ఇనుప కౌగిలి

srinu pport
నవంబర్ నెల
మొదలయ్యిందంటే చాలు
మా వూరిపైకి విరుచుకుపడేది…  అది
దానికి దొరికితే చర్మాన్ని చీరేసి
ఎముకులను కొరికేస్తుందనే భయంతో
ఊలు కవచాలను ధరించి
ఇళ్ళల్లో దాక్కునే వాళ్ళమందరం
రాత్రంతా…
ఊరి చివర గుడిసెలో
ఒంటరి దీపంలా
కడుపుమంటను
కుంపటిలో వేసుక్కూర్చుని… ఆమె
పొలిమేర పొలంలో
చీకటి చుట్టను కాలుస్తూ
నోటిలో నిప్పు కత్తితో… అతడు
తెల్లార్లు దానితో తలపడేవారు
తెల్లారేసరికి…
వారి తెగువకు అది
కాస్తా తలొగ్గేది
గాయపడిన దాని కాయం నుండి
చిందిన తెల్లరక్త బిందువులతో
ప్రతి పచ్చనాకు నిండేది
అంతవరకు…
చీకటి గది పొదల్లో
చెవుల పిల్లులమైన మేము
తరువాత తెలుసుకునే వాళ్ళం
భయపడితేనే ఏదైనా
ఇనుప కౌగిలిలో బంధించగలదని!
అగ్నిశిఖలా కలబడితే పారిపోతాయి
ఆఖరికి చలైనా… పులైనా అని!!
                                                                                                                -మొయిద శ్రీనివాసరావు

మీ మాటలు

  1. ramaswami says:

    కవిత బాగుందండి మొయిద శ్రీనివాసరావు గారు , అభినందనలు .

  2. balasudhakarmouli says:

    అనుభవాన్ని కవిత్వం చేయడంలో కవులకు వొక ఈజీనెస్ వుంటుంది – కవిత్వం చేయాల్సిన వస్తువు.. అప్పటికే తనలో సంయోగం చెంది వుంటుంది కాబట్టి ! కవిత్వ గాడత కవిత్వం నిండా పరుచుకుని వుంటుంది. వొక శిల్పమూ వొనగూరుతుంది.
    మంచి కవిత శ్రీనివాస్ రావ్…. థ్యాంక్యూ ……

  3. moida srinivasarao says:

    ధన్యవాదాలు రామస్వామి గారు మరియు బాల సుధాకర్ మౌళి గారు

  4. Thirupalu says:

    //భయపడితేనే ఏదైనా
    ఇనుప కౌగిలిలో బంధించగలదని!
    అగ్నిశిఖలా కలబడితే పారిపోతాయి
    ఆఖరికి చలైనా… పులైనా అని!!//
    జీవిత సత్యమండి చాలా బాగా చెప్పారు.

మీ మాటలు

*