కటకటాల్ని వెక్కిరించిన కవిత: కిటికీ పిట్ట

kitiki pitta

మోహన్ చిత్రకారుడుగా ఆ రంగంలో లోతైన విశ్లేషణా వ్యాసాలతో “అరుణతార”లో రచనలతో సుపరిచితుడు. 2005-06 మద్య కాలంలో తీవ్రమైన నిర్బంధ కాలంలో మోహన్ ఒకరోజు అనంతపురంలో యూనివర్శిటీ దారిలో నడిచి వెళ్తుండగా తెల్ల సుమోలో యూనిఫాంలేని పోలీసులు బంధించి పదిహేను రోజులపాటు తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయగా ఆ చిత్రహింసల కొలిమిలోంచి పెల్లుబికిన సాంద్రమైన ఆర్థ్రత నిండిన ఆగ్రహ వాక్యం ఈ ఖైదు కవిత్వం.

 

ఖైదులోంచి అనేకమంది కవులు రచయితల రచనలు మనం చదివాం. కానీ ఈ కవిత్వంలో ఉన్న కొత్త చూపు మానవీయత శత్రువును కూడా తనను తాను ప్రశ్నింప చేసుకొని మనిషిని చేసే సౌందర్యాన్ని తన కుంచెనుండి కలానికి ఒలికిన లేలేత నెత్తుటి రంగు పూసిన గాయాల చిత్రవర్ణ కవిత్వం ఇది. రచయితగా చిత్రకారునిగా నలుగురికీ సుపరిచుతుడైన మనిషిని తన రాజకీయ విశ్వాసానికి యింత తీవ్రమైన చిత్రహింసల పాల్జేసి రాజ్యం మానసికంగా తనని బలహీనుణ్ణి చేయబూనడం అమానుషం. కానీ రాజ్యానికి ఇవేవీ అంటని మట్టికాళ్ళ మహారాక్షసి కదా? తన కాళ్ళు నరికివేయబడ్తాయన్న భయం వెంటాడి మనుషులను వేటాడుతుంది. కానీ నిబద్ధత నిమగ్నతగల మనిషి తన సుదూర స్వప్నాన్ని ఈ దేశ శ్రామిక వర్గ విముక్తిలో కాంక్షించే వాడిగా చెక్కు చెదరని ఆత్మవిశ్వాస ప్రకటనగా తన కలాన్ని పదును పెట్టే అవకాశంగా ఈ ఖైదు సమయాన్ని కూడా సద్వినియోగం చేయగల ధీశాలత్వం ఇదే సామాజిక సందర్భం యిస్తుందని ఈ కవిత్వం మరోమారు నిరూపిస్తుంది.

 

నిజానికి ఖైదులో వున్నది ఖైదీ పేరుతోను తనకు కాపలాగా వున్న ఉద్యోగి జైలర్ పేరుతోను ఇరువురు వున్నది జైలులోనే కదా అన్న స్పృహ జీతం తీసుకునే వాడికి వుండదు కదా? వాడికి తను మనిషినే అన్న స్పృహ నశించి ఉద్యోగ ధర్మం పేరుతోనో, తన నిస్సహాయతతోనో తోటి మానవునిపై మృగంలా అమలుచేసే చిత్రహింసల గురించి ఒకింత బాధ్యతతోనే మోహన్ వారిపై కూడా సానుభూతి చూపడం కవి హృదయాన్ని పట్టిస్తుంది.

 

నువ్వయినా ఎన్నిసార్లని గాయాలు చేయగలవులే

నువ్వయినా ఎన్నిసార్లని ప్రేమలు కోల్పోగలవులే

నేనైనా ఎన్నిసార్లని నిన్ను ద్వేషించగలనులే

ఇదుగో ఇటు

నా ముఖంలోకి సూటిగా చూడు

నా కళ్ళలో నీకే వెన్నెలా కనిపించడం లేదూ

నా నుదిటిమధ్య నీకే సన్నని జీవరేఖా పొడగట్టడం లేదూ

 

హు.. అవున్లే

చూపును కోల్పోతేనే గదా

నీ చేతులకు అసహజ చర్యలు మొలుచుకొచ్చేది

కార్పణ్యపు బిరడాను బిగించుకుంటేనే కదా

నీ హృదయ సున్నిత సంస్పర్శలు బండబారేది..

ప్రియ శత్రువా

నువ్వేం దిగాలుపడకు!

నీ భ్రమల విచ్చిత్తి కోసమే

నే బతికి బట్టకడతా

నాపై నువ్వెన్ని గాయాలకైనా పాల్పడు

నీలో మూల మానవుడు అంతరించడు

 

“గాయానికి గాయానికీ నడుమ

కాసింత తెరిపి

నాకే కాదు నీకూ కావాలి” అంటాడు కవి.

 

“పునరుత్థానం ఒక పురాకాంక్ష

వేటలో అసువులు బాసిన

ఆదిమానవుని ఖననంలో పోసిన

ఇంత కుంకుమా ఎర్రగంధమూ

వియోగపు రద్దుకు గొప్ప ఆశ్వాసన” అని విశ్వాస ప్రకటన చేస్తాడు కవి.

 

“హింస పాలబడిన పురాశరీరాన్ని

నిలువెత్తుగోడల మధ్య పడదోసి కూడా

తలుపుల భద్రత కోసమో

తలుపుల్లో దాగిన బతుకు భద్రత కోసమో

తాళంపైన తాళమేసుకునే

సంశయాత్మల విచికిత్సకు

విరగబడినవ్వుతున్నా” అని జైలు వాతావరణాన్ని హేళన చేస్తూనే

 

తలుపులంటే చెట్ల రూపాంతరాకృతులే కదా

తలుపులంటే రెండు చెక్కల కలయికే కదా!

 

చెట్ల రుతు సౌందర్యాలను ఆరాధించేవాణ్ణి

రెక్కల ఆవరింతలో కదిలిపోయేవాణ్ణి

తలుపు భౌతిక చలనాలనౌ తుంపేయవచ్చు

మరి మనసు తిరిగే స్వప్న ప్రపంచపు సంగతో– అని ప్రశ్నిస్తాడు కవి.

 

మోహన్ ఇందులో ఖైదులోనుండే బయట తనకోసం వేచివున్న అమ్మా, నాన్నా, చెల్లెల గురించి, తను రోజూ చూసే మందారం కొమ్మ తెంపిన అమ్మాయి గురించి కవిత్వం రాసారు. చిత్రహింసల మద్యలోంచే తన రాజకీయ విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తూ తన నుండి ఏ ఒక్క రహస్యాన్ని పొందలేకపోయిన శత్రువుని హేళన చేస్తూ విస్పష్ట ప్రకటన చేస్తారు. ’దేహం దేహమే రహస్యమైన చోట దేశంలో కోటానుకోట్ల రహస్యాలు’ అంటాడు కవి. ఈ కవిత్వం మొత్తం సరికొత్త ఉపమాన చిత్రలిపితో తాననుభవించిన చిత్రహింసలను మన కళ్ళకు కట్టినట్టు చూపుతూ శత్రువు యొక్క అమానవీయతను వాని నిస్సహాయతను బట్టబయలు చేయడం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూనే కర్తవ్య నిర్వహణకు గుండె నిబ్బరాన్నిస్తుంది.

కేక్యూబ్ వర్మ

varma

మీ మాటలు

  1. NS Murty says:

    వర్మగారూ,
    మంచి పరిచయం. అపురూపమైన మానసిక విశ్లేషణ గల కవిత.
    ఎన్నో ధన్యవాదాలు.
    అభివాదములతో

  2. balasudhakarmouli says:

    వర్మ గారూ… మోహన్ గారి పేరు నాకు చిత్రకారుడుగానే తెలుసు. కవిని పరిచయం చేసారు. గొప్ప కవిని పరిచయం చేసారు. మహా శక్తివంతుడయిన కవిని పరిచయం చేసారు. కవికి, కవి ధైర్యానికి , నిబద్ధతకు వందనం.

  3. P Mohan says:

    వర్మకు కృతజ్ఞతలు. పరిచయం నచ్చిన వారికీ. ఇది 2006లో వచ్చిన పుస్తకం. చిన్న వివరణ.. నా పేరు పి.మోహన్. ఉత్త మోహన్ కాదు, పి.మోహన్. ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు మోహన్ నేను కాదు. నేను కూడా బొమ్మలు గీస్తాను కాని, పెద్దగా బావుండవు. జనం గందరగోలపదతారని పేరు మార్చుకోలెం కదా…

  4. పెద్దలు మూర్తి గారికి, మిత్రుడు బాల మురళికి ధన్యవాదాలు. మోహన్ సార్ మీరు వీలయితే సారంగకు మళ్ళీ చిత్రలేఖనం పై మీ పరిచయ వ్యాసాలూ వ్రాస్తే బాగుంటుంది. సామాజిక సమస్యలపై స్పందించి వేసిన పాశ్చాత్య చిత్రకారుల పరిచయాలు మీరు రాసినవి చాలా విజ్ఞానదాయకంగా వుంటాయి. అలాగే కవిత్వం కూడా.

మీ మాటలు

*