కలని ఆయుధం చేసుకున్న కవి అరసవిల్లి!

arasavilli krishnaకవిత్వానికి కవికి మద్య ఏ తెరలూ లేని మనిషి వుండాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా? ఈ మాటెందుకంటే కవులుగా కథకులుగా చలామణీ అవుతూనే మాస్క్ తీస్తే వాళ్ళలో ఓ అపరిచిత మనిషి దాగుంటాడన్నది చాలా మందిలో చూస్తుంటాం. కానీ అరసవిల్లి కృష్ణ తన కవిత్వానికి జీవితానికి లోపలి మనిషికి బాహ్య రూపానికి తేడాలేని స్వచ్చమైన మానవుడు. దర్జీగా దేహానికి సరిపోయే దుస్తులను మాత్రమే కాకుండా మనసు పొరలను చేదించే అక్షరాలను అల్లిక చేసే కవిగా సామాన్య జీవితం గడుపుతూ సరళమైన పదాల మద్య తన భావోద్వేగాలను “తడి ఆరని నేల” గా మనముందుంచారు.

 

కవిత్వాన్ని తన నెత్తుటిలోకి ఆహ్వానించుకొని దేహమంతా ప్రవహింప చేసుకొని అదే తడితో తన సహజమైన సరళ పద చిత్రాలతో మనముందు సామాజిక వాతావరణాన్ని చిత్రించడంలో అరసవిల్లి తనదైన శైలిని పట్టుకుని చిత్రిక పట్టి మనముందు ఆవిష్కరిస్తాడు. వర్తమాన సమాజంలోని అన్యాయాన్ని సామాజిక సంక్షోభాన్ని రాజ్య నిరంకుశత్వాన్ని ఆగ్రహంగా ఎండగడుతూనే దానిని నినాదప్రాయం కాకుండా హత్తుకునేట్టు చెప్పడం ఈయన కవిత్వంలో చూస్తాం. 2008 నాటినుండి విరసం సభ్యుడిగా వుంటూ “సామాజిక నిబద్ధతతో కవిత్వాన్ని సృజిస్తూన్న అరసవిల్లి ఉద్యమ కవిత్వంలో సౌందర్యాత్మక విలువల్ని ప్రోదిచేస్తూ కవిత్వ భాషలోనూ, అభివ్యక్తిలోనూ, నిర్మాణంలో ఒక విలక్షణతని సాధించారంటారు” ప్రముఖ విమర్శకులు గుడిపాటి.

 

 

మరణం తర్వాత ఓ దీపం

ఆరిపోకుండా వెలుగుతుంది

 

సౌందర్యం కాలుతున్న

వాసన వెంటాడుతుంది

 

ఓ దేశాన్ని వెతుకుతున్నాను

ఒకే దేశం రెండు చేతులుగా కన్పిస్తుంది

ఒక చేతిలో ఆయుధముంది

రెండవ చేతిలో స్వప్నముంది

 

రైతుల ఆత్మహత్యలు, బూటకపు ఎదురుకాల్పులు, సామూహిక మానభంగాలు రాజ్యం చేయిస్తున్న మానభంగాలు దహనకాండలూ ఇలా మన కళ్ళముందు నిత్యమూ జరిగే సామాజిక చిద్రపటాన్ని తన కవితా వస్తువుగా తీసుకొని అరసవిల్లి కృష్ణ కవిత్వ గానం చేస్తున్నారు.

 

మరణం వ్యక్తిగతం కాదు

మరణం సామూహిక విషాదం

 

భూమితో నా సంభాషణ

గర్భంలో దాగిన పిండం వింటుంది

వినడం మట్టి ప్రయాణంలాంటిది.

 

వినడం భూమికి తెలిసినంతగా

అధికారలాలసకు తెలియదు.

 

ఈ దేశంలోని నదులన్నీ

స్త్రీల కన్నీళ్ళతో ప్రవహిస్తున్నాయి

 

స్త్రీలు కదా

సమాధానాలుండవు

ఏనాటికయినా

అడవి మాట్లాడుతుంది

ఆ పదకొండుమందికీ

ఆకాశం వందనం చేస్తుంది.

నిబద్ధతా కవిత్వ ప్రేమా రెండీటిని బాలన్స్ చేసుకుంటున్న కవి అరసవిల్లి!

-కేక్యూబ్ వర్మ

varma

మీ మాటలు

  1. వర్మ గారూ… కృష్ణ గారి పరిచయం బావుంది.

  2. balasudhakarmouli says:

    లోలోపల వొక పరిమళం గుభాలిస్తూ వుంటుంది అరసవిల్లి కృష్ణ కవిత్వంలో… సమాజాన్ని అత్యంత ప్రేమతో చూడడం వలన అరసవిల్లి కృష్ణ గారి కవిత్వానికి ఆ సౌందర్యం వచ్చుంటుంది.

  3. కళా సాగర్ గారు , బాలసుదాకర్ మౌళి గారు ధన్యవాదాలు.

    మరో చిన్న విన్నపం ఈ వ్యాఖ్య ద్వారా. అరసవిల్లి కవితా సంకలనం ‘ తడి ఆరని నేల’ పాలపిట్ట బుక్స్, హైదరాబాద్లో లభ్యమవుతుంది. అరసవిల్లి మొబైల్ నెం. 9247253884.

మీ మాటలు

*