చిత్రాంగి

drushya drushyam 28మన దిష్టి తగులుతుందిగానీ చూడగలిగితే ఎన్ని అందాలో…
అస్పష్టంగానూ, నిగూఢంగానూ ఉండే అనురాగాలూ హృద్యమైన వ్యక్తీకరణలలూ కనుల ముందు దృశ్యబద్ధమైతే మానవులు ఎంత హాయిగా ఉంటున్నారో తెలిసి రాదు!నిజానికి మనుషులు ఏకాంతంలో లేదా తమ వ్యక్తిగత ప్రపంచంలో ఎంత బాగుంటరు?
తమను తాము ఆవిష్కరించుకుని ఆనందించడంలో, తమలో తాము లీనమై ముచ్చట్లాడటంలోవాళ్లు ఎంత ముద్దుగుంటరు!నిజానికి ఈ చిత్రం ఆమెదే.
కానీ, ఇద్దరిని కాంపోజ్ చేస్తూ నేను మరో ఇద్దరు పురుషులనూ ఫ్రేంలోకి తెచ్చాను, గమనించగలరు.

ఎందుకూ అంటే, మరేమీ లేదు. అపోజిట్ సెక్స్ కారణంగా చిత్రానికి ఒక విస్త్రుతి. ఇరువురూ ఇరువురితో సంభాషణలోఉండటంలో ద్యోతకమయ్యే ఒక మోహనం. దానికి సూచికగానే ఇది!
అది ఫోన్ సంభాషణ కావచ్చు. ఏమైనా, అంది వచ్చిన సౌకర్యంలోని సుఖమూ శాంతి, విలాసమూ, అభివ్యక్తిలోని ఆ అలవోకనూ చూస్తారనే ఈ చిత్రం.పరిపరి చూపుల్లో పలు విషయాలూ పలుకుతయనే చూడమనడం!పురుషుల నుంచి విడివడి ఆ ఇద్దరిని మళ్లీ చూడండి. వాళ్లిద్దరూ కాసేపు లంచ్ టైమ్ లో అట్ల కూచున్నప్పుడు తీసిన ఈ ఫొటోను చూడండి. ఆమెనే కనిపిస్తుంది. ఆ రూపసి, ప్రేమమయి, శ్రామికురాలు చిలకపచ్చ రంగు వస్త్రాల్లో తెరతీయగ చూడండి. తనలో లోపలి భావనలకు రూపమీయడంలో లీనమవడంలో ఏదో ఒక ప్రియమైన సంభాషణలో ఉండగా అవతలి ప్రాణంతో ప్రాణమై కలబోసుకోవడంలో ఎంత ఏకాగ్రత ఉన్నది.

బాపు బొమ్మలను ఎన్ని వందలుగా నేను స్వయంగా దర్శించానో.
ఇదొక చిత్రం.

+++

మనుషులు ఏ తెరలూ లేకుండా మరే గోడలూ అడ్డు లేకుండా గొంతు ఒక్కటే ప్రాణం అయినట్లు సంభాషణ పావనం చేసే తీరు ఒక చూడ ముచ్చట. ఆ స్థితిని దర్శిస్తే ఎవరికైనా ఈర్శ కలగక మానదు. చిత్రమేమిటంటే, ఇంతటి సౌజన్యం పెంచింది మాత్రం మొబైల్ ఫోనే!

అది ఫోనే సంభాషణే కావచ్చు. కానీ, ఇరువురి మధ్యా అదొక చెలియలి కట్ట.
బహుశా ఆ గొంతు నిండా ధ్వనించే ఆప్యాయత అభిమానాలతో ఒకర్నొకరు ప్రేమగా పలకరించుకోవడం. క్షేమ సమాచారాలు పంచుకోవడం, అటు పిదప నిదానంగా సంభాషణలోకి దిగడం, పరాచకాలాడటం, నిందా పూర్వకంగా మాట్లాడుకోవడం, అలక వహించడం – అన్నీనూ. అవును. పెదవులు దాటిన పదనిసలకు అంతూ పొంతూ ఉండదు. కానీ, చూడటం కూడా ఒక రొమాన్స్.

+++

ఫోన్. అవును. ఇవ్వాళ మానవ సంబంధాలన్నిటినీ ఒక్కటి చేసిన సందర్భం….ఈ సాఫల్యాన్ని నేనొక్కడినే చూడటం లేదు. అందరి అనుభవంలోనూ ఈ సరాగాలూ ఉన్నవే! ఆ ఉల్లాస సల్లాపాలు ఎక్కడి కక్కడ ఉన్నవే.
వేష బూషణాలు, సహజ సౌందర్యం, లావణ్యమూ, సరస పరిజ్ఞానము, ఇంకా చాలా…అవన్నీ ఉన్నతీకరించబడేవి అనుబంధాలతోనే కదా! అందుకే ఈ బంధం గురించిన చిత్రం.  ఇదొక శ్రమైక జీవుల విలాస సోయగంలో ఒక చిరు ఖండిక.

+++

ఇదివరకు ఎన్నో కట్టుబాట్లు. కులం, మతం, లింగం, ప్రాంతం, ఆర్థిక తారతమ్యాలు.
వీటన్నిటితో కూడి ఇంకెన్నో సాంఘిక కట్టుబాట్లు. ముఖ్యంగా మహిళలకు.

తాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడమే అరుదు. అలాంటిది ఇప్పుడు తాను తన దగ్గరి వాళ్లతో, దూరపు బంధువులతో, అపరిచితులను పరిచయం చేసుకుని, పరిచయస్తులనూ ప్రియం చేసుకుని, తక్షణపు పలకరింపులతో ఒక హృదయపూర్వక చాలనం.

ఇపుడు ఏ అడ్డూ లేదు. ఉన్నదల్లా తానే. తనను తాను అధిగమించడమే. తన పరిమితి. తనను తాను అదుపులో పెట్టుకోవడమే..అదే ఇవ్వాళ్టి సమస్యా, పరిష్కారం.

+++

ఒకానొక మధ్యాహ్నం.. ఇద్దరు కూలీ చేసుకునే మహిళలు అట్లా లంచ్ టైం అయ్యాక కాసేపు అలా విశ్రాంతిగా కూచున్నరు. ఇంతలో ఒకామె ఫోన్ మోగింది. ఇంకేం? సంభాషణలోకి దిగింది.
మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆమె అలవోకగా ఆ నేలను చిన్నగా సాపు చేస్తున్నది. ఏవో ఉంటయి, ఏరుతుంటది. ఇంకేవో కనవడుతై. తీసి పారేస్తది. ఇంకా ఎన్నో.

క్రమంగా ఆమె కళ్లు అరమోడ్పులైతయి. పెదవులు గారాబాలు పోతయి.  నవ్వు, పరిపరి విధాలై వికసిస్తది. ఒళ్లు సిగ్గుల మొగ్గవుతది. మనసు తేలిపోతుంది…అంతా మొబైల్ ఫోన్ మహిమ.

చూస్తుంటే ఆమె ఇక్కడ ఉన్నదనుకోవడం ఒట్టి భ్రమ. తన మనసు అవతలి వ్యక్తి మీదే ఉన్నది.
కేవలం ఆ శరీరం ఇక్కడుందన్నమాటేగానీ తాను అక్కడే ఉన్నది.
మాట్లాడుతూ మాట్లాడుతూ చేతుల్తో కింద నేల మీద అలవోకగా ఏదో రాస్తుంది. అది కవిత్వం కాదా? మునివేళ్లతో ఏదో ముడుతది. ఒక చిన్న పుల్లను తీస్తది. దాంతో చిన్నగా రాళ్లనూరప్పలను కదుపుతూ కదుపుతూ ముచ్చట్లను రాజేస్తది.

అర్థవంతమైనవో కావో మనకేమి ఎరుకగానీ, తీయటి పలుకులేవో వింటూ చెబుతూ తానేదో అనల్పమైన మాధుర్యంలో తేలియాడుతూ ఉండగా బిబూతీ బూషణుడు అన్న మాట గుర్తుకొస్తుంది. స్త్రీ ఒకసారి తన హృదయ ద్వారాలు తెరిచిందా ఇక స్వర్గమే అని!

నిజమే కాబోలు. కానీ ఎంతమందికా అదృష్టం.

చిత్రంలో ఆ సంగతీ చూడవచ్చు. సంభాషణలో ఉన్నప్పుడు వాళ్ల హావభావాలను, కదలికలను, శరీరపు భంగిమలను చూస్తుంటే భువన విజయం అంటే ఇదే అనిపిస్తుంది.మనిషిని సాధించడం. అవును. ఆడవాళ్లని కాదు, ఎవరైనా సరే, మనిషి ఎవరైనా సరే. ప్రేమతో దర్శించండి. వాళ్లను వాళ్లుగా వదిలినప్పుడు వాళ్లెంత బాగుంటరు. ఒకరినొకరు సాధించుకోవడంలో ఎంత దివ్యంగా కానవస్తరు.

+++

అన్నట్టు, ఆ యువతి అవతలి ఎదపై ఊసులాడుతుండగా ఆ మాటల్ని చిన్నగా వింటూ, అదంతా తనకూ తెలుసు లేదా నేనూ అనుభవించినదే అన్నట్టు ఆ సోదర మహిళ! ఒక అంగీకారం గల మనిషి పక్కన ఉన్నందువల్లో ఏమో ఈ యువతి కూడా హాయిగా లీనమైపోవడం…ఇదంతా చిత్రమే, చూస్తే! లీనమే అనుభవిస్తే.

వెలుగునీడల ఛాయా చిత్రణలో ఒక చిత్రం ఇట్లా కూడా.

తానెవరూ అని అడిగి చిన్నబుచ్చకండి. అలా తీయడం తప్పే కదా అని పెద్దరికాలు పోకండి.
మీ మనసులో ఉన్న మీ మనుషులను దర్శించమని, ప్రియమైన పరష్వంగం కోసం సంభాషించమని, ఫోన్లో అయినా ఇంత కథనం ఉందనీ అనీ ఈ చిత్రం.

కృతజ్ఞతలు,

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీ మాటలు

 1. మీరు రాసింది చదివేదాకా ఆ ఫ్రేమ్ లో ఉన్న మిగతా ఇద్దరి మీదకు దృష్టి పోలేదు :) చూసీ,చూడగానే కళ్ళను కట్టిపడేసింది మీ ఫోటోలోని అమ్మాయి. ఎంత సోయగం అంత మామూలు భంగిమలో. ఆ పక్కన కూర్చున్న ఇంకో స్త్రీ కూడా తనకి కాంప్లిమెంటరీ లాగా, ఇంకో పదో, ఇరవయ్యో ఏళ్ళు పోతే ఈ సౌందర్యం, సౌకుమార్యం మాయమై అలా కావచ్చు అనే భావనకి, ఒకవేళ అదే జరిగినా తను జీవితానికి ఇంకో దృక్కోణం అవుతుందేకానీ, పోయేదేం లేదు అనే భరోసానీ ఇస్తున్నట్టు…భలే బావుంది.

  Great capture!!

 2. థాంక్స్ జోతి గారు. ఒకవేళ అదే జరిగినా – పోయేదేం లేదు అనే భరోసానీ ఇస్తున్నట్టు…బాగా చెప్పారు.ప్లీజ్.

 3. raamaa chandramouli says:

  రమేశ్..అద్భుతమైన ఛాయాచిత్రమిది.ఒక వందపేజీల వ్యాఖానాన్ని రాయదగ్గ మహానుభూతి ఆ “ఆమె” లో ఉంది.
  శభాష్.
  రామా చంద్రమౌళి ,వరంగల్

మీ మాటలు

*