ఒక జన్మాంతర ముక్తి కోసం…

మామిడి హరికృష్ణ

1. నేనొక నిరంతర తపస్విని
జన్మాంతరాల నుంచి
ఒకానొక విముక్తి కోసం
మహోన్నత మోక్షం కోసం
అమందానంద నిర్వాణం కోసం
నిత్యానంత కైవల్యం కోసం
తపస్సును చేస్తూనే ఉన్నాను
2. నిద్రానిద్ర సంగమ వేళ
దిగంతాల అంచుల కడ
సంజె కెంజాయల వింజామరలు వీస్తున్న ఎడ
నువ్వు ప్రత్యక్షమయ్యావు

3. నువ్వు దగ్గరైన క్షణం

నా కన్నుల నిండా
నీ రూపాన్నినిక్షిప్తం చేసుకుంటాను
నీ చేష్టలని గుండెల్లో ముద్రించుకుంటాను
నీ నవ్వులని పువ్వులుగా పరుచుకుంటాను
నీ చూపులని వెన్నెల వెలుగులుగా మార్చుకుంటాను
నీ మాటలని కోయిల పాటలుగా మలచుకుంటాను
నీ సామీప్యాన్ని
పంట పొలం మీదుగా వీచిన పైరగాలిలా స్పర్శిస్తాను
నీ సాన్నిహిత్యాన్ని ఉగాది ఉత్సవంగా దర్శిస్తాను
scan0068
4. నిన్ను
ఆకాశంలోంచి  దిగివచ్చిన రతీదేవివని కీర్తిస్తాను
భూమిని చీల్చుకుని వచ్చిన Venusవని ఊహిస్తాను
అగ్ని జ్వాలలలోంచి ఎగసి వచ్చిన Aphroditeవని తలుస్తాను
జలపాతం నుంచి ప్రవహించిన mermaidవని మరులుగొంటాను
గాలి ద్వీపం నుంచి ఎగిరొచ్చిన Scarlett వని మోహిస్తాను
మనో లోకం సృష్టించిన వరూధినివని తపిస్తాను
స్త్రీత్వం- స్త్రీ తత్త్వం కలబోసి నిలిచిన లాలసవని జపిస్తాను
7th Element అంతిమ ఆకారమని భ్రమిస్తాను
5. నీ సాహచర్యపు మత్తులో
నేనింకా ఓలలాడుతుండగానే
నీ హృదయాన్ని చేతుల్లోకి ఇముడ్చుకుని
మాగన్ను నిద్రలో తేలియాడుతుండగానే
ప్రాచీన అరమాయిక్ పుస్తకం లోని వాక్యానికి మల్లే
నువ్వు అదృశ్యం అవుతావు
6. నువ్వు దూరమైన మరు నిమిషాన
పంట కోత అనంతర పొలంలా దిగులు పడతాను
నీరంతా ఎండిపోయిన నదిలా బెంగ పడతాను
చందురుడు రాని ఆకాశంలా చిన్నబోతాను
పూలన్నీ రాలిన మల్లె చెట్టులా ముడుచుకు పోతాను
స్వరం మరిచిన సంగీతంలా మూగ పోతాను
సర్వం మరిచిన విరాగిలా మౌనమవుతాను
7. దిక్కు తోచని ఏకాంతంలో
మనో నేత్రం తెరిచి అంతర్యానం ఆరంభిస్తాను
నీ జ్ఞాపకాల గుడిలోకి ప్రవేశించి
తలపుల గంటలను మ్రోగించి
నీ గుర్తుల వాకిలిపై
అనుభూతుల ముగ్గులను అందంగా అల్లుతాను
నీ స్మరణల సరస్సులో అలలుగా తేలుతాను
నీ చరణాల ఉషస్సులో మువ్వనై మ్రోగుతాను
8.నిన్నే తలుచుకుంటూ
నిన్ను మాత్రమే కొలుచుకుంటూ
మళ్ళీ నీ రాక కోసం
తపస్సును మొదలెడతాను
9. నేనొక నిరంతర తపస్విని
జన్మాంతరాల నుంచి
ఒకానొక నీ కోసం
తపస్సును చేస్తూనే ఉన్నాను

–మామిడి హరికృష్ణ

మీ మాటలు

  1. ఓ నిరంతర తపస్వీ ! ఎన్నటికైనా నీ తపస్సు ఫలించేనా ? కవిత హృద్యంగా ఉంది కృష్ణ గారూ …ప్రేమతో జగతి

    • Harikrishna mamidi says:

      థాంక్ యు జగతి .. కవిత మీకు నచ్చినందుకు

  2. మార్మికత్వ మాయలో కొట్టుకుపోతున్న నిరంతర స్వాప్నికుడు హరికృష్ణ వాస్తవ జగత్తులోని కాఠిన్యాన్ని గుర్తిస్తాడా?

  3. Thirupalu says:

    భావ కవుల స్వాప్నిక జగత్తులో ఓలలాడిన స్త్ర్రీత్వం హరికృష్ణ గారి మార్మిక తపస్సులో ప్రత్యక్ష మై ఆయన్ను లాలించి ఊగించి మోహించి మభ్య పెడుతుందేమో!- బుద్దియజ్నమూర్తి గారు.

    • Harikrishna mamidi says:

      మీరు చెప్పింది నిజం తిరుపాలు గారు, ఈ స్థితి నాకు ప్రస్తుతానికి బాగుంది.. జీవితం లోని చెడుని, కాతిన్యాన్నీ , విషాదాన్నీ చూసిన తర్వాతి స్థితి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటె విషాద వాస్తవికతకు పరాకాష్ట సౌందర్యారాధన కదా?

మీ మాటలు

*