శేఖర్ ధైర్యం మనకో పాఠం!

 

myspace

 బహుశా మనిషికి ఉండాల్సిన అన్ని గుణాల్లోధైర్యమే గొప్పది. అది ఎన్నోసార్లు రుజువై ఉండవచ్చు. కానీ  నాకు మొన్న శేఖర్ని చూసేక అనిపించింది, ధైర్యమే వుంటే ఇంకేమీ అక్కర్లేదని జీవితంలో.

 Old Man and the Sea లో ముసలి వాడి ధైర్యమది. విప్లవం ఎట్లైనా విజయవంతమవుతుందని  నమ్మిన ‘అమ్మ’నవల్లో ముసలి తల్లి మొండి ధైర్యం అది. కొండల్ని పగల గొట్టినముసలి చైనా మూర్ఖుడికి వుండిన తెగువ అది. 

సాధారణంగా ఇలాటి పాత్రలు రచనల్లో కనిపిస్తాయి. అసలు రచయితలు ఇలాటి పాత్రల్ని ఎక్కడనుంచి సృష్టిస్తారు? చరిత్రలో ఇలాటివాళ్ళు ఎక్కడినుంచి పుట్టుకు వస్తారు? మొత్తం ప్రపంచం తమకి వ్యతిరేకమైనా, కష్టాలన్నీ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడిచేసినా, జబ్బులేవో చావుని అనంతంగాశరీరంలోకి నింపుతున్నా, అంతులేని వనరులున్న శత్రువు నిరంతరం దాడిచేస్తున్నా — నిలువరించే వీళ్ళు ఎలాటి వారై వుంటారు? వాళ్ళు ఏయే ధాతువులతో తయారైవుంటారు?

వాళ్ళు ఏ శక్తుల్ని కూడదీసుకుని ధైర్యంగా నిలబడతారు? అత్యంత సామాన్యులైన వాళ్ళకు ఏ ఊహలు, ఏ హామీలు అంత ధైర్యాన్నిస్తాయి?

నేను చూడలేదు కానీ, చెరబండ రాజు గురించి చెప్తారు చూసిన వాళ్ళు. ఆయనతో గడిపిన వాళ్ళు మెదడుని మృత్యువుకబళిస్తున్నా కూడా, రాజ్యాన్ని ధిక్కరించే స్వరం కొంచెమైనా తగ్గలేదని, ‘ముంజేతిని ఖండించిన నా పిడికిట కత్తివదల’ అని అన్నాడని.

నేనెప్పుడూ కలవలేదుగానీ, అలిశెట్టి ప్రభాకర్ కూడా అలాగే ఉండేవాడని,మృత్యువుని పరిహసిస్తూ.

ఇక పతంజలి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకో నెల రోజుల్లోచనిపోతారనగా, మిత్రుల్ని, శిష్యుల్ని పిలిపించుకుని ఒక Last Supper చేసారు. అప్పటికే ఎన్నో రౌండ్ల కెమోతెరపీ సెషన్లతో శరీరం వడలు పోయింది. నాలుక, గొంతు అలవికాని మంటతో మండిపోయేది. కానీ, మిత్రులకు సామూహిక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు వ్యవస్థతో శాశ్వత పేచీ పెట్టుకోవాల్సి వచ్చిందో, తనని రచయితగా నిలబెట్టినదేమిటో as-a-matter-of-factగా చెప్పేరు.

బహుశా, తాము నమ్మిన, ప్రేమించిన, ఇష్టపడిన వ్యాసంగమేదో వాళ్ళని నిలబెట్టి వుండవచ్చు. ఇలాటి తెగువ చాలా మందిలో వుండొచ్చు. కానీ, ప్రజల పక్షాన వుంటూ, తిరుగులేని శక్తివున్న ప్రజా శత్రువులకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ వైపు వున్నవాళ్లు చూపించే తెగువ ఇంకా గొప్పది.

కార్టూనిస్ట్ శేఖర్ కి ఇష్టమైన వస్తువులు నాలుగు – సంఘ్ పరివార్, ప్రపంచ బాంక్-చంద్రబాబు, తెలంగాణ, ఇంకా కులమనే కేన్సర్. శేఖర్ మెదడును, హృదయాన్ని బాధపెడుతున్నది తనను కబళిస్తున్న కేన్సర్ కాదు. కులమనే కేన్సర్. అందుకే పెట్టుకున్నాడు ఒక ప్రోజెక్ట్ — Caste Cancer. ఆసుపత్రి బెడ్ మీదనే పనికి ఉపక్రమించి పూర్తి చేసేడు. “ఇంకా ఎక్కడుందండీ కులం,” అని అనేవాళ్ళకు ఈ బొమ్మలు చూపించాలి. ఒక్కొక్క కార్టూనూ ఒక్కొక్క కొరడా దెబ్బలా వుంటుంది.

10173554_844876798861497_2505974776557559890_n

రేపు పుస్తకం ఆవిష్కరణ వుందనగా, ఫోన్ చేసేడు. హిందూ లో తనపై వ్యాసం రాసినందుకు. “చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా వుంది. కానీ, రేపు పుస్తకం ఆవిష్కరణకు రాగలనో లేదోన”ని అన్నాడు. ఇక ఎక్కువ మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమని ఫోన్ పెట్టేశాను.

ఇక తర్వాత రోజు సభలో గంటల పాటు ఓపిగ్గా కూచున్నాడు. అంతే కాదు, చివర్లో తన preamble చెప్పుకున్నాడు. జీవితం పట్ల తన దృక్పథం, తనిప్పుడు మరో ప్రాజెక్ట్ ని ఎందుకు చేపట్టబోతున్నాడు అన్నీ చెప్పేడు. ఇంకో ప్రాజెక్ట్ ఎందుకంటే, అది తనలోని కేన్సర్ తో పోరాటానికి ఉపయోగపడే ఒక మానసికమైన ఆయుధం. కానీ, అది మనకి శేఖర్ ఇచ్చే ఆయుధం కూడా.

ఒక కుల రోగ గ్రస్తమైన వ్యవస్థ చుండూర్ మారణకాండ నిందితుల్ని వదిలేస్తే, ఒక రోగంతో అద్వితీయమైన పోరాటం చేస్తున్న శేఖర్ మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అది కేవలం ఒకానొక పుస్తకంగానే కనిపించవచ్చు. కానీ, దాని వెనుక వున్న అతడి తెగువ దానికి తిరుగులేని శక్తిని ఇచ్చింది.

ఇప్పుడు ఆ శక్తితోనే మనం, ఇప్పుడు వేయి దెయ్యపు కన్నుల, కోరల, కొమ్ములతో దేశంపై తెగపడ్డ వింత, క్రూర జంతువుతో యుధ్ధం చెయ్యాలి. ఆ తెగువ, ధైర్యం కావాలిప్పుడు దేశానికి.

*

1901233_805223106160200_304354655_n

post script: 
   శేఖర్ ధైర్యం గురించి నేను రాసి, సారంగ సంపాదకులకు పంపి మూడు రోజులైంది. ఈ రోజు తెల్లవారు జామున శేఖర్ చనిపోయాడు. నిశ్చలంగా, పెట్టెలో ఉన్న శేఖర్ ముఖం ప్రశాంతంగా వున్నది. యుద్ధంలో గెలిచిన సంతృప్తి వుంది ఆ ముఖంలో. శరీరంలో శక్తి అయిపోయింది కాబట్టి కేన్సర్ పై పోరాటం ఆపేడు కాని, ఏమాత్రం శక్తి వున్నా ఇంకా పోరాడేవాడే.
పుస్తకం రిలీజ్ అయిన రోజు అడిగాడు, “మీకు చాలామంది డాక్టర్లు పరిచయం వుంటారు కదా. అడగండి వాళ్ళని శక్తి రావడానికి ఏం చెయ్యాలని. ఏం తాగితే ఇంకొంచెం వస్తుందో కనుక్కోండి,” అన్నాడు.
   ఆ బక్క శరీరంలో వున్న అణు మాత్రం శక్తినీ వాడుకొని బతికేడు. చనిపోయిన రోజు కూడా ఆంధ్రజ్యోతిలో కార్టూన్ వచ్చింది. ఎవరో అంటున్నారు, “రేపటికి కూడా పాకెట్ (కార్టూన్) పంపించాడు.” అని.
  సామాన్యుల అసమాన ధైర్యసాహసాలే మనకి ఊపిరి, ప్రేరణ. నిత్య జీవితంలో ఇంతే గొప్పగా పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది వున్నారు. దుస్సహమైన జీవితం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, శత్రువు వేయి పడగల నాగరాజై దాడిచేస్తున్నపుడు మనకి ఇలాటి ధైర్యవంతులే ప్రేరణ.
  శేఖర్ గుర్తుంటాడు ఎప్పటికీ.

మీ మాటలు

  1. కూర్మనాథ్ గారూ … మీరు శేఖర్ గారి గురించి రాసింది అక్షరాల … అక్షరాల సత్యం. అదే ఆయన్ని ఇన్నాళ్ళూ బతికించింది కూడా. తను నాతో ఎప్పుడు మాట్లాడినా ప్రపంచం లోని గొప్ప సినిమాల గురించి మాట్లాడేవారు … ఆర్ట్ సినిమాలంటే శేఖర్ గారికి చాలా ఇష్టం. జబ్బులోనూ నాకు కాల్ చేసి మంచి సినిమాలు పంపించమని అడిగేవాడు. ధైర్యం విషయం లో ప్రపంచానికి గోర్కి అమ్మ లో ముసలి తల్లి కావచ్చు గాని మనకందరికీ శేఖర్ గారే రోల్ మోడల్. మీ పారదర్శక నివాళితో రీచార్జ్ అయిన ఫీలింగ్ కలిగింది నాలో.
    – గొరుసు

    • jeyasurrya says:

      కూర్మనాథ్ గారూ..
      మీ వ్యాసం అతని వ్యక్తిత్వాన్ని పట్టి చూపింది.

  2. durgaprasad says:

    శేఖర్ గారి కార్టూన్స్ ఎంతో ఆలోచింప చేసేవి. నేడు ఆయన మన మధ్య లేక పోవడం మన తెలుగు వారికి తీరని నష్టం. ఆయన వేసిన caste cartoon చూస్తుంటే, నేడు నిజానికి ఎవరు కూడా తమ తమ కులాలని వదులుకోవడానికి సిద్ధం లేని తీరులో పెరిగిపోయింది ఈ cancer అనిపించక మానదు. శేఖర్ గారికి నిజమైన నివాళి మనమా cancer ని రూపు మాపి నప్పుడే.

  3. Nisschala Choppala says:

    ఫ్లీసె , శేఖర్ గారి పిక్చర్ అప్లోడ్ చెయ్యగలరు

  4. balasudhakarmouli says:

    ధైర్యమే మనిషిని నిలబెడుతుంది.

మీ మాటలు

*