కొత్త మందు

Kadha-Saranga-2-300x268

”శర్మకి యా క్సిడెంటయింది  ,తెలుసా —?”ఇంటిలోకి అడుగు పెట్టగానే అంది నా శ్రీమతి.

”ఎక్కడ  –?”కంగారుగా అడిగాను.

”ఇంకెక్కడా –ఫెక్టరీలోనే —మీకు తెలియి దా ? మీ ఫెక్టరీలోనేగా అతడూ  పని చేసేది —”

నిజమే! శర్మమా ఫెక్టరీలోనే పని చేస్తాడు. — గంధకామ్లం తయారు చేసే విభాగంలో —పైగా నాకు ఆప్త మిత్రుడు. అయినా నాకు ఆ సంగతి తెలియికపోవటం ఆశ్చర్యంగా అనిపించింది.

”ఎప్పుడైంది యాక్సిడెంటు —-”

”రెండు మూడు వారాలైనట్లుంది ”

గత మూడు వారాలుగా నేను ఆఫీసు పని మీద ఉర్లు  తిరుగుతునాను. మార్కెటింగ్ మేనేజరుగా పని చేసేవాడికి ఉర్లు తిరగటం తప్పదు కదా !అయితే మాత్రం —-

”ఫోను చేసినప్పుడు చెప్పలేదేమిటీ ?”కొంత కంగారుగానూ కోపంగానూ అడిగాను.

శ్రీమతి మాట్లాడలేదు.

”ఎక్కడవున్నాడిప్పుడు ?”

”పట్నంలో —ప్రభుత్వాసుపత్రిలో —-”

విప్పే షూలేసు సు మళ్ళీ కట్టుకొని ,వెంటనే బైకెక్కి  ఇంటి గేటు దాటాను.

పశ్చిమాంబరాన ప్రమాదానికి గురైన  సూర్యుని నెత్తురికి తడిసి న మబ్బులు ఎర్రగా కనబడ్డాయి. ఎక్కడనుంచో వచ్చిన చీకటి ప్రపంచాన్ని మెల మెల్లగా తన గుప్పటిలోకి తీసుకుంటోంది. మా ఉరివాళ్ళ బ్రతుకులాంటి గతుకుల రోడ్డు మీద జాగ్రత్తగా ముందుకు సాగాను.

రోడ్డు మలుపు తిరిగి పెద్ద రోడ్డెక్కగానే ఎదురుగా కనబడింది ప్రత్యేక ఆర్ధిక మండలి. ఊరిలోవుండవలసిన వెలుగు మొత్తం అక్కడేవున్నట్లు విద్యుత్తు దీపాలతో కళకళలాడుతోంది.

నేనూ ,శర్మ ఉద్యోగం చేసే కర్మాగారం అక్కడేవుంది. మనుషుల జబ్బులకు మందు తయారుచేసే కర్మాగారం మాది. మందులు తయారు చేయడమే కాక ,కొన్ని పాత జబ్బులకు కొత్త మందులు ,కొత్త జబ్బులకు కొత్త మందులు కనిపెట్టడానికి విస్తృతంగా రీసెర్చు కూడా చేస్తువుంటారు.

కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ రోడ్డు నిండా చీకటి. ప్రత్యేక ఆర్ధిక మండలిలోని వెలుగు కార్మికుల నివాసాలదాకు చేరటం లేదు –రోడ్డుకి ఎడంవైపు ఆర్ధిక మండలిలో పని చేసేవారికోసం ఎవ్వరో నిర్మించిన అగ్గిపెట్టెలాంటి అద్దె ఇళ్ళు –వాటి చుట్టూ  మసక మసక వెలుతురు –శర్మ అక్కడే వుంటాడు. ఒకసారి అటు చూశాను –శర్మ ఇంటిలో దీపం వెలగటం లేదు.

రోడ్డుకి కుడివైపు గుడెసెలు. మండలిలో రోజువారీ కూలికి పనిచేసేవారి నివాసాలు అవి. అక్కడ హడావిడిగా ఉంది. ఆ రోజు సంపాదించిన డబ్బు ఖర్చు చేసే హడావిడి అక్కడ. డబ్బు సంపాదించడానికీ ,సంపాదించినది ఖర్చు చేయడానికీ చేసే హడావిడియేగా జీవితం !

గట్టిగా నిట్టూర్చాను. నాకు నా చిన్ననాటి ఊరు గుర్తు వచ్చింది అప్పుడు ఊరిలోని వెలుగు మొత్తం ఊరి జమీందార్ గారి ఇంటిలోనేవుండేది. ఇప్పుడూ అంతే అనిపించింది. నాడు పంట పొలాల ఆస్తి కలిగినవారు  జమీందార్లు –నేడు ఆర్ధిక మండలీలు వున్నవారు  జమీందార్లు –అంతే తేడా !

రోడ్డువైపు దృష్టి వుంచి జాగ్రత్తగా సాగాను. పాపం,శర్మ!ఏం ఇబ్బంది పడుతున్నాడో ,ఏమో ! అసలే వాడి ఆర్ధిక పరిస్థితులు అంతంతమాత్రం. ప్రమాదం ఫాక్టరీలోనే జరిగింది కనుక ఖర్చు యజమాన్యంవారే  భరించాలి. అలాంటప్పుడు కార్పోరేటు ఆసుపత్రిలో కాక ప్రభుత్వాసుపత్రిలోచేర్చారెందుకో !

నేనూ శర్మ చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నాం; అడుకున్నాం; కలిసే తిరిగేవాళ్లం. శర్మ చాలా ప్రతిభావంతుడు. రాబోయే సమస్యలను ముందే పసి కట్టేవాడు. కాలానికి ముందే ఆలోచించే వాడి ప్రతిభకి సరైన గుర్తుంపు రాలేదని బాధ పడుతువుంటాను నేను. లేకపోతే వుత్త మట్టి బుర్రైన నేను —రెండు మూడు సార్లు పరీక్ష వ్రాసి పాస్ అయ్యానని అనిపించుకున్న నేను –మార్కెటింగ్ మేనేజర్ కావటమేమిటీ –ఇంజినీరింగు డిప్లొమా పాసైన శర్మ నట్టులు బొల్టులు విప్పే మెకానికుగా పని చేయడమేమిటి !

డిప్లొమా పాస్ ఆయిన తరువాత కొన్ని సంవత్సరాలు శర్మ నాకు కనబడలేదు. ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. హటాత్తుగా ఒక రోజు మా కర్మాగారంలోని కేంటీనులో ప్రత్యక్షమయ్యాడు.

‘నువ్వేమిటి,ఇక్కడ —” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఈ కాపెనీలో చేరానురా ”

‘అదెప్పుడు —ఏ సెక్షన్ —”

”గంధకామ్లం తయారుచేసే ప్లాంటులో –మెకానిక్కుని  –ఓ నెల అవుతోంది చేరి ”

”సరేలే –సాయంత్రం ఇంటికిరా ”భోజనం బల్ల వద్ద  మిగతా మేనేజర్లు నా  చుట్టూ  కూర్చున్నారని గుర్తిస్తు అన్నాను.

”ఏ జెమ్ ఒఫ్ ఏ వర్కర్ !”శర్మ వెళ్ళగానే నా పక్కనే కూర్చున్న జి.యం. గారన్నారు ”ఉద్యోగంలో చేరి నెల రోజులైనా కాలేదు ,అప్పుడే పని అట్లా పట్టేసాడు. హి  ఇస్ యువర్ ఫ్రంట్ –?”

”యెస్ ; చిన్ననాటి స్నేహితుడు ”

”వెరీ గుడ్ ; అతడు పని రాక్షసుడు.చేతిలోవున్న పని పూర్తి అయినంత వరకు పనినుంచి కదలడు ”

”మనకు కావాలిసింది అదే కదా  –”ఫైనాన్స్  మేనేజర్ మాట కలిపాడు.”కార్మికులు ఓ , టి. చేసినా మనం డబ్బులు ఇవ్వం కదా. అందువల్ల పని వత్తిడి వున్నప్పుడు ఓ. టి.చేయమని గడ్డంపట్టుకొని బతిమాలవలసి వస్తుందట. శర్మ లాంటివారు కొందరువుంటే లాభానికి లోటు వుండదు.

మేనేజర్లు అందరూ శర్మ పనితనం గురించి గొప్పగా మాట్లాడారు. నాకు చాలా సంతోషం కలిగింది.

” చిన్నప్పటినుంచివాడు  చాలా ప్రతిభావంతుడండి. ”అనే మాటలతో  మొదలు పెట్టి శర్మ చరిత్ర మొత్తం వివరించాను.

కాని ,ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.ఒక సారి టూరుకి వెళ్ళి రాగానే ,వెంటనే కేబిన్ లోకి రమ్మని కబురు పెట్టారు జి. యం. గారు. భయం భయంగా వెళ్ళాను. ఎందుకంటే ఆ సారి టూరులో పెద్దగా ఆర్డర్లు సంపాదించలేక పోయాను. ఉద్యోగులు చేసిన మంచి పనులనూ ఆర్జించి పెట్టిన లాభాలనూ వెంటనే మరిచిపోతారు యజమాన్యం వారు –పైగా అది వాళ్ళ బాధ్యత అంటారు. చేయలేకపోయినవాటిని అసలు మరిచిపోరు.

టూరు విషయం ఎత్తలేదు జి. యం. గారు. అది నా అదృష్టం అని అనుకున్నాను.

‘’సీ ,మిస్టర్ రావ్ –‘ తన బల్లమీదవున్న గ్లోబుని వ్రేలుతో తిప్పుతూ అన్నారు జి.యం.’’నేను చెప్పే విషయం ప్రత్యక్షంగా మీకు సంబంధించినది కాదు అని నాకు తెలుసు. అయినా మీకు  చెబుతే మంచిదేమోనని అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వర్కరుని కోల్పోవటం నాకు ఇష్టం లేదు’’

పరీక్షా హాలులో అర్ధం కాని ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్ధిలా కంగారు బడ్డాను నేను.

‘’అదే మీ  ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా –అదే శర్మ –అతని గురించే —‘’

బల్లమీదవున్న ఫోను మ్రోగింది. ఫోనులో మాట్లాడిన జి. యం. ముఖం యెర్రగా కందిపోయింది. ‘’ఇస్తారయ్యా –ఇస్తారు’’

జి. యం. ఫోనులో అన్నాడు.’’పని మొదలుపెట్టమని చెప్పవయ్యా –కాగితం వచ్చినంతవరకు అంటే –నేను చెబుతానులే –కానీ –‘’

ఫోను గట్టిగా పెట్టి విసుక్కున్నారు జి. యం. ‘’తెలివి మీరిపోతునారు . ప్రతి పనికీ అడ్డుపెడుతున్నారు.—లేటు చేస్తున్నారు. ‘’కోపంగా కుర్చి వెనకు జారి అన్నారు’’ఇదిగో ,ఇదండి వరస –భద్రత గురించి వర్కర్లకు అవసరానికి మించిన అవగాహన కల్పించాడు మీ శర్మ. ఇప్పుడు వర్కర్లు పంపులకి గార్డులు పెట్టాలని,అంటునారు. పంపు మరామత్తుకి ఇచ్చే ముందు పూర్తిగా ‘’డ్రైన్ ‘’ చేసినటు సంతకం పెట్టిన కాగితం ఇమ్మని అడుగుతున్నారు  పనులు ఆలస్యమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గే చోట కొద్దిగా చూసి చూడనట్లు  ఉండాలి కదా. మీ శర్మ ఇక్కడకి రాక ముందు ఇలాంటి గొడవలు లేవు ‘’

నేను మౌనం పాటించాను.

బల్లమీదవున్న పైపు అందుకున్నాడు జీ. యం. పైపులోని బూడిద దులిపి కొత్త పొగాకు నింపుకుంటూ అన్నాడు. ‘’పెళ్ళాం పిల్లలూ వున్న  వాడు కదా అని ఆలోచిస్తున్నాను. పైగా మంచి వర్కరు కూడానూ –లేకపోతేనా —‘’గట్టిగా పొగ పీల్చి అన్నారు జి. యం. ‘’మీరు ఒక సారి శర్మతో మాట్లాడండి .గోరుతో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు ?’’

బాధగా కేబిన్ బయటికి వచ్చాను. బరువెక్కిన పాదాలతో అడుగులు వేసి వెళ్ళింది సమయం.

సాయంత్రం శర్మ ఇంటికి వెళ్ళాను.జరిగినదంతా వివరంగా చెప్పాను. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను,కూడా. కాని నా మాటలు పట్టించుకోలేదు శర్మ. పనిలో భద్రత గురించి, వర్కర్లకు పూర్తి అవగాహన కలిగించటం అవసరమన్నాడు. అందువల్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నాడు. యాజమాన్యం వారుకూడా ఆత్మార్ధంగా భద్రతకి పెద్ద పీట వేయాలని అన్నాడు.

నాకు శర్మ పట్ల జాలి కలిగింది. పనిలో ప్రతిభావంతుడైన వాడు యాజమాన్యం ఆలోచనలను పసి కట్టలేక పోతున్నాడెందుకని !

“ ఒరేయి  ‘’ నేను అన్నాను. ‘’ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయ,రా.కాని ప్రయోగిగంకా ఆలోచించాలి. ఎవ్వరు ఏం చెప్పినా ,ఎంత చెప్పినా ,భద్రత గురించి పర్యావరణం గురించి ఖర్చు చేయడానికి ఏ యాజమాన్యమైనా కొద్దిగా వెనకాడుతుందిరా .వాటి మీద ఖర్చు చేసే డబ్బుకి రిటర్న్ ఉండదు కదా . చట్ట ప్రకారం ఎంత తక్కువ చేయాలంటే అంతే’’

శర్మ తలయెత్తి నన్ను ప్రశ్నార్థకం గా   చూసాడు.నే ను మళ్ళీ అన్నాను. ‘’పైగా ఈ ఆర్ధిక మండలి అలనాటి ఈస్ట్ ఇండియ కంపెని లాంటిది. అందువల్ల నీ వేగం కొద్దిగా  తగ్గించు.నేను ఎందుకు చెబుతున్నానని  అర్ధంచేసుకో . మంచి వర్కరనే పేరుంది నీకు.  జి. యం.గారికి కూడా నీ మీద అభిమానమే. నీ తెలివి తేటలనూ మంచి పేరునీ ఉద్యోగంలో పైకి రావటం కోసం ఉపయోగించు . ఇలాంటి అనవసరమైన —–‘’

‘’ నేను అనుకోవటం లేదు అనవసరమని . ‘’శర్మ గొంతు లేచింది. ‘’పాపం కూలి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేస్తునారు  . మొన్న ఏమైందో తెలుసా –గంధకామ్లం పంపు చేసే పంపు ,పూర్తిగా డ్రైన్ చేయకుండా మరామత్తుకి ఇచ్చేసారు. హెల్పరు ,బొల్టు విప్పగానే వానలా బయటికి దూకింది ఆమ్లం –అతని అదృష్టం బాగుండటం వల్ల కళ్ళు పోలేదు అంతే. తప్పు చేసినవాడు పొరపాటు ఒప్పుకుంటాడా —అందుకే పూర్తిగా డ్రైన్ చేశారని సంతకం పెట్టి కాగితం ఇమ్మంటున్నాం. ‘’

‘’అలాంటి చోట పని చేసేటప్పుడు వేసుకోవలసిన ప్రత్యేక దుస్తులూ వాడవలసిన భద్రతాపరికరాలు ఉంటాయి కదా ‘’

‘’ఆయనే ఉంటే మంగలివాడు ఎందుకురా —‘’

శర్మలాగే కర్మాగారంలోని యంత్రాలు  కూడా నిర్విరామంగా తిరిగాయి. ఉత్పత్తిలోనూ కొత్త మందులు కనిపెట్టడంలోనూ మా సంస్ధ ముందడుగు వేసింది. కొత్తగా కనిపెట్టిన మందులు మనుషుల మీద ప్రయోగించడానికి సిద్ధమైంది  .

అప్పుడు జరిగింది ఆ సంఘటన —

పొగ గొట్టం మరామత్తు కోసం పైకి ఎక్కిన ఒక వర్కర్ క్రిందపడి చనిపోయాడు. పెద్ద గొడవకి దారి తీసింది ఆ సంఘటన. ఎత్తులో పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్టు వాడటం తప్పనిసరి. అతడు బెల్టు వాడాడు. కాని అది బలంగా ఒక చోట తగిలించలేదని ,అందువల్ల పడిపోయాడని యాజమాన్యం వారు అన్నారు. పైగా అతడు మద్యం మత్తులో ఉండేవాడని కూడా ఋజువు చేసారు. కాని కార్మికులు ఒప్పుకోలేదు. వాడిన బెల్టు పాతదని అలాంటివే కర్మాగారంలో లభ్యమని ,వాటి బలాన్ని టెస్టు చేయించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని వాదించారు. వర్కర్లను ఉసికొల్పేది శర్మే నని నమ్మింది యాజమాన్యం. సమస్య సమ్మేకి దారి తీస్తుందేమో నని భయపడిన యాజమాన్యం జి. యం. గారిని ఉద్యోగంనుంచి తొలిగించి శాంతి కుదుర్చుకున్నారు.

కొత్త జి. యం. చేరగానే కార్మికులతోనూ వర్కర్లతోనూ సమావేశమైనాడు.  జరిగిందేదో జరిగిపోయిందని ఇక మీదట అలా జరగదని హామీ ఇచ్చారు. అంతే కాదు , పనిలో భద్రత ను త్యాగం చేస్తే ఊరుకునేది లేదని నొక్కి వక్కాణించాడు. ఎవ్వరైనా  భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినా  ,ఉల్లంఘించ డానికి ప్రోత్సాహం ఇచ్చినా వెంటనే –అర్ధరాత్రీ అయినా –తనకి ఫోను చేసి మాట్లాడమని నిర్దేశించారు .అంతే కాదు శర్మని ప్రత్యేకంగా తన కేబినులోకి పిలిచి అభినందించాడు కూడా  .

‘’సీ ,మిస్టర్ శర్మా –‘’కొత్త జి.యం.అన్నారు. ’’మీరు పని చేసే ఈ కర్మాగారంలో పని చేయటం నా అదృష్టం. ప్రతి కర్మాగారంలోను మీలాంటివాడు ఒకడైనా వుంటే పరిశ్రమల్లో ప్రమాదాలకు తావుండదు. వాట్ ఏ డెడికే ట్టడ్ మాన్ యు ఆర్ !ఉత్పత్తి తగ్గితే  మరో రోజు సాధించవచ్చు –కాని ప్రమాదానికి గురైన  వాడ్ని తెచ్చుకోగలమా —‘’

శర్మతో పాటుకార్మికులు కూడా ఆ మాటకి పొంగి పోయారు.  భద్రతపట్ల అంకింత భావంగల జి. యం. వచ్చినందుకు సంతోషించారు. ఆ ఆదివారం కలిసినప్పుడు అదే మాట అన్నాడు శర్మ.

‘’నువ్వు పొరపడుతున్నావురా ‘’నేను అన్నాను ’’నువ్వు ఎంత ప్రతిభావంతుడు వైనా యాజమాన్యం వారి ధోరణి పట్టుకోలేకపోతున్నావు ‘’

“ ఏంటిరా   , అలా అనేసావు ? ’’

‘’నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి శర్మా  –పాత జి. యం. అయినా కొత్త జి.యం.అయినా , జి.యం. జి.యం.నే . వాళ్ళ ఆలోచనలు బయట కనబడినా ,కనబడక పోయినా ఒకే లాగానే ఉంటాయి.పనికి సంబంధించిన ఆలోచనలు మనిషిని బట్టి మారవు. పదవినిబట్టి మారుతాయి. ‘’

‘’నాకు అర్ధం కాలేదురా –‘’

‘’జి.యం.ఎవ్వరైనాసరే , ఆలోచనా ధోరణిలో మార్పువుండదు. నీకు ఒకటి తెలుసా – జి. యం.ఉద్యోగాల మార్పిడి కుండ మార్పుల పెళ్ళిలాంటిది. ‘’

‘’అంటే —‘’

‘’ఆ  జి.యం. ఎక్కడకి వెళ్లారనినీకు  తెలుసా —మన కొత్త జి.యం.ఖాళీ చేసి వచ్చిన పోస్టుకి—మన యజమాన్యంవారే సర్దుబాటు చేసారట. ‘’

‘’సార్ ,ఇక్కడే  —‘’ఎవ్వరో కేక వేసి పిలవటం విని బైకు అపాను. ప్రభుత్వాసుపత్రి గేటు వద్దవున్నాను నేను. మా కర్మాగారంలో పనిచేసే ఇద్దరు ముగ్గురు నా  చుట్టూ  చేరారు.

‘’ఎలావుంది శర్మకి —‘’బైకు పార్కు చేసి  అడిగాను.

‘’ఎలావుంది అంటే —-‘’

‘’ఏమైందని  చెప్పరేం —?’’నా మనసు కీడు శంకించింది .

‘’ఏం చెప్పను ,సార్ ,’’ ఒకడు కళ్ళు వత్తుకొని అన్నాడు.

‘’పోనీ ,ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది ?’’

‘’ఆ రోజు రాత్రి —మరిగించిన గంధకం పంపు చేసే  పంపు పని చేయటం మానేసింది  సార్. ఎంత ప్రయత్నించినా స్టార్టు కాలేదు. జి.యం.గారు శర్మని తీసుకురమ్మంటే ఇంటికెళ్ళి తీసుకొచ్చాం. ఇంత వరకెప్పూడూ రాత్రి పూట  అతన్ని తీసుకురావలిసిన అవసరం రాలేదు. శర్మ ఎప్పుడూ పగలేగా పని చేసేది —‘’

‘’ఏమైందని చెప్పండి ‘’

‘’వస్తూనే పంపువద్దకు  పరిగెత్తాడు శర్మ. మరిగే గంధకం నిలువు చేసే టాంకు పైన వుంటుంది పంపు. దానిమీద వుండే పలక ఒకటి –పంపుదగ్గరదే  –ఎప్పుడో ఎవ్వరో తీసి వుండడం శర్మ గమనించలేదు. హడావిడిగా వెళ్తూ ఒక కాలు మరిగే గంధకంలో కి —‘’

‘’అమ్మ బాబోయి —‘’

‘’కాని గంధకం కాళ్ళకు  తగలలేదండి. వ మరిగించడానికి వాడే ‘’స్టీమ్ ‘’తగిలింది. మోకాళ్ళ దాకా కాలింది. ‘’

‘’ఏ గదిలో వున్నాడు ?’’

‘’నూరో నెంబరులో —‘’

ఒక ఉదుటున లోపలకి వెళ్ళాను. ఒక కుర్చీలో కూర్చుని బయటికి చూస్తునాడు శర్మ. ‘

“ ఒరేయి  ,శర్మా —-‘’

వాడు వెనక్కు  తిరిగి చూడలేదు. వెక్కి వెక్కి ఏడవటం వినబడింది.

‘’అన్యాయమై పోయానురా –నేను అన్యాయమై పోయానురా –‘’

‘’ఊరుకోరా –ఇప్పుడు ఏమైందని –ఒక నెల రోజుల్లో మళ్ళీ మామూలు అవుతావురా –‘’

ఒక నిమిషం మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత అన్నాడు.

‘’ఒక సారి నా దగ్గరకి వచ్చి కిటికీనుంచి చూడరా –‘’

‘’ అక్కడ ఏముందిరా చూడడానికి  —‘’ నేను శర్మ దగ్గరకి వెళ్ళాను.

‘’అదిగోచూడు  ,ఆ కనబడేది బీచురోడ్డు కదూ –‘’

‘’అవును ‘’

‘’ఈ రోజు పున్నమి కాబోలు –పిచ్చెక్కిన సముద్ర కెరటాలు బీచులో నిలబడినవాళ్ళ పాదం క్రింత ఇసుకను లాగేస్తునాయి . పున్నమి వెన్నెల లో వెండి పూత పోసుకున్న సముద్రం —‘’

‘’అవునవును ‘’

‘’దూరంగా బెర్తు కోసం ఎదురు చూసే నావలు ,మన బ్రతుకులలా –అయ్యో చూడు ,ఆ చంటి పిల్ల రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతోంది. పరిగెత్తుకొచ్చే కారు క్రింద —-‘’

‘’ఏంటిరా ,ఈ పిచ్చి మాటలు —‘’

‘’నాకు అంతా బాగానే కనబడుతున్నాయి కదురా ‘’

‘’ఎవ్వరన్నారురా నీకు కనబడటం లేదని —‘’

‘’డాక్టర్ అన్నారురా నాకు రేచీకటి అని –రాత్రి పూట నాకు ఏది కనబడదని –అందుకే యాక్సిడెంటు జరిగిందని —‘’

నేను తుళ్ళి పడ్డాను.

‘’ఇది మెడికల్ కాలేజీ తాలూకు ఆసుపత్రి కదా –ఇక్కడ డాక్టర్ సర్టిఫికటు ఇచ్చేసారు రా –ఇక నాకు ఫాక్టరీ ఉద్యోగానికి అర్హత లేదట.ఇక ఫాక్తరికి రానవసరం లేదన్నారురా ‘’

నా గుండె తరుక్కుపోయింది –అంటే శర్మ ఇలా—బుర్ర పిచ్చెక్కినటైంది. గది బయటికి పరిగెత్తుకొస్తూ   అనుకున్నాను.

అవును ,మా కంపెని వారు కొత్త మందులు కనిపెడుతునారు !

***

LR-SWamy-240x300 –ఎల్. ఆర్. స్వామి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. పరిశ్రమల్లో జరిగే దోపిడీ విధానం , వారికి పని లో పాటించాల్సిన భద్రతలను పాటించక పోవడం , మాన్సిహి శ్రమనే కాదు చివరికి ద్రోహ బుద్ధితో అతని జీవికకే మోసం తీసుకురావడం హృదయ విదారకంగా ఉంది. కానీ ఇది వాస్తవం, రచయిత పరిశ్రమల్లో పని చేసేరు కనుక ఇంత స్పష్టంగా రాయగలిగేరు . ఎన్ని ఇలాటి వెతల కథలో మన దోపిడీ విధానపు పరిశ్రమల్లో. కథనం బాగుంది . గుండె చెమరించింది ….ప్రేమతో జగద్ధాత్రి

  2. ఇది కధ కాదండి! నిజం గా నిత్యం జరుగుతున్న శ్రమ దోపిడీ ఇది. హృదయాన్ని కదిలించింది.

  3. మంజరి లక్ష్మి says:

    నువ్వు ఇన్ని గంటలు పని చెయ్యాలి, నీ జీతం ఇంత అని నిర్ణయం జరిగినప్పుడే పెట్టుబడి దారుడికి వచ్చే గ్రాస్ లాభం (జీతానికి, కార్మికుడు తయారుచేసిన సరుకును అమ్ముకుంటే వచ్చేదానికీ ఉన్న తేడా) నిర్ణయమై పోయినట్లే. అదే శ్రమ దోపిడీ ద్వారా వచ్చే అదనపు విలువ. ఇలాంటి శ్రమ దోపిడీని చెయ్యటం ఈ బూర్జువా ప్రభుత్వ చట్టాల ప్రకారం కూడా న్యాయమే. అయితే ఈ కధలో, ఫ్యాక్టరీ యజమానులు, ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం కూడా చేసిన అరకొర చట్టాల ద్వారా వాళ్ళకు కల్పించవలసిన కనీస సౌకర్యాలను, భద్రతలను కూడా కల్పించ కుండా ప్రభుత్వం ఒప్పుకున్న దోపిడీ కన్నా ఇంకా ఎక్కువ (సెకండరీ) లాభాలను పొందటానికి ఎటువంటి నీచానికి కూడా దిగుతారో చూపించింది. అంటే అలా కనీస సౌకర్యాలను కల్పించకపోవటం దోపిడీని న్యాయ బద్ధం చేసిన ఈ బూర్జువా చట్టప్రకారం కూడా భయంకరమైన అన్యాయం అన్న మాట. అది అడిగిన కార్మికులకు ఏ గతి పడుతుందో కూడా చూపించారు ఇందులో.

  4. మంజరి లక్ష్మ్ says:

    (జీతానికి, కార్మికుడు తయారుచేసిన సరుకును అమ్ముకుంటే వచ్చేదానికీ ఉన్న తేడా)
    అనేదాన్ని (జీతానికి, కార్మికుడు తయారుచేసిన సరుకును అమ్ముకుంటే వచ్చేదాంట్లోంచి ఉత్పత్తి సాధనాల ఖర్చులు తియ్యగా మిగిలిన దానికి, ఉన్న తేడా) అని చదువుకోవాలి.
    పైన పొరపాటుగా రాశాను.

మీ మాటలు

*