పదిహేడు మంది అమ్మల కథలు!

amma kathalu

 

అమ్మ ను గూర్చి కథలూ కవిత్వాలూ ఇవేవీ కొత్తవి కావు మన సాహిత్యానికి. కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. ఐనా ధైర్యం చేసి ” అమ్మ కథలు” అని పేరున సమ్మెట ఉమా దేవి గారు రాసిన కథల  పుస్తకం ఇటీవలే చదవడం జరిగింది. నిజానికి అమ్మ కథలంటే ఎప్పటిలానే ఉంటాయనుకుని చాలా యధాలాపంగా మొదలుపెట్టిన నేను మొత్తం కథలన్నీ ఆగ కుండా చదివేశాను. ఇది అతిశయోక్తి కాదు ఒక తీయని అనుభూతి.

 

ఒక్కొక్క కథ ఒకో విధంగా వైవిధ్యంగా ఉంది చాలా ఆసక్తిగా చదివించాయి. ఈ సంపుటిలోని 17 కథలు చాలా బాగున్నాయి అనేసి ఊరుకోలేము. ఎందుకు బాగున్నాయో కూడా ఒక రెండు మాటలు మీతో పంచుకుందామని నా తాపత్రయం.

అమ్మ అంటే సెంటిమెంట్ , అమ్మంటే ఒక త్యాగ శీలి , అమ్మంటే అన్నీ వరాలిచ్చేసే దేవత అలాంటిది సమ్మెట ఉమా దేవి అమ్మ మాత్రం నిజమైన సహజమైన రక్త మాంసాలున్న మనిషి. హృదయం , దేహం , ఆలోచన కలిగిన ఒక మేధావి , కరుణామృత మూర్తే కాదు కరుకు నిర్ణయాలను తీసుకుని సమాజాన్ని  ఎదిరించి నిలబడ గల ధీశాలి.

 

పదిహేడు కథల్లోనూ పదిహేడు అమ్మలు కనబడతారు. భర్త చనిపోయే ముందర ఎందుకు విడాకులు తీసుకుందా తల్లి అని పిల్లలందరూ సందేహ పడే ఒక కథ. అందరూ అమ్మని నానా మాటలూ అంటున్నా ఎందుకు భరించిందో ఆ అమ్మ మాటల్లోనే విని హతాశులైన పిల్లలు. త్యాగమంటే కేవలం ఉన్న సంపద ప్రేమ ఇవ్వడమే కాదు బాధ్యత ను నెరవేర్చడం కూడా . భర్త పైన మమకారం  లేక కాదు , కానీ పెళ్లి కావల్సిన ఆడ పిల్లలికి శోభాస్కరంగా పసుపూ కుంకుమలతో సాగనంపాలంటే తాను సుమంగళి గా ఉండాలి అన్న  ధృఢ నిశ్చయం తో అపవాదులకోర్చి ఆడపిల్లల క్షేమాన్ని ఆశించిన , నెరవేర్చిన తల్లిని దర్శింప చేసేరు ఉమా దేవి.

ఈ కథ ఎందుకో చాలా కదిలించింది నన్ను. ఇందులో చాలా విషయాలున్నాయి. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత ఉందో తెలుపుతూనే , ఇంకా మారని మన సమాజం లోని ఈ బోలు సాంప్రదాయాలను ప్రశ్నించే కథ ఇది .

 

అమ్మ కథల్లో కొన్ని కథలు హృదయాన్ని ద్రవింప జేసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా “సహాన” కథలో ఉమా దేవి గారు చూపించిన ప్రతీకాత్మకత పాఠకులను చాలా ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లగా ఉన్న పాప అమ్మా వీధిలో కుక్కలే అంటూ ఝడిసి పరిగెత్తు కొస్తే , కంప్లెయింట్ ఇచ్చి ఆ కుక్కల బారినుండి తప్పించిన తల్లి , అమ్మాయి యుక్త వయస్కురాలైనాక ఎందరో మగ వాళ్ళు ఏదో ఒక సాకుతో ఆమెని తాకడానికి ప్రయత్నించడమూ , అది చెప్పుకోలేక ఆ పాప తల్లికి చెప్పినప్పుడు ఎలా తన బిడ్డని రక్షించుకోవలో తెలియని అయోమయ స్థితి లోని ఆ తల్లి మనసులోని వేదనని ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఒక్కసారిగా మన కళ్ల ముందు ఎన్నో ఘాతుకాలు ఆడపిల్లల పై జరుగుతున్నవి గుర్తొస్తాయి, తల్లి తండ్రులు ఎంత వరకు రక్షణ ఇవ్వగలరు? అన్నది మిల్లీయన్ డాలర్ ప్రశ్న . మొన్న బలై పోయిన నిర్భయ , నిన్నటి ఆయెషా ఇలా ఎందరో పసి మొగ్గలు తుంచబడి రాలిపోవడం గుర్తొస్తుంది.

1239667_473249809449813_888003086_n

 

అమ్మ కథల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే అన్నీ అమ్మ ప్రేమనే కాక అమ్మ ప్రేమను ఆశించే పిల్లల మనస్సులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక కథలో ఒక పాప తన అమ్మ తనతో ఉండాలనే ఆస కొద్దీ ఊరికే కడుపు నొప్పి అని ఏడుస్తూ గాబరా పెడుతుంది. డాక్టర్ ఈ పాప అల్లరి కనిపెట్టి ప్రశ్నించినప్పుడు నాకు బాలేక పోతే అమ్మ నన్నే అంటి పెట్టుకుని ఉంటుంది కదా అని ఇలా చెప్పేను అని చెప్పినప్పుడు , వాస్తవం లో ఎందరో ఉద్యోగస్తులైన తల్లులు, పనుల్లోకి వెళ్లాల్సిన తల్లులు పిల్లలల్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన తల్లుల మనసులు కరిగి నీరౌతాయి. అంతే గాక పిల్లల మనసులను కూడా మనం తెలుసుకునే లా ఉంది ఈ కథ.

 

తాను ఎన్నో కథలు రాసినా అవి సంకలనంగా వెయ్యమని వాటిల్లో అమ్మ ప్రస్తావన ఎక్కువగా వచ్చినందున వాటికి “అమ్మ కథలు” అనే పేరు పెట్టమని సూచించిన మంచి రచయిత నవ్య సంపదకులు జగన్నాధ శర్మ కి ముందుగా కృతజ్ఞతలు చెప్పడం ఉమా దేవి గారి సంస్కారాన్ని తెలియజేస్తుంది.

 

కథ ఒక సహజ సిద్ధంగా చెప్పబడేది కనుక , అలానే ఆమె కథలు ఒక్కో జీవితాన్ని గూర్చి మనతో చెప్పినట్టుగానే సాగుతాయి. ఎక్కడా అసహజంగా , అతిశయోక్తిగా మాట్లాడే ఏ పాత్రా మనకి కనిపించదు. ఎందుకంటే ఇవేవీ పాత్రలు కావు వాస్తవ జీవితాలు . అందుకే అమ్మ కథలు చదివితే మనకి అమ్మ ప్రేమే కాదు చాలా  విషయాలు తెలుస్తాయి . మనసు , మెదడు కదిలించే కథలుగా ఈ మధ్య వచ్చిన కథలలో ఉమాదేవి  కథలు పది కాలాలు నిలబడాలని నిలబడతాయని ఆశిస్తున్నాను.

 

“అమ్మంటే” ఎన్నో రూపాలలో  చూపించారు రచయిత్రి. ప్రాణం రక్షించిన ప్రాణదాత , అమ్మంటే ధైర్యం , అమ్మంటే బహురూపాలలో తన సంతానాన్నే కాదు ఎందరికో సహాయం చేసే దేవత.

అందుకే అమ్మ కావడం గొప్ప విషయమే కానీ అమ్మతనం కలిగి ఉండటం మరింత గొప్ప విషయం. ఈ అమ్మతనాన్ని తన కథల్లోని అమ్మల్లో ఆవిష్కరించారు ఉమా దేవి.

 

కథలన్నిటిని వర్ణించి విసిగించడం నాకు ఇష్టం ఉండదు . ఆమె రాసిన కథల్లోని సారాన్ని చెప్పడం , మృదు మధురమైన సరళమైన ఆ శైలి ఎలాంటి వారినైనా ఆకట్టుకోగల ఆ చెప్పే నేర్పు. వెరసి అన్నీ కలిసి “అమ్మ కథలు” గా మనముందు అక్షరాల రూపం లో పొందు పరిచి అందించిన ఈ స్నేహ మయి కి కృతజ్ఞతలు . మంచి కథలు రావడం లేదు అనే సాహితీ ప్రియులకు ఉన్నాయమ్మా ఉన్నాయి మా మంచి కథలు సమ్మెట ఉమా దేవి గారి “అమ్మ కథలు ” అని చెప్పాలనిపించి ఈ రెండు మాటలూ .

మరిన్ని మంచి కథలు అమెనుండి ఆశిస్తూ ….ప్రేమతో

జగద్ధాత్రి

1231658_539630582777569_2120927918_n

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని…’ అన్నాడో కవి అది అక్షర సత్యం… అమ్మ అన్న దేవత లేకపోతే… నేను, నువ్వు, మనం… ఈ సమస్త మానవాళి ఉండదు.
    ఇలాంటి అమ్మ కధలను ఒక చోట ఏర్చి,కూర్చి,పేర్చి మనకందించిన ఉమకు అభినందనలు.

    కధలు యెంత బావున్నా పాఠకులకు చేరడం కోసం వాటిని చదివి ఒక్కొక్క కధను విశ్లేషించడం ఒక గురుతరభాద్యత దానిని జగధాత్రి అక్క సమర్ధవంతంగా చేసారు. ఆవిడ గురుంచి మాట్లాడం అంటే ముంజేతి కంకణానకి అద్దం చూపించడమే.

    మణివడ్లమాని

  2. బావుందండీ జగద్ధాత్రి గారూ, మరి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? విశాలాంథ్ర వాళ్ళు వేశారా?

  3. jwalitha says:

    కథలను సమీక్షించి ఊరించి వదిలేస్తే ఎలాగండి ఆ పుస్తకం చదివే మార్గం అంటే చిరునామా కూడా ఇస్తే బాగుండేది

    • టి. చంద్ర శేఖర రెడ్డి says:

      జ్వలిత గారికి,
      ఈ పుస్తకం విశాలాంధ్ర పబ్లిషర్స్, నవోదయ బుక్ హౌస్, కాచిగూడ; ప్రజాశక్తి బుక్ హౌస్ ల ద్వారా లభ్యమవుతోంది. కాదంటే ఈ చిరునామాని నేరుగా కూడా కాంటాక్ట్ చెయ్యొచ్చు.

      m. నీహారిక శ్రీనివాస్
      H.No. 69 అండ్ 80, ద్వారకా నగర్, నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్
      Boduppal, రంగారెడ్డి Dist. పిన్ 500039

      అన్నట్లు ఈ పుస్తకం మీద 14.04.14 ప్రజా శక్తి దిన పత్రిక అనుబంధం “సవ్వడి” లో మరో విస్తృతమైన సమీక్ష వచ్చింది. వీలైతే అది కూడా చూడండి.

      భవదీయుడు
      టి. చంద్ర శేఖర రెడ్డి
      09866302404

  4. lakshmi narayana b v says:

    నమస్కారం..అమ్మ కథల సంపుటిలోని అన్నింటిలో అమ్మ మాత్రమే ప్రధాన పాత్ర కాగా…అమ్మ గురించి రచయిత్రి ఒకే వాక్యంలో ఇచ్చిన నిర్వచనం ..నిజంగా అభినందనీయం…సముద్రాల్లోని నీరంతా సిరా మార్చి కలాల్లో నింపినా..అమ్మ గురించి వివరించడం సాధ్యం కాదు….అభిప్రాయ వ్యక్తీకరణకు మాటలు మూగబోయిన వేళ..ఇంతకంటే అద్భుతమైన వ్యాఖ్య..దొరకదు కదా….ధాత్రిగారు చెప్పినట్లు రచయిత్రి నుంచి ఇంకెన్నో మరెన్నో మంచి కథలు రావాలని ఆకాంక్ష

Leave a Reply to Radha Cancel reply

*