బాగా చిన్నప్పుడు ..భలేగా ఉండేది కాబోలు!

నా చిన్నప్పటి ఫోటో

నా చిన్నప్పటి ఫోటో

వారం, పది రోజుల పాటు ఎంత బుర్ర గోక్కున్నా, గీక్కున్నా నాకు పదేళ్ళ వయస్సు దాకా జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం అంత తేలిక కాదు అని తెలిసిపోయింది. ఇక మెదడులో సరుకుని పూర్తిగా నమ్ముకుంటే లాభం లేదు అనుకుని ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని వెతికితే అలనాటి ఫోటోలు మూడంటే మూడే దొరికాయి. ఇందులో నా అత్యంత చిన్నప్పటి ఫోటో ఈ క్రిందన పొందుపరిచాను. ఇది ఖచ్చితంగా మా పెద్దన్నయ్యే తీసి ఉంటాడు. అప్పుడు నాకు రెండు, మూడు ఏళ్ళు ఉంటాయేమో….గుర్తు లేదు. కానీ ఫోటో చూడగానే “భలే క్యూట్ గా “ ఉన్నాను సుమా అని ఇప్పటి వాడుక మాటా”, “చంటి వెధవ ముద్దొస్తున్నాడు సుమా” అని ఆ రోజుల నాటి ప్రశంసా నాకు నేనే చెప్పుకున్నాను.

ఆ రోజుల్లో యావత్ కాకినాడ నగరం మొత్తానికి బహుశా పదో, పదిహేనో “డబ్బా” కెమెరాలు ఉండి ఉంటాయి. కలర్ ఫోటోలు, విడియోలు, టీవీలు, కంప్యూటర్లు వగైరా వస్తువులే కాదు, ఆ పదాలే ఆంద్రులకి, ఆ మాట కొస్తే భారతీయులకే తెలియవు. “అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ పవర్ అంతా కలిపితే ఈ నాడు ఒక చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మ లో ఉంది” అని నేను పుట్టిన సంవత్సరం గురించి ఎక్కడో చదివి సిగ్గు పడ్డాను. నమ్మండి, నమ్మక పొండి, సరిగ్గా నేను పుట్టిన నాడే జపాన్ వాళ్ళు చేతులెత్తేసి, అమెరికాతో యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు పెట్టేసి రెండవ ప్రపంచ యుద్ధం అంతం చేశారు. బహుశా ఈ “క్యూట్” ఫోటో తీసిన ఏడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఎప్పటికీ నా వయస్సు పదహారే!

ఇది కాక మరొక ఫోటో కూడా ఉంది. అది కూడా ఇక్కడ జత పరుస్తున్నాను. కానీ ఇందులో ఉన్న పిల్లాడు నేనో, మా తమ్ముడో (ఆంజి అనబడే హనుమంత రావు, కేలిఫోర్నియా నివాసి) ఖచ్చితంగా తెలీదు. కవల పిల్లలం కాక పోయినా, అలాగే పెరిగాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరైనా పరవా లేదు కానీ ఆ ఫోటో ఉన్నది నేనే అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రెండు ఫొటోలలోనూ ఆ మెడలో ఉన్న మూడు పేటల చంద్ర హారం. మా అమ్మ ఎప్పుడూ ఆ హారం వెయ్యకుండా నన్ను ఎక్కడికీ పంపించేది కాదుట. మరొక క్లూ ఏమిటంటే ఆ పక్కన నుల్చున్న అమ్మాయి మటుకు మా “దొంతమ్మూరు బేబీ” యే.

దొంతమ్మూరు బేబీతో

దొంతమ్మూరు బేబీతో

నా వయసుదే అయిన ఆ అమ్మాయి అసలు పేరు “వెంకట రత్నం” అని బహుశా తనకి కూడా గుర్తు ఉంది ఉండదు ఎందుకంటే ఇప్పటికీ తనని అందరూ “బేబీ” అనే పిలుస్తారు. ఈ బేబీ మా మూడో మేనత్త కుమార్తె బాసక్క (వరసకి వదిన కానీ బాసక్క అనే పిలిచే వాళ్ళం) పెద్ద కూతురు. పిఠాపురం లో రాయవరపు వారి దౌహిత్రురాలు అయినప్పటికీ బేబీ పుట్టుక, పెంపకం అన్నీ కాకినాడలో మా ఇంట్లోనే జరిగాయి. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి పెరిగిన మేం ఇద్దరం ఐదో తరగతి దాకా ఒకటే క్లాసు లో చదువుకున్నాం. అందుచేత మా ఇద్దరికీ కలిపి ఒక ఫొటో మా పెద్దన్నయ్య తీసి ఉంటాడు. ఈ ఫోటోలో కూడా ‘చతికిల పడినా క్యూట్” గా ఉన్నాను అనే అనుకుంటున్నాను.

 

నా పుట్టువెంట్రుకలు

నా పుట్టువెంట్రుకలు

ఇక నాకు ఏ మాత్రం గుర్తు లేక పోయినా, నా చిన్నప్పటి ఫోటోలలో చాలా అపురూపమైనది నా పుట్టువెంట్రుకల నాటి ఫోటో. ఆ “పండగ” మా తాత గారు బతికుండగానే జరిగింది. అప్పుడు నా వయసు ఐదారేళ్ళు ఉండ వచ్చును. నా వెనకాల నుంచున్నది మా అక్క మాణిక్యాంబ. మా అక్కకి ఒక పక్కన ఉన్నది మా అమ్మమ్మ బాపనమ్మ, రెండో పక్కన మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. వారిద్దరి తోటీ నాకున్న ఏకైక ఫోటో ఇదే! ఇక నాకు “మొదటి క్షవరం “ చేస్తున్న వాడు మా ఆస్థాన మంగలి రాఘవులు. కాకినాడలో ఎవరికీ క్షవర కల్యాణం కావాసి వచ్చినా, పండగలూ, పబ్బాలకీ రాఘవులు దొంతమ్మూరు గ్రామం నుంచి రావలసినదే! బహుశా 1950-51 నాటి ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. ఇలాంటిదే మరొక ఫోటో కూడా ఉండేది కానీ ఇప్పుడు కనపడడం లేదు. అందులో వెనకాల మా తాత గారు చుట్ట కాల్చుకుంటూ నా పుట్టు వెంట్రుకల పండగ చూస్తూ ఉంటారు.

ముందే మనవి చేసుకున్నట్టు, ఏవేవో పండగలు, పురుళ్ళు, వ్రతాలు, వచ్చే పోయే బంధువులతో ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది అని తప్ప నాకు పదేళ్ళ లోపు జ్జాపకాలు ఎక్కువ లేవు. అలా గుర్తు చేసే ఆధారాలూ ఎక్కువ లేవు. ఆఖరికి నాకు అక్షరాభ్యాసం జరిగిన సంగతి కూడా గుర్తు లేదు కానీ నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదువుకున్న “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” వివరాలు బాగానే గుర్తున్నాయి. ఆ స్కూలు గాంధీ నగరం పార్కుకి నైరుతి వేపు ఎల్విన్ పేట లో ఉంది. మా ఇంటి నుంచి రోడ్డు మీద నడిచి వెడితే పదిహేను నిముషాలు పడుతుంది కానీ, మా చిన్నప్పుడు ఎదురుగుండా గిడ్డీ గారి సందు లో, మా భాస్కర నారాయణ మూర్తి తాతయ్య గారి ఖాళీ స్థలం (కపిలేశ్వరపురం జమీందారులు, రాజకీయ ప్రముఖులు ఎస్..పి.బి.పి పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు ల ఇంటి వెనకాల) ,     ప్రహరీ గోడ మధ్య కన్నం లోంచి దూరి వెడితే ఐదు నిముషాలు మాత్రమే పట్టేది.

నేనూ, ఆంజీ, బేబీ ప్రతీ రోజూ, బిల బిల లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా స్కూలికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడూ “నేను వెళ్ళను” అని భీష్మించుకుని కూచున్నట్టు అంతగా జ్జాపకం లేక పోయినా, కొన్ని సందర్భాలలో మా “సున్నారాయణ” గాడు బలవంతాన భుజాల మీద మోసుకుని స్కూల్ లో నేల మీద కూచోబెట్టినట్టు లీలగా గుర్తు ఉంది ఇప్పటికీ. నా ఐదో ఏట 1950 లో ఆ “ఆనంద పురం పురపాలక ప్రాధమిక పాఠశాల లో ఒకటో తరగతిలో ప్రవేశించి, ఐదో తరగతి దాకా చదువుకున్నాను.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

అవును…..అప్పుడు ఆ స్కూల్ లో బెంచీలు లేవు. రెండు గదులు. రెండు వరండాలు. అంతే! వెనకాల అంతా ఇసక పర్ర. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అందరూ నేల మీదే కూచుని చదువుకోవల్సినదే! అత్యంత విచారకరం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితి అంత కంటే అన్యాయం గా ఉంది. ఇప్పటికీ అందరూ నేల మీద కూచునే చదువు కుంటున్నారు. అది తప్పు అని కాదు కానీ ఆ చిన్న భవనమూ, మొత్తం వాతావరణం ఇప్పుడు దయనీయంగా ఉంది అని ఇటీవల నేను కాకినాడ వెళ్లినప్పుడు గమనించిన విషయం. ఇటీవల నేను తీసుకున్న రెండు ఫోటోలు ఈ క్రింద పొందుపరిచాను. ఒకటి ఇప్పటి హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారూ, కొందరు పిల్లలతో. ఇంకొకటి నేను స్కూలు గుమ్మం దగ్గర భయం, భయం గా నుంచొని ఉన్న ఫోటో.

ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు ఆ ప్రాధమిక పాఠశాల లో టీచర్లు అందరూ క్రిస్టియనులే! దీనికి బహుశా ఎల్విన్ పేట లో ఒక చర్చి ఉండడం , ఆ పేటలో క్రైస్తవ జనాభా ఎక్కువ ఉండడం ప్రధాన కారణం. పైగా అందరూ ఆడవాళ్లే. అందరి పేర్లూ మేరీ, సుగుణ, కరుణ లాంటివే! మేం అందరం “జాని జోకర్ బజా, బజాతా, రీ,రీ, రీ,రీ సితార్ బజాతా”, “జాక్ అండ్ జిల్ వెంటప్ ది హిల్” లాంటి పాటలు ఎంతో హుషారుగా నేర్చుకునే వాళ్ళం. “వందే మాతరం” ఇంచు మించు జాతీయ గీతం స్థాయి పాటలా ప్రతీ రోజూ పాడే వాళ్ళం.

దసరా సమయంలో “పప్పు బెల్లాలకి” లోటుండేది కాదు. రిపబ్లిక్ డే కి, స్వాతంత్ర్య దినోత్సవానికి మ్యునిసిపల్ ఆఫీసు ప్రాంగణంలో జండా వందనం తరువాత బిళ్ళలకీ లోటు ఉండేది కాదు. “ఆ గిడ్డీ వెధవ” ని –అంటే కిరస్తానీ వాడిని అనమాట ….తోటలోకి తప్ప ఇంట్లోకి రానివ్వకండిరా అని ఎప్పుడైనా మా ఇంట్లో ఎవరైనా అరిచినా, ఎవ్వరూ లక్ష్యపెట్టే వారు కాదు. ఎటువంటి మత, కుల తారతమ్యాలూ అంటని ఆ వయసు అటువంటిది. మనిషి ఎదిగిన కొద్దీ కుల, మత కల్మషం పెరుగుతుందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నమ్మండి, నమ్మక పొండి, నా మటుకు నాకు అమెరికా వచ్చే దాకా ఈ కులాల ప్రభావం, ప్రాంతాల ప్రాబల్యం మన వారిలో ఇంత ప్రస్ఫుటంగా జీర్ణించుకు పోయింది అని తెలియ లేదు. ఇప్పుడు తెలిసినా చెయ్యగలిగింది ఏమీ లేదు అని కూడా తెలిసింది.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ తో

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ తో

ఆఖరి అంశంగా ….నాతో సహా, ఆ రోజు చూసిన వాళ్ళందరికీ ఇంకా కళ్ళకి కట్టినట్టు ఉన్నదీ, చూడని వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూసిన వాళ్ళు వర్ణించి పదే, పదే చెప్పి నవ్వుకునేది నా బాగా చిన్నప్పుడు కేవలం ఐదు నిముషాలలో అయిపోయిన ఒక దీపావళి పండగ. అప్పుటికి మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. నాకు మహా అయితే ఆరేళ్ళు ఉంటాయి కానీ ఆ దీపావళి ఇంకా జ్జాపకమే! యధాప్రకారం మా అన్నయ్యలు, స్నేహితులు ఇంట్లోనే ఒక నెల పాటు చిచ్చుబుడ్లు, మతాబాలు, తారా జువ్వలు తయారు చేసే వారు. అవి తయారు చేసే పద్ధతీ, కావలసిన వస్తువులు అన్నీ మా తాత గారి స్వహస్తాలతో ఉన్న ఒక పెద్ద తెలుగు పుస్తకంలో ఉండేవి.

నేను పెద్దయ్యాక కూడా కొనసాగిన ఆ తయారీలో రసాయనాలు, వస్తువులలో నాకు బాగా గుర్తున్నవి భాస్వరం, పచ్చ గంధకం, బొగ్గు, సూర్యాకారం, అభ్రకం ముక్కలు, గన్ పౌడర్, ఎర్ర పువ్వులు రావడానికి రాగి రవ్వ, ఇనప రవ్వ, జిల్లేడు బొగ్గు, ఆముదం, జిగురులావాడే మెత్తటి అన్నం, చిన్న, చిన్న ముక్కలుగా చింపేసిన చెత్త కాగితాలు, న్యూస్ పేపర్లు మొదలైనవి. ఆ రోజు ఇంట్లో చేసినవి కాకుండా బజారు నుంచి ఇంట్లో చెయ్య లేని, చెయ్యనివ్వని టపాసులు, సిసింద్రీలు, కాకర పువ్వొత్తులు ఇంటి నిండా ఉన్న యాభై మంది చిన్నా, పెద్ద లకీ సరిపడా బాణ సంచా సామగ్రి కొనుక్కొచ్చారు. వీటిల్లో బాంబులు, తారాజువ్వల లాంటి యమా డేంజరస్ సామాగ్రి పిల్లలకి అందకుండా ఎక్కడో దూరంగా పెట్టి, మిగిలిన సరదా మందు గుండు సామాగ్రి అంతా మా తాత గారు కూచునే నవారు మంచం క్రింద జాగ్రత్తగా పేర్చి పెట్టారు. అక్కడికి దగ్గరగా పది, పదిహేను బిందెలలో నీళ్ళు తోడి రెడీగా ఉంచారు ప్రతీ దీపావళి కీ లాగానే!

ఇక పిల్లలు అందరూ వత్తులు కట్టిన గోంగూర కట్టలు తీసుకుని, వత్తులు వెలిగించి, “దిబ్బూ, దిబ్బూ, దీపావళీ” అని నేల కేసి మూడు సార్లు కొట్టి వత్తులు ఆర్పేసి మా తాత గారి దగ్గరకి పరిగెట్టగానే ఆయన ఒక మతాబా యో, కాకర పువ్వోత్తో వాళ్ళ సైజు ని బట్టి ఇచ్చే వారు. అందరిలోకీ అగ్ర తాంబూలం అప్పటికీ, ఇప్పటికీ మా అక్కదే. మా అక్కని “అమ్మరసు” అనీ “చిన్న అమ్మరసు” అనీ పిలిచే వారు. పదేళ్ళ మా అక్క వెళ్ళగానే మా తాత గారు ఒక మతాబా ఇచ్చారు. అది వెలిగించి మహోన్నతంగా, అత్యంత మనోహరంగా వెదజల్లుతున్న ఆ పువ్వుల మతాబాని మా అక్క అనుకోకుండా, ఏదో అంటూ మళ్ళీ మా తాత గారి మంచం దగ్గరకి వెళ్లింది…అంతే……ఆ నిప్పు రవ్వలు మంచం కింద పెట్టిన మొత్తం దీపావళి సామాగ్రి మీద పడి అన్నీ ఒకే సారి అంటుకుని మంటలు, పేలుళ్లు, సిసింద్రీలు పరిగెట్టడాలు… ఒకటేమిటి అన్ని రకాల వెలుగులూ, చప్పుళ్ళతో అంతా అరక్షణం పట్ట లేదు…దీపావళి హడావుడికి.

అప్పటికే ఎనభై ఐదేళ్ళ మా తాత గారు మంచంమీద నుంచి చెంగున గంతేసి ఆయన గది లోకి పరిగెట్టారు. మా చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మిగిలిన పెద్ద వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిందె తీసుకుని మంచం క్రిందకి నీళ్ళు విసిరేసి మొత్తానికి మంటలు అదుపు లోకి తెచ్చారు. ఆ ఏడు మొత్తం దీపావళి పండుగ అంతా ఐదు నిముషాల లోపే అయిపోయింది. మా కుటుంబంలో ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు దీపావళి టాపిక్ వస్తే ఈ అంశం అందరం తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం.

అన్నట్టు “అమ్మరసు” అనే ఆ తెలుగు పిలుపు, అందులోని ఆప్యాయత అంటే ఎంత ఇష్టమో. మా అక్క “చిన్న అమ్మరసు” ఎందుకు అయిందంటే .. …మా ఆఖరి మేనత్త రెండో కూతురుని “పెద్దాపురం అమ్మరసు” అనీ పెద్దమ్మరసు” అనీ పిలిచే వారు. అసలు పేరు నాకు తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు ….నవంబర్ 19, 1953 నాడు “అమ్మరుసొదిన” పెళ్ళికి పెద్దాపురం వెళ్లాను. నాకు భలేగా గుర్తున్న ఆ పెళ్లి జ్జాపకాలూ, పెళ్లి మేళం (???) గురించీ మరో సారి వివరిస్తాను…..

– వంగూరి చిట్టెన్ రాజు

మీ మాటలు

 1. amarendra says:

  లగే రహో రాజు గారూ ..మీ బాల్యం మా చిన్నప్పటంత ‘మధురం’ గా ఉంది..విడవకుండా రాయండి విత్ ఫొటోస్ ..థాంక్స్

 2. వంగూరి చిట్టెన్ రాజు says:

  తప్పకుండా,,,ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్….

 3. బూర బుగ్గలతో చిన్నప్పుడూ,ఇప్పుడూ
  భలేగా ఉన్నారు సారూ!
  మీ రచన కు మీరు పెడ్తున్న ఫుటోలు స్పెషల్ ATTRACTION!

మీ మాటలు

*