వాళ్ల పేరు “ఈ రోజు, ఇప్పుడు” !

 

గాబ్రియేలా మిస్త్రాల్ ( http://en.wikipedia.org/wiki/Gabriela_Mistral ) అసలు పేరు లూసిలా (లూచిలా). ఆమె చిలీ దేశమునకు చెందిన కవయిత్రి. ఆమె జీవిత కాలము 1889 – 1957. ఆమెకు 1945లో నోబెల్ బహుమతి లభించినది. ఆమె చిన్నప్పుడు బడిలో చదువుచుండగా బడి పంతులు నీకు ఇక చదువు రాదు అని ఇంటికి పంపాడట. ఆమె తానే స్వయముగా చదువు నేర్చుకొన్నది. ఒక బడి పంతులమ్మగా పని చేసినది. పెండ్లి ఐన తఱువాత ఆమె భర్త ఎందుకో ఆత్మ హత్య చేసికొన్నాడు. ఆ సంఘటన ఆమె జీవితములో ఒక పెను తుఫాను రేపినది. తాను ఇకమీద నెప్పుడు తల్లి అవజాలననే కొఱత ఆమెను దహించినది. ఏ హృదయములో అగాధమైన శోకము దాగి ఉంటుందో అది కవితకు జన్మస్థానము అవుతుంది ఒక్కొక్కప్పుడు. గాబ్రియెలా అను పేరుతో పద్యములను వ్రాయుటకు ప్రారంభించినది ఆమె. మిస్త్రాల్ అనగా తేమ లేని చలి గాలి. ఆమె కవితా వస్తువు గర్భిణి స్త్రీ, పిల్లలు, పిల్లల లేమి, ఇత్యాదులు. ఆమె కవితలను కొన్ని తెలుగులో ఆంగ్లమునుండి చేసిన నా అనువాదాల రూపముగా మీతో పంచుకొంటున్నాను. ఇందులోని తప్పులన్ని నావే, కాని ఇవి మీ కవితాహృదయాలను తాకితే ఆ ఘనత మిస్త్రాల్‌కు చెందుతుంది. ఆమె విద్యారంగములో చేసిన కృషి మహత్తరమయినది. పన్నెండేళ్లకే బడి ముగించిన ఆమెను స్పానిష్ ప్రొఫెసర్‌గా నియమించారు. ఆమెకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ, తన యావజ్జీవితాన్ని వారి సంక్షేమముకోసము అంకితము చేసినది. పసి పిల్లలను గురించి ఆమె నాడు చెప్పిన పలుకులు నేటికి కూడ స్మరణీయమే
మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మన మెన్నో తప్పులు చేస్తాము. కాని వాటిలో అతి ఘోరమైన నేరము పిల్లలను నిర్లక్ష్యము చేసి వదలి వేయడము, ఎందుకంటే పిల్లలు మానవజీవితానికి ఊట. ఎన్నో కార్యాలలో మనము తాత్సారము చూపవచ్చును. కాని పిల్లల విషయములో వాయిదా వేయడము తప్పు. బాల్యములో వాళ్ల శరీరము ఎదుగుతుంది, రక్తమాంసాలు నిండుకొంటాయి, వారి మేధస్సు పెరుగుతుంది. వాళ్లకు రేపుఅని మనము బదులు చెప్పరాదు. వాళ్ల పేరు ఈ రోజు, ఇప్పుడు” “.

mistral

1)  నటన మాడు టెటులో – Those Who Do Not Dance – Women in Praise of the Sacred, p 214, ed. Jane Hirshfield, Harper Perennial, New York, 1995.

 

అడిగె నామె యడిగె – ఒక

కుంటి పిల్ల అడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

నటన మాడు మురిసి

 

అడిగె నామె యడిగె – ఒక

చిన్న పిల్ల యడిగె

పాట పాడు టెటులో –  నే

పాట పాడు టెటులో

పాట పాడు నీదు హృది

పాట పాడు మురిసి

 

ఎండు గడ్డి యడిగె – ఒక

ఎండు గడ్డి యడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

గాలిలోన తేలి

 

అడిగె దైవ మడిగె – నీల

గగనమందు నుండి

ధరకు దిగుట యెటులో – నే

ధరకు దిగుట యెటులో

వెలుగులోన రమ్ము – మాతో

నటన మాడ రమ్ము

 

వనములోన జనులు – నగుచు

నటన మాడి రెల్ల

వెలుగులోన జనులు – పాడి

నటన మాడి రెల్ల

రానివారి హృదయములు

అంధకార మాయె

రానివారి హృదయములు

చేరె ధూళి తోడ

mistral2

2) ఉయ్యాల  – Rocking – Selected Poems on Gabriela Mistral, translated and edited by Doris Dana, p 43, Johns Hopkins Press, Baltimore, 1971.

 

దివ్యమైనది యా సముద్రము

అలల నూపుచునుండె డోలగ

ప్రేమసంద్రపు టలల వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

అటుల నిట్టుల వీచు గాలియు

నూపె నాకుల రేయిలో మెల

ప్రేమపవనపు రొదను వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

నీరవమ్ముగ నిఖిల మంతటి

నూపుచుండెను తండ్రిదేవుడు

అతని జేతులు నను స్పృశించగ

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

3) నెమ్మది – Serenity, p 71 of the reference in (2)

 

నీకోసము పాడగా జగమందున చెడు కనబడదు

కనుమదారి, ముండ్లకంపమృదువగు నీ ఫాలమే

 

నీకోసము పాడగా క్రూరత లేదీ భూమిలోన

సింహములు నక్కలు కరుణార్ద్ర నయనములే

 

4) సౌందర్యానికి దశ ముఖాలు  – Decalogue of the Artist, p37 of the reference in (2)

 

1 – విశ్వముపైన దేవుని నీడ

ఆ అందమునే ప్రేమించు సదా

 

2 – సౌందర్యమ్మో దేవదత్తము

సౌందర్యమ్మో వాని ప్రతీక

సృష్టికర్తను ప్రేమించకున్నను

వాని సృష్టికి నీవే సాక్షి

 

3 – ఇంద్రియాలను ఉద్రేకించుట

కాదెప్పుడుగా కామనీయకము

ఆత్మను విరియగ జేయునదేగా

నిజముగ నౌను సౌందర్యమ్ము

 

4 – భోగముకోసము వలదా యందము

ఆడంబరమున కది ఆమడ దూరము

 

5 – వెదకకు దానిని బజారులోన

వెదకకు దానిని సంతలలోన

అక్కడ లేదు స్వచ్ఛపు టందము

అక్కడ లేదు అచ్చపు టందము

 

6 – అందమ్మనునది సుందరగీతి

హృదయములోన జనియించే నది

హృదయములోన పెఱుగును పూయును

నిన్ను పునీతుని జేయును తథ్యము

 

7 – హృదయములోగల వెతలను ద్రోసి

శాంతిని నింపును సౌందర్యమ్మది

 

8 – తల్లి రక్తమును పంచుకొన్న యా

బిడ్డవోలె గావించుము సృష్టిని

 

9 – అందము కాదొక నల్లమందు, అది

కల్గించదు మత్తును నిద్రను

చైతన్యమును పెంపొందించుచు

పొంగెడు మదిరయె సౌందర్యమ్మది

స్త్రీయే యైనా పురుషుండైనా

కాలేవొక్క కళామూర్తిగ

ఆత్మనిగ్రహము లోపించిన నీవు

 

10 – సృష్టిని గాంచి గర్వపడకుమా

నీవు కన్న యా కలల శిఖరమును

చేరలేదు నీ సృష్టియు యెన్నడు

దేవదేవుని పూర్ణస్వప్నమౌ

ప్రకృతి కన్నను  మిన్నయు కాదు

 

5) పాల చుక్కలు – Prayer, p212 of the reference in (1)

 

మంచు చుక్కల సేకరించెడు కలశములవలె నే

నుంచినా నీ నాదు స్తనముల వాని ముందర పూ-

రించు నాతడు వీని జీవన గంగ ధారల సే-

వించ వత్తురు పాల చుక్కల నా తనూభవులు

 

6) అమ్మ – Birth Poetry, Ed. Charlotte Otten, p 4, Virago Press, London, 1993.

 

ఈ రోజు అమ్మ నన్ను చూడడానికి వచ్చింది, నా పక్కన కూర్చుంది.  మేమిద్దరము అక్కాచెల్లెళ్లవలె మాట్లాడుతున్నాము జరగబోయే విశేషమైన విషయాన్ని గురించి.

 

అలాగే కదలాడే నా కడుపుపైన చేతులనుంచి నా రొమ్ముపైన బట్టలను తొలగించింది. ఆమె కోమలమైన హస్తస్పర్శకు నా హృదయము మెల్లగా తెరచుకొన్నది. నాకు తెలియకుండా అక్కడినుండి ఉన్నట్లుండి చిమ్ముకొంటూ పాలు పొంగింది.

 

సిగ్గు, తొట్రుబాటు నన్ను ముంచెత్తింది.  నా దేహంలోని మార్పులను, అవి రేకిత్తించే భయాన్ని గురించి ఆమెతో మాట్లాడసాగాను.  ఆమె రొమ్ముపైన నా ముఖాన్ని ఉంచాను.  ఆక్షణంలో నేను మళ్లీ నా తల్లికి చిన్న పిల్లనైపోయాను, ఆమె చేతుల్లో ముఖాన్నుంచుకొని దిగులుతో, భయముతో  జీవితము కలిగించిన ఈ కొత్త మలుపును  తలుస్తూ ఏడవడానికి మొదలుపెట్టాను.

 

– జెజ్జాల కృష్ణ మోహన రావు

మీ మాటలు

*