నన్ను మాట్లాడనివ్వు!

నన్ను మాట్లాడనివ్వు
స్పష్టంగా, తీర్మానంగా-

నీకు నచ్చదుకాబట్టీ
నీ అనుమతిలేదు కాబట్టీ
నా అవసరాలను రోజూ
అగ్గికి ఆహుతివ్వాలా?

నీలాగే
నేనూ జీవితమం గురించి
వేయి కలల్ని మోసుకొచ్చాను
అనుదినమూ నా కలల్ని చంపేసేలా
వేయి మేకులు కొట్టేస్తున్నావు!

నీ అనుమానాలకల్లా
నేను బాధ్యురాల్ని కాను
విచారణలు, నేర నివేదికలు,
నా మీద నువ్వు ప్రవేశ పెట్టే
అవిశ్వాస తీర్మానం –
వీటన్నిట్నీ చర్చించేందుకు
పడకగది నీ పార్లమెంటు కాదు.

నన్ను మాట్లాడనివ్వు!

మిక్కుటమైన బాధల్ని
బొమ్మగీసి చూపించలేను
నా అయిష్టాన్ని
నీకు విశదపరచటానికి
యుద్ధం సాగించలేను!

– అనార్ , తెగించు (ఊడఱు) అన్న స్త్రీ సాహితీ సంకలనంలోనుండి

Anar02

శ్రీలంకకి చెందిన ప్రముఖ తమిళ కవయిత్రి  ఇస్సాత్ రిహాణా అజీమ్ గారు “అనార్‌” అనే కలంపేరుతో రాస్తారు. ఈమె కవితల్లో శృంగారం, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ భావాలే ఎక్కువగా కనబడతాయి. ఈమె కవితా సంపుటాలు శ్రీలంకలోనూ, భారత దేశంలోనూ పలు సాహితీ పురస్కారాలు అందుకున్నాయి.

ఊడరు –  ఈ స్త్రీ సాహితీ సంకలనంలో పదమూడు వ్యాసాలు, ఐదు కథలు, ఇరవైనాలుగు కవితలు ఉన్నాయి.  రంజి (స్విస్), దేవా(జెర్మని), నిరుపా(జెర్మని), విజి(ఫ్రాన్స్) – వీరి సమిష్ఠి కృషితో 2002 లో ప్రచురించబడినది ఈ సంకలనం.

 

~ అవినేని భాస్కర్

Avineni Bhaskar

మీ మాటలు

 1. ఎన్ వేణుగోపాల్ says:

  భాస్కర్ గారూ,

  మంచి కవిత. మంచి అనువాదం. కాని కవితలోనూ, వివరణలోనూ బోలెడు అచ్చుతప్పులున్నాయి, పంటికింద రాళ్ల లాగ. మీరైనా, సంపాదకులైనా ఆ అచ్చుతప్పులు సవరించి మళ్లీ పోస్ట్ చేస్తే బాగుంటుంది.

 2. వేణుగోపాల్ గారూ,
  కవిత మీద, అనువాదం మీద మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములండీ.

  అచ్చుతప్పులు సంపాదకులు దిద్దరు అన్న విషయం ఇందాకే చూశానండి. పత్రికలో రైట్ కాలంలో “అచ్చు తప్పులు – ఒక గమనిక” అనొక లింక్ ఇచ్చి పెట్టారు చూడండి. ఆ ప్రకటనని నేను ముందే చూసి ఉంటే జాగ్రత్త పడి ఉంటానండి.

  నేను సారంగకి పంపించిన మెయిల్లో ఒకటుంది ఇక్కడ అచ్చయినదాంట్లో మరొకటుంది! నిజంగా సారంగవాళ్ళు పాపమండి. టెక్నాలజీ పదాల్ని మింగేస్తున్నట్టుంది :-(

 3. వేణూ: షుక్రియా..ఇప్పుడు అప్డేట్ చేసాం, చూడు.
  అచ్చుతప్పులకి మన్నించండి.

 4. balasudhakarmouli says:

  ఈ కవితకు, ఈ కవికి, అనువాదకులకు వందనం. ఇలాంటి కవితలు యింకా యింకా యింకా రావాలి. ఆ కవయిత్రిని పూర్తిగా తెలుగులోకి తీసుకొచ్చే పని చేస్తే ఎక్కువ ప్రయోజనం వుంటుంది. ఆ పని చేయాలని అనువాదకుల్ని కోరుతూ…..
  ఇలాంటి కవితలు పత్రికలో మరిన్ని వస్తాయని ఎదురుచూస్తూ……

 5. moida srinivasarao says:

  మంచి కవితను అనువదించి అందించినందుకు ధన్యవాదాలు సార్.

 6. Thirupalu says:

  శ్రీలంక తమిళ కవిత అనగానే అదేదో యుద్ద భూమి చెందిన, రాజకీయ అణచివేతకు చెందిన కవిత అనుకున్నా. ఇది కుటుంబ యుద్దభూమిలో స్త్రీ స్వేచ్చను రక్తసిక్తం చేసిన యుద్దోన్మామదమని తెలిసి హాశ్చర్య పోవలసి వచ్చింది. కవిత చాలా బాగుంది.

మీ మాటలు

*