అపరాధం

ఆ సంఘటన గురించి ఇప్పుడు తల్చుకున్నా కూడా నాకు అపరాథభావనతో కన్నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో కలవరం వచ్చి చేరుతుంది. అయితే దాన్ని నేను తల్చుకుని అప్పుడు జరిగిన పొరపాటు లాంటిదే మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి ఈరోజు అది నాకు ఉపయోగపడింది. ఈరోజు జరిగిన పొరపాటుని గురించి శ్యామలకి చెప్పి క్షమాపణ చెప్పగలిగిన దానిని ఆ రోజు ఆ పొరపాటుని రాకేష్ కి చెప్పి క్షమాపణ అడగకపోవడానికి కారణం ఏమిటి?

భయం – ఔను.

ఆ రోజు నేను ఇంట్లో అబద్దాలు చెప్పి పెళ్ళి కాకుండానే రవిని హోటల్ రూమ్ లో కలవడం అందరికీ తెలుస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాను.

మనకి బాధ కలిగించిన విషయాలని చెప్పుకుంటే ఆ బాధ తొలుగుతుంది నిజమే కావొచ్చు కాని కొన్ని కొన్ని మనం బయటకి చెప్పుకోలేని అనుభవాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ అనుభవాలు మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా మనకి ఉపయోగపడితే మన బాధ తొలగిపోతుందనే విషయం నాకు ఈరోజు తెలిసింది……

నిన్న రాత్రి మా అబ్బాయి “అమ్మా! నా నైకీ టీ షర్ట్ కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?” అని అడిగాడు.

“నీ అల్మైరాలోనే పెట్టి ఉంటుంది శ్యామల సరిగా్గ చూడు” అన్నాను.

వాడు వెతుక్కుని వెతుక్కుని ఏడుపు ముఖం పెట్టుకోని “కనపడటం లేదమ్మా!” అన్నాడు. నేను వాడి బట్టల అల్మైరాతో పాటు ఇల్లంతా వెతికాను.

“సరే రేపొద్దున శ్యామల రాగానే అడుగుదాములే పడుకో” అని వాడిని సముదాయించాను కాని నా ఆలోచనలన్నీ ఆ షర్ట్ మీదే ఉన్నాయి.

శ్యామల కాజేసి ఉంటుందా? స్కూల్లో పనులు, పరీక్షల హడావుడి లో ఇంటిని అసలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమి పోయాయో, ఏమున్నాయో కూడా చెప్పలేనేమో ఇప్పుడు. పని వాళ్ళ మీద పూర్తి బాధ్యత వదిలేస్తే ఇలాగే జరుగుతుంది అనుకుంటూ బాధపడసాగాను.

తెల్లవారింది. ఎవరి పనులకి వాళ్ళు తయారవుతూ హడావుడిగా ఉన్నాం. శ్యామల రాగానే వాకిట్లోనే నిలేసి షర్ట్ గురించి అడిగాను.

“నాకు తెలియదమ్మా!” అంది.

“నీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? ఇల్లంతా వెతికాం రాత్రి. ఎక్కడా లేదు. నువ్వు తీయకపోతే ఇంట్లో ఉండాలిగా” అన్నాను.

“లేదమ్మా! నేను తీసుకోలేదు” అంది.

“నువ్వు తీశావని నేను అన్నానా? తీయకపోతే ఇంట్లోనే ఎక్కడో ఉంటుందిగా సాయంత్రం నేను వచ్చేలోపు ఇల్లంతా వెతుకు” అన్నాను కఠినంగా.

“సరేనమ్మా” అంది శ్యామల.

సాయంత్రం నాలిగింటికి వచ్చి కాఫీ పెట్టుకుంటుండగా “అమ్మా! షర్ట్ ఇదిగో – మొన్న స్పెషల్ పంక్షన్ కి అభినవ్ అడిగితే ఇచ్చా. ఈరోజు స్కూల్లో వాడిని చూడగానే గుర్తొచ్చింది. స్కూలు నుంచి నేరుగా వాళ్ళింటికి వెళ్ళి తీసుకొస్తున్నా” అన్నాడు – నా కోసం ఏదో ఘనకార్యం చేసిన వాడిలా.

“అలా ఎలా మర్చిపోయావురా? రాత్రంతా వెతుకుతూనే ఉన్నాను నువ్వు నిద్రపోయాక కూడా” అన్నాను కోపంగా.

వాడు నన్ను పట్టించుకోకుండా “అఁ మర్చిపోయాను – ఏమయింది? ఇప్పుడు తెచ్చానుగా” అంటూ దాన్ని నా ముఖాన విసిరేసినట్లుగా కిచెన్ కౌంటర్ మీద పడేసి వాడి గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు ఒక్కసారిగా – మళ్ళీ చాలా రోజుల తర్వాత – రాకేష్ గుర్తొచ్చాడు.

ఇరవయ్యేళ్ళ క్రితం……

నేను హోటల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ “ఎక్కడికెళ్ళావే? నీ కోసం మీ హెడ్ మిసెస్ వచ్చారు మనింటికి. ఏదో ఫైలు అర్జంటుగా కావాలని వెతికితే ఎక్కడా కనపడలేదంట. నువ్వు ఎక్కడ పెట్టావో అడగాలని వచ్చిందిట” అంది.

మీ మేడమ్ వచ్చింది అని చెప్పగానే నా గుండెలు గుబుక్కుమన్నాయి. ఈ రోజు ఉదయం రవిని కలుసుకోవడానికి హోటల్ కి వెళుతున్నప్పుడు మా స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని అమ్మకి చెప్పాను. దాన్నే మళ్ళీ చెప్తూ ఆ టీచర్ కీ, మా హెడ్ మిసెస్ కీ పడదులేమ్మా అందుకే ఆమె ఫ్రెండ్స్ ని మాత్రమే పిలిచింది. కొంపదీసి ఆమెకి ఈ సంగతి చెప్పలేదు గదా!” అన్నాను – నేను చెప్పిన అబద్దానికి నిజం రంగు పులుముతూ.

“నాకేం తెలుసే మీరు ఆవిడకి చెప్పకుండా పార్టీ చేసుకుంటున్నారనీ…. ఎవరో టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని వెళ్ళిందని చెప్పా” అంది.

రవితో గడిపిన మధురక్షణాల తాలూకు మైకం నాలో మాయమైపోయి ఆందోళన ప్రవేశించింది. హోటల్ రూమ్ నుండి మా హెడ్ మిసెస్ కి ఫోన్ చేసినపుడు అదృష్టవశాత్తూ ఆవిడ ఫోన్ ఎత్తలేదు, నా అసిస్టెంట్ రాకేష్ ఎత్తాడు. చాలా పేదబ్బాయ్. పదవ తరగతి వరకూ చదివి కాలేజీకి ఫీజు కట్టలేక మేడమ్ ని బ్రతిమాలుకుని ఇక్కడ అసిస్టెంట్ కమ్ అటెండర్ గా చేరాడు.

“రాకేష్ నాకు జ్వరంగా ఉంది, చూపించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చాను. మేడమ్ కి చెప్పు ఈరోజు ఆఫీసుకి రావడం లేదని” అన్నాను.

“ఆఁ ఆఁ” అంటున్నాడు.

“రాకేష్” అన్నాను.

“మీకేం నంబరు కావాలి?” అన్నాడు.

“ఇది 26…..9 కదా!”

“ఆఁ చెప్పండి… ఎవరూ?”

“ఏంటి రాకేష్ నేను స్వప్నని వినపడుతోందా…. నాకు బాగాలేక హాస్పిటల్ కి వచ్చాను. డాక్టర్ కి చూపించుకోని త్వరగా రావడానికి ట్రై చేస్తాను కాని వీలయ్యేట్లు లేదు. ఇక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు. ఈ విషయం కూడా మేడమ్ కి చెప్పు – సరేనా, చెప్తావా” అన్నాను.

“ఆఁ చెప్తా చెప్తా” అంటున్నాడు.

నాకు భలే ఆశ్చర్యమేసింది అతని ముభావతకి. ఆఫీసు ఇన్ ఛార్జినైన నన్నుగౌరవంగా ఎప్పుడూ ‘మేడమ్’ అని పిలుస్తాడు. ‘ఈరోజేంటి ఇతను ‘చెప్తా చెప్తా’ అంటున్నాడు కాని ‘మేడమ్’ అని పిలవడం లేదు పైగా గొంతులో గౌరవం కూడా లేదు? నేను చెప్పింది నమ్మడం లేదా లేక నేను ఈ లాడ్జిలోకి రావడం చూశాడా? – ఇక్కడెక్కడో దగ్గర్లోనే అతనిల్లు అని చెప్పడం గుర్తు. చూసి ఉండడులే ఒట్టి అనుమానం నాది, పనిలో ఉండి ఉంటాడు’ అనుకున్నాను.

అమ్మతో ఏదో చెప్పి నా గదిలోకి రాగానే ఆ సంభాషణంతా రీలు లాగా నా కళ్ళ ముందు కదలాడింది. ‘రాకేష్ మేడమ్ కి చెప్పి ఉంటాడు. రేపు స్కూలుకెళ్ళగానే మేడమ్ అడిగితే ఏం చెప్పాలి? ఆఁ ఏముందీ… నా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి బయలుదేరాను కాని బాగా తలనొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళానని చెప్తే సరి’ అనుకున్నాను.

ఒక అబద్దానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో కదా అనుకుంటూ కాసేపూ, రవి గురించి కాసేపూ ఆ రాత్రంతా ఆలోచనలే… రవి నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎక్కడో చోట కలుసుకునేవాళ్ళం. నాన్నకి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యాక నేను కూడా ఇంటికి దగ్గరగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చేరాను. రవి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు. అతనికి ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాము.

హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి లాడ్జిలో దిగిన రవి నన్ను కలుసుకోమని ఫోన్ చేస్తే వెళ్ళాను.

‘ప్చ్! చాలా తప్పు చేశాను, అసలు అలా వెళ్ళకూడదు, అతన్ని ఏ పార్కులోనో కలుసుకుని ఉండాల్సింది’

తర్వాత జీవితంలో ఈమాటలు ఎన్ని సార్లు అనుకున్నానో…..

మేడమ్ రాకముందే రాకేష్ తో మాట్లాడాలి, మేడమ్ ఏమందో కనుక్కోవాలి అనుకుంటూ పది కాకముందే స్కూలుకి వెళ్ళాను. ఏవో జెరాక్స్ కాపీలు తీసుకుంటున్న రాకేష్ నన్ను చూడగానే “గుడ్ మార్నింగ్ మేడమ్. హెడ్ మిసెస్ మేడమ్ మీ కోసం మీ ఇంటికి వెళ్ళారు అప్లికేషన్స్ ఫైల్ కోసం – ఎక్కడ పెట్టారు?” అన్నాడు ఆందోళనగా.

“అదేంటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా హాస్పిటల్ కి వెళ్ళానని!” అన్నాను.

“నాకు ఎప్పుడు ఫోన్ చేశారు?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అదేమిటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా – మేడమ్ కి చెప్పు అంటే సరేనన్నావ్” అన్నాను కోపంగా.

“నేనెప్పుడన్నాను? లేదు లేదు మీరు ఫోన్ చేయలేదు” అన్నాడు – అతని కళ్ళనిండా అంతులేని విస్మయం.

“నీకేమైనా పిచ్చా! మతిమరుపు ఎక్కువవుతుంది నీకీమధ్య. నేను మాట్లాడుతుంటే ‘ఆఁ ఆఁ’ అంటున్నప్పుడే అర్థమైంది మన మైండ్ లో లేవని” అన్నాను పెద్దగా అరుస్తూ. అక్కడే నిలబడి మా మాటలు వింటున్న ప్యూను వెంకటప్పయ్య “ఔనమ్మా! నేను కూడా విన్నాను ఎవరితోనో ఫోనులో ‘ఆఁ ఆఁ చెప్తాను చెప్తాను’ అని రెండు సార్లు అనడం” అన్నాడు నాకు సపోర్టు వస్తూ.

“మేడమ్ రాగానే చెప్పు నేను ఫోన్ చేసిన సంగతి ‘చెప్పడం మర్చిపోయాన’ని స్పష్టంగా చెప్పు లేకపోతే బాగుండదు చెప్తున్నా” అన్నాను కోపంగా – చూపుడువేలు విదిలిస్తూ.

అతను నేను ఫోన్ చేసిన సంగతి చెప్పడం మర్చిపోయి ఇప్పుడు మేడమ్ తిడుతుందని బొంకుతున్నాడనే అనుకున్నాను. మేడమ్ రావడం, ‘నేను చెప్పడం మర్చిపోయాను’ అని రాకేష్ ఆవిడతో చెప్పడం జరిగిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు మేడమ్ నన్ను పిలిచి “నువ్వు రాకేష్ ని బెదిరించి చెప్పించినట్లుగా ఉంది అతని ముఖం చూస్తుంటే – నిజంగా నువ్వు ఫోన్ చేశావా స్వప్నా?” అంది.

“నిజంగా చేశాను మేడమ్” అన్నాను ఆవేదనగా. నా ముఖంలో కూడా నిజాయితీని చూసిన మేడమ్ “సరేలే పో” అంది.

తర్వాత రోజు 10-11 గంటల మధ్యలో రాకేష్ వచ్చి “మేడమ్ మీకు ఫోన్” అన్నాడు. నేను ఫోన్ దగ్గరకి వెళ్ళి “హలో” అన్నాను.

“హల్లో…. ఏమంది మీ మేడమ్? మీరు నిన్న నాకూ చేసింది ఫోన్…. రాకేష్ కి కాదు. మీ పక్కన ఎవరో ఉన్నట్లుంది ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు….. నిజంగా మీరెళ్ళింది హాస్పిటల్ కా లేక…… ఇహిహి…”

టప్ న ఫోన్ పెట్టేశాను. కాళ్ళు వణకసాగాయి భయంతో. మళ్ళీ చేశాడు. ఫోన్ ఎత్తి “రాంగ్ నంబర్” అన్నాను.

“రాంగ్ నంబరా – హ!హ!హ!” అంటూ నవ్వుతున్నాడు.

వాడు నవ్వుతున్నందుకో లేక వాడు నేను వెళ్ళింది లాడ్జికన్న సంగతి కనిపెట్టినందుకో నాకు బాధ కలగలేదు కాని రాకేష్ ని అనుమానించి, బాధపెట్టి, భయపెట్టి మేడమ్ కి అబద్దం చెప్పించినందుకు నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి.

ఏడుస్తున్న నన్ను గమనించిన మేడమ్ “ఎవరు స్వప్నా?” అంది నాకు దగ్గరగా వచ్చి.

“ఎవరో మేడమ్ ఏదేదో చెత్తగా మాట్లాడుతున్నాడు” అన్నాను.

ఫోన్ మళ్ళీ మోగుతోంది. ఈసారి మేడమ్ ఫోన్ ఎత్తి “ఎవర్రా నువ్వు? స్వప్న భర్తని పిలిపించి మాట్లాడిపించనా?” అంది బెదిరింపుగా – నాకు పెళ్ళయి్య భర్త ఉన్నట్లుగా. ఆవిడ ఉద్దేశం పెళ్ళిగాని పిల్లలని ఇలా ఫోన్లు చేసి ఏడిపిస్తారని అనుకుని అలా చెప్పిందని అనుకుంటా.

అవతల వాడు ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఆ స్కూల్లో నాలుగేళ్ళు పని చేశాను. ఇక నాకు వాడి దగ్గరనుండి ఫోన్ రాలేదు కాని రాకేష్ ని చూస్తుంటే బాధ కలగసాగింది. ఆ రోజు నుంచీ రాకేష్ ని నా తమ్మడిలాగే చూసుకున్నాను. అతనికి ఫీజు కట్టి చదివించాను. ఇప్పుడతను గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఆఫీసర్. అతనికి సహాయం చేసి నా అపరాధాన్ని పోగొట్టుకున్నాను కాని నాలోని బాధ మాత్రం ఇన్నాళ్ళుగా తొలగిపోలేదు.

పెళ్ళి కాకుండానే లాడ్జిలకెళ్ళడం, ప్రమాదాల్లో ఇరుక్కోవడం ఎంత అసహ్యమైన విషయమో తద్వారా నా జీవితంలో జరిగిన ఈ అనుభవం ఇంకా అసహ్యం. ఆతొందరపాటుతనంతో మరో తప్పు చేయబోయేదాన్నే ఈరోజు.

“స్వప్నా వస్తున్నావా?” నా పక్కింటి వాకింగ్ ఫ్రెండ్ ప్రమీల కేకతో ఆలోచనల్లోనుండి బయట పడి వాకింగ్ షూస్ వేసుకుని బయటకొచ్చాను.

వాక్ చేస్తున్నప్పుడు చొక్కా విషయం ప్రమీలకి చెప్పాను దిగులుగా. “దొరికితే దొరికిందిలే – దొరికిందని మీ పనిమనిషికి చెప్పకు. నీకు భలే తొందరపాటని కాలనీ అంతా టాం టాం వేస్తారు ఈ పనోళ్ళు” అంది ప్రమీల.

“వద్దు వద్దు. వాళ్ళేమైనా అనుకోనీ నేను మాత్రం చొక్కా దొరికిన విషయాన్ని చెప్పేస్తాను. చెప్పకపోతే ఆ పిల్ల ముఖం చూసినప్పుడంతా వచ్చే అపరాధభావన అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది” అన్నాను.

వాక్ నుంచి ఇంటికి రాగానే “శ్యామలా షర్ట్ దొరికింది. వీడు వాళ్ళ ఫ్రెండ్ కిచ్చి మర్చిపోయాడు. ఇదిగో ఈ రోజు తెచ్చాడు” అన్నాను పని చేసుకుంటున్న శ్యామలకి షర్ట్ చూపిస్తూ.

“దొరికిందా – నేనే తీశానని నన్ను పనిలోంచి తీసేస్తారని భయమేసిందమ్మా” అంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు.

పొద్దునైనా నిన్ను నేను ఏమీ అనలేదుగా శ్యామలా… ఇంట్లో ఎక్కడో పడేసి ఉంటావు, వెతుకు అనే కదా అన్నాను, ఎందుకు భయం?” అన్నాను.

పైకి అలా అన్నానే కాని చొక్కా దొరక్కపోయినట్లైతే మరో తప్పు చేసి ఉండేదాన్నేమో!

ఆ ఆలోచన రాగానే ఏమాత్రమూ సంకోచించకుండా శ్యామల చేతులు పట్టుకుని “ఏది ఏమైనా నిన్ను బాధ పెట్టినందుకు, నా తొందరపాటుకు నన్ను క్షమించు తల్లీ” అన్నాను.

“అయ్యో అమ్మా!- ఏం ఫరవాలేదు ఊరుకోండి” అంది శ్యామల. మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు. రాకేష్ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది అయితే చిత్రంగా నాకు ఈసారి బాధ కలగకపోగా దాని నుంచి ఏదో నేర్చుకున్నట్లుగా అనిపించింది.

**********

మీ మాటలు

  1. సారీ. అపరాథం కాదు. “అపరాధం” పొట్టలో చుక్క ఉండకూడదు. టైపింగ్ అపరాధానికి క్షమాపణలు.

  2. Manjari Lakshmi says:

    ఏ వారం వచ్చిందండీ ఈ కథ నేను చూడనే లేదు. బాగుంది. ఏ వారంలో వచ్చిందో ఇక్కడ డేట్ కూడా mention చేస్తుంటే బాగుంటుందేమో సారంగ వాళ్ళు అనిపిస్తోంది.

  3. మంజరి లక్ష్మి గారూ, ఈ వారమే వచ్చింది. ఈ వారం ఈ కథని కాస్త లేట్ గా పోస్ట్ చేశారు. గురువారం రావలసినది శనివారం పోస్ట్ చేశారు.

మీ మాటలు

*