ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 17 వ భాగం

(గత వారం తరువాయి)

17

ఒక్కసారిగా నూటా ఎనిమిది ప్రజాపనులు జరుగుతున్న ప్రాంతాలపై ‘జనసేన’ జరిపిన ‘ప్రక్షాళన’ యాత్ర ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. పత్రికలు, మీడియా.. తమ తమ రిపోర్టర్‌లందరినీ ‘జనసేన’ ప్రక్షాళన బృందాలు సమాచారచట్టం ఆధారంగా చేస్తున్న ‘ప్రశ్న’ కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికీ నియమించవలసి వచ్చింది.

గంటగంటకు అన్ని టి.వి. చానళ్ళలో వివిధ ప్రాంతాల్లో నాసిరకపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సిగ్గుతో తలలు  వంచుకుని లొంగిపోవడం.. ఒక చోటనైతే నిస్సహాయుడైన ఓ కాంట్రాక్టర్‌ తన నిస్సహాతను ఏకరువుపెడ్తూ, పైన ఏ రాజకీయనాయకునికి, అధికారికి..ఎవరెవరికి ఎన్ని పర్సంటేజీలిచ్చి చివరికి ఎలా మోసానికి గురై.. యిప్పుడీ దుస్థితిలో ఇరుక్కుపోయడో వివరిస్తూ భోరున విలపించాడు సిగ్గుతో.
మొత్తానికి అధికారికంగా ప్రజాధనానికి సర్వాధికారులైన ప్రజలే ఒక సమూహంగా ఎదురుగా వచ్చి ప్రశ్నలు ప్రశ్నలుగా గుండెల్లోకి బాణాలను సంధించే పరిస్థితి ఒకరోజూ ఎదురౌతుందని ఊహించిన కాంట్రాక్టర్లు మింగలేక కక్కలేక గుడ్లప్పగించి, బిక్కచచ్చి లజ్జతో లుంగలు చుట్టుకుపోవడం అన్ని టి.వి. ఛానళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఐదారుచోట్ల కాస్త ముదురు కాంట్రాక్టర్లు మొదట ఎదురు తిరిగి, తను దుష్ట అనుచరవర్గంతో ‘జనసేన’ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి తలలను పగులకొట్టి దౌర్జన్యం జరిపి బీభత్సం సృష్టించారు. ఐతే ఈ విషయాలన్నీ మీడియాలో ప్రసారమై బయటి ప్రపంచమంతా చూస్తోందన్న భయం, జనసేన మనుషులు అడిగే ప్రశ్నలన్ని సమాచార చట్టం ప్రకారం అధికారులిచ్చిన సర్టిఫైడ్‌ కాపీలలో ఉన్నవే కావడం, నిజంగానే తాము చేస్తున్న కోట్లకొద్ది రూపాయల పనులు నాసిరకంగా ఉన్నట్టు జనసేన బృందాల్లో ఉన్న హైలెవెల్‌ సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తులు కళ్ళముందే జరుపుతున్న పరీక్షలద్వారా నిర్ధారిస్తూండడం, ఇన్నాళ్ళూ తమ దగ్గరినుండి లక్షలకు లక్షలు లంచాలను తిన్న అధికారులూ, పోలీసులూ, ఇతరేతర హైరార్కీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తూండడం.. ఇదంతా అయోమయంగా, పిచ్చిపిచ్చిగా, భయం భయంగా అనిపించి.. ఒక్క కాంట్రాక్టరైతే ఏమీతోచక, ఎవర్నీ ఏమీ చేయలేక అతని చొక్కాను అతనే పరపరా చింపుకుని గొడ్డులా అరిచాడు. ఆ అరుపు, ఆ ఉన్మాదస్థితి.. ఆ నిస్సహాయ దౌర్భాగ్యాన్ని దాదాపు అన్ని తెలుగు వార్తా చానళ్ళు పొద్దూ రాత్రనక అస్తమానం ప్రసారం చేశాయి.
23

బ్రేకింగ్‌ న్యూస్‌..
‘అవమానాన్ని భరించలేక ఒక అవినీతి కాంట్రాక్టర్‌ బహిరంగ రోదన’

‘ఏకు మేకై అవినీతి పర్వతాలను బ్రద్ధలు చేస్తున్న వైనం’
‘తెరవెనుక నిజాలను బయటపెడ్తున్న బినామీ కాంట్రాక్టర్లు’
‘రౌడీలందరూ రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లయ్యారా!’
‘జనసేనను కదిపితే క్షణాల్లో వాని చరిత్ర బట్టబయలు’
‘గుప్పిట్లో నిప్పు.. విప్పుతే ముప్పు.. విప్పకుంటే తప్పు’

ఒక్కో ఛానల్‌ వాళ్ళవాళ్ళ శైలిలో ప్రత్యేక తరహా వాక్య విన్యాసాలు.. మొత్తానికి అందరికీ.. వార్తలు చదువుతున్నవారికి, వింటున్నవారికి, వార్తాపత్రికల్లో కథనాలను కంపోజ్‌ చేస్తున్నవారికి రిపోర్టర్లకు, అచ్చువేస్తున్న ప్రెస్‌మెన్‌కు, ఇన్నాళ్ళూ దుర్మార్గులకు కాపలాకాస్తున్న అట్టడుగు పోలీసులకు, అందరికీ పరమ ఆనందంగా ఉంది. చిన్న తెప్పలా వచ్చిన జనసేన ఒక ఉప్పెనగా మారి ఓ వినూత్న రీతిలో అవినీతి అంతానికి తిరుగులేని విధానాన్ని అమలు చేయడం చిత్రంగా, ఆశ్చర్యంగా.. పులకింతంగా ఉంది. ఎక్కడ చూచినా ‘జనసేన’ చర్చే.

‘జనంనాడీ’ ఇప్పుడు చూడండి.. అని ఓ ఛానల్‌లో ప్రజలముందు మైక్‌ ఉంచి వాళ్ళ అభిప్రాయాలను లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నారు.

‘నరకాసురుడు చచ్చిపోతే అబ్బా పీడవిరగడైపోయిందని జనమంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారట. జనసేన పుణ్యమా అని వందల వేలమంది నరకాసురుల వధ జరుగుతోందీ రోజు ఈ తెలుగునేలపై.. ఎన్ని దీపావళి పండగలు జరుపుకోవాలో అన్నంత ఉత్సాహంగా ఉంది..’ అంటున్నాడో నలభై ఏండ్లు పైబడ్డ పౌరుడు రోడ్డుపై నడచిపోతూ.
‘అరె.. మీతిమీరిపోయిండ్లు నాయకులు. సిగ్గుశరం లేకుండా దేశాన్ని పంచుకుని తినుడేనాయె. ఇన్నాళ్ళకు జనానికి వీళ్ళ పనిబట్టే విధానం దొరికింది. జనసేనకు ధన్యవాదాలు”
‘ప్రజలు.. ఒంటరిగా ఎంత బలహీనులో.. సమిష్టిగా అంత బలవంతులని యిది ఒక సజీవ ఉదాహరణగా నిరూపించింది.’
‘స్వార్థరహిత నాయకత్వం ప్రజలను ఎలా ఏకతాటిపై నడిపించి విజయాలను సాధిస్తుందో ఈ జనసేన ప్రతిఘటన వల్ల తెలుస్తోంది’
‘ఇగ కక్కుతరు కొడ్కులు..అరె కోట్లకు కోట్లు తినుడు. కిలోలకొద్ది బంగారం దోచుడు, దాచుడు.. ఎక్కడ్నుండొస్తానై యివన్నీ అని యిండ్లళ్ళ ఆడోళ్ళు కూడా అడ్గరు మొగోళ్ళను. అడిగేటోడు లేక జన్నెకిడ్సిన ఎద్దుల్లెక్క బలిసిండ్లు.. తీయాలె, ఒక్కొక్కన్ని తవ్వి బండారం బయటికి తీయాలె.. సంబురంగున్నది. జనసేనకు జై. దాని ఎన్క ఎవ్వడున్నడోగని వానికి దండం’
.. ఇలా సాగుతున్నాయి లైవ్‌ టెలికాస్ట్‌లో ప్రజాస్పందనలు.
‘ఇంకో ఐదు నిముషాల్లో.. జనసేన సృష్టికర్త రామం, జనసేన సిద్ధాంతకర్త డాక్టర్‌ గోపీనాథ్‌లతో ‘అగ్ని’ టి.వి. ముఖాముఖి. అగ్ని టి.వి. నిప్పు పిడికిలిని విప్పుతుంది.’ఏదో యాడ్‌.. కింద మూడు లైన్ల అక్షరాల స్క్రోలింగ్స్‌.

ఈ మూడు లైన్ల అక్షరాల కదలికలను, ప్రక్కన యింకో చిన్న అడ్వర్‌టైజ్‌మెంట్‌ డిస్‌ప్లేను, పైన ఇంకేదో రౌండింగ్‌ ఐటమ్‌, తెరపై యాంకర్‌ వాచకం.. ఏకకాలంలో ప్రేక్షకుడు ఈ తెరను చూస్తూ ఎంత హింసకు గురౌతాడో ఏ మేధావీ, పౌరహక్కుల వాళ్ళూ, ఈ మొద్దు ప్రభుత్వమూ ఆలోచించదు.
‘ఈలోగా.. గోవిందరావుపేట అనేచోట.. నిన్న జరిగిన ఉదంతాన్ని తిలకించండి’
ప్రొజెక్షన్‌ ప్రారంభమైంది

అక్కడ ఓ రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం జరుగుతోంది. అటు ప్రక్క ఒక జెసిబి, టిప్పర్‌, రెండు కాంక్రీట్‌ మిక్సర్స్‌, రెండు లారీలు ఉన్నాయి. ఓ పదిమంది కార్మికులు పని చేస్తున్నారు. ఇద్దరు సగం నిలబడ్డ పిల్లర్‌కు ఉక్కు కడ్డీలను జతచేసి వెల్డింగ్‌ చేస్తున్నారు. కెమెరా దీన్నంతా చూపిస్తూంటే.. ప్రక్కన పచ్చగా పొలాలు, చెట్లు.. పెద్దగా సెలయేరులాంటి నీటి ప్రవాహపు జాడలు ఏవీలేవు. అసలక్కడ అంత పొడవైన వంతెన అవసరం ఉందా.. అని అన్పించే వాతావరణం ఉంది. చూస్తూంటే..మంత్రి, మంత్రి బామ్మర్దయిన కాంట్రాక్టర్‌, లోకల్‌ ఎమ్మెల్యే, ఆ ప్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌.. అందరూ కుమ్మక్కయితే ఫండ్స్‌ను పంచుకునేందుకు అసలు అవసరమే లేని కావలసిన డబ్బును దండుకునేందుకు వీలుగా నాసిరకం డ్యాం నిర్మిస్తున్నారనే పరమసత్యం అర్థమౌతోంది.
”నమస్కారం సార్‌. మీరేనాండి ఈ రాంపురం బ్రిడ్జ్‌ కంట్రాక్టర్‌. నా పేరు జగన్‌. జనసేన కార్యకర్తను” అని ఓ జనసేన కార్యకర్త అడిగాడు అక్కడున్న తెల్లని స్టార్చ్‌ బట్టలేసుకున్న నల్లని వ్యక్తిని. అతను బట్టలేసుకున్న ఎలుగుబంటులా ఉన్నాడు. అతని మెడలో నులకతాడంత మందం బంగారు గొలుసులు, రాళ్ళ బిళ్ళలు, రెండు చేతులకు రెండు ధగధగా మెరిసే బేస్‌లెట్లు, రెండు చేతులక్కలిపి ఎనిమిది ఉంగరాలు ఉన్నాయి.
”ఔను..” అన్నాడు అసహనంగా, నిర్లక్ష్యంగా
” ఈ కన్‌స్ట్రక్షన్‌, ప్రాజెక్ట్‌ డిటైల్స్‌ మా జనంకోసం డిస్‌ప్లే చేయాలెగద సార్‌”
”చేయాలె.. కని చేయలె..ఐతేంది.”
”యిప్పుడు చేస్తరా సర్‌”
”ఏమో చూస్తం.. అదంత అవసరమా”
”పోనీ.. మేం పెట్టాల్నా సార్‌ బోర్డును”
”మీరు పెడ్తరా.. మీ దగ్గర డిటైల్లున్నయా..”
”ఒక్క బోర్డుయేగాదు.. మీ అందరి చరిత్ర భూగోళాల వివరాలన్నీ మా దగ్గరున్నయ్‌ సార్‌. బొడ్డుబోయిన అంజయ్యగారూ.. బాబూ..” అని ఒక జనసేన కార్యకర్తను పిలిచి.. ”ఓ నలుగురు వెళ్ళి ఈ రాంపురం బ్రిడ్జ్‌ ‘పబ్లిక్‌ ప్రకటన’ బోర్డులను ఆ కొసకు, ఈ కొసకు పాతండయ్యా” అని పనిని పురమాయించి,
”ఊఁ.. చెప్పండి అంజయ్యగారు.. అసలు ఈ వర్క్‌కు ఆఫీషియల్‌ కాంట్రాక్టరెవరు”
”నీకు చెప్పడమవసరమా” అన్నాడు తలబిరుసుగా.
”చాలా అవసరం.. ఎందుకంటే యిది ప్రజల డబ్బు. మేం ప్రజలం” అన్నాడు జగన్‌ వెనుక నిలబడిన ఉన్న దాదాపు ఓ ఇరవైమంది యువకులు.
”చెప్ప..”
”సరే.. ఐతే మేమే చెప్తం. దీని అసలు కాంట్రాక్టర్‌ మంత్రి విశ్వేశ్వర్రావు తమ్ముడు జగపతిరావు. ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పనిని రెండుకోట్ల డెబ్బయి లక్షలకు ఓవర్‌ ఎస్టిమేషన్‌ వేయించుకుని.. గవర్నమెంట్‌లో మ్యామ్యాలిచ్చి సబ్‌ కాంట్రాక్ట్‌ క్రింది ఇక్కడి లోకల్‌ ఎమ్మెల్యేకు చెందిన మెసర్స్‌ వెంకటేశ్వరా కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు కోట్ల రౌండ్‌ ఫిగర్‌కిచ్చి స్కిప్పయిండు. తర్వాత వాళ్ళు కూడా ఈ పనిని చేపట్టక ఈగిల్‌ అండ్‌ కంపెనీకి ఒక కోటీ ఎనభై లక్షలకిచ్చి పనిని మొదలుపెట్టి ఐదు లక్షల కమీషన్‌ మీద మీకు ఒక కోటీ డెబ్బయ్యయిదు లక్షలకిచ్చిండ్లు..మీరు..”
”వద్దు వద్దు.. యిగ చెప్పద్దు. అప్పటిక్కూడా ఆ ఎమౌంట్‌తో పనిచేస్తే పదిహేను లక్షల్నాకు మిగులుతై. కాని సిఇకి, ఇఇకి, ఎయికి.. వీళ్ళకు పదిశాతం, నక్సలైట్లకు పదిశాతం, ఎపిపి, జడ్‌పిటిసి, స్థానిక యువజన సంఘాలకు ఐదుశాతం.. అంతా తడిసి..వందల ముప్పయ్యిశాతమే మిగుల్తాంది టెండర్‌ కాస్ట్‌ల. గీ డబ్బుతో ఈ బ్రిడ్జ్‌కట్టుడు ఎవనితరంగాదు… నేను చావాల్నా .. ఏంజేయాలె”
”అసలెప్పుడైపోవాలె ఈ బ్రిడ్జ్‌.”
”మూడ్నెళ్ళ కిందట్నే హాండోవర్‌ చేయాలి.. గని యింక యాడాదైనా కాదు. యిగ నాతోని కాదు కట్టుడు. క్విటయ్‌పోత..”
”అసలిక్కడ బ్రిడ్జే అవసరంలేదు.. అక్కర్లేని దాన్ని కట్టేందుకు ఓ ప్రాజెక్ట్‌ తయారుచేసి.. ఉన్న కొత్త రోడ్డును డిస్మాంటిల్‌ చేసి, జనం రాకపోకలకు అంతరాయం కల్గచేసి.. యిప్పుడది పూర్తిగాక, వర్షాకాలంల మనుషులు నడ్వలేక..” జనసేన దళం సారధి రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రఘువీర్‌ అంటున్నాడు.
”ఔ…” అన్నాడు కాంట్రాక్టర్‌ అంజయ్య..అంగీకారంగా తలూపుతూ.
ఆ క్షణం.. అప్పట్నుండి జరుగుతున్న తతంగాన్నంతా మీడియా కెమెరాలు కవర్‌ చేస్తున్నాయనే స్పృహ కలిగి.. అంజయ్య భయంతో అదిరిపోయి.. తడబడ్తూ, తత్తరపడ్తూ.,
”జనానికి జవాబు చెప్పండి.. యిప్పుడు మీరేంజేస్తారు..”
”మంత్రి దగ్గరికి పోయి వందసార్లు మొరపెట్టుకున్న. ప్రతిసారీ ఫుట్‌బాల్‌ లెక్క బైటికి తంతాండు. మొన్నయితే గన్‌మాన్‌తోని మెడలుపట్టి బైటికి నూకించిండు..”
చటుక్కున.. అనూహ్యంగా.. అంజయ్య ఏడ్వడం ప్రారంభించాడు.
టి.వి లో ఆ స్ట్రిప్‌ ఐపోయింది..

వెంటనే యాంకర్‌ శ్రీరాం తెరమిదికొచ్చి.. గత ఒకటిన్నర నెలలకాలంలో ఆంధ్రదేశంలో ‘జనసేన’ అనే ప్రజాసంస్థను వరంగల్లులో స్థాపించి, అవినీతిలో, అనైతికతతో, లంచగొండితనంతో కూరుకుపోతున్న ప్రస్తుత సమాజాన్ని విలువలున్న పౌరసంఘంగా పునర్నిర్మాంచాలనే లక్ష్యంతో ఒక నిర్మాణాత్మక ప్రణాళికతో రంగప్రవేశం చేసిన ‘జనసేన’ వ్యవస్థాపకుడు రామం, ఆ సంస్థ సిద్ధాంతకర్త డాక్టర్‌ పి. గోపీనాథ్‌ యిప్పుడు ఈనాటి ‘ముఖాముఖి’లో మనతో మాట్లాడ్డానికి మన స్టూడియోలో ఉన్నారు. ఒక బిందువుగా పుట్టిన ‘జనసేన’ ఈ రోజు ఒక సింధువై విస్తరించింది. ‘అవగాహన’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు, ఏకకాలంలో ఓ ఇరవై లక్షలపైచిలుకు సమాజంలోని వివిధ వృత్తుల్లో, వివిధ స్థాయిల్లో, వివిధ రంగాలల్లో ఉన్న అనేకమంది పౌరులతో రెండే రెండు ప్రశ్నలున్న ప్రశ్నాపత్రంతో సర్వే చేసి విస్తృతమైన అభిప్రాయసేకరణ చేశారు. మేము ఈ సర్వే ఫలితాలనూ, జననాడిని యిదివరకే గణాంకాలతో సహా ప్రసారంచేశాం. కాగా..’ప్రక్షాళన’ పేరుతో వివిధ రంగాలకు చెందిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులను.. ఓ నూటా ఎనిమిదింటిని గుర్తించి, దాదాపు నలభై రెండు వేలకోట్ల విలువగల ప్రజోపయోగ నిర్మాణాల స్థితిగతులను తనిఖీ చేయడానికి ఈ దేశ రాజ్యాంగం ‘సమాచార చట్టం – 2005’ ద్వారా ప్రతి పౌరునికీ, సంక్రమింపజేసిన అధికారాన్ని చేతిలో ఓ అజేయమైన ఆయుధంగా ధరించి.. ఆ ప్రాజెక్టుల సర్వ సమాచారాన్ని సర్టిఫైడ్‌ కాపీలుగా వెంటతీసుకుని, ఆయా రంగాల్లో నిపుణులనుకూడా తమ తమ బృందాల్లో సభ్యులుగా స్వీకరించి.. ‘ప్రజాధన వినియోగాన్ని ప్రజలే తనిఖీ చేసుకుంటున్నారు’ అనే నినాదంతో మొన్న ఇరవైయవ తేదీన ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీయాత్రతో.. అనేకచోట్ల బయటపడ్డ నమ్మశక్యంగాని నిజాలను వెలికితీసి ప్రజలముందు, మీడియాముందు విప్పి పెడ్తూంటే.. కోట్లమంది దిగ్బ్రాంతికీ, ఉలిక్కిపాటుకు గురై.. అందరూ అవాక్కయిపోయారు. అసలు ఏం జరుగుతోంది. వేల లక్షలకోట్ల రూపాయలు ఇంత దారుణంగా భోంచేయబడ్తున్నాయా, అదీ ప్రజలపక్షాన అప్పుచేసి, రేపు పుట్టబోయే శిశువు నెత్తిపై కూడా అప్పును వారసత్వంగా మోపుతూ.. ఈ నాయకులు, ఈ అధికారులు ఇంత నిస్సిగ్గుగా దోచుకు తింటున్నారా అని విస్తుపోతున్న ఈ ఉద్విగ్న సందర్భంలో.. ‘జనసేన’ సంస్థ వ్యవస్థాపకులు..

”రామం గారూ.. నమస్కారమండీ..”
”నమస్కారం”.. తెరపై రామం ముఖం.. నవ్వుతూ.’జనసేన సంస్థ సిద్ధాంతకర్త.. ప్రముఖ సామాజిక శాస్త్ర గ్రంథాల రచయిత డాక్టర్‌ గోపీనాథ్‌.. నమస్కారం సార్‌..”
”నమస్కారం”
”చెప్పండి.. భారత జాతిపిత మహాత్మాగాంధి ‘అహింసా’ సిద్దాంతాన్ని ప్రవచించినపుడు.. ఎవ్వరూ దాన్ని ప్రశంసించలేదు సరికదా గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత నిజాయితే ప్రాణంగా గాంధీ తన అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నప్పుడు అందరూ అవాక్కయి విస్తుపోయారు.. దాదాపు అదేరీతిలో.. నమ్మశక్యంగాని ఒక అతి సామాన్యమైన, సాధారణమైన సమాచార చట్టం అనే పౌరాధికారాన్ని ఒక వజ్రాయుధంగా ధరించి మీరు చేపట్టిన ఈ జనసేన జైత్రయాత్ర ఇపుడు దావానలంలా విస్తరించి చీకటి మనుషుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించడం కాదు.. శతఘ్నులను ప్రేలుస్తున్నాయి.. ఈ వర్తమాన ఉద్విగ్న సందర్బంలో ప్రజలందరూ మిమ్మల్ని వినాలనీ, మీ ఆలోచనలను పంచుకోవాలనీ, మీతో కలిసి నడవాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. చెప్పండి.. అసలు ప్రజలను ఏ దిశలో మీ వెంట నడిపించాలని, అంతిమంగా ఏ లక్ష్యాలను సాధించాలని మీరనుకుంటున్నారు.”

రామం చాలా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. ”నిజానికి ఈ మితిమీరిన అవినీతి, అనైతికత, రాజకీయ నాయకుల అరాచక ప్రవర్తన ఒక్క మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన జాఢ్యంగానీ, సమస్యగానీ కాదు.. యిది ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభలిన అంటువ్యాధిలాంటిదీ జాతీయ సమస్య. దీన్ని యుద్ధప్రాతిపదికపై ఎదుర్కొని ఎవరో ఒకరు రెండవ భారత స్వాతంత్య్ర సంగ్రామ స్థాయిలో అంతర్గత పోరాటం చేయకుంటే యిది భారత భావి తరాలను అంధకారంలోకి నెట్టి వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఒక చోట అసలు రోడ్డేలేకుంటే ఫర్వాలేదు. ఎవడో ఒకడు అందరికోసం ఎప్పుడో ఒకప్పుడు ఒక రోడ్డు వేస్తాడు. దానిపై అందరూ సౌకర్యవంతంగా నడుస్తారు. కాని అక్కడ లంచాలు మేసి మేసి ఒక దుర్మార్గుడు ఓ చెత్త, పనికిరాని, బొడుగు బొడుగు రాళ్ళతో అధ్వాన్నపు రోడ్డు వేస్తే.. యిక అక్కడ ఇంకో కొత్త రోడ్డు వేయడం సాధ్యంకాదు. ఉన్నదాన్ని తీసేయరాదు.. ఇట్‌ బికంస్‌ ఇర్రిపేరబుల్‌. అదిగో ఆవిధంగా కోటానుకోట్ల రూపాయలతో ఈ అధ్వాన్నపు రోడ్లవంటి ఎన్నో నిర్మాణాలు, పనులను చేసి ఈ దేశాన్ని చెత్తకుండీని చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.యిది హత్యకన్నా ఘోరమైన నేరం. దీన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలి.”

”అసలు మీ సిద్ధాంతమేమిటి”
”మాకు ఒకే ఒక పారదర్శకమైన లక్ష్యం ఉంది. దాన్ని సిద్ధాంతం అంటానికి వీల్లేదు. ఏ యితర రాజకీయ పార్టీల సిద్ధాంతాలతోనూ మాకు నిమిత్తం లేదు. ప్రమేయం లేదు, వ్యతిరేకతకూడా లేదు. మా గమ్యం ఒకటే. శాశ్వత ప్రాతిపదికపై ప్రతి పౌరున్నీ అహింసాయుతంగా ఒక ప్రశ్నించే పదునైన ఆయుధంగా రూపొందించడం. రాజ్యాంగబద్దంగా ఎవరైనా ఏంచేయాలి.. ఏం చేస్తున్నారు.. ఏదైనా చేయకూడని అసాంఘిక కార్యం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావని నిలదీసి దోషిగా జనంలో నిలబెట్టడమే జనసేన ఏకైక కార్యక్రమం..”

”రాజ్యాధికారం చేపట్టడం సంగతి..”
”యిదివరకే చెప్పాం చాలా వేదికలపైన స్పష్టంగా. ‘జనసేన’ ఒక రాజకీయ పార్టీకాదు. ఇది ఎన్నికల్లో పోటీ చేయదు. ఇది రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించదు. ‘జనసేన’ కు ముందువరుసలో ఉన్న మేము.. ఎవరమూ ఏ నాయకత్వాన్నీ, పదవులనూ, సంపదలనూ ఆశించం. అసలు మాకు స్వంత ఆస్తులు ఉండవు. స్వంత ఆస్తి లేనివానికి స్వార్థం ఎందుకుంటుంది. అతి నిరాడంబరమైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తూ.. గాంధీ జీవితాంతం ప్రవచించిన నిరాడంబర జీవిత మాధుర్యాన్ని జనానికి ప్రయోగాత్మకంగా జీవించి చూపించాలనీ, మమ్మల్ని ప్రజలు విశ్వసించడానికి మూలమైన నమ్మకాన్ని కల్పించాలనీ ప్రయత్నిస్తున్నాం నిజాయితీగా. యిది ఈ దేశంలో ఏ నాయకుడూ చేయని పని.. ఇదివరకు మహానుభావులు వినోభా భావే నుండి బాబా ఆమ్టే వరకు నిస్వార్ధ జీవితాలను జీవించి చైతన్యాన్ని రగిలించినా.. వాటిని ప్రజాబాహుళ్యంలోకి ఒక మహోద్యమంగా శాశ్వతీకరించలేకపోయారు. ‘జనసేన’ ఒక నిజాయితీతో కూడిన పారదర్శకమైన జీవితాన్ని జీవించడం ఒక విశిష్ట సంస్కృతిగా పౌరులకు అలవాటు చేయాలని సంకల్పిస్తోంది. చెబుతే అతిగా అన్పిస్తుందిగాని.. రోడ్డుపై ఒక బంగారు బిళ్ళ పడివుంటే ‘మనది కాని దీన్ని మనం ముట్టుకోవద్దు’ అనే ఆత్మ సంస్కారంతో ఎవరికివారు దాన్ని చూస్తూ వెళ్ళిపోయే ఆదర్శ సమాజాన్ని ‘జనసేన’ లక్ష్యిస్తోంది.”
”రాజ్యాధికారాన్ని చేపట్టనప్పుడు వ్యవస్థపై మీకు ఎలా నియంత్రణ ఉంటుంది.”
”కౌటిల్యుడు చెప్పిన ‘రాజు..రాజగురు అనుబంధం’ గురించి మేం ఆలోచిస్తున్నాం. నిజానికి రాజు ప్రజలకూ, ప్రజాధనానికే రక్షకుడు, కస్టోడియన్‌ మాత్రమే. దుర్మార్గులైన పాలకులు దాన్ని ప్రజాధనానికి యజమానులుగా చిత్రించి  భక్షకులై అనుభవిస్తూ వస్తున్నారు. స్వార్థ చింతనతో ప్రజల అసలైన సంక్షేమావసరాలను రాజగురువు రాజుకు తెలియజేసినపుడు రాజు తు.చ. తప్పకుండా వాటిని అమలుచేసి ప్రజారంజకమైన, న్యాయబద్ధమైన పాలనను కొనసాగించాలి. ‘జనసేన’ విషయంకూడా అంతే. ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవాళ్ళలో ‘జనసేన’ ఆలోచనలనకు, విధానాలకు లోబడి నిస్వార్థ, ఆదర్శ ప్రజాజీవితాన్ని గడపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినవాళ్ళకు ‘జనసేన’ ఆమోదముద్ర వేస్తుంది. ‘జనసేన’కు ప్రజల్లో నమ్మకంతో కూడిన ఆదరణ ఉంటే అపుడా అభ్యర్థి గెలుస్తాడు. అటువంటి అభ్యర్థి ‘జనసేన’ యొక్క ఒక అంగంగా, ప్రతినిధిగా ప్రభుత్వ నిర్మాణంలో, పరిపాలనలో పాల్గొంటాడు. స్థూలంగా ఇది మా ఆలోచనాధార. ఒక అతి ప్రధానమైన ఉద్యోగానికి అనేకమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను పెట్టుకుంటే వాళ్ళలో అత్యుత్తమమైన వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామో  పరమ పవిత్రమైన ప్రజాసేవకోసం శాసనసభ్యునిగా, లోకసభ సభ్యునిగా పనిచేయవలసిన ప్రజాప్రతినిధిని ఎంతో కూలంకషంగా పరిశీలించి, ఎటువంటి నేరచరిత్రఉన్నా, మా గూఢాచార వ్యవస్థ అధ్యయనంలో ఏమాత్రం దుష్టచరిత్ర ఉన్నా, వాణ్ణి కనీసం జనసేన దగ్గరిక్కూడా రానీయం. కనీస విద్యార్హతలు, వయోపరిమితులు, ఇతరేతర ప్రజాహిత సంబంధ ప్రత్యేకార్హతలు.. యివన్నీ కీలకాంశాలుగా పరిగణించబడ్తాయి.. ఏ క్షణాన్నైనా, ఏ మా వ్యక్తయినా ‘జనసేన’ నియమాలను ఉల్లంఘిస్తే వెంటనే ‘జనసేన’ తనవద్ద ఉన్న అతని అన్‌డేటెడ్‌ రాజీనామా లేఖను ఉపయోగించి ఆ వ్యక్తిని రీకాల్‌ చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి..కాబట్టి దుర్మార్గులైన నాయకులు ప్రజలకు ఆచరణయోగ్యంకాని అనేక హామీలనిచ్చి, ఆశలు కల్పించి కుర్చీపై కూర్చోగానే మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో దుర్మార్గ ప్రజాప్రతినిధులను వెనక్కి ‘రీకాల్‌’ చేసే ఏదో ఒక మార్గం, ఆయుధం ప్రజల దగ్గరుండాలి. ‘జనసేన’ దగ్గర ఉంటుందది. ఐతే ఎలా అనే దానిపైన యింకా స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ పార్టీలేవైనా, వామపక్ష పార్టీలతో సహా తమ పార్టీ నాయకుడెవడైనా తప్పు చేసినప్పుడు, స్కాంతో బయటపడ్డప్పుడు వాడిపైన ఏ చర్యా తీసుకోవడం లేదు. క్రమశిక్షణ చర్యలే లేవు. శిక్షించడం అసలే లేదు. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే…పత్రికారంగంలో ఏమున్నది.. ఏ పత్రికైనా అట్టతీసేస్తే అన్నీ ఒకటే అన్నట్టుగా.. రాజకీయపార్టీ పేరు ఏదైనా అవినీతి, లంచగొండితనం, అనైతిక ప్రవర్తనల విషయంగా అన్నీ ఒకే రీతిలో నీతిహీనంగానే ప్రవర్తిస్తున్నాయి. యిప్పుడు పరిస్థితి బాగా కుళ్ళిపోయి కంపువాసన కొడ్తోంది. దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి.”

రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో, ఆశతో వింటున్నారు రామం ఎంతో ఓపెన్‌గా, నిజాయితీగా చెబుతున్న విషయాలను. పరిస్థితి ఒక మొక్క మొలకెత్తబోయేముందు భూమి పులకించిపోతున్నట్టుగా ఉంది.
యాంకర్‌ అన్నాడు.. ”యిప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థ.. మీరు ‘జనసేన’ కోణంలో కలగంటున్న ఆదర్శ వ్యవస్థ.. స్వరూప స్వభావాల విషయంలో ఎలాంటి మౌలిక తేడాలను కలిగి ఉంటాయి. అది చెప్పండి.”
రామం మళ్ళీ అందుకున్నాడు. ”ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ అద్భుతమైన శాసనాలనే రూపొందించి కాగితాల్లో నిక్షిప్తం చేశాయి. కాని అమలులో మాత్రం ఆవగింజంతైనా చిత్తశుద్ధి లేదు. కాగా యిక్కడి ప్రభుత్వాలూ, ప్రజలూ ఇతర అన్ని ప్రపంచ దేశాల్లోవలె తాము నిర్మించిన తమ దేశశాసనాలను తామే గౌరవించరు, అమలు చేయరు సరికదా వాటిని వక్రీకరించి విపరీతార్థాలతో దోపిడీకి పాల్పడ్తారు. మీరు ఆశ్చర్యపోతారు. అనేక ప్రజాసంఘాలు సర్వేచేసి సమర్పించిన నివేదికల ప్రకారం వర్తమాన భారత రాజకీయాల్లో ఎనభై ఐదుశాతంమంది వీధి గూండాలు, రౌడీషీటర్లు, హంతకులు, నేరచరితులు ఉన్నారు.

వీళ్ళను క్రమంగా ఆ రంగంనుండి తప్పించడం అంతసుళువైన విషయంకాదు. భారత రెండవ స్వాతంత్య్ర సంగ్రామం తరహాలో ప్రజలు ఏ ఊళ్ళోవాళ్ళు ఆ ఊళ్ళో పోరాడ్తే తప్ప ఈ ప్రక్షాళన సాధ్యంకాదు. మొదటి స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌వాడనే శత్రువు స్పష్టంగా కళ్ళెదుటనే కనబడ్తూ ఉన్నాడు కాని ఇప్పుడు కనబడకుండా అవినీతిపరుల రూపంలో అదృశ్యంగా మనలో. మన ప్రక్కన, మన ఇంట్లోనే, మన కుటుంబసభ్యులుగా మన జాతిద్రోహులే కలిసిపోయి ఉన్నారు. కనబడని శత్రువుతో యుద్ధంచేయడం కష్టంకదా.. మీకొక అతి ప్రధానమైన రహస్యం చెబుతాను. చెప్పనా..”
”చెప్పండి..”
”ఈ దేశానికి నిరక్షరాస్యులైన భారత పౌరులతో ఎటువంటి హానీలేదు. కాని చదువుకున్నవారితో కొంత ప్రమాదం, బాగా చదువుకున్నవారితో ఇంకా భారీ ప్రమాదం పొంచివుంది. గత ఇరవై ఏళ్ళనుండి.. హర్షద్‌ మోహతా, కేతన్‌పరేఖ్‌ దగ్గర్నుండీ.. తెల్గీ.. ఈ మధ్య బయటపడ్ట అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల, కమ్యూనికేషన్‌ మంత్రిత్వశాఖ, కార్పొరేట్‌ కంపెనీల దాకా, ఖనిజాలు, గనులు, జలయజ్ఞాలు, ఛత్తీస్‌గడ్‌లో వందయూనివర్సిటీల స్థాపన, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతుల్లో వేలకోట్ల అవినీతి. ఇవన్నీ ఏం చెబుతున్నాయి..ఉన్నత విద్యావంతుల్లోనే దొంగలు ఎక్కువగా ఉన్నారని ఋజువు చేస్తున్నాయిగదా. ఔనూ.. హౌటు కర్బ్‌ దిస్‌ ఈజ్‌ ద రియల్‌ ప్రాబ్లమ్‌”
”దీన్ని ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు మీరు..డాక్టర్‌ గోపీనాథ్‌గారు చెప్పండి”
”చాల సింపుల్‌.. మనిషి దొంగతనం చేస్తున్నపుడు దొంగతనాన్నెవరో చూస్తున్నారనే భయం ఉంటే చాలు. దొంగ భయపడి వెంటనే విరమించుకుంటారు. కాబట్టి మనిషిని అనుక్షణం గమనించే నిఘా కావాలి. అమెరికాలో సెటిలైట్‌ సర్వైలెన్స్‌ ఉంటుంది. ఎవనికివాడు నన్ను సిసి కెమెరాలో, ఆకాశంనుండి ఏ సెటిలైట్‌ వ్యవస్థో చూస్తోంది.. పట్టుబడ్తామని ఒళ్ళు దగ్గరపెట్టుకుని వెళ్తుంటారు రోడ్డుపై. యిక్కడకూడా అటువంటి ఈ దొంగనాయకులను వెంటాడే ఓ నిఘా వ్యవస్థ కావాలి. ‘జనసేన’ అదే. అదొక వాచ్‌డాగ్‌.. మా దగ్గర ‘జనసేన’ నిర్మాణం మూడు థల్లో ఉంటుంది. ఒకటి కేంద్రకం. దాంట్లో ఋషులవంటి నూటా ఎనిమిదిమందితో కూడిన సారధ్య బృందం ఉంటుంది. రామం, నేను ముందుంటాం. అధ్యకక్షుడు, కార్యదర్శి.. ఇటువంటి పదవులు లేవు. తర్వాత అంతర్‌వలయం. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు.. అన్ని జిల్లాల కార్యాలయాల బాధ్యులు. శిక్షణా విభాగం, క్రమశిక్షణా విభాగం, రక్షణ విభాగం, గూఢాచార విభాగం, ఆర్థిక విభాగం, విధాన విభాగం, విస్తరణ విభాగం, క్షేత్ర కార్యాచరణ విభాగం.. ఈ విధంగా ఎనిమిది సెక్టార్స్‌. దళాలుంటాయి. ఒక్కో విభాగంలో ఆయా రంగాల్లో నిపుణులైన, సాధికారత కల్గిన వ్యక్తులుంటారు. ఉదాహరణకు ఆర్థిక విభాగముందనుకో.. చార్టర్స్‌ అకౌంటెంట్స్‌, రిటైర్డ్‌ ఫైనాన్స్‌ సెక్రటరీలు, ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌.. ఇటువంటి వాళ్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మిగతా వాటిల్లోకూడా. ఈ అంతర్‌వలయం అంతా నిరంతర ఉద్దీప్తతతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, ప్రధానంగా పౌరుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో, అనవసరంగా ఈ కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించాలనే దుర్భుద్ది నీకెందుకురా.. ఒక వ్యక్తికి నిజంగా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు అవసరమా..ఏంజేస్తావ్‌ వీటితో.. వంటి జ్ఞానవికాసాన్ని కల్పించడంలో తలమునకలై ఉంటుంది. దీనికి వెలుపల ఒక బాహ్యవలయముంది. దీంట్లో ఆదర్శ భావాలున్న జనబాహుళ్యం ఉంటుంది. నిజానికి ప్రస్తుతం నాయకులకంటే ప్రజలే ఎక్కువగా కలుషితమై నీతిహీనులై ఉన్నారు. లంచాలు యిస్తారు, తీసుకుంటారు. అవకాశముంటే ఏ నీచమైన పనైనా చేస్తారు. వీడు మనిషికి వందిస్తే వీని సభకొస్తారు. మర్నాడు వాడు నూరిస్తే వాని సభకూ వెళ్తారు. ఉచితంగా ఇస్తానంటే కలర్‌ టి.వి. తీసుకుంటాడు. నగదు బదిలీ తీసుకుంటాడు. సైకిళ్ళు తీసుకుంటాడు. మోటార్‌సైకిళ్ళు, ఉచిత విద్యుత్తు, ఉచిత బియ్యం, ఉచిత బట్టలు.. ఉచితం ఏదైనా సరే.. తీసుకుంటాడు.. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుంటాడు. వీళ్లను సంస్కరించాలి. దేన్నయినా ఈ రాష్ట్రంలోగానీ, ఏ ఇతర రాష్ట్రాల్లోగానీ ఏనాడైనా..ఎవరైనా ప్రజలు దేన్నయినా మాకిది ఉచితంగా ఇమ్మని ఎప్పుడైనా అడిగారా. సిగ్గులేని నాయకులు వాళ్ళ ఓట్లకోసం బూటకపు ప్రజాకర్షక పథకాలను ప్రకటించి పబ్బం గడుపుకున్నారు తప్ప.. ఏ మనిషీ తనకు తానొక బిచ్చగాణ్ణి, నాకిది ఉచితంగా యిమ్మని ఎప్పుడూ అడగడు. ఇది మనిషి ‘రోషాని’కి, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. నీకంటె పెద్ద వెధవాయను నేను అన్నట్టు ఒకణ్ణి మించి ఒకడు ఉచితాలను ప్రకటించి, సబ్సిడీలను పెంచి, కమిషన్‌లను ప్రకటించి ప్రజలను భ్రష్టు పట్టించారు. నిజానికి .. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 20 సబ్సిడీ యిచ్చి విచ్చలవిడిగా కుర్రకారు మోటార్‌బైక్స్‌పై పిచ్చితిరుగుడు, తిరగడానికి యిన్ని కోట్ల లీటర్ల పెట్రోల్‌ను.. రోజుకు ఇన్ని కోట్లరూపాయల సబ్సిడీని భరించడం అవసరమా. ప్రజలకు ఒకసారి తేరగా ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత అవి ఇవ్వడం మానేస్తే రేపు వాళ్ళే తిరగబడి గొడవలు చేస్తారు. ఈ దిక్కుమాలిన ప్రజాకర్షక పథకాలు వద్దు మహాప్రభో అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారతీయ ఆర్థిక మండలి, వంటి సంస్థలు, పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాలు, అమర్త్యసేన్‌ వంటి మేధావులు ఎప్పట్నుండో నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారు. తోడుకుని తింటానికి ఆరోగ్యశ్రీలు, పద్దెనిమిదేండ్ల పోరగాండ్ల ఓట్లు దండుకోడానికి ఫీజ్‌ రీ ఎంబర్స్‌మెంట్‌, రైతుల ఓట్ల కోసం ఉచిత విద్యుత్తు.. విద్యుత్తును ఉచితంగా ఇస్తూంటే ఊళ్ళలో కొందరు రైతులు మోటార్‌ పంప్‌ ఆన్‌ చేసి పోతే రాత్రంతా అది నడుస్తూనే ఉంటుంది. అరాచకమైపోతోంది ఎన్నోచోట్ల.. అటుదిక్కు ఏదోరకంగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో నలభైశాతం అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కాబట్టి మళ్ళీ ఆదాయం సంపాదించుకునేందుకు నీతిమాలిన మద్యం వ్యాపారం. పదివేల కోట్ల కోసం జనానికి వాకిట్లోనే మద్యం అందుబాటు. బడి ఒడిలో, దేవాలయం ముంగిట ఎక్కడబడ్తే అక్కడ బార్లు, బ్రాండీషాపులు. పదివేలకోట్లు రాబడైతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి ముప్పయ్యెనిమిది వేలకోట్లు ప్రజలనుండి పిండి దోపిడి.. సీసాపై యాభై రూపాయల ఎమ్మార్‌పి ఉంటే బహిరంగ దౌర్జన్యంతో డెబ్బయ్‌ రూపాయలకు అమ్మడం.. సిగ్గు చచ్చి ఎక్సైజ్‌, పోలీస్‌, నిఘా వ్యవస్థలు. సిండికేట్స్‌, మాఫియాలు, గూండారాజ్యాలు.. ఏమిటి.. ఏమిటిదంతా. పుచ్చిపోయింది వ్యవస్థ. అక్కడ ఒకవైపు ఆర్థిక శాఖే కదిలి మంత్రుల ముందు చేతులెత్తి నిలబడి ఈ ప్రభుత్వాలను నడుపలేమిక.. అని ఇంట్లో చారెడు బియ్యంలేక పిల్లలను పస్తులుంచవలసిన స్థితిలో ఉన్న ఇల్లాలులా రోదిస్తోంది.. ఏం జరుగుతోంది.. ఎటు పోతున్నాం మనం.. యిది.. ఈ దుష్టమైన భూమిపుండువంటి దురవస్థను ఎదుర్కోడానికి.. రిటైర్డ్‌ స్కిల్స్‌.. డాక్టర్లు, ఇంజినీర్లు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, దేశస్పృహ ఉన్న కత్తుల్లాంటి యువకులు, ఉద్యమకారులు.. వీళ్ళతో నిండిన బాహ్యవలయం. మొత్తం ‘జనసేన’ లక్షమంది పారదర్శకంగా జనసేన ‘కేంద్రకం’ ఈ లక్షమందిని పోషిస్తుంది – నడిపిస్తుంది.. నడుస్తుంది. ఈ సమాజాన్ని కొంగ్రొత్త మార్గంలో మున్ముందుకు తీసుకెళ్తుంది. కొత్త చరిత్రను రాస్తుంది.” చెబుతున్నారు డాక్టర్‌ గోపీనాథ్‌.

ఆనందం, ఆవేశం పట్టలేక యాంకర్‌ ఆనందరావు చప్పట్లుకొట్టాడు.. ”నిజంగా వ్యక్తిగతంగా నాక్కూడా ఎంతో సంతోషంగా ఉందిసార్‌. ఈ మా టి.వి. ద్వారా కొన్ని వందలమంది మేధావులను, పాత్రికేయులను, సూడో రాజకీయ విజ్ఞులను, విశ్లేషకులను ఇంటర్వ్యూ చేశానుగదా సార్‌ కాని ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా, యింత నిబద్ధతతో ఒక ప్రణాళికను తయారుచేసుకుని ముందుకొచ్చినవాళ్ళను చూడలేదు.. యింకా చెప్పండి..”
రామం అందుకున్నాడు.
”మన రాష్ట్రంలో అసలు పరిశ్రమలున్నాయా. యువత ఉపాధి సంగతేమిటి. విదేశీ నియంత్రణంలో ఉన్న ఎంఎన్‌సిలకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏవైనా భారీ పరిశ్రమలు పనిచేస్తున్నాయా ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టతతో. సాఫ్ట్‌వేర్‌ బహుళజాతి కంపెనీలు సామ్రాజ్యవాద రాజకీయాల్తో తమ తలుపులను భారతదేశంలో మూసేస్తే.. యిక్కడి ఇన్ని లక్షలమంది గతి ఏమిటి. ఎక్కడో స్విచ్‌ ఆఫ్‌ చేస్తే యిక్కడ లక్షల లైట్లారిపోతాయికదా. ఒకవైపు చైనా, కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ లాంటి దేశాలు పరిశ్రమలను ప్రపంచదేశాల గుండెల్లోకి విస్తరించుకుంటూపోతూంటే.. మన దేశీయులు చేవచచ్చి ఎందుకింత దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకెంతసేపూ కమీషన్ల యావతప్ప అసలు దేశం స్పృహలేదు. ఒక్క బొమ్మల పరిశ్రమ చూడు.. ప్రపంచమంతా మేడిన్‌ చైనా. అమెరికాలో చెప్పులు, పెన్నులు, కీచైన్‌లు, ఆహారం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీం, కార్లు, మెమరీచిప్స్‌, బ్యాటరీలు.. అరెరె.. ఎన్ని.. ఎన్నెన్ని అన్నీ మేడిన్‌ చైనా.. కాని అమెరికావాడు ప్రపంచపోలీస్‌ కాబట్టి.. యిక్కడేదైనా అమ్ముకోండి.. కాని నాకు టాక్స్‌ కట్టండి. నా ఖజానాను నింపండి. నేను చెప్పిన మాట వినండి.. అని ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడు. శాసిస్తున్నాడు. యిక్కడ మనం అద్భుతమైన మానవ వనరులుండి, సహజ ప్రకృతి వనరులుండి, అడవులుండి, నదులుండి, పర్వతాలుండి.. అన్నీ ఉండి అవినీతిలో కూరుకుపోయి మనను మనం గొంతులు పిసుక్కుంటున్నాం.. యిక్కడి ప్రజలకు నిజమైన స్పృహ లేకుండా చేసి ఈ పరమ దుర్మార్గ రాజకీయనాయకులు దేశద్రోహానికి తలపడ్తున్నారు. మనం భూమిపుండులో కూరుకుపోతున్నాం. ఇప్పుడు అర్జంటుగా ఏదో ఒకటి జరగాలి.. యిక్కడి భవిష్యత్‌ దృష్టిలేని నాయకులు ఒకటివెంట ఒకటిగా చేస్తున్న తప్పులవల్ల కోలుకోలేనంతగా ప్రజాసామాజికారోగ్యం ఆల్‌రేడీ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో ఆరువందలయాభై ఇంజినీరింగ్‌ కాలేజీలు, వందల సంఖ్యలో ఎంసిఎ, ఎమ్‌బిఎ, ఫార్మసీ కాలేజీలు అవసరమా. యాడాదికి ఏమాత్రం నాణ్యత, ప్రమాణాలు లేని రెండు లక్షల యాభైవేల యువకులు ఉద్యోగానికి పనికిరాని ‘హ్యూమన్‌ గార్బేజ్‌’గా మార్కెట్లోకి రావడం, నిరుద్యోగులై, దిక్కుతోచక రోడ్లమీద నింగిచూపులు చూచుకుంటూ వైట్‌ కాలర్డ్‌ లేబర్‌గా మారవలసిన దుస్థితి ఏమిటి.. ఎందుకు..రాష్ట్రం.. సమాజ రూపకల్పన, భవిష్యత్‌ దార్శనికత.. ఇవన్నీ పూర్తిగా లోపించి సమాజాన్ని అసమర్థ నాయకులు చీకట్లోకి నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ గుండాయిజం, కాన్సిట్యూషన్‌ వైజ్డ్‌ మాఫియా యిక్కడ సమాజాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. మేల్కోవాలి..మనం వెంటనే మేల్కోవాలి. లేకుంటే యిక శాశ్వత సమాధే.”
”కాని అహింసాయుతంగా.. మీరు మీ లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే పనేనా..”
”తప్పకుండా సాధ్యమౌతుంది.. హింసతో నక్సలైట్లు నలభై ఏళ్ళుగా చేయలేని పనిని గత రెండునెలల్లో మేము చేయడం మీరు స్వయంగా చూస్తున్నారుగదా. తుపాకి ఏకకాలంలో ఒక వ్యక్తిని మాత్రమే చంపుతుంది. కాని అహింసాయుతంగా మేము చేపట్టిన రాజ్యాంగసమ్మత ప్రజాస్వామ్య ప్రక్షాళన, పరివర్తన వ్యక్తిని చంపదు సరికదా సమూలంగా, శాశ్వతంగా మారుస్తుంది. చట్టప్రకారం శిక్షిస్తుంది.. ఐతే.. విధిలేని పరిస్థితుల్లో.. హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నట్టు.. యథా యధాహి ధర్మస్య.. తరహాలో.. దుర్మార్గుల దౌర్జన్యం హద్దులు మీరినపుడు, అవధులు దాటినపుడు ధర్మాగ్రహ ప్రదర్శన, దుష్టశిక్షణ అనివార్యమౌతుంది. నరకాసురవధ హత్యకాదు. దుష్టసంహారమౌతుంది. అలాగే దయ్యాలకు వేదపాఠం వినిపిస్తే ఎదురుదాడి చేసినట్టు. ఈ మాఫియాగ్యాంగ్‌లు మాపై ‘జనసేన’పై దాడిచేస్తాయని తెలుసు. అట్టి స్థితిని ఎదుర్కొనేందుకు మేము సుశిక్షితుమై, సశరీర సాయుధలమై ఉన్నాం. మా యువకుల ఒక్కో శరీరాంగం ఆయుధమే. ధర్మం దారితప్పినపుడు అవసరమైతే మనిషిని నిర్మూలించడానికి.. సీనియర్‌ సిటిజన్స్‌తో నిండిన.. అంటే వాళ్ళు డెబ్బయ్‌కిపైగా సంవత్సరాలు తృప్తిగా జీవించారు. జీవితానికి ఒక అర్ధవంతమైన ముగింపును కోరుకుంటున్నారు.. ఊర్కే యింకా యింకా అలా రాయిలా, రప్పలా జీవించి ఏమీ ప్రయోజనంలేదని నిర్ధారించుకున్న వయోవృద్ధులు ఒక ‘ఆత్మార్పణ దళం’గా మావద్ద ఉన్నారు. అవసరమైతే, అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళను బ్రహ్మస్తంగా ప్రయోగిస్తాం. ఎవడైనా ఒక పరమచంఢాలుడైన రాజకీయ నాయకుడు ఎవరిమాటా విననప్పుడు ఒక వరిష్ట ‘జనసేన’ వృద్ధ కార్యకర్త బహిరంగంగా, ప్రజల సమక్షంలో వాన్ని నిర్మూలించి వాడికి ‘మరణశిక్ష’ను అమలుచేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతాడు. వ్యూహాత్మక ఎత్తుగడలే అవసరమైనపుడు..”

టి.వి. ప్రసారం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రం రాష్ట్రమంతా ఆ క్షణాన యిక ప్రళయించబోతున్న సముద్రాన్ని చూస్తున్నట్టు.. అప్రతిభులై మహదానందంతో ప్రసారాన్ని వింటున్నారు. వీక్షిస్తున్నారు.
అప్పుడాక్షణం.. చరిత్ర ఒక కొత్త పేజీని సింగారించుకుంటోంది.

(సశేషం)

మీ మాటలు

  1. raammoham.r says:

    నవలలో మౌళి గారు నిర్వహిస్తున్న “జనసేన” ఉద్యమంలా ఈ మధ్య తెలుగు నేలపై ఆవిర్భవించిన జనసేన పనిచేస్తే ఎంతబాగుండును . పవన్ కల్యాణ్ జనసేన చిచ్చు (చచ్చు)బుడ్డిలా తుస్సుమంది.
    ప్రయోజనాత్మక నవల ఇది.మౌళి గారికి అభినందనలు.
    రామ్మోహన్.ఆర్.కరీంనగర్.

మీ మాటలు

*