాను.’’

‘‘నేను ఒక known poet ని కాను. ఎవరికీ తెలియని రచయితని. నన్ను తెలుసుకోవాలని అనుకునే వాళ్ళుంటారా అని అనుకుంటాడు త్రిపుర. అవును- ఈయనని ఎవరైనా గొప్ప రచయితని పొగిడినప్పుడు సిగ్గుపడిపోతాడు. ఆ పరిస్థితి నుంచి తప్పుకుపోవాలనుకుంటాడు. ఆ disturbance ఎలాంటిదంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని కలవడానికి ఎప్పుడూ కొంతమంది doctors వచ్చేవాళ్ళట. (ఆయన medical officer గా పనిచేసేవారు.) అందులో ఒక lady doctor ఉండేది. ఆమెను చూడగానే భయపడి, సిగ్గుపడి ఇంటివెనుక ఉన్న back yards లోకి పారిపోయి ముళ్లపొదల మధ్య దాక్కునేవాడట. బయటికి వొచ్చేసరికి ఆ ముళ్ళు గీరుకుని, అక్కడక్కడా రక్తమొచ్చి భయపెట్టిన అనుభవం. అదే అనుభవాన్ని తననెవరైనా రచయితగా తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఎదుర్కొంటానని చెపుతాడు. ‘‘రచయితలూ, పాఠకులూ అన్న సంగతి వదిలేసి ముందు మనుషులుగా దగ్గరవుదాం,’’ అంటాడీ భగవంతపు త్రిపుర. మధ్య మధ్యలో తనని ఆకట్టుకునే తన కథల్లోని కొన్ని పంక్తుల్ని చదివించుకుంటాడు. ఆ లైన్ల ద్వారా తనకీ మనకీ ఏదైనా ఒక తలపు, దారి స్పురిస్తుందేమోననే ఆశ. తన కథల్లోని ప్రతి పాత్ర సంఘటనా అన్నీ జరిగి తను ఎదుర్కొన్నవనే అంటాడు. అందుకే కథల్లో ఏ భాగం దగ్గర తను liberate అయ్యాడో ఎక్కడ తను పొందిన అర్థాలని పొందుపరిచాడో పేరాల్ని చదివించుకున్నాడు. చిన్నప్పటి నుంచి తను lone walking అంటే ఇష్టపడతానని చెబుతాడు. ‘‘అలా ఒక్కణ్ణే నడుచుకుంటూ వెళ్లిపోతాను. ఆ సమయాల్లో నాతో నేను intactగా వున్నట్లనిపించి స్వేచ్చగా అనిపిస్తుంది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు.’’

త్రిపుర కథల్లోపల ఏం వుంది? ఏం దొరుకుతుంది? అని ప్రశ్నించుకుంటే ఏమీ వుండదు. ఏమీ వుండబోదు. తనని తాను ఎక్కడికీ జారిపోకుండా అదిమిపట్టే అస్తిత్వపు స్పృహ. కొన్ని సంవత్సరాలుగా పొందిన అనుభవాలు తదేక వేదనోద్విగ్నతలో మాగి మాగి రాలకుండా కథల్ని చెప్పి రాలిపోయిన సంఘటనలు. ఓ కొండమీద నిస్సంచార మధ్యాహ్నంలో ఎండిన కొమ్మమీద పిట్టని చూస్తూ తదేకతలోకి జారిన జెన్‌ భిక్షువు గుర్తుకొస్తాడు త్రిపుర చూసినప్పుడు.

భిక్షువుకి పిట్టలాగా త్రిపురకి కథ. అంతే… నాకు కాఫ్కా అంటే ఇష్టం, ఎంతిష్టం అంటే అతని పుస్తకంలోని ఏ వాక్యాన్నీ తీసుకున్నా నా కొక కథ లేదా వొక poem. కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచి వొక పదాన్ని స్పృశిస్తే అది కవిత్వంగా తగులుతుంది. బహుశా మనకి నచ్చిన authors కి సంబంధించి ఇలాగే వుంటుందమో. కాఫ్కా జీవితం చుట్టూరా అతని తండ్రి వొక irresistible ప్రభావం.

కథల్రాయలేరా ఇక అని బెరుకిరుకుతనంతో అడిగితే… ‘‘ఎట్లా రాయను… అనుభవాలేమీ లేవు… చాలావరకూ అంతా చచ్చిపోయింది. ఏమైనా రాస్తే పాత అనుభవాలనే, ఇరవై ఏళ్ళ క్రితంవి రాయాలి. అవన్నీ రాసేశాను. రాయడం నాకెప్పుడూ ఇష్టంలేదు. నేను professional writer నీ కాదు.  I’m a dead wood now. రాస్తే కవిత్వాన్ని రాసుకుంటున్నాను. వాట్లో కాఫ్కా themes. కాఫ్కాని నేను ఇంకా ఇంకా అర్థం చేసుకుంటున్నాను. కాఫ్కాని పూర్తిగా ఒకసారే చదవలేను. కొన్ని పేరాలు చదివిన తర్వాత ఆగిపోతాను. ఆ తర్వాత నా discovery మొదలవు తుంది.  K తో.. అది నేనే… బహుశా నా స్వంత K ని నేను extend చేసుకుంటున్నానేమో… నా కనిపిస్తుందీ నేను చెప్పేసుకున్నదంతా వలసపక్షులగానంలో ఎక్కువగా పలికింది. నా ఫ్రెండ్‌ ఒకతను అన్నాడు. అది మీ magnum opus అనీ. కానీ దాన్ని ఎవరైనా పూర్తిగా చదివి చెబుతారా అని ఎదురుచూస్తున్నాను. అందులోనే కొన్ని పంక్తులు చదివితే నా పరిస్థితి ఇంకా నాకు ఎక్కువ స్పుటమవుతుంది.

‘‘నవ్వేను…. నవ్వితే రెండు సిగరెట్లు ఒకేసారి కాలుతున్నట్టుగా అడుగడుగున తెలుస్తుంది. పిప్పి పన్ను నొక్కుకుంటూంటే నొక్కుకుంటున్నట్టుగా, నొప్పి క్షణాలన్నింట్లోనూ పాకురుతున్నట్టుగా తెలుస్తుంది. గోలెంలోని మొక్కుకి నళ్ళు పోస్తూ ఉంటే నీరూ, నీరు రూపం చెందిన వెలుగూ, మొక్కమీద పడి మొక్క చుట్టూ చెదిరి వ్యాపించి, మట్టిలో కలిసినట్టుగా- ఆ ప్రాసెస్‌ అంతా- ఆ క్షణాల్లో ఆ క్షణాలన్నీ నన్ను కదిపి ఒక కాస్మిక్‌ కాన్షష్‌నెస్‌లోకి తోస్తాయి. తెలుస్తుంది. తెలియగానే నా ఫ్రాంటియర్స్‌ నాకు పోతాయి’’- బాబుట్టి బోధపరుచుకోటానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూసింది. కానీ నవ్వింది చివరకు. నవ్వి, అంది నీ శక్తి కాదేమో అది, అదొక వ్యాధేమో ఆలోచించావా?’’

ఈ పేరాలోని తనవి చెప్పుకునే క్రమాన ‘‘నాకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఈ  constant awareness of myself. ఇది నన్ను వదిలిపోదు. బహుశా ఇదే నన్ను తట్టుకోలేక కథల్ని రాయించిందేమో. ఎంత దీన్నుంచి తప్పించుకోవాలనుకున్నా కుదరడంలేదు. ఒక సైకాలిజిస్టు ఫ్రెండ్‌కి చూపుంచుకుంటే ఇది కొంతమంది mystics కోరుకునే స్థితి అని చెప్పాడు. నాకయితే అక్కడ కుబ్బ చెబుతున్నట్టుగా వ్యాధిగా కూడా తోస్తుంది. మీతో ఈ మాట్లాడుతున్నదంతా ప్రతి క్షణక్షణానికీ తెలిసీ… తెలుసునని తెలిసీ… తెలిసింది తిరిగి తెలిసి…’’

త్రిపుర చనిపోయిన తన తల్లిని కాఫ్కాలోకి పిలిచి ఖాళీకుర్చీతో మాట్లాడిన కవిత ఇంకా గుర్తుంది. ‘‘మీ అమ్మతో మీ అసోసియేషన్‌ ఏమిటి’’ అన్నాను. కవితని మసగ్గా recollect చేసుకుంటూ, మా అమ్మగారికి mental illness ఉండేది, చాలా fragile గా ఉండేది. హాస్య ప్రియత్వం ఎక్కువ. ఒక గొప్ప image maker మా అమ్మ, ఎవర్నైనా చూసినప్పుడు ఒక వస్తువు పేరును ఆ వ్యక్తికి అంటగట్టేది.

ఒకసారి భమిడిపాటి జగన్నాథరావుగారు మా ఇంటికి ఇస్మాయిల్‌గారిని తీసుకుని వచ్చారు. ఆయన్ని కవిగా మా అమ్మకు పరిచయం చేశారాయన. ‘‘నువ్వు చెప్పనక్కరలేదురా అతడి మొహం చూస్తేనే తెలుస్తుంది కవి అని,’’ అందామె. ఇస్మాయిల్‌గారు ఈ విషయాన్ని ఎంతో సరదాగా చెప్పుకుని తిరిగేవారు.’’

త్రిపుర కవిత్వంలో adjectivesని ఇష్టపడరు. పదాల్ని తేలికపరిచి condense చేసి డాలీ, వంచిన కాలంతో తడిపినట్టు చిన్న పదాల్నే తడిపి పలికిస్తుంటాడు.  ఇప్పుడు తనకు జెన్‌ తప్ప ఏదీ ఛత్రపు ఛాయ అంటూ తనదైన tranquil looksలోంచి అశబ్దంగా కులికాడు. మీరు నమ్మరు, మీరు పవిత్ర ఖురాన్‌నిగానీ, భగవద్గీతనుగానీ తిరగేసినట్టుగా నేను Kafka diariesలోని రోజూ వొక పేజీని తిరగేస్తుంటాను. అందులో వొకచోట ఆగిపోయి freeze అయిపోతాను…’’ అంటూ చెపుతాడీయన. ఇంకా ఇలా గొణుగుతుంటాడు కూడా. Everything gives way at the center under that feet అంటూ కాఫ్కా చెప్పిన మాటల్లోకి తూలి కవిత్వం చేయొచ్చునంటూ సంబరపడిపోతాడు.

జీవితంలో ఏదైనా తుఫానులాంటిది మీదపడితేనేగానీ రాయలేనంటాడు. వలసపక్షుల గానాన్ని రాయడానికి తన అగర్తల (త్రిపుర) ఉద్యోగ జీవితాంతాన్ని గుర్తుకు తెచ్చుకుని అప్పటి తమ ఒంటరి బతుకుల కరెంటులేని చీకటి సాయంత్రాల ఈశాన్యపు పక్షుల స్నేహాన్నీ recall చేసుకున్నాడు.

త్రిపురా, వలసపోయిన పక్షులన్నీ ఇప్పుడొకసారైనా నీ గూటికి తిరిగొచ్చాయా చెప్పు త్రిపురా…. నీ పాఠకుడెక్కడున్నాడో అతన్నైనా పక్షుల జాడ చెప్పమందాం.

 

-సిద్దార్థ

ఆంధ్రప్రభ దినపత్రిక, 7 మార్చి 1999

త్రిపుర ఫోటో: మూలా సుబ్రహ్మణ్యం

మీ మాటలు

 1. కె. కె. రామయ్య says:

  ” త్రిపుర మోపిన కథల బరువుతో, కవిత్వంతో స్థాణువులైపోయి, ఇలా కూడా రాయొచ్చేమో. కథల్నీ, కవిత్వాల్నీ అవి తీవ్ర అంతస్థాపానికి గురయ్యింది తెలుగు పాఠకలోకం. త్రిపుర గారి కథల్ని చదివినవాళ్ళు చాలామంది ఆయనకి స్నేహితులూ, శత్రువులూ అయిపోయారు. ఆయన కథల్లో వుండే తీవ్రతా, సాంద్రతా, ద్రవగుణమూ ఇప్పటికీ నెమరుకొస్తాయి. కథకూ కవిత్వానికీ మధ్య వున్న విభజనను చెరిపేశాడాయన.

  త్రిపుర కథల్లోపల ఏం వుంది? తనని తాను ఎక్కడికీ జారిపోకుండా అదిమిపట్టే అస్తిత్వపు స్పృహ. కొన్ని సంవత్సరాలుగా పొందిన అనుభవాలు తదేక వేదనోద్విగ్నత. ఓ కొండమీద నిస్సంచార మధ్యాహ్నంలో ఎండిన కొమ్మమీద పిట్టని చూస్తూ తదేకతలోకి జారిన జెన్‌ భిక్షువు గుర్తుకొస్తాడు త్రిపుర చూసినప్పుడు. ”
  ____________________________________________________
  త్రిపుర గారి ప్రధమ వర్ధంతి ( మే 24, 2014 ) సందర్భంగా అరుదైన, అపురూపమైన యీ వ్యాసానిచ్చిన సిద్ధార్థ గారికి, సారంగ సంపాదకులు అఫ్సర్ గారికి కృతజ్ఞతలు.

  ఫొటోలో ఉన్నవారు ( L to R ) సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నరేష్ నున్నా, గుంటక శ్రీనివాస్ అనుకుంటా. సరిచూసి ఫొటో కి కాప్షన్ కూడా పెట్టగలరా ( వివరాలు ఇంతకు మునుపు సారంగ వ్యాసంలో ఇచ్చినవే అయినా ).

 2. balasudhakarmouli says:

  ఈ వ్యాసం చదివాక త్రిపుర కథలు మళ్లీ చదవలానిపిస్తుంది. ఎప్పుడూ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తూనే వుంటాయి. ఈసారి యింకా బాగా అర్థం అర్థం చేసుకోవాలి. అన్నీ ప్రత్యేకమైన కథలే అయినా ‘హోటల్లో’ కథని యిప్పుడు బాగా , కొత్తగా అర్థం చేసుకోవాలి. మళ్లా త్రిపురని అందించినందుకు ధన్యవాదాలు సిద్దార్థ గారూ…. !

 3. I’ve been looking forward to read this. & Loved it. త్రిపురని ఎప్పుడూ కలుసుకోని నేను ఆయన మాటలు కనీసం ఇలాంటి స్మృతిరచనల్లోంచైనా వినడాన్ని ఆస్వాదిస్తాను.

 4. - తహిరో says:

  సిద్దార్థ గారూ 15 ఏళ్ళ క్రితం రాసారా? అద్భుతం – త్రిపురని తాగినట్టుంది నాకు.
  మీకు, సారంగకు ఇద్దరికీ ప్రణమిల్లుతున్నాను – గొరుసు

 5. కె. కె. రామయ్య says:

  వ్యాసం కి శీర్షిక చిత్రంగా వాడిన, జీవకళ ఉట్టిపడుతున్న, త్రిపుర గారి ఫొటో తీసినది త్రిపురకి అత్యంత ఇష్టుడైన త్రిపుర గారి సుబ్రతో ( శ్రీ మూలా సుబ్రహ్మణ్యం ). Photo courtesy by Mula Subrahmanyam అని రాయాలని కాదు కాని, ఎందుకో యీ ఊసు అందరితో పంచుకోవాలని ఓ ఉబలాటం. Sweet & simple Subrato అని త్రిపుర గారు ఆప్యాయంగా తలుచుకునే సుబ్బుకి కృతజ్ఞతలు. వ్యాసం పరిధిని దాటి వ్యాఖ్య రాసినట్లుగా ఉంటే మన్నించవలసినదిగా కోరుకుంటూ ~ రామయ్య

  • - తహిరో says:

   త.మా . రామయ్యగారూ …. మన్నించితిమి పొమ్ము :)

మీ మాటలు

*