ఆలోచించేలా రాయగలిగితే చాలు : సోమశంకర్

2 (1)

మార్చి నెల వచ్చిన కథలని అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” (కినిగె పత్రిక) కథను ఉత్తమ కథగా నిర్ణయించాము. ఆ కథారచయిత కొల్లూరి సోమశంకర్ గారితో ముఖాముఖీ ఈ వారం –

 

  • సోమశంకర్ గారూ! మార్చ్ నెలలో వచ్చిన అన్ని కథల పోటీనీ తట్టుకొని మీ కథ ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ ఉత్తమ కథగా నిలబడ్డందుకు ముందుగా మా బృందం తరఫున అభినందనలు!

ధన్యవాదాలండీ.

  • మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం వివరిస్తారా?

1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం.

ఆ తరువాత, “The Adventures of Pinocchio” అనే పిల్లల నవల చదవడం తటస్థించింది. ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. 1999 నాటికే ఆ పుస్తక అనువాదం పూర్తి చేసినా, 2012 జనవరికి కానీ ముద్రణకి నోచుకోలేదు. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.

అనువాదాల కన్నా ముందుగా, Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్‌నెస్” అనే శీర్షిక,ఆంధ్రజ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ పేజిలో “కరెంట్ అఫైర్స్” అనే శీర్షిక నిర్వహించాను. ఆంధ్రభూమి సాధన అనుబంధంలో “Arithmetic” అనే శీర్షికలో పోటీ పరీక్షల లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపాను. తరువాత అదే అనుబంధంలో “అంతర్జాతీయ అంశాలు” అనే శీర్షిక నిర్వహించాను. ఇదే సమయంలో, బాలజ్యోతిలో పిల్లల కథలు రాసే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో బాలజ్యోతికి 9, ఆంధ్రభూమి వారపత్రికకి 2 పిల్లల కథలు రాసాను.

బాలజ్యోతి సంపాదకుల సూచన మేరకు, వివిధ మాసపత్రిక/వారపత్రికలకు కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఆగష్టు 2001 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైన “రూపాయల పుస్తకం” అనేది నా మొదటి కథ. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది.

నేను రాసిన “అతడు-ఆమె-ఇంటర్‌నెట్” అనే కథని “లడ్‌కా-లడ్‌కీ-ఇంటర్‌నెట్” అనే పేరుతో నేనే హిందీలోకి అనువదించాను. అలాగే, నేను ఆంగ్లం నుంచి అనువదించిన “బొమ్మ” అనే కథని హిందీలో “టెడీబేర్” అనే పేరుతో అనువదించాను. శ్రీ కె.వి. నరేందర్ రాసిన “చీపురు” కథను “ఝాడూ” పేరిట;శ్రీ మాన్యం రమేష్‌కుమార్ రాసిన “శబ్దం” కథని “శబ్ద్” పేరిట హిందీలోకి అనువదించాను.

నేను రాసిన “పాపులర్ సుబ్బారావ్” అనే కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. నేను అనువదించిన “బొమ్మ” కథని తెలుగు అనువాదం ఆధారంగా, కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.

ఇక ఎమెస్కో బుక్స్ కోసం 5 పుస్తకాలను అనువదించగా, “ఆనందం మీ సొంతం” అనే పుస్తకం ప్రచురితమైంది. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇవి కాక, పూనెకి చెందిన డా. అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ “One Life to Ride” ను తెలుగులోకి అనువదించాను. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రెస్ దశలో ఉంది. యు.కె.లో స్థిరపడిన వినయ్ జల్లా రాసిన ఆంగ్ల నవల “Warp and Weft” అనువాదం ఈ మధ్యే పూర్తి చేసాను.

ఇవి కాక పలు సంస్థల కోసం రకరకాల డాక్యుమెంట్లను తెలుగులోకి అనువదిస్తున్నాను.

SomaSankar2014

  • మీరు అభిమానించే తెలుగు రచయితలు..?

కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, యండమూరి, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొదలైన వారు.

  • ఇక “ముసుగు వేయద్దు మనసు మీద” కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ రాయడం వెనకాల ఉన్న నేపధ్యాన్ని వివరిస్తారా? ఈ కథాంశం ఆధారంగా మీకు కథ రాయాలనే ఊహ ఎలా వచ్చింది?

ఈ కథ చెప్పే కథకుడు నాకు పరిచయం. ఆయన నాకన్నా కనీసం ఏడెనిమిదేళ్ళు పెద్ద. ఓ కన్సల్టింగ్ సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రముఖ నగరాలలో బ్రాంచి ఆఫీసులు ఉండేవి. కొంత కాలం తర్వాత అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆఫీసు ఖర్చులను తగ్గించుకునే నిమిత్తం, కొన్ని బ్రాంచిలను మూసేయ్యాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. దశలవారీగా బ్రాంచీలను తొలగిస్తూ వచ్చింది. హైదరాబాద్ బ్రాంచిని ఎప్పుడు మూసేస్తారో తెలియక, ఈయన చాలా కంగారు పడేవాడు. ఎప్పుడూ దిగులుగా, నిరుత్సాహంగా ఉండేవాడు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, ఉన్నదాన్నే ఎలాగొలా నిలుపుకోవాలని చూసేవాడు. అతని వ్యక్తిగత సమస్యలు నాకు పూర్తిగా తెలియకపోయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నయని మాత్రం తెలుసు. అతని భయాలు, సందేహాలు, బెంగ చాలా కాలం పాటు నాకు బాగా గుర్తుండిపోయాయి. ఆ ఆఫీసు మూసేసారని తెలిసింది, ఆయన ఏమయ్యారో మాత్రం తెలియలేదు. ఉద్యోగ నిమిత్తం నేను కొన్నాళ్ళపాటు హైదరాబాదుకి దూరంగా ఉండడంతో నాకు ఆయన సమాచారం తెలియలేదు. తర్వాత ఈ మధ్య ఇవే లక్షణాలు మా మిత్రుడి అన్నయ్యలో చూసాను. ఆయనదీ స్థిరమైన ఉద్యోగం కాదు. సంసార బాధ్యతలు ఎక్కువ. చేసే ఉద్యోగం నచ్చదు, మనసు పెట్టి పనిచేయలేడు. సో, ఎప్పుడూ డల్‌గా, frustrated stateలో ఉంటూంటాడు.

ఇక కథలోని వీరేశం పాత్రధారిని నేను ఓ బర్త్‌డే పార్టీలో చూసాను. ఆయన ముసలాయనే, కానీ బాగానే ఎగిరాడు. నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను. కథలో జరిగినంత సంభాషణ మా మధ్య జరగలేదు కానీ, టూకీగా ఆయన స్వభావం అదేనని గ్రహించాను.

ఓ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అక్కడున్న బట్టల కొట్ల వద్ద సింహం డ్రెస్ వేసుకుని జనాలని పిలుస్తున్న ఓ వ్యక్తి, ఒక్కసారిగా తల మీద ముసుగు బయటకి తీసి ఆ వేషం వేసుకోవాల్సి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ, తన పేదరికాన్ని, కొట్టు యజమానుల్ని దూషించాడు. చాల స్వల్ప సమయంలో జరిగిన ఘటన, కానీ నా మనసులో ముద్ర పడిపోయింది.

మనలో చాలామంది ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఆనందం/సంతోషం ఎక్కడో బయటి నుంచి రావాలని అనుకుంటూ, ఎప్పుడో వస్తుందని ఊహిస్తూ, ప్రస్తుతం నిరాశలో నిస్పృహల్లో బతుకుతాం. కానీ ఈ మూడు ఘటనలని మేళవిస్తే, ఈ కథకి నేపథ్యం అయింది!

MVMM

  • కేవలం మీరు చూసిన ఒక ఘటన వల్లే కథ ఏర్పడిందా లేక ఇలాంటి వ్యక్తుల్ని మీరు కలిసి, వాళ్ళ వృత్తిపరమైన సాధకబాధకాలు తెలుసుకున్నారా?

ఒకాయన్ని కలిసాను. కాస్త సంభాషణ జరిగింది. ఆయన క్లుప్తంగా చెప్పిన కొన్ని వివరాలతో నేను వీరేశం పాత్రని సృష్టించుకున్నాను. అంతేకాని, కథ రాద్దామనే ఉద్దేశంతో ఆయనతో సంభాషించలేదు. ఆయనని కలిసినప్పుడు కథ రాయాలన్న ఉద్దేశమే లేదు. తర్వాత ఎప్పుడో తట్టిన ఆలోచన ఈ కథ.

ఆ పాత్రకి ఎదురైన కొన్ని సంఘటనలు మా ఆఫీసు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసి తరచూ మానేసే వ్యక్తులకి ఎదురైనవే. ఇంకా కొందరు వ్యక్తులకి ఎదురైన చిన్న చిన్న ఘటనలను ఈ కథలో ఒకే పాత్రకి ఎదురైనట్లుగా చూపాను.

  • మీ కథలో ప్రస్పుటంగా కనిపించిన మంచి లక్షణం క్లుప్తత. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది రావాలంటే కథని చాలా సార్లు ఎడిట్ అయినా చేసుకోవాలి, లేదా కథని రాసే ముందే కథ తాలూకు సంపూర్ణ స్వరూపం రచయిత మనసులో రూపు దిద్దుకోవాలి. ఈ రెండు విధానాల్లో మీరు ఏది ఆచరిస్తారు?

సాధారణంగా, ఒక ఇతివృత్తం/ఘటనని ఆధారం చేసుకుని కథ రాయాలని అనుకున్నప్పుడు మొదట కథా స్వరూపం అంతా, సంభాషణలతో సహా, మనసులోనే రూపొందుతుంది. నేను రాద్దామనుకున్న అంశానికి ఓ రూపు వచ్చింది అనుకున్నాకనే, అది కంప్యూటర్ తెర మీదకి వస్తుంది. మొదటినుంచి నాది ఇదే పద్ధతి. కథని టైప్ చేసుకున్నాక, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులూ చేసుకుంటాను.

  • ఈ కథ రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది?

నేను సొంత కథలు చాలా తక్కువగా రాస్తాను. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను.

అది నా బలహీనత. ఈ కథ మనసులోంచి కంప్యూటర్ స్క్రీన్ మీదకి రావడానికి సుమారు పది రోజులు పట్టింది. కానీ ఒకసారి టైప్ చేసాక, రెండే మార్పులు చేసాను.

  • కొంత అనిశ్చితితోనూ, దాన్నుంచి ఉద్భవించే అశాంతితోనూ జీవించే మనుషుల మనసులని మీ కథ తాకడం, ఒక కొత్త ఉత్తేజాన్ని వాళ్ళలో నింపడం అనే ప్రయోజనాన్ని మీ కథ సాధించినట్టు మా బృందం అనుకోవడం జరిగింది. కథ అనేది ఒక కొత్త ఆలోచననో, కొత్త ఉత్తేజాన్నో, కొత్త స్ఫూర్తినో ఇవ్వాలని మీరు భావిస్తారా? లేక, కేవలం ఒక తాత్కాలికమైన అనుభూతినో అనుభవాన్నో కలగజేసే కథలని కూడా మీరు సమర్ధిస్తారా?

ప్రతి కథకీ వ్యక్తంగానో, అవ్యక్తంగానో ఓ లక్ష్యం ఉంటుంది, ఉద్దేశిత పాఠకులు ఉంటారు. కొన్ని కథలు వినోదాన్ని, హాస్యాన్ని పంచితే, మరికొన్ని ఆలోచనల్ని రేకిత్తించి, ఉత్తేజితులని చేస్తాయి. కొన్ని కథలు గతంలో జరిగిన దారుణాలను గుర్తు చేస్తే, మరికొన్ని సమాజిక సమస్యలని ప్రస్తావిస్తాయి. మీరన్నట్లుగా కొన్ని కథలు అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తాయి. అవీ అవసరమే. కొన్ని కాలక్షేపం కథలుంటాయి. దేని ప్రయోజనం దానిదే. సాహిత్యం నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందడం ఆయా పాఠకుల అభీష్టం. పుస్తకంలోని పేజీలను గబగబా తిప్పేయచ్చు, లేదా జీర్ణం చేసుకుని, తమకు అన్వయించుకుని ఆచరించనూవచ్చు. సమస్యలకి పరిష్కారం చెప్పడం రచయితల పని కాదు, సమస్యలని ఎదుర్కోడానికి, ప్రేరణనిచ్చి, ఆలోచన రేకిత్తంచగలిగితే చాలు! ఎందుకంటే కథాపరంగా రచయిత సూచించే పరిష్కార మార్గాలు నిజజీవితంలో వర్తించకపోవచ్చు… కానీ సమస్యలో ఉన్నవారికి కొత్తగా ఆలోచించడానికి అవకాశం మాత్రం తప్పకుండా కల్పిస్తాయని నా నమ్మకం.

  • మీరు రాసిన ఏదైనా ఒక కథని,‘మంచి కథ’ అనుకోవడానికి మీరు ఏ ఏ ప్రమాణాలు అవసరం అనుకుంటారు? లేదూ,‘మంచి కథ’ అంటే మీ దృష్టిలో ఏది?

2014 మార్చి నెల కథలను సమీక్షించే సందర్భంలో మీరే అన్నారు, మంచి కథని నిర్వచించడం కష్టమని.   నా దృష్టిలో నేను రాసే ప్రతీ కథా మంచికథే. ఉద్దేశపూర్వకంగా సమాజానికి చెడు చేయని రచన ఏదైనా మంచిదే. రాసేటప్పుడు ప్రతీ కథ మంచి కథ అనుకునే రాస్తాను. కాకపోతే, ప్రెజంటేషన్‌లో, ట్రీట్‌మెంట్‌లోనూ తేడాలు వస్తే అది పాఠకులకు నచ్చకపోవచ్చు. పాఠకులకు నచ్చిన కథలు విమర్శకులకి నచ్చకపోవచ్చు. కాబట్టి వాదప్రతివాదాలకు దూరంగా, రాయాలనుకున్నది రాసుకోడమే నా పద్ధతి. నేను రాసినవి కొందరికైనా నచ్చుతాయని నా నమ్మకం. నా మటుకు నాకు కథా వస్తువు బాగుండాలి, సన్నివేశాల కల్పన బాగుండాలి, సంభాషణలు బాగుండాలి. ఇవన్నీ కలిస్తే, అది తప్పకుండా మంచి కథే అవుతుందని నా అభిప్రాయం. పాఠకులని చదింవించేలా, చదివిన తర్వాత ఆలోచించేలా కథ రాయగలిగితే అది మంచి కథే అవుతుందని ఓ రచయితగా నా అనుభవం.

* అనువాదాలు చేయడం ఒక రచయితగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఒక రచయితగా మీరు స్వతంత్రంగా నిలబడడానికి ఈ అనువాదాల అనుభవం ప్రతిబంధకమయిందా, లేక సహాయపడిందా?

అనువాదాలు చేయడం, ఓ రచయితగా నా మీద తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. రచయితగా స్వతంత్ర్యంగా నిలబడానికి ఓ రకంగా ప్రతిబంధకమైంది, మరో రకంగా సాయపడింది. అనువాదాల కంటే సొంత కథ రాయడమే కష్టం నాకు. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు ఇవన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని పట్టుకుని, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు. తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. భావం చెడగొట్టకుండా, కథని మన భాషలో చెబితే చాలు. ఆల్రెడీ, ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి, ఇక్కడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత కథల విషయంలో సంభారాలేవీ సిద్ధంగా ఉండవు, అన్నీ మనమే సమకూర్చుకోవాలి. పూర్తయ్యకా గాని, ఎలా ఉంటుందో తెలియదు. మధ్య మధ్యలో రుచి చూస్తూ, సవరించుకోవచ్చుగానీ, ఆలస్యం అయిపోతుంది. ఈ కారణం వల్లే నేను రాసిన సొంత కథల సంఖ్య, చేసిన అనువాదాల సంఖ్యలో సగం కూడా లేదు.

ఇక అనువాదాలు చేయడం వల్ల కల్గిన ఉపయోగాలు: కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను, క్లుప్తంగా, ఎఫెక్టివ్‌గా రాయగలగడం; కథనాన్ని కొత్త రీతిలో నడపడం వంటివి. అయినా రచయితగా/అనువాదకుడిగా నాది ఇంకా ఇవాల్వింగ్ స్టేజే, కథారచనలో నాకు పూర్తి నైపుణ్యం రాలేదని నా భావన. రాస్తూ వుంటే మెరుగవుతాము.

  • ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు మీరు? మీ కథాసంపుటిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ఇప్పటి వరకు 29 సొంత కథలు (పిల్లలు కథలు కాకుండా), 95 అనువాద కథలు రాసాను.

నా సొంత కథల సంకలనం “దేవుడికి సాయం” త్వరలోనే వెలువడుతుంది. ముందుగా ఈ-బుక్, వీలుని బట్టి ప్రింట్ బుక్!

నా అనువాద కథలతో 2006లో “మనీప్లాంట్” అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తర్వాత, “నాన్నా, తొందరగా వచ్చేయ్” అనే అనువాద కథల ఈ-బుక్‌ని, “వెదురు వంతెన” అనే అనువాద కథల మరో ఈ-బుక్‌ని ప్రచురించాను.

  • మరోసారి అభినందనలు అందజేస్తూ, మీరు ఇలాంటి మరిన్ని మంచి కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు, సోమశంకర్ గారూ!

నా కథను ఉత్తమ కథగా గుర్తించినందుకు, ఈ ఇంటర్వ్యూ రూపంలో, నా గురించి పాఠకులకు తెలుపుతున్నందుకు మీకు, సారంగ పత్రికకి మరో సారి ధన్యవాదాలు. నమస్కారం.

(కథ చిత్రం: గురుచైతన్య, కినిగె పత్రిక సౌజన్యం)

మీ మాటలు

  1. సమాజానికి చెడు చేయని రచన ఏదైనా మంచిదే. రాసేటప్పుడు ప్రతీ కథ మంచి కథ అనుకునే రాస్తాను. – బాగా చెప్పారు సోమశంకర్ గారూ, మీరు మరిన్ని కథలు రాయాలని కోరుకుంటూ…..

  2. bathula mirchee apparao says:

    హృదయ పూర్వక అభినందనలు

  3. @ రాధ గారూ, @ బత్తుల అప్పారావు గారూ,
    ధన్యవాదాలు
    కొల్లూరి సోమ శంకర్

Leave a Reply to bathula mirchee apparao Cancel reply

*