అల్లరి పాటలు…!

తృష్ణ

తృష్ణ

 
నేను 6th classలో ఉండగా మా ఇంట్లో మొదటి బ్లాక్ అండ్ వైట్ టివీ వచ్చింది. అప్పట్లో టివీ అనేది కొత్త సరదా అవడం వల్ల అన్ని కార్యక్రమాలతో పాటూ ‘చిత్రహార్’ కూడా వదలకుండా చూసేవాళ్ళం. చిత్రహార్ లో హీరో హీరోయిన్ ని ఏడిపిస్తూ పాడే టీజింగ్ సాంగ్స్ కొన్ని వచ్చేవి. పాట చివరిదాకా హీరోయిన్ ని ఏడిపిస్తూ, తిప్పేస్తూ, ఊపేస్తూ, అల్లరి పెడుతూ ఉంటే అప్పటిదాకా చిరాకుపడ్డ అమ్మాయి అబ్బాయిని కోప్పడకుండా పాట చివరికి వచ్చేసరికీ నవ్వేసేది. అలా ఎందుకు నవ్వేస్తుందో అర్థమయ్యేది కాదు. పాట అయిపోతోంది బట్టి తప్పనిసరిగా నవ్వేస్తుందన్న మాట అనుకునేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకు తెలుగు కార్యక్రమాలు మొదలయ్యాకా చిత్రలహరి వచ్చేది. అందులోనూ కొన్ని పాత పాటలు ఇలానే ఉండేవి. పాట చివరిదాకా హీరో హీరోయిన్ ని నానారకాలుగా అల్లరిపెడుతూనే ఉంటాడు. ఇప్పటికీ నాకు అర్థంకానిది ఒకటే.. అలా ఎత్తి కుదేసి, దొర్లించేసి, అల్లరిపెట్టేసాకా ఒక్క లెంపకాయ వెయ్యాల్సింది పోయి పాట చివరికి హీరోయిన్ నవ్వేసి ఎందుకు కూల్ అయిపోతుందో.. అని!!
 
 
ఈసారి ‘పాట వెంట పయనం’ లో ఇలాంటి అల్లరి పాటలు కొన్ని చూపిద్దామని. అంటే అన్నీ పాట చివరిదాకా వచ్చాకా హీరోయిన్ నవ్వేసే పాటలు కాకుండా; అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే పాటలు + అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్నిపాటల్నే వెతికి తెచ్చాను. అప్పట్లో అమ్మాయిలు ఇంత ఫాస్టా? ఇంత ధైర్యమా? అని ఆశ్చర్యం వేస్తుంది అలాంటి కొన్ని పాటల్ని చూస్తే. పాటలు వెతుకుతూంటే నే గమనించిన సంగతి ఏంటంటే ఇలాంటి అల్లరి పాటల్లో చాలా వరకూ అక్కినేని పాటలే ఉన్నాయి. వేరే హీరోల పాటలు వెతకచ్చు కానీ చాలావరకూ చెవికింపుగా ఉండే పాటలు అవడం వల్ల ఈసారి ఎక్కువగా అక్కినేని పాటల్నే ఎంచుకోవడమైంది.
 alBKcXRoY1dqb1Ex_o_buddhimanthudu-movie-songs---havvare-havva---anr-vijaya-
 
ముందు అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్ని పాటలు చూద్దాం.. అలాంటి పాటల్లో నాకు బాగా నచ్చేది “ప్రేమించి చూడు” చిత్రంలో పాట.
“మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయము వలదా హోయ్…ఓ చెయి వేసేదా”
అని నాగేస్రావ్ పాడుతూంటే, ఆ అక్కాచెల్లెళ్ళు రుసరుసలడుతూ టైరులో గాలి కొడుతుంటే నాగేస్రావ్ మీద కోపం రాదు సరికదా భలే సరదాగా ఉంటుంది..
 
 
“బులిబులి ఎర్రని బుగ్గల దానా చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపొయ్యవా నువ్వే మారిపోయావా..
నన్ను మరచిపోయావా..నువ్వే మారిపోయావా” 
అని అబ్బాయి పాడుతుంటే, అబ్బాయితో పాటే అమ్మాయి కూడా ఈల వెయ్యడం గమ్మత్తుగా ఉండేది చిన్నప్పుడు ఈ పాట చూసినప్పుడల్లా! “శ్రీమంతుడు” చిత్రంలోని పాట ఇది..
 
 
ప్యాంటు, చొక్కా వేసుకున్న అమ్మాయి వెనకాలే ఓ అబ్బాయి ” అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా… ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా..య్యా..య్యా…” అని పాడుతూ ఉంటే “మనకి తెలిసిపోయింది కదమ్మా ఈ అబ్బాయికి తెలియలేదా అది అమ్మాయి అని” అని అమ్మని అడిగేవాళ్లం చిన్నప్పుడు..:)
(చిత్రం: అదృష్టవంతులు)

 
“ఇల్లరికం” చిత్రంలో మారువేషం వేసుకుని భర్త తన భార్యనే అల్లరిపెట్టే ఈ పాట చాలా సరదాగా, వినడానికి కూడా బావుంటుంది. 
ఎంత వెతికినా ఈ పాట వీడియో దొరకలేదు..:( ఆడియో లింక్ మాత్రమే ఇస్తున్నాను. 
(నిలువవే వాలు కనులదానా..)
 
 
 
 
“నేనంటే నేనే” సినిమాలోని ఈ సూపర్ స్టార్ కృష్ణ  పాట ఎంత ఫేమస్సో వేరే చెప్పాలా?! కొత్త సినిమా పాటలు చూసీ చూసీ, ఈ పాటలో అమ్మాయికి స్కర్ట్ వేసినా కూడా ఎంత నీట్ గా ఉందో పాట అనిపిస్తుందీ పాట చూస్తూంటే.
(ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే..) 

 
యద్దనపూడి నవల “మీనా” ఆధారంగా తీసిన “మీనా” చిత్రంలో ఓ పాట ఉంది. ఓ పట్నం పిల్ల పొలంలోకి వచ్చి నడవలేక అవస్థ పడుతుంటే ఆమెని అల్లరిపెడ్తూ ఓ బావ పాడే పాట ఇది. 
“చేనుకి గట్టుంది.. ఇంటికి గడపుంది 
కంటికి రెప్పుంది.. కన్నెకు హద్దుందీ
హద్దు మీరినా, కాలు జారినా.. అంతా గల్లంతౌతుందీ..
అమ్మాయిగారండీ..” అని సాగే ఈ పాట సాహిత్యంలో ఎంతో నీతి కనబడుతుంది. 
ఈ చిత్రంలో నాయికగా వేరే ఎవరైనా అయిఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అన్నది నా డౌటాభిప్రాయం.
 
 
ఇంకా చెప్పుకుపోతే బుధ్ధిమంతుడు చిత్రంలో “హవ్వారే హవ్వా హైలెస్సో.. దాని యవ్వారమంతా హవ్వా హైలెస్సో” పాట, 
పల్లెటూరి బావ చిత్రంలో  “ఒసే వయ్యారి రంగీ..” , 
లేత మనసులు చిత్రంలో “హల్లో మేడం సత్యభామ..”, 
కొడుకు కోడలు చిత్రంలో  “గొప్పోళ్ళ చిన్నది..” ఇలా బోలెడు పాటలున్నాయి! 
ఈ వరుసలో ఒక కలర్ సాంగ్ మాత్రం పెట్టకుండా ఈ సిరీస్ పూర్తవదు. అదే ” నిర్ణయం” చిత్రంలో నాగార్జున పాడే “హలో గురూ..ప్రేమకోసమేరా జీవితం..” పాట. నాటక రచయిత, సినీ రచయిత గణేశ్ పాత్రో రాసిన పాట ఇది. అప్పట్లో విపరీతంగా ఫేమస్ అయిపోయిన ఈ పాట ఇప్పటికీ ఎక్కడో అక్కడ మోగుతూనే ఉంటుంది. అమల ఎంత బావుంటుందో ఈ పాటలో!
 
***    ***   ***
 
ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని “టేండమ్ సాంగ్స్” అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. “వినుము చెలీ తెలిపెదనే ఒక మధుర రహస్యం”, “చేతిలో చెయ్యేసి”, “నల్లవాడే..”, అందాల ఓ చిలుకా”, “ఆడేపాడే పసివాడా” మొదలైన పాటలన్నమాట. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉన్నాయి. ఒకటీ”దొరికితే దొంగలు” చిత్రంలో ఉంది. ఒకటేమో అబ్బాయిని అమ్మాయి ఏడిపించేదయితే, మరొకటి అబ్బాయి అమ్మాయిని ఉడికించేది..
“ఎవరికి తెలియదులే యువకుల సంగతి..”
“ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి..”
***   ***   ***
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూద్దామా…
 
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూపిస్తానేం…
మొదట బ్రహ్మచారి చిత్రంలో అమ్మాయి + స్నేహితురాళ్లందరూ కలిసి ఓ అబ్బాయిని బాగా ఏడిపించేసే పాట ఉంది. అప్పట్లో ఇలాంటి పాట సెన్సేషనే అయి ఉంటుంది. ఇలాంటిదే.. అంటే హీరోయిన్ తన స్నేహితురాళ్లతో కలిసి “హల్లో ఇంజనియర్ హల్లో మైడియర్..” అంటూ హీరోని అల్లరి పెట్టే పాట “ధర్మదాత” చిత్రంలో కూడా ఉంది.  అందులోనూ అక్కినేని హీరో, అల్లరి అమ్మాయేమో నటి కాంచన.
ఇప్పుడు బ్రహ్మచారిలోని  “ఓ బ్రహ్మచారి నిను కోరి.. నిలుచున్నది.. చిన్నది.. నిను చేరి” పాట చూసేద్దాం..
 
 
తర్వాత, సావిత్రి ఏ.ఎన్.ఆర్ కి చెమటలు పట్టిస్తూ “ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట..” అంటూ పాడే పాటొకటుంది. చిన్నప్పుడూ చిత్రలహరిలో చూసేప్పుడు ఈ పాటలో “శ్రీవారూ..” అని సావిత్రి ఎందుకు పిలుస్తోంది అని అడిగితే అమ్మ సినిమా కథ చెప్పింది. తర్వాతెప్పుడో ఊళ్ళోకకొచ్చే పాత సినిమాలు తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ సినిమా కూడా చూపించింది.
(చిత్రం: మంచి మనసులు)
 
 
అవసరమైతే హీరోలను సైతం ఆటపట్టించగల అప్టుడేట్ యువతిగా పేరుపడ్డ నటి జమున. “బందిపోటు దొంగలు” చిత్రంలో అక్కినేని ని అల్లరి పెడుతూ జమున పాడే పాటుంది.. “కిల్లాడి దొంగా డియ్యూం డియ్యూం..” అని. అది కాకుండా “ముహుర్తబలం” చిత్రంలో జమునదే ఇంకో పాట ఉంది. పైన మీనా చిత్రంలో హీరో కృష్ణ ఓ పట్నం అమ్మాయిని ఏడిపిస్తే పాడతాడు కదా, ఇందులోనేమో పట్నం బాబులా వచ్చిన కృష్ణను అల్లరిపెడుతూ అల్లరి అమ్మాయిగా జమున పాడుతుందీ పాట.
(డొయ్ డొయ్ డొయ్ డొయ్ వస్తున్నాడోయ్..)
 
 
“గొప్పోళ్ల చిన్నది గువ్వల్లే ఉన్నది..
కొండ మీడి కోతల్లే చిక్కనంటది..
చెట్టు కొమ్మల్లే గుండేను ఊపేస్తది..”
అని కొడుకు కోడలు చిత్రంలో అమ్మాయిని ఉడికిస్తూ అబ్బాయి పాడే పాటొకటి ఉంది. అదే అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయిని ఏడిపిస్తూ “నా కంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. అన్నాడూ ఒక పిలగాడు..” అని పాడే అల్లరి పాటొకటి ఉంది. వాణీశ్రీ  బాగా చలాకీగా నటించిన ఈ పాట చూసేద్దామిప్పుడూ..
(చిత్రం: కొడుకు కోడలు)

 

 
 
మైనర్ బాబు చిత్రంలో 
“కారున్న మైనరు.. కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు 
మా చేతికి వచ్చాయి తాళాలు..హోత్తెరీ..” అంటూ వాణిశ్రీ పాట మరొకటి ఉంది. 
మైనర్ బాబుని అల్లరిపెడుతూ, డబ్బున్న అబ్బాయిల గుణాలని ఎద్దేవా చేస్తూ ఓ పేదింటి పిల్ల పాడే పాట ఇది..
 
***   ***   ***
(మరోసారి మరో నేపధ్యంతో మళ్ళీ కలుద్దామే..)

మీ మాటలు

 1. sasikala says:

  హ,,,హ… సో నైస్ . ఇప్పటి రోజులు పాటలు చూస్తే అప్పటి అల్లరి ఎంత గౌరవంగా ఉంది అనిపిస్తుంది :)

 2. కదండీ!
  ధన్యవాదాలు.

 3. వేణూశ్రీకాంత్ says:

  మాంచి సరదా టాపిక్ ఎన్నుకున్నారు… పాటల సెలక్షన్ కూడా బాగుందండీ.. గుడ్ వన్ :-)

 4. pavan santhosh surampudi says:

  చివరి వరకూ “కారున్న మైనరు.. కాలం మారింది మైనరు” పాట కోసం ఎదురుచూసాను. టోటల్లీ శాటిస్ఫైడ్.

 5. పోస్ట్ బాగుంది అండి
  పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా లో బోల్తా కొట్టావు చిన్ని నాయన
  ముద్దుల క్రిష్నయ్య లో ఒంగోలు గిత్త
  సాంగ్స రిపీట్ అవుతాయండి

 6. amarendra says:

  థాంక్సండి ఇవి మా ఆరో ఫారం నాటి పాటలు..మీ పుణ్యమా అని దాదాపు 50 ఏళ్ళు వెనక్కి వెళ్లాను..థాంక్స్ అగైన్!!

 7. ఆర్.దమయంతి. says:

  బావుంది తృష్ణ! అల్లరిని చక్కగా ఎంచి రాసారు.
  :-) ఈ పాటలు పాతరోజుల్లోకి తీసుకెళ్ళాయి నన్ను.
  థాంక్యు.

 8. ధన్యవాదాలు దమయంతి గారూ.

 9. తృష్ణ మేడం గారు…

  మనసుల్ని మళ్ళీ అల్లరి వయసుకు
  మళ్ళించినందుకు కృతజ్ఞతలు…

  చైర్మన్ చలమయ్య లోని ఈ గీతం …

  http://salilda.com/songs/film/telugu/chairman/tikkutakku.mp3

  టిక్కు టాకు టిక్కు టాకు బస్తీ బొమ్మలం …

  “జానేమన్ జానేమన్ తేరే దో నయన్”
  గా మారి దేశాన్నో ఊపు ఊపిన జేసుదాస్ ఆశా ల
  యుగళ గీతం కూడా ఈ లిస్టుకు అర్హమైనదే…

  సందర్భాలు వేరు వేరైనా
  రెండుచోట్లా ఎంచక్కగా అమరి…
  అలరించిన గీతం…

మీ మాటలు

*