ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక Butterfly Effect

ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect…

 

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ.  2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు  మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం.  ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం.  మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది.  నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై,  కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం.  తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది.  శైవక్షేత్రం శ్మశానమయ్యింది…

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.

బడబాగ్నికి సలిలం లక్ష్యం.

దేహాగ్నికి దేహమే లక్ష్యం.

ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.

నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా !    —   అల్లమప్రభు.