ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!

varavara.psd-1

అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం.

అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది.

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది.

11hymrl01-RDF_G_HY_1235147e

అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి.

varavara_rao.gif

‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది.

శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది.

‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’

అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక

అక్కడుంటుంది?

స్వర్గంలోని వర్గకలహాలు

రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’.

నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది.

ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది.

–          వరవరరావు

-ఏప్రిల్ 30, 2014

 

మీ మాటలు

 1. ఈ శీర్షిక ద్వారా వి వి సార్ కవిత్వాన్ని మరల చదివి నేపథ్యాన్ని ఆకళింపు చేసుకోవడం ద్వారా సృజన రంగంలోని వారికి దిక్సూచిగా వుంటుంది. సంపాదకులకు సార్ కు ధన్యవాదాలు..

 2. balasudhakarmouli says:

  కుక్క విశ్వాసం – చాలా గొప్పది. ఆ విశ్వాసాన్ని, ప్రేమను నేను కూడా చూశాను. నేను 7 తరగతి చదివుకుంటున్నప్పుడు మా దగ్గర వొక కుక్క వుండేది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు నా వెంటే వచ్చేసీది. తర్వాత అది ప్రమాదంలో చనిపోయినప్పుడు నాకు చాలా బాధేసింది. దాని పేరు టైగర్. యిప్పటికి కూడా మరిచిపోలేకపోతున్నాను.

  గురువు గారూ – వరవరరావు గారూ.. కవిత చాలా సరళంగా వుంది. మాట్లాడుకున్నట్టు వుంది. సరాసరి గుండెల్నించి కవిత్వం దూసుకువస్తేనే.. యిలా నిర్మలమైన ఆకాశంలా కవిత్వం – ముందు పరుచుకుంటుంది.
  ముగింపు చాలా బాగుంది. దేన్ని కవిత్వం చేసినా దృక్పథం మారదని నిరూపించిన కవిత.

  మిమ్మల్ని యిలా – చాలా ఆనందంగా వుంది.

  మీ కవిత్వ అనుభవాలను – యిలా పంచుకుంటుంటే…. ప్రేరణగా వుంటుంది.
  ** ** **

 3. వి వి తొలినాళ్ళ నుంచే ప్రగతిశీల దృక్పథం తో కవిత్వం రాసారు. వి వి కవిత్వం మొత్తం పుస్తకంగా వచ్చింది కదా . నిజానికి ఇప్పుడు కొంత తీరిక దొరికి అది చదువుతున్న . వి వి ఇంటర్వ్యూ ఒకటి చెయ్యాలి .సర్ కు చెప్పను .నాదే లేటు. కాని చేస్తా . ఇంత సుదీర్ఘ కాలం అంత కమిట్మెంట్ తో బ్రతకడం అనూహ్యం . అందుకే నా లాంటి అనేక మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు

 4. కోడూరి విజయకుమార్ says:

  వి వి గారు పద్యం గురించి చెప్పిన ఈ జ్ఞాపకాలు, నా జ్ఞాపకాల తుట్టెను కదిలించాయి.
  వి వి గారు చెప్పిన ఆ ఇల్లు మా అమ్మ వాళ్ళ చిన్నమ్మది … ఆమె పేరు బుచ్చమ్మ … ఆ తరువాత వాళ్ళు హన్మకొండ నుండి నర్సంపేట కి మారి పోయారు. చిన్న తనం లో గొప్ప ప్రేమతో చూసుకునేది నన్ను – ముఖ్యంగా ఈ సినిమాల పిచ్చి , ఆమె నుండి మా అమ్మకూ , మా అమ్మ నుండి నాకూ వొచ్చిందని మా బాబాయి అంటూ ఉంటాడు ఎప్పుడూ !
  ఆమెకి పిల్లలు లేకపోవడంతో, అటు మరిది కొడుకునీ (వి వి గారు ప్రస్తావించిన కిషన్ గారు … నాకు మావయ్య అవుతారు వరుసకి ) , యిటు అక్క కూతురునీ (అంటే మా అమ్మని) పెంచుకుంది … మా అమ్మ కు పద్నాలుగు ఏళ్ళకు పెళ్ళయ్యే సమయం వరకూ వి వి గారు చెప్పిన ఆ యింట్లోనే పెరిగింది … అప్పటి వి వి గారు, మా అమ్మ జ్ఞాపకాలలో ‘వర్వరన్న’ గా పదిలం … నా చిన్నప్పుడు, ‘శ్రద్ధగా చదువుకోవడం , సింపుల్ గా వుండడం’ కు సంబంధించి, వి వి గారి ఉదాహరణలనే యిచ్చేది మా అమ్మ ! … ఇంట్లో వుండే ఈ కుక్క పిల్ల గురించి కూడా మా అమ్మ చెప్పేది. ఈ సారి మా ఊరు వెళ్ళినపుడు మా అమ్మకు చెప్పాలి … వి వి గారు ‘సారంగ’ లో పంచుకున్న ఈ జ్ఞాపకాల గురించి!… చాలా సంతోషిస్తుంది.
  నాకు ఊహ తెలిసాక, మా నాన్న పుస్తకాల కలెక్షన్ లోంచి నేను చదివిన కొన్ని పుస్తకాలలో ‘చలి నెగళ్లు’ ఒకటి … మిగతావి ‘మహా ప్రస్తానం ‘ ; ‘అమృతం కురిసిన రాత్రి’ ; ‘ రుక్కులు ‘ ‘వైతాళికులు’ ; ‘చదువు’ ; ‘పోతన భాగవతం’

 5. santhamani says:

  వరవర రావ్ గారు ,నిజంగా ఈ కవిత చాలా అద్భుతం.ఇవ్వాళ మీరెలా ఉపన్యసిస్తారో,ఎలా మాటాడతారో అలా అప్పటి కవిత నడకా,మాటా వుంది.సరే,దృక్పథం బీజ ప్రాయంగా…మీరు ఇపుడు ఇలా ఒక్కో దశ వివరించే కవితలు పరిచయం చేస్తే కొత్త కవులకు ఉపయోగం…అభినందనలు వరవర రావు గారు

 6. జంతువులకు గౌరవ మర్యాదలు ఉంటాయని సుప్రీం కోర్టు తీర్పు. మనుషుల విషయంలోనూ ఇలాగే చెబితే సంతోషం.. సార్ కవిత చచ్చిపోయిన నా పెంపుడు కుక్కలను, పిల్లులను, తాబేలునుమ, చిలకను గుర్తుకుతెచ్చింది. ఒక కుక్కకు బెల్టు లేదని మునిసిపాలిటి వాళ్ళు విషమిచ్చి చంపారు. మేం ఇంట్లో నుంచి బయటకొచ్చేలోగా.. అది గిలగిల తన్నుకుని చనిపోయింది. ఒక నల్లపిల్లిని కుక్కలు పట్టి కడుపు చీరాయి. ఆపత్రికి తీసుకెళ్ళి కుట్లు వేయించా.. తిరిగి తీసుకోచ్చేప్పుడు అది బుట్టలోంచి ఎగిరి నా సైకిల్ చక్రం కిన్దేపడిపోయి ప్రాణం విడిచింది.. ఒక నక్షత్ర తాబేలు ఇంట్లో చెప్పకుండా వెళిపోయింది. ఒక చిలుకను నా ఫ్రెండ్ నాగన్నకు ఇచ్చా. పిల్లి పట్టుకుపోయిందని చెప్పాడు…. నాకు కాకి అంటే ఇష్టం, సంఘజీవి కదాని. పెంచాలని కోరిక. దొరకడం లేదు. నా పుస్తకాలను కాకి ప్రచురనలుగానే తెస్తున్నా,,

 7. Yugandar says:

  మామూలుగా ‘వివశం’ అనేది ప్రేమ/దోమ సంధార్భల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కాని వి వి గారి రాతలు ఒక రకమైన వివశం కలిగిస్తాయి…పద గాంభీర్యం అవసరం లేని భావ గాంభీర్యం, వేదన, అర్తి, పొరాటం, అసిధార వ్యాఖ్యానం కలగలిసి ముప్పిరి గొలుపుతాయి…వి వి అంటే వివేకం, వివేచన ; వి వి కూడ అంతే!

 8. suresh says:

  తొలిదశలో మీరు విశ్వాసంపై రాసిన కవితను ఇలా ఇప్పుడు అందించినందుకు ధన్యవాదాలు వి. వి. గారు. కవిత, స్పందనలు చదువుతుంటే కుక్క రూపం కళ్ళముందు కదలాడుతూ… దాని తోక ఇప్పటికీ ఊగుతున్నట్టే అనిపిస్తుంది.

 9. bhasker.koorapati says:

  ఇంత మంచి “వెంటాడే పద్యం” శీర్షికను….అదీ వి.వి. గారి ఆర్ద్రమైన వచనం ద్వారా పరిచయం చేసిన ఎడిటర్ గారికి, వి.వి. గారికి ధన్యవాదాలు. కోడూరి విజయ కుమార్ స్పందన బావుంది.
  –భాస్కర్ కూరపాటి.

 10. bhasker.koorapati says:

  ఇంత మంచి “వెంటాడే పద్యం” శీర్షికను….అదీ వి.వి. గారి సున్నితంగా హృదయాన్ని హత్తుకునే వచనం ద్వారా పరిచయం చేసిన ఎడిటర్ గారికి, వి.వి. గారికి ధన్యవాదాలు. కోడూరి విజయ కుమార్ స్పందన బావుంది.
  –భాస్కర్ కూరపాటి.

మీ మాటలు

*