వర్షం

సౌత్ ఆఫ్రికా కథ

                                  ఆంగ్ల మూలం:రిచర్డ్ రైవ్

                                                                    అనువాదం:     ఎలనాగ

    676x380      అప్పటిదాకా వున్న కలకలాన్ని పీల్చేస్తూ మిలిటరీ బ్యాండులా గట్టిగా ప్రతిధ్వనించే శబ్దంతో కురవసాగింది వర్షం. తడిసిన అద్దాల్లా వున్న వీధుల్లోని ఎరుపు, పసుపుపచ్చ రంగుల ప్రకాశవంతమైన నియాన్ లైట్ల కాంతిని ముంచేసింది వాన. సైడుకాలువలు పొంగినయ్. రోడ్ల మీద పొంగిన నీరు శబ్దం చేస్తూ పేవ్ మెంట్ల మీదికి చేరింది. నీటి ప్రవాహం గురగుర శబ్దం చేస్తూ డ్రెయినేజీల మూతల్ని పీల్చేసింది. బూడిదరంగులో వున్న వర్షధారలూ, పొగమంచూ కలిసి నగరం మధ్యలో వున్న కొండని కనపడకుండా చేసినయ్. ఉదాసీనంగా వున్న కేప్ టౌన్ నగరంలోని సిటీహాల్ క్లాక్ టవర్ ధీరత్వంతో తొమ్మది గంటలు కొట్టడానికి ప్రయత్నించింది. విధ్వంసకర శబ్దాల్ని చేస్తూ విసురుగా ఉధృతంగా కురిసింది వర్షం.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ బిల్డింగు లోపలి నుండి పసుపుపచ్చని కాంతి బయటికి వస్తోంది. బయటి వాతావరణం నుండి రక్షణ కోసం దాని తలుపు గట్టిగా మూయబడి వుంది. లోపల  శరీరాల వేడిమి, గుడ్డల వేడిమి, మళ్లీ మళ్లీ వేడి చేసిన చేపనూనె వాసన – అన్నీ కలిసి ఊపిరాడనివ్వ కుండా వాంతి తెప్పించే విధంగా వున్నయ్. కిటికీల గాజుతలుపుల మీద పొగమంచు తాలూకు మసక చిత్రాలు. తలుపు కింది నుండి లోపలికి తన్నుకొచ్చిన నీళ్లు రంపపు పొట్టుతో కలిసిపోయి అక్కడ చిన్న మడుగులా తయారైంది.

చేతుల చొక్కా తొడుక్కున్న సోలీ చెమటతో తడిసిపోయాడు. అతనికి బూతులు మాట్లాడాలనిపిచేటంత చిరాకుగా వుంది. నీళ్లోడుతూ అప్పుడే లోపలికి వచ్చిన స్త్రీని చూసి “తలుపును గట్టిగా ముయ్. ఇది టెంటనుకున్నావా” అని బిగ్గరగా అరిచాడు.

“అరవకు సోలీ”

“కోపం తెప్పించొద్దు. మీ నల్లోల్లు ఎప్పుడూ తలుపుల్ని సరిగ్గా మూయరు”

“తెల్లోడా, అరవకు”

“నేను నీ మీద అరుస్తున్నాను కదా. ఔను మరి”

“ఇక పోనియ్. నాకు రెండు చేప ముక్కలు, తోక నరికినవి”

“రెండు చేప ముక్కలా? ఓకే”

“బయట కుండపోతగా వర్షం” అన్నదామె ఎవరినీ ఉద్దేశించకుండానే.

“అవును. వర్షం ఉధృతంగా వుంది” అంటూ లోపలికి వచ్చాడొక బక్కపలుచని మలేషియన్ యువకుడు. అతడు తల మీద హ్యాట్ పెట్టుకున్నాడు.

“ఒకటిన్నర పౌండ్ల ఫిష్షూ చిప్సూ కావాలి”

“ఒకటిన్నర పౌండ్లు. థాంక్యూ. కాని ఆ తలుపును మూసెయ్”

“సరే కాని ఈ హానోవర్ స్ట్రీట్లో ఒక్క నీ షాపుకే తలుపుందనుకుంటున్నావా?

“అయితే చావు” అంటూ మాటలు ఆపి, మరో కస్టమర్ వైపు తిరిగాడు సోలీ.

ఉత్తరం వైపు నుండి బలమైన వర్షపు ఈదురుగాలులు కిటికీల అద్దాల్ని బాదుతున్నాయి. హానోవర్ స్ట్రీట్ బస్టాపులో ఒక బస్సు జారుడు శబ్దం చేస్తూ ఆగింది. అందులోంచి దిగిన ప్యాసెంజర్లు వాన నుండి తప్పించుకోవడానికి ఎదురుగా వున్న సినిమా హాలు గేట్లోకి పరుగెత్తారు. వీధిదీపాలు మసకగా వెలుగుతున్నాయి.

చేపముక్కల్నీ చిప్సునూ పాత వార్తాపత్రికల్లో కస్టమర్లకు కట్టి యిస్తుంటే సోలీ చెమటలు కక్కుతున్నాడు. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ వేసియ్యాలా? పేపర్లో కట్టి ఇవ్వాలా? ఇక్కడే తింటావా? “ఒకటిన్నర పౌండ్లవి ప్లీజ్.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ చిప్సూ. వద్దా? రెండు ఫిష్ ముక్కలు, చిప్సు. వద్దా? ఉప్పూ, వినెగర్ చల్లనా? “ఒకటిన్నర పౌండ్లవి ఇవ్వండి.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ, చిప్సూ.

అప్పుడే లోపలికి వచ్చిన ఒక స్త్రీతో “తలుపు మూసెయ్” అని బిగ్గరగా అరిచాడు సోలీ. సారీ అన్నట్టుగా ఆమె చిన్నగా నవ్వింది.

“మీ నల్లోల్లు నాస్తికులకన్నా ఘోరం” అన్నాడు సోలీ.

ఆమె తలుపు మూయటానికి యాతనపడి, రంపపు పొట్టూ నీళ్లూ కలిసిన మడుగులో నిలబడింది. ఆమె శరీరం  మీది నుండి  నీళ్లు కారుతున్నాయి. సోలీ రెండు వంటచెరుకు కట్టెల్ని పొయ్యిలో వేయటానికి కౌంటరు దగ్గర్నుంచి కదలగానే ఆమె పక్కకు జరిగి తోవనిచ్చింది. అంతకు ముందు సోలీ అన్న వాక్యానికి మరో కస్టమరు కోపం తెచ్చుకుని, “మీ యూదులు మా నల్లోల్లను ఎప్పుడూ బయటికి తోయటానికే వున్నారు” అన్నాడు.

తన జాతి మీద వచ్చిన వ్యాఖ్యను తిప్పికొట్టటం కోసం “అయితే చావు” అన్నాడు సోలీ. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ తోనా? ఉప్పు వెయ్యనా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ.

“ఏం కావాలి చెప్పండి మేడమ్”

“సినిమా యెప్పుడు వొదుల్తారో కొంచెం చెప్తారా?”

“నేనేం సినిమా టాకీసు మేనేజర్ననుకున్నావా?”

“ప్లీజ్”

“పదిన్నరకు” అని చెప్పాడు మలేషియన్ యువకుడు.

“థాంక్యూ. అంత వరకు నేనిక్కడ నిలబడొచ్చా? బయట వర్షం బాగా వుంది” అన్నదామె సోలీతో.

“బయట బాగా వర్షం కురుస్తుందని తెలుసు నాకు. కాని ఇది ధర్మసత్రం కాదు” అన్నాడు సోలీ.

“ప్లీజ్ బాస్”

ఈ వాక్యంతో సోలీకి హృదయం లోపల తెలియకుండానే గిల్లినట్టైంది. ఆరో జోన్ లోని ఆ మూలలో అతని దుకాణం చాలా సంవత్సరాలుగా వుంది. ఇంతకు ముందు యెన్నోసార్లు యెందరో తనకు బాధ కలిగించే మాటలనటం అతనికింకా జ్ఞాపకమే. అతనెప్పుడూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడామె అన్న వాక్యం అతడు ఊహించనిది. ప్లీజ్ బాస్…ఈ వాక్యం అతనికి నచ్చింది. తను వేసుకున్న కోటుకూ, టైకీ ఆ వాక్యం సరిపోయేట్టుగా వుందనుకున్నాడు. ప్లీజ్ బాస్…ఆహా ఎంత బాగుందీ వాక్యం!

“సరే సరే. కొంత సేపటిదాకా వుండు. కానీ వర్షం ఆగగానే వెళ్లిపోవాలి”

ఆమె తలూపి ముసురు వెనకాల మసకగా కనపడుతున్న టాకీసు పేరును చదవటానికి ప్రయత్నించింది.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా?” అడిగాడు సోలీ.

ఆమె యేమీ మాట్లాడలేదు.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడుగుతున్నాను”

అప్పటికీ ఆమె నుండి ఏ సమాధానమూ లేదు.

“చావు” అన్నాడు సోలీ మరో కస్టమరు వైపు తిరిగి.

 

వర్షపు మసకలోంచి సియెనా చూస్తోంది కానీ ఆమె చూపులు దేనిమీదా లేవు. తడిసిన రోడ్ల మీద జారుతూ పోతున్న కార్లు. వర్షంలో రకరకాల హారన్ల చప్పుళ్లు. టైర్ల కిందికి వచ్చిన నీళ్లను చిమ్ముతూ బస్సులు. గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ లో బిగ్గరగా మనుషుల మాటలు. ఆమె చూపులు ఎదురుగా వున్న కొండ మీది నీటి పాయలను దాటి, చలికాలపు కేప్ టౌన్ ను దాటి, బోలండ్ అనే వూరి వేసవిలోకి ప్రవేశించాయి. స్టెలెన్ బాష్ పార్ల్ ల ఆకుపచ్చని ద్రాక్షతోటల్ని దాటి, మాల్మెస్ బరీలోని ఉక్కపోత నిండిన గోధుమపొలాల్ని దాటి, తెస్లర్స్ డాల్ గ్రామంలోని కేరింతల్నీ , బద్ధకంగా ఆవులించే సూర్యుణ్నీ చేరుకున్నాయి. అక్కడ సూర్యుడు ఉదయించటం కోసం, వెలుగునివ్వటం కోసం, అస్తమించటం కోసం శ్రమ పడుతూ అలసిపోయినట్టుగా వుంటాడు.

పంతొమ్మిదవ శతాబ్దపు ఎత్తుగోడల మిషన్ చర్చిలో ఆమె మొదటిసారిగా జోసెఫ్ ను కలిసింది. ఆ చర్చి ఇప్పటికీ వుందక్కడ. ఎంతో అందంగా పైకి పాకే ఐవీ తీగ ఆ చర్చి అందాన్ని మరింతగా పెంచుతుంది. బాగా పాలిష్ చేయబడి తళతళ మెరిసే పెద్దపెద్ద చమురు దీపాలు పైకప్పు నుండి వేలాడబడి వుంటాయి. ఆ చర్చిలో ఆ దీపాల రెపరెపల్లోనే ఆమె మొదటిసారిగా అతణ్ని చూసింది. అతడు ఆ చర్చిని చూడటానికి కేప్ టౌన్ నుండి వచ్చాడు. ఆ రాత్రి ఆమె చర్చిలో అంతకు ముందెప్పుడూ పాడనంత బాగా ఒక భక్తిగీతాన్ని పాడింది. “మృత్యుచ్ఛాయలు నిండిన లోయలో నడుస్తున్నా, ఓ నా ప్రియతమా” అంటూ సాగుతుంది ఆ గీతం.

అప్పుడతడు ఆమెను చూశాడు. అందరూ ఆమెనే చూశారు. ఎందుకంటే సోలోలను ఆమె అద్భుతంగా పాడుతుంది.

“ఏ దుష్టశక్తికీ వెరవను నేను” అంటూ చరణం.

నిజంగా ఆమె భయం లేకుండా అతణ్ని ప్రేమించింది. అతనికోసమే పాడింది. అతని విశాలమైన కళ్లకోసం, పసిమి నిండిన అతని చర్మం కోసం, అందమైన అతని చెక్కిలి కోసం పాడింది. జోసెఫ్ అనే మనిషిని సృష్టించిన సృష్టికర్త కోసం పాడింది. చుక్కలు పొదిగిన పాలపుంతలో వీణతీగల్ని బిగించిన ఆకాశం మీద చంద్రుడు బొమ్మలా అడుగులు కదిపిన రాత్రులవి. తన చెవిలో అతడు గుసగుసగా పలికిన వలపు వాక్యలు నిండిన రాత్రులవి. అతని కొంటె మాటలకు ఆమె సిగ్గుపడి కిసుక్కున నవ్వింది. అట్లా నవ్వటం సభ్యతే అనుకున్నదామె.  తాను కేప్ టౌన్లోని ఆరో జోన్ లో ఒక వీధిలో ఉంటున్నాననీ, ఆడపిల్లలు తనంటే పడిచస్తారనీ చెప్పాడతడు. మోలీ, మియెనా, సోఫియాల గురించీ, స్కూలుటీచరుగా పని చేస్తూ ఎప్పుడూ ఇంగ్లిష్ లోనే మాట్లాడే చార్మేన్ అనే ఆవిడ గురించీ అతని ద్వారానే తెలిసిందామెకు. కానీ తనకు మాత్రం తెస్లర్స్ డాల్ మీదనే ప్రేమ కలిగిందని అన్నాడు జోసెఫ్. అతణ్ని నమ్మాలా వద్దా అన్నది ఆమె నిశ్చయించుకోలేక పోయింది. మబ్బు వెనకాల చంద్రుని నడకతో పాటు యవ్వన సంపదను కనుగొన్నాడతడు.

ఆ తర్వాత కేప్ టౌన్ కు వెళ్లే రైలు తాలూకు కీచుశబ్దం. ఎంత పెద్ద శబ్దమంటే అది తన కుటుంబం తెలిపిన నిరసనను ముంచేసింది. తన తండ్రి ఉగ్రరూపం దాల్చడం, తెస్లర్ డాల్ చర్చిలోని అవివాహితులైన నన్స్ విసిరే మర్మపూరిత వీక్షణాలు. తన పారవశ్యాన్నీ, వెర్రి ఆవేశాన్నీ ముంచేసేటంత శబ్దం చేస్తూ రైలు. లక్షలకొద్దీ విద్యుద్దీపాల వెల్తురులో వేలకొద్దీ కార్లు తిరుగుతూ చేసే శబ్దంలో మునిగిపోయి తబ్బిబ్బవటం. కేప్ టౌన్ కు ప్రత్యేకం అయిన ఉత్సవ సాయంత్రాలు నిండిన వేసవి కాలం. ఆరో జోన్ లోని చిన్న గదిలో తనివి తీరని వ్యామోహం నిండిన ప్రేమ. నాలుగు తెల్లని గోడలూ, కిర్రుమనే ఒక పాత కుర్చీ, “ఈ యింటికి మా దీవెనలు” అంటూ గొణుగుతున్నట్టున్న గోడల అంచుల్లోని కార్డ్ బోర్డ్ పట్టీ.

ఆ తర్వాత అతడు ఆలస్యంగా ఇంటికి రావటం. అప్పుడప్పడు మరీ ఆలస్యంగా రావటం. కొన్నిసార్లు అసలే రాకపోవటం. రోజురోజుకూ అతని మోహం తగ్గుతూ ఇతర అమ్మాయిల పేర్లను గొణుక్కోవటం. మోలీ, మియెనా, సోఫియా, చార్మేన్. అతడు తననుండి జారిపోతున్నాడనే ఎరుక అసహాయతలోకి తోస్తూ , మరింత వడివడిగా వేగాన్ని బాగా పెంచుతూ…

“నేను నింద మోపటం లేదు. కేవలం విన్నానని అంటున్నానంతే”

“అప్పుడప్పుడు రాత్రుళ్లు నువ్వెందుకు సినిమాకు పోవు?”

మరియా ప్రియుడు జోసెఫ్ కోసం వెతుకుతున్నాడు.

జోసెఫ్ కోసం నిఘా. జోసెఫ్ కోసం వెతుకులాట. జోసెఫ్ ను పొడవటం కోసం ప్రయత్నాలు. జోసెఫ్. జోసెఫ్. జోసెఫ్. మోలీ. మియెనా. సోఫియా. పేర్లు, పేర్లు, పేర్లు. పుకార్ల మీద పుకార్లు. ఏకపక్ష వాంఛ. సినిమాకు వెళ్లరాదూ. సినిమాకు పోయి ఏం చూడాలి? ఎందుకు చూడాలి? ఎప్పుడు చూడాలి? ఎక్కడ చూడాలి?

వరుసగా వారం రోజుల పాటు అతడు రాకపోయే సరికి అతణ్ని వెతకాలని గట్టి నిర్ణయం చేసుకుంది. వర్షంలో నడిచివెళ్లి, ఆ మర్యాద లేని సోలీ గాడి ఫిష్ అండ్ చిప్స్ దుకాణంలో నిలబడాలని నిశ్చయించుకుంది. షో అయిపోయే దాకా వేచి చూడాలి.

కిటికీ అద్దాల మీద అప్పటి దాకా విసురుగా కొట్టిన వాన ఆగిపోయింది. కేవలం చర్మాన్ని మాత్రమే కొద్దిగా తడిపే ముసురు మొదలైంది. ఎడతెరిపి లేకుండా. అంతం లేకుండా. ప్రతి రూపాన్నీ, దృశ్యాన్నీ ముసురు తాలూకు సన్నని పొరతో నల్లని దిగులుతో కప్పేస్తూ. ఒక నియాన్ లైటు వణుకుతూ, రోదిస్తూ మూర్ఛరోగి లాగా వెలుగుతూ ఆరిపోతోంది. అలసిపోయిన సోలీ కౌంటరు మీదున్న చవకబారు గడియారం వైపు క్షణం పాటు చూపును విసిరాడు.

“పదిన్నర అయింది. సినిమా షో నుండి జనం బయటికి వస్తారిక”

ముసురు తాలూకు మసకపొర లోంచి సియెనా తదేక దృష్టితో చూసింది. సినిమా హాలు ప్రాంగణంలో ఏ మాత్రం మనుషుల అలికిడి లేదు.

“జనం బయటికి వచ్చే సమయమైంది” అంటూ షో తర్వాత తన దుకాణాన్ని ముంచెత్తే కస్టమర్ల తాకిడిని తట్టుకోవటానికి సన్నద్ధుడయ్యాడు సోలీ.

“ఇవ్వాళ్ల జనం బయటకు రావటం లేటయింది” అన్నాడు సోలీ.

“అవుననుకుంటా” అన్నది సియెనా.

సోలీ తన కళ్లచుట్టూ కారుతున్న చెమటను తుడుచుకుని, శుభ్రంగా నిరాడంబరంగా వున్న ఆమె శరీరాన్ని పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం అలిసినట్టుంది కాని కాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సినిమా హాలు నుండి చాలా జనం ఆవరణలోకి వచ్చాక, ఆఖర్న ఒకరిద్దరు చలిలో వణుకుతూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. బయట ఈదురు గాలులు వీస్తూ అంతా తడితడిగా వుంది.

“మీ ఆయననున్నాడా సినిమా థియేటర్లో?”

ఖాకీ యూనిఫాంలో వున్న ఒక వ్యక్తి థియేటర్ గేటును తెరవడానికి అవస్థ పడుతుంటే ఆమె అతణ్నే పరీక్షగా చూస్తోంది.

“మేడం, మీ ఆయనున్నాడా లోపల?”

లోపలి జనమంతా టాకీసు కాంపౌండులోకి వచ్చారు. గేటు తెరిచి జనాన్ని బయటికి  వదలటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ యూనిఫాంలోని మనిషి .  తుపుక్కున ఊసినట్టు, వాంతి చేసుకున్నట్టు జనం బయటికి రాబోతున్నారు.

“థియేటర్లో మీ ఆయనున్నాడా?”

జవాబు లేదు.

“చావు” అన్నాడు సోలీ.

వాళ్లంతా ఇప్పుడు బయటికొస్తారు. జోసెఫ్ కూడా వస్తాడు. ఆదరబాదరాగా సోలీకి కృతజ్ఞతలు చెప్తూ ఆమె తలుపు వైపు పరుగెత్తింది.

“తలుపును మూసెయ్”

ఆమె దేన్నీ వినే స్థితిలో లేదు. ముసురు ఆగిపోయింది. నిర్జనమైన వీధిలో, టాకీసులోని ఖాళీ ఆవరణలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. తన ఖాళీ హృదయంలో కూడా అదే నిశ్శబ్దం. థియేటర్ ఎక్సిట్ తలుపు ముందున్న మెట్లలో చివరిమెట్టు మీద ఆశాభావంతో నిల్చుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూండగా.

అప్పుడు నవ్వుకుంటూ, తోసుకుంటూ ఒకరి వెంట ఒకరు వచ్చారు. ఆమె వాళ్ల ముఖాలను అత్యంత తీక్షణంగా పరిశీలించింది కానీ ఆ ముఖాలు చాలా వేగంగా కదిలిపోయాయి. నవ్వుతూ, తుళ్లుతూ, బిగ్గరగా అరుస్తూ…వెడల్పైన కన్నులతో, పసిమి వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, బలమైన చెక్కిలి ఎముకల్తో నల్లనివాళ్లు, గోధుమరంగువాళ్లు, తెల్లనివాళ్లు, పసుపుపచ్చని వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, నవ్వే కళ్లతో, ఎంతో ఆహ్లాదంగా, ఎగిరెగిరి పడుతూ. కానీ వాళ్లలో జోసెఫ్ లేడు. వేగంగా కొట్టుకుంటున్న తన గుండె వెయ్యి ముక్కలవుతుందా అనిపించిందామెకు. జోసెఫ్ అసలే కనపడకపోతే? ఎవరెవరి ముఖాలో కనిపిస్తున్నాయి ఆమెకు. వాటిలో సోలీ ముఖం కూడా వుంది. నల్లని ముఖాల, గోధుమరంగు ముఖాల సముద్రంలో చిక్కని నీలికళ్లూ, చక్కని తెల్ల గెడ్డమూ ఉన్న ముఖం కోసం పిచ్చిగా వెతుకుతూ…మళ్లీ సోలీ ముఖం కనపడుతోందేమిటి! యాభై ముఖాల్ని చూసినా అందులో జోసెఫ్ లేడు. తనకు తెలిసిన పెద్ద చెక్కిలివాడి కోసం వెతుకుతూ ఆమె. సోలీ, మోలీ, మియెనా, చార్మేన్, ఎన్నెన్నో ముఖాలు కదులుతున్నయ్.

ముసురు మళ్లీ మొదలైంది. అప్పుడు ముఖాల్ని కాకుండా షర్ట్లనూ, ఓవర్ కోట్లనూ చూస్తోంది ఆమె. సోలిటేర్ షాపులో బేరం చేసి ఒకటిన్నర పౌండ్లకు తాను కొన్న లేత నీలంరంగు షర్ట్ కోసం, దాని మీది కోటు కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి ఆమె కళ్లు. ఒకటిన్నర పౌండ్లకు వాటిని చేజిక్కించుకోవటం కోసం ఆమె ఎంతో గింజుకుంది. షాపువానితో ప్రాధేయపడింది. తన ఒక వారం రాబడి అది. ఊహల్లో మునుగుతూ జోసెఫ్ ముఖం కోసం వెతుకుతోంది. గుంపు పల్చబడి ఆఖర్న ఒకరిద్దరు మెల్లగా బయటకు వస్తున్నారు. వాచ్ మన్ ఇనుప గేటును మూసేస్తున్నాడు. జోసెఫ్ ను లోపల వేసి మూశారేమో. తనొక్కతే బయట. వాచ్ మన్ లే మిగిలిపోయారు. ఇంకా బలమైన ఇనుప గేట్లు.

“జోసెఫ్ వున్నాడా లోపల? ప్లీజ్ చెప్పండి”

“జోసెఫ్ ఎవరు?”

“జోసెఫ్ ఇంకా లోపలే ఉన్నాడా?”

“జోసెఫా? అతనెవరు?”

వాళ్లు ఆమెను ఆటపట్టిస్తున్నారు. వెనకాల నవ్వుతున్నారు. జోసెఫ్ ను వెతకటంలో ఆమెకు ఆటంకం కలిగిస్తున్నారు.

“జోసెఫ్ లోపలున్నాడు” పిచ్చిదానిలా గట్టిగా కేక వేసిందామె.

“చూడండి మేడమ్, కుంభవర్షం కురుస్తోంది. ఇంటికి వెళ్లండి మీరు”

ఇంటికెళ్లాలా? ఎవరి దగ్గరికి? దేని దగ్గరికి? ఖాళీ గదిలో ఖాళీ పడక మీదికా? “ఈ యింటిని దీవించండి” అని అబద్ధం పలుకుతున్న రోడ్డుమీదికా?

మూల మీద గుంపును చూసిందామె. జోసెఫ్ అక్కడున్నాడేమో అనుకుంది. పరుగెత్తుతూ ప్రతి ముఖంలోకి పరీక్షగా చూస్తోంది. ఓ నా జోసెఫ్. గుంపు వర్షంలో తడుస్తోంది. నడుమ ఇద్దరు భీకరంగా పోట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒకడు జోసెఫ్. మురికి కాలువలోని బురదలో ఒకరి మీద మరొకరు కలియబడుతూ, జారుతూ. తొడుక్కున్న బట్టల్లోంచి బురద కారుతూ, ఆ రెండు శరీరాలు రేఖామాత్రంగా. నీలిరంగు షర్టును తొడుక్కున్న జోసెఫ్ ను గుర్తించిందామె. కళ్లమీంచి కారుతున్న వర్షపు నీటిని తుడుచుకుంటూ జోసెఫ్ ను చూసిందామె. ప్రాణరక్షణ కోసం పోట్లాడుతున్న జోసెఫ్ ను చూసింది. సైడు కాలువలో నిస్సహాయంగా మరొకడిని తన్నుతున్నాడు జోసెఫ్. అంతలోనే పోలీసుల విజిల్. పోలీస్ వ్యాను వచ్చి కీచుమంటూ ఆగిందక్కడ.

“ప్లీజ్ సర్. ఇతనిదేం తప్పు లేదు. మిగతా వాళ్లందరూ పారిపోయారు. ప్లీజ్ సర్. ఇతను జోసెఫ్. ఇతనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదు. బాస్. ప్లీజ్ సర్. ఇతడు నా జోసెఫ్. ప్లీజ్ బాస్.

“పక్కకు తప్పుకో”

“ప్లీజ్ సర్. అసలుదోషి ఇతడు కాదు. వాళ్లంతా పారిపోయారు. నిజం బాస్”

images

ఒంటరిగా మిగిలిందామె. ఒంటరి పడక. ఒంటరి గది.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ గుంపుతో నిండిపోయింది. లోపల మనుషుల తొక్కిసలాట. ఈదురు గాలితో కలిసిన వాన మళ్లీ తలుపునూ, కిటికీల్నీ బాదుతోంది. పొంగిన సైడుకాలువలు తమ మీదికి వస్తున్న మరింత మట్టినీటిని ఇముడ్చుకోలేకపోతున్నాయి. సినిమా తర్వాతి రష్ ను తట్టుకోలేక సోలీ చెమటలు కక్కుతున్నాడు.

ఫిష్షూ చిప్సా? వినెగర్ కలపాలా? ఉప్పు వెయ్యాలా? ఒకటిన్నర పౌండ్లదా? థాంక్యూ. సారీ. ఫిష్ అయిపోయింది. ఐదు నిమిషాలాగాలి. కేవలం చిప్సా? వినెగర్? తొమ్మిది పెన్నీలు. చిన్న చిల్లర.  థాంక్యూ. సారీ. ఫిష్ లేదు. ఐదు నిమిషాలాగండి. చిప్సా? తొమ్మిది పెన్నీలదా? థాంక్యూ. సోలీ ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగి, చేపముక్కల్ని పైవి కిందకూ కిందవి పైకీ తారుమారు చేశాడు.

“బయట ఏం గొడవ?”

“సినిమా కోసం వచ్చాను సోలీ”

“జాగా లేదు. బయటికి వెళ్లాలి”

“సినిమా కోసమని చెప్పానుగా”

“పోలీసోళ్లేం చేశారు? సారీ, ఫిష్ లేదు సార్. ఐదు నిమిషాలాగండి. పోలీసోళ్లేం చేశారు?”

“భోరున కురిసే వానలో భయంకరమైన పోట్లాట”

“జీసస్! వర్షంలోనా?”

“ఔను”

“పోట్లాడుకున్నదెవరు?”

“జోసెఫూ ఇంకొకడూ”

“జోసెఫా?”

“ఔను. అరుండేల్ వీధిలోని వాడు”

“అతడా. ఆ జోసెఫ్ నాకు తెలుసు. ఎప్పుడూ ఎవరితోనో తంటా పడతాడు. వాడి బతుకెప్పుడో రోడ్డు పాలైంది”

“అవును వాడే”

“ఇంకొకడెవడు?”

“తెలీదు”

“పోలీసులు పట్టుకున్నారా?”

“జోసెఫ్ ను పట్టుకున్నారు”

“ఎందుకు పోట్లాడుకున్నారు? ఫిష్షా? ఒక్క నిమిషంలో ఇస్తాను సార్”

“ఎవరో అమ్మాయి గురించి”

“ఎవరామె”

“పటేల్ కంపెనీలో పన్చేసే మియెనా తెలుసు కదా. ఇప్పుడామెతో వ్యవహారం నడుస్తోంది. ఆమె ప్రియుడు పట్టుకున్నాడు వీళ్లను”

“సినిమాలోనా?”

“ఔను”

సోలీ బిగ్గరగా, గుంభనంగా నవ్వాడు.

“పోలీసుల ముందు ఏడ్చిన ఆమెను చూశావా?”

“ఎవరామె?”

“పోలీసుల దగ్గర ఏడ్చింది చూడు, ఆమె”

“ఆమె జోసెఫ్ ప్రియురాలంటున్నారు”

“జోసెఫ్ కు ఎప్పుడూ బోలెడు మంది ప్రియురాళ్లుంటారు” ఫి-ష్ త-య్యా-ర్. మీకు రెండు ముక్కలా సార్. ఒకటిన్నర పౌండ్లదా. చిల్లర ప్రాబ్లెం. ఫిష్షూ చిప్సా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ. కేవలం ఫిష్షేనా? వినెగర్ వద్దా? ఉప్పు? తొమ్మిది పెన్నీలదా? చిల్లర ప్రాబ్లెం. థాంక్యూ.

“ఆ స్త్రీ గురించి చెప్పు”

“ఆమె పోలీసుల ముందు ఏడ్చిందంటున్నారు”

“ఓహ్, జోసెఫ్ కు బోలెడు మంది ప్రియురాళ్లు”

“ఈమె అతనితో కలిసి బతుకుతోంది”

“ఎట్లా వుంటుందావిడ? ఫిష్ కావాలా సర్?”

“ఔను, ఆమె కాళ్లు చాలా బాగుంటాయి”

“ఓహో” అన్నాడు సోలీ. “ఎవరది? తలుపు మూయండి వెంటనే” అన్నాడు మళ్లీ.

సియెనా లోపలికి వచ్చింది. క్షణం పాటు నిశ్శబ్దం. తర్వాత గుసగుసలు, గోల.

ఎవరో చెవిలో గుసగుసగా అడిగితే ఔనన్నట్టు తల వూపాడు సోలీ. “ఈవిడ ఇప్పటిదాకా ఇక్కడే నిల్చుని ఎదురు చూసింది. అతనికోసం కాదనుకుంటా” అన్నాడు మళ్లీ.

జీన్స్ లో వున్న ఒక అమ్మాయి కిసుక్కున నవ్వింది.

“ఫిష్షూ చిప్సుకు ఒకటిన్నర పౌండ్లు మేడం”

“ఒకప్పుడు ఒకటింపావు పౌండ్లే కాదా”

“అది బోర్ యుద్ధంకన్న ముందు మేడం. ఇప్పుడు చేపల ధర పెరిగింది. బంగాళా దుంపల ధర పెరిగింది. అయినా ధర పెంచొద్దంటారా?”

“అవును, ఎందుకు పెంచాలి?”

“ఓహ్, చావు. నెక్స్ట్ ప్లీజ్”

“ఔను. మాకు చావే గతి సోలీ”

“క్షమించండి మేడం”. సియెనా వైపు తిరిగి “ఫిష్షూ చిప్సూ కావాలా? డబ్బు లేకపోయినా

ఫరవా లేదు. ఉచితంగా యిస్తాను”

“థాంక్యూ బాస్”

జనం బయటికి పోతుంటే వర్షం భోరున కురవసాగింది. సోలీ డ్రాయరు లాగి డబ్బును లెక్క పెట్టుకున్నాడు. వీధిలో నీటి పాయలు జలాశ్వాల్లా దౌడు తీస్తున్నాయి. పేవ్మెంటు మీదికీ డ్రెయినేజీ రంధ్రాల్లోకీ వాననీరు ఉధృతంగా పోతోంది. భవనాల పైనుండి చిన్నచిన్న జలపాతాలు దూకుతున్నయ్. ఎడతెగని ప్రవాహాలు. మసకబారిన వీధిదీపాలు. ఫిష్షూ చిప్సూ కట్టివున్న న్యూస్ పేపర్ను నీరసంగా పట్టుకుంది సియెనా.

“వర్షం ఆగేదాకా నువ్విక్కడ ఉండొచ్చు” అన్నాడు సోలీ.

కన్నీరు నిండిన కళ్లతో పైకి చూసింది సియెనా. తన పచ్చని పళ్లు బయటపడేలా నవ్వాడు సోలీ. “ఏం ఫరవా లేదు”

ఒక్క క్షణం పాటు ఆమె ముఖం మీద చిన్న నవ్వు మెరిసింది.

“ఏం ఫరవా లేదు నాక్కూడా” ఆమె కిందికి చూసి ఒక్క క్షణం సందేహించింది. తర్వాత తలుపు తీయటానికి అవస్థ పడింది. పెద్ద శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. ఊళ వేస్తూ ఉత్తరదిక్కు నుండి కొడుతున్న వాన సోలీస్ ప్యాలెస్ లోకి వచ్చింది.

“తలుపు మూయ్” అన్నాడు సోలీ నవ్వుతూ.

“థాంక్యూ బాస్” అని వణుక్కుంటూ వర్షంలోకి నడిచిందామె.

***

 

 

 

 

 

 

మీ మాటలు

*