వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా శూన్యం ఆవరించింది. జాతస్య మరణం ధ్రువం కావచ్చు. కాని కొందరి మరణం ఎంతమాత్రమూ అంగీకారయోగ్యం కాదనిపిస్తుంది. ఆ లోటు ఎప్పటికీ తీరదనిపిస్తుంది. మార్కెజ్ మరణ వార్త విన్నప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలుగా తెరలు తెరలుగా దుఃఖం వస్తూనే ఉంది.

భాషలో, జాతిలో, భూఖండంలో, వయసులో ఎంతో ఎడం ఉన్న సుదూరమైన ఈ మనిషి, ప్రతిభలో ఆకాశమంత ఎత్తయిన ఈ మనిషి కేవలం భావాల వల్ల దగ్గరివాడైన ఈ మనిషి నా మనిషి అని ఎందుకనిపిస్తున్నాడు? నా హృదయపు ముక్క ఒకటి తెగిపోయినప్పటి మహా విషాదం ఎందుకు ఆవరిస్తున్నది?

అతి ఎక్కువగా ప్రభావితం చేసిన రచయితలు, కళాకారులు ఎవరికైనా ఇలాగే నా మనిషి అని ఆప్తులుగా అనిపిస్తారేమో. వారిని ఎన్నడూ కలవకపోవచ్చు కాని వారినిక కలిసే అవకాశం కూడ ఎప్పటికీ లేదనే ఎరుక కలగడం, వారి అద్భుత ప్రతిభ వెలువడడానికి ఇక వీలులేదని తెలియడం ఒక జీవితకాల విషాదం.

ఆయనను చదివాను. ఆయన అక్షరాల మాయలో చిక్కుకున్నాను. ఆయన వాక్యాల వెంట కన్నీరు కార్చాను. ఆయన సృష్టించిన సన్నివేశాలలో భాగమై అపారమైన ఆనందాన్ని అనుభవించాను. గొప్ప తాదాత్మ్యం పొందాను. మైమరిచిపోయాను. బహుశా ఆ పఠనానుభూతి, ఆ సంభ్రమం, ఆ ఆనందం ఎప్పటికీ మాయం కావు, ఆయన ఇక లేడు. ఆయన రచనలు వెలువడడం ఆగిపోయి పదేళ్లు అయింది గాని ఏమో హఠాత్తుగా ఆ కాన్సర్ నుంచి విముక్తి అయి, ఆ అల్జీమర్స్ నుంచి బైటపడి, ఆ అద్భుత మేధ మళ్లీ ప్రపంచం కోసం ప్రేమతో మరి నాలుగు అక్షరాలు వెదజల్లేదేమో. కాన్సర్ అని తెలిసిన తర్వాతనే, చనిపోయాడని నీలివార్త ప్రచారమైన తర్వాతనే కదా ‘కథ చెప్పడానికే బతుకు’ (లివింగ్ టు టెల్ ది టేల్) అని జీవిత కథ రాశాడు!

ఇక ఆ ఆశ లేదు. కథ చెప్పే మనిషి లేడు. ఆ కలం ఆగిపోయింది. యాభై సంవత్సరాలకు పైగా లాటిన్ అమెరికన్ జీవిత సముద్రాన్ని మథించి, ప్రపంచానికి అమృతాక్షరాలనందించిన ఆయన చేతివేళ్లు దహనమైపోయి చితాభస్మంగా మారిపోయాయి. అనంత కోటి జ్ఞాపకాలను, కోటి ఊహలను, లక్ష వాస్తవాలను కలగలిపి, ఆ రసాయనిక సంయోజనంలో ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన ఆ మేధ ఆలోచించడానికి ఇంక అవకాశం లేదు. ఆయన శిష్యురాలు, చిలీ జీవితాన్ని దాదాపు గురువంత అద్భుతంగానూ చిత్రించిన నవలా రచయిత ఇసబెల్ అయెండె అన్నట్టు, “నా గురువు మరణించాడు. కాని ఆయనకు సంతాపం ప్రకటించను. ఎందుకంటే నేనాయనను పోగొట్టుకోలేదు: ఆయన మాటలను మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాను.”

***

Gabriel-Garcia-Marquez-2-190

ఎక్కడో కొలంబియాలో పుట్టిపెరిగి, స్పానిష్ లో రాసి, మార్క్యూజ్ అనే పొరపాటు ఉచ్చారణతో పిలుచుకున్న ఈ గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ అనే మహా శబ్దమాంత్రికుడు, మాంత్రిక వాస్తవికతా శిల్పి నా జీవితంలోకి ఎలా వచ్చాడు? ఆయన మా వరంగల్ వాడో, తెలంగాణ వాడో అని నేను ఎప్పుడూ ఎందుకు నమ్ముతూ వచ్చాను?

“జీవితమంటే ఒకరు జీవించినది కాదు, వారు గుర్తు పెట్టుకునేది, తిరిగి చెప్పడం కోసం ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది” అని తన ఆత్మకథ లివింగ్ టు టెల్ ది టేల్ లో అన్నాడు మార్కెజ్. బహుశా ఆయన జీవితమూ రచనా అన్నీ ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. అందువల్లనే ఆయన రచన వాస్తవికత మాత్రమే కాదు, అది వాస్తవికత, జ్ఞాపకం, ఊహల కలనేత. వందల సంవత్సరాల సామూహిక జ్ఞాపకాల దొంతరలు నిత్యజీవన భయానక ఉజ్వల వాస్తవికతతో పడుగూ పేకల్లా కలిసిపోయిన తెలంగాణ వంటి ప్రతి సమాజంలోనూ ఆయన ఉన్నాడు, ఆయన సృజన ఉంది.

మార్కెజ్ ను నాకు పరిచయం చేసింది రాజకీయార్థిక శాస్త్రవేత్త, సురా పేరుతో విమర్శకుడిగా సుప్రసిద్ధుడు, సృజన సాహితీమిత్రుడు సి వి సుబ్బారావు. రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎమర్జెన్సీ కాలమంతా జైలులో ఉండి, ఎమర్జెన్సీ తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా చేరాడు. అప్పటి నుంచి 1985 దాకా ఎప్పుడు సెలవులు వచ్చినా నేరుగా వరంగల్ వచ్చి, అటూ ఇటూ వెళ్తూ వస్తూ, వరంగల్ లోనే ఎక్కువకాలం గడిపేవాడు. సృజనకూ సాహితీమిత్రులకూ బైటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆయన ఒక తెరిచిపెట్టిన విశాలమైన కిటికీ. ఆయన నిశాచరుడు. రాత్రంతా మేలుకుని ఉండి ఉదయం ఐదున్నర, ఆరుకు పడుకునేవాడు. రాత్రంతా ఆయనకు తోడుగా చెప్పినవి వింటూ, రోడ్లమీద తిరుగుతూ, అన్నివేళల్లోనూ హనుమకొండ చౌరస్తాలో ఇరానీ హోటళ్లలో చాయ్ తాగుతూ కాలం గడుస్తుండేది. అలా సుబ్బారావు ద్వారానే 1982 చివరిలో మార్కెజ్ గురించి తెలియడమే కాక వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పుస్తకమూ, మార్కెజ్ నోబెల్ ఉపన్యాసం అచ్చయిన ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ కటింగ్ ఫొటోకాపీ చేతికందాయి. ఆ నవలలో మొదటిసారి మంచుముక్కను ముట్టుకున్న మహోగ్ర ఉష్ణమండల వాసిలాగనే నేనూ ఆ అక్షరాలు ముట్టుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ మొదటి పఠనంలోనే నవల మొత్తంగా అర్థమయిందని చెప్పలేను గాని గాఢమైన ప్రభావాన్ని వేసింది. అంతకన్న ఎక్కువగా ఆకట్టుకున్న, దుఃఖావేశాలు కలిగించిన, లాటిన్ అమెరికా చరిత్ర చదవడానికి పురికొల్పిన నోబెల్ ఉపన్యాసం వెంటనే తెలుగు చేశాను.

(http://www.andhraprabha.com/offbeat/hundred-years-of-solitude/15980.html) అది అప్పుడే సృజన జూన్ 1983 సంచికలో అచ్చయింది. తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ చదివినప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురింపజేసింది.

తర్వాత నాలుగైదు సంవత్సరాలకు బెజవాడలో ఉండగా లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా చేతికందింది. సరిగ్గా తెలుగు సీమలో ఆట పాట మాట బంద్ అనే నియంతృత్వం అమలవుతున్న చీకటిరోజులవి. కలరా రోజులవి. పైకి ప్రేమ కథగా కనబడినప్పటికీ అది మానవసంబంధాలను విచ్ఛిన్నం చేసే వాతావరణానికీ, మానవసంబంధాల అపరాజితత్వానికీ ఘర్షణ కథ అని నాకనిపించింది. ఆ తర్వాతెప్పుడో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మార్కెజ్ కూడ ఆ నవల గురించి “పాఠకులు నా వలలో పడగూడదు” అన్నాడని చదివినప్పుడు ఆ నవల పొరలుపొరలుగా ఏమేమి చెప్పిందో ఎన్ని సార్లు చదివితే అన్నిసార్లు కొత్త అర్థాలు దొరుకుతాయనిపించింది.

images

తర్వాత బెంగళూరులో ఉండగా పన్నెండు కథల సంపుటం స్ట్రేంజ్ పిల్ గ్రిమ్స్. ఇరవై ఏళ్ల కింద ఆ పుస్తకం చదువుతున్నప్పటి అనుభవం ఈ క్షణాన అనుభవిస్తున్నట్టే ఉంటుంది. ఆ పుస్తకమంతా ప్రవాసానికీ ప్రవాస వైచిత్రికీ సంబంధించినది. ఆ ప్రవాసం స్థలానిది కావచ్చు, కాలానిది కావచ్చు, వయసుది కావచ్చు. మనసుది కావచ్చు. అధికారానిది కావచ్చు. ఆ డజను కథలూ వస్తుపరంగా గాని, శిల్పపరంగా గాని పాఠ్యపుస్తకాలుగా అధ్యయనం చేయదగినవి. ఆ పుస్తకంమీద నా ప్రేమ ఎంతటిదంటే కనీసం అరడజను మందికి ఆ పుస్తకం కానుక ఇచ్చాను. కనీసం డజను సార్లయినా కథ వర్క్ షాపుల్లోనో, సాహిత్య సమావేశాల్లోనో వాటిలో ఏదో ఒక కథ గురించి చెప్పి ఉంటాను. ఇరవై ఏళ్లు గడిచినా వాటిలో ద ట్రెయిల్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇన్ ద స్నో గాని, ఐ ఓన్లీ కేమ్ టు యూజ్ ద ఫోన్ గాని గుర్తుకొస్తే కళ్లు చెమరుస్తాయి. లైట్ ఈజ్ లైక్ వాటర్ ముందర అమాయక, నైసర్గిక బాల్యంలోకి జారిపోయి నిజంగానే ఆ ట్యూబ్ లైట్ పగిలిపోయి దాంట్లోంచి వెలుగు నీటిలా ప్రవహిస్తుందా చూడాలనిపిస్తుంది.

బెంగళూరులో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అని మేం నడుపుతుండిన బృందంలో అందరూ రాజకీయ, సామాజిక కార్యకర్తలే కాక సాహిత్యాభిమానులు కూడ. మార్కెజ్ రచనలు మాకు నిరంతర చర్చనీయాంశాలు. అందుకే నేను బెంగళూరు వదిలేసి వచ్చేటప్పుడు పిడిఎఫ్ మిత్రులు అప్పుడే తాజాగా వెలువడిన ఆఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్ కానుకగా ఇచ్చారు. మళ్లీ ఇది కూడ ప్రేమ కథగా కనబడుతుంది గాని పొరలు విప్పుకుంటూ పోతే వలసవాదం, క్రైస్తవం, స్థానిక ఆచారవ్యవహారాలు, అభూత కల్పనలు, ప్రేమ, ఆధిపత్యం ఒకదానిలో ఒకటి కలిసిపోయి అబ్బురపరుస్తాయి.

బెంగళూరులో ఉండగానే దొరికిన మరొక మార్కెజ్ అద్భుతం క్లాండెస్టైన్ ఇన్ చిలీ. అకాలంగా మరణించిన సాహితీమిత్రుడు గోపీ స్మృతిలో ఒక పుస్తక ప్రచురణ కార్యక్రమం, ముఖ్యంగా తనకు ఇష్టమైన అనువాద సాహిత్యం ప్రచురించాలని అనుకున్నప్పుడు వెంటనే తట్టినదీ, కొద్ది రోజుల్లోనే అనువాదం, ప్రచురణ అయిపోయినదీ ఆ క్లాండెస్టైన్ ఇన్ చిలీ పుస్తకమే. నేను, సి వనజ అనువాదం చేసిన, చీకటి పాట పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో సల్వదోర్ అయెండె పేరు వర్ణక్రమం దగ్గరి నుంచి ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి మార్కెజ్ పుస్తకం అది. దాని అనువాదంతో, ప్రచురణతో సంబంధం ఉండడం నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది.

IMG_20140422_074326

 

నోబెల్ బహుమతి డబ్బుతో పత్రిక కొని దాంట్లో రిపోర్టర్ గా పని చేస్తాననడమూ, చేయడమూ, ఎప్పటేప్పటి జ్ఞాపకాలనూ, తాత అమ్మమ్మల అభూత కల్పనలకు అక్షరాలు తొడగడమూ, మకాండో అనే ఊహాగ్రామం చుట్టూ అల్లిన అద్భుత గాథలూ, గెరిల్లాలతో చర్చలకు మధ్యవర్తిత్వమూ, అధ్యక్ష పదవి చేపట్టమని కోరడమూ, మరణించాడనే గాలి వార్తా, దానికి జవాబుగా కథ చెప్పడానికే బతికి ఉన్నాననడమూ, కాస్ట్రోతో స్నేహమూ, సామ్రాజ్యవాద వ్యతిరేకతా…. ఆయన చుట్టూ అల్లుకున్న అభూతకల్పనల వంటి జానపదగాథలు ఎన్నెన్నో, మిత్రులతో సంభాషణల్లో ఎన్నిసార్లో….

అనుకోకుండా వనజకు బర్కిలీలో ఫెలోషిప్ వచ్చి, నాకు కూడ మూడు నెలల కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడవలసిన మనుషుల, ప్రాంతాల జాబితా తయారు చేసుకున్నాను. గూగీ, జేమ్స్ పెట్రాస్, మార్క్ ట్వెయిన్, పాల్ రాబ్సన్, బాబ్ డైలాన్, ఐన్ స్టీన్, స్వీజీ-మాగ్డాఫ్ లు గడిపిన మంత్లీ రివ్యూ ఆఫీసూ వగైరా… వనజకు బర్కిలీలో పరిచితమైన మెక్సికన్ వలేరియా బ్రబాతా వల్ల మెక్సికో కూడ వెళ్లడం వీలయినప్పుడు అక్కడ మార్కెజ్, ఫ్రీదా కాలో, డీగో రివేరా, వీలైతే దక్షిణాదికి వెళ్లి జపాటిస్టాలు…. కాని సరిగ్గా అప్పుడే మార్కెజ్ మెక్సికో సిటీ లో లేడు. తర్వాత కొద్ది రోజులకు గూగీని కలవడానికి అర్వైన్ కు వెళ్తూ లాస్ ఆంజెలిస్ లో మిత్రులు డాక్టర్లు జ్యోతి, గిల్బర్ట్ ల దగ్గర ఆగినప్పుడు, మాటల్లో ప్రస్తావన వస్తే గిల్బర్ట్ పనిచేసే ఆస్పత్రిలోనే మార్కెజ్ కు కీమోథెరపీయో, ఆ తర్వాత చికిత్సలో జరుగుతున్నాయని తెలిసింది. కాని ఆ షెడ్యూల్ కూడ అప్పుడు లేదు. అంటే రెండు సార్లు కనుచూపుమేర లోకి వెళ్లి కలవలేకపోయాను.

***

images

మార్కెజ్ ఆయన జ్ఞాపకాలను, తన జ్ఞాపకాలను మాత్రమే కాదు, తన జాతి జ్ఞాపకాలనూ, మానవజాతి జ్ఞాపకాలనూ తన రచనకు ముడిసరుకుగా వాడుకున్నాడు. జ్ఞాపకం అన్నప్పుడే కాలం జల్లెడ పట్టగా మిగిలిన వాస్తవం అని అర్థం. ఆ జల్లెడలో పూర్తిగా నెల్లు మిగిలిందా, పోయిందంతా పొల్లేనా ఎవరూ చెప్పలేరు. ఆ జ్ఞాపకాలను ఊహలతో రంగరించి, వాస్తవికతతో మెరుగులు దిద్ది అక్షరాలకెక్కించాడు మార్కెజ్. అందువల్లనే ఆయన రచనల్లో వందలాది కోటబుల్ కోట్స్ ఉంటాయి. అవి మానవజాతి తరతరాల సంచిత ఆస్తికీ, ప్రాచీన వివేకపు నికషోపలానికీ. ఆధునిక, అత్యాధునిక, భవిష్య ఆశాసూచికలకూ ప్రతీకలు. ఆనందంతో బాగుపడని దాన్ని ఏ మందులూ బాగుచేయలేవు అన్నా, ఎప్పుడైనా ప్రేమించడానికి ఏదో మిగిలే ఉంటుంది అన్నా మార్కెజ్ ప్రకటిస్తున్నది మనిషి పట్ల ప్రేమను, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని. ఆ ప్రేమకూ, ఆ ఆశకూ ఎన్నటికీ మరణం లేదు.

దాన్ని ఆయన కాల్పనిక రచనల్లో మాత్రమే కాదు, కఠిన వాస్తవిక ప్రసంగంలోనూ వ్యక్తీకరించాడు.

“…ఇన్ని జరిగినా, మాపట్ల కొనసాగినఅణచివేతకూ, మమ్మల్ని కొల్లగొట్టుకు పోవడానికీ, మమ్మల్ని వెలివేయడానికీమాకు ఒక జవాబు ఉంది. అది బతుకు. మాపై కొనసాగిన దౌర్జన్యానికంతటికీ మేంబతుకుతో జవాబిస్తాం. వరదలు గానీ, రోగాలు గానీ, కరువులు గానీ, ప్రళయాలుగానీ, శతాబ్దాల తరబడి సాగిన అనంత యుద్ధాలు గానీ చావుమీద బతుకు సాధించినవిజయాన్ని కాదనలేకపోయాయి. చావు మీద బతుకు గొప్పతనాన్ని తొలగించలేకపోయాయి” అని ఆయన నోబెల్ ప్రసంగంలో అన్నాడు.

అంతేకాదు, తన సామాజిక వాస్తవికతకూ తన సాహిత్య అభివ్యక్తికీ మధ్య సంబంధం పట్ల కూడ ఆయన ప్రకటించిన సవినయ అవగాహన మనిషి మీద, సమాజం మీద, చరిత్ర మీద, భవిష్యత్తు మీద ఆయన గౌరవానికి నిదర్శనం: లాటిన్ అమెరికా బీభత్స వాస్తవాన్ని వివరంగా చెప్పి, “నిజంగా స్వీడిష్ సాహిత్య అకాడెమీదృష్టికి రాదగిన అర్హత కలిగినది ఈ పెరిగిపోయిన వాస్తవమేగాని, దాని కేవలసాహిత్య వ్యక్తీకరణ కాదు. ఒక కాగితం మీది అక్షరం కాదు. మాలో బతుకుతున్నవాస్తవం. ఆ వాస్తవం మా అసంఖ్యాక రోజువారీ మరణాలను నిర్ణయిస్తున్నది. ఆవాస్తవం అనంతమైన సృజనాత్మకతకు వనరులు చేకూర్చిపెడుతున్నది. ఆ వాస్తవంనిండా కన్నీళ్లు ఉన్నవి, సౌందర్యం ఉన్నది. గతకాలాన్ని నెమరేసుకుటూ దేశదిమ్మరిగా తిరిగే ఈ కొలంబియన్ ఆ వాస్తవానికి ఒకానొక వ్యక్తీకరణ, అదృష్టం వరించినఒకానొక ఉదాహరణ” అని ఆయన నోబెల్ వేదిక మీది నుంచి ప్రకటించాడు.

ప్రపంచమంతా ఆయనకు నివాళి అర్పించింది. కాని అన్నిటిలోకీ నాకు నచ్చినది, ఆయన పుట్టిపెరిగిన నేల మీద దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మార్క్సిస్టు విప్లవకారుల సంస్థ కొలంబియా విప్లవ సాయుధ సైన్యం (ఫార్క్) తాము వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పాత్ర కర్నల్ అరెలియానో బెండియా నుంచి ప్రేరణ పొందుతూనే ఉంటామని అంది. ఆ మహాద్భుత వ్యక్తి మరణం తర్వాత మళ్లీ ఒకసారి చెపుతున్నాం. అరెలియానో బెండియా లాగనే మేం కూడ శాంతి గురించి కలగంటూనే ఉంటాం, శాంతిని నెలకొల్పుతాం అంది ఫార్క్.

-ఎన్. వేణుగోపాల్

venu

మీ మాటలు

  1. buchireddy gangula says:

    ఎక్ష్చెల్లెన్త్ వన్ —బాగా చెప్పారు సర్
    ————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  2. balasudhakarmouli says:

    ఆత్మీయ స్పర్శ వాక్యం వాక్యంనా !

  3. Thirupalu says:

    // అతి ఎక్కువగా ప్రభావితం చేసిన రచయితలు, కళాకారులు ఎవరికైనా ఇలాగే నా మనిషి అని ఆప్తులుగా అనిపిస్తారేమో. వారిని ఎన్నడూ కలవకపోవచ్చు కాని వారినిక కలిసే అవకాశం కూడ ఎప్పటికీ లేదనే ఎరుక కలగడం, వారి అద్భుత ప్రతిభ వెలువడడానికి ఇక వీలులేదని తెలియడం ఒక జీవితకాల విషాదం.//
    చాలా నిజం చెప్పారు సార్‌!

  4. Vijay Reddy says:

    వేణుగోపాల్ గారు,

    అద్భుతం, చాలా చక్కగా రాసారు. నేను మీ చీకటి గానం చదివాను. తెలుగు భాషలో ఉన్న ప్రామాణిక అనువాదాలలో ఆ పుస్తకం ఒకటనేది నా అభిప్రాయం. “ఓహ్ మై సన్” అనే వాక్యాన్ని మీరు “అబ్బా నా కొడుకా” అని అనువాదం చేసిన విధానం నాకు అలాగే గుర్తు ఉంది పోయింది.

    ఈ వ్యాసాన్ని మీరు ఏదైనా పుస్తకం లో బాగం చేస్తే బాగుంటుంది. చీకటి గానాన్నే మీరు మళ్ళీ ప్రచురిస్తే ఎలా ఉంటుంది?

  5. “ఆనందంతో బాగుపడని దాన్ని ఏ మందులూ బాగుచేయలేవు” “ఎప్పుడైనా ప్రేమించడానికి ఏదో మిగిలే ఉంటుంది” ఆయన కాక మరెవ్వరీ మాట అనగలరు..

    చివరలో మీరన్నట్లు శాంతిని గురించి కల గనేవారికి, కల కంటున్నవారికి మాత్రమే సాధ్యమైన గుణాలివి. మళ్లీ చీకటి గానం వెలుగులోకి వస్తుందా.. కష్టమైతే కనీసం జిరాక్స్ చేసి పీడీఎఫ్‌గా మార్చి సాప్ట్ కాపీని అయినా సరే మనుషుల కోసం అందుబాటులో ఉంచగలరు.

    ఒక శబ్ద మాంత్రికుడిని అదే స్థాయి అక్షరాలతో ఆవిష్కరించారు. చదివిన ప్రతివారూ మీతో ఏకీభవిస్తారనే భావిస్తున్నా. కాయలు కాసే చెట్టుకే రాళ్లు అనే చందాన దశాబ్దాలుగా మీ జీవితాన్ని ఊగించిన ఆ మనిషి రచనలను మీరే క్లుప్తంగా పరిచయం లేదా సమీక్ష విడివిడిగా చేయవచ్చు కదా..

    ఆశలకేం.. చాలానే… తీరడమే సమస్య..

    ఒకనాటి సృజనలోని ఆ నొోబెల్ ప్రసంగ పాఠాన్ని మాకందించినందుకు ధన్యవాదాలండీ….

  6. కోడూరి విజయకుమార్ says:

    వేణూ !
    అప్పుడెప్పుడో చదివిన మార్కెజ్ రచనలు – ‘లవ్ ఇన్ టైం అఫ్ కలరా’; ‘అఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్; ‘స్ట్రేంజ్ పిల్గ్రిమ్స్’ లని మళ్ళీ ఒకసారి కొత్తగా చదవాలన్నత ఉద్వేగానికి గురిచేసింది మీ వ్యాసం !

  7. ఎన్ వేణుగోపాల్ says:

    గంగుల బుచ్చిరెడ్డి గారు,

    బాలసుధాకర మౌళి గారు,

    తిరుపాలు గారు,

    విజయ్ రెడ్డి గారు,

    రాజశేఖర రాజు గారు,

    విజయ్,

    కృతజ్ఞతలు. ఆ మహారచయిత గురించి కొండ అద్దమందు అన్నట్టుగా కూడ చెప్పలేకపోయాననే, నా ప్రేమను పూర్తిగా వ్యక్తం చేయలేకపోయాననే అసంతృప్తి/విచారం
    లో ఉండగా మీ ప్రోత్సాహం. మార్కెజ్ సాహిత్యం మీద గత ఐదు దశాబ్దాలలో ఎంతో చర్చ జరిగింది. ఆయనను ఇటు కొస నుంచి అటు కొస వరకు లాగినవాళ్లు ఉన్నారు. కాని, నావరకు నాకు ఆయన నా జీవితం గురించీ, నా వరంగల్ గురించీ, నా తెలంగాణ గురించీ రాసినట్టే అనిపిస్తుంది. అందుకే ఆ వెలుగువెన్నెలల చంద్రుడికి ఈ వ్యక్తిగత నూలుపోగు. అదీ నాకు పూర్తి సంతృప్తితో రాలేదు.

    చీకటి పాట మళ్లీ వేయమని చాలమంది అడుగుతున్నారు. చూడాలి. కావలసినవాళ్లకు వెంటనే ఫొటోకాపీ చేయించి ఇవ్వగలను. ఇంతకూ అంతటి మహారచయిత రచనల్లో అది ఒక్కటి మాత్రమే (నోబెల్ ఉపన్యాసం, విపులలో వచ్చిన కొన్ని కథలు మినహాయిస్తే) తెలుగులోకి వచ్చింది. ఒక్క నవల కూడ రాలేదు. అదీ మన తెలుగు ఘనత! దాదాపుగా మార్కెజ్ నవలలన్నీ మలయాళంలోకి వచ్చాయని విన్నాను.

  8. santhamani says:

    venugaaruu వ్యాసం బాగుంది.కాని మీరన్నట్టు నూలు పోగే.వివరంగా మరోసారి రాయండి.అన్నట్టు వన్ హండ్రెడ్ ఇయర్స్ solityude కుడా తెలుగులో లేదా?

    • ఎన్ వేణుగోపాల్ says:

      శాంతమణి గారూ

      కృతజ్ఞతలు. వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ కూడ తెలుగులోకి రాలేదు. అదే విషాదం. కొన్ని రచనలు ఎంత తొందరగా తెలుగులోకి తెచ్చుకున్నామో, కొన్ని ఎన్నాళ్లయినా (ఎన్ని దశాబ్దాలయినా) ఎందుకు తెచ్చుకోలేదో దానికదిగా పరిశోధించాల్సిన విషయం.

  9. balasudhakarmouli says:

    మన తెలుగులో యిప్పుడు కూడా అద్భుతమైన అనువాదకులు వున్నారు… అటు కవిత్వంలోనైనా, యిటు కథలూ – నవలలలోనైనా ! అనువాద సాహిత్య ఎక్కువగా నూతన రచయితలకు అందాల్సిన అవసరం వుంది. ప్రపంచంలో వివిధ సాహిత్యధోరణలను, సామాజిక స్థితిగతులను తెలుసుకునే అవకాశం వుంటుంది. దేశానికి ఎంతో విలువైన చూపుతో, బాధ్యతతో రచనలు చేస్తున్న… కా. ఎన్. వేణుగోపాల్ గారూ…. త్వరగా మీరే అనువాదం చెయ్యండి.

  10. amarendra says:

    బావుందండి..థాంక్స్..ఎవరైనా ప్రచురిస్తానంటే ‘వన్ హండ్రెడ్ ..’ తెలుగు చేసే ప్రయత్నం చేస్తాను..

  11. balasudhakarmouli says:

    దాసరి అమరేంధ్ర గారూ…. మీరే కదండీ ! ఈ మధ్య మీరు విజయనగరం వచ్చినప్పుడు సభలో మీ అప్పటి పోయెమ్స్ విన్నాను. చాలా ఆనందమనిపించింది.

    గొప్ప గొప్ప పుస్తకాలుకు అనువాదాలు రావాల్సిన అవసరం వుందండి.

    • amarendra says:

      అవునండి..థాంక్స్..అనువాదాలు అవసరం..మా గెనెరతిఒన్ వాటి వల్ల ఎంత ‘లాభ’ పడిందో !

      • amarendra says:

        సారీ..చూసుకోలేదు..అది ‘జనరేషన్’ అని వుండాలి

  12. palamaneru balaji says:

    తెలుగు సాహిత్యం లో చాలా మంది చెయ్యాల్సిన చాలా పనులు ప్రేరణతో భాద్యతతో ప్రారంభించాల్సి ఉంది.
    సమర్థత కలిగిన వాళ్ళకిఉత్సాహం ఉంటుంది ప్రోత్సాహమే కావాలి

Leave a Reply to ఎన్ వేణుగోపాల్ Cancel reply

*