వీలునామా – 31 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మరొక వీడుకోలు

ఇంగ్లండు వదిలి మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నామన్న ఊహతోనే ఎమిలీ ఆరోగ్యం కుదుటపడసాగింది. స్టాన్లీ ఇంగ్లండు వదిలి వెళ్ళేముందు ఒక్కసారి ఎమిలీని తీసికెళ్ళి పెగ్గీకి చూపించాలనుకున్నాడు. తన చేతుల్లో పుట్టిన ఫిలిప్స్ పిల్లలని ఒక్కసారి చూడాలని పెగ్గీ ఎన్నోసార్లు అనుకుంది.

పిల్లలని తీసుకుని ఫిలిప్స్ దంపతులూ, జేన్ స్కాట్లండు బయల్దేరారు. ఎల్సీ ప్రయాణం పైన పెద్దగా ఉత్సాహం చూపించలేదు, పైగా ఇంటిల్లిపాదికీ సరిపడా బట్టలు కుట్టడంలో తల మునకలుగా వుండిపోయింది.

ఫిలిప్స్ కూతుళ్ళిద్దరినీ, జేన్ నీ చాలాకాలం తర్వాత చూసిన పెగ్గీ చాలా సంతోషపడింది. అందరూ నాలుగు రోజులు పెగ్గీ ఇంట్లో సందడిగా గడిపారు.  లిల్లీ అందాన్నీ, పిల్లల ముద్దు ముచ్చట్లూ చూసి పెద్దాయన టాం లౌరీ ఎంతో సంబరపడ్డాడు. జేన్ ని కలిసి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కూడా ఒకరోజు ఎస్టేటు నించి వచ్చాడు. అక్కణ్ణించే జేన్ వెళ్ళిపోవడం ఫ్రాన్సిస్ కే మాత్రం నచ్చలేదు.

“జేన్, ఇంగ్లండు మొత్తానికే వదిలి వెళ్ళేముందు ఒక్కసారైనా ఎస్టేటుకొచ్చి చూడవా? క్రాస్ హాల్ కి రాకుండానే వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో!”ఫ్రాన్సిస్ వేడుకున్నాడు. పల్లెటూర్లో ఎస్టేటుకి ప్రయాణం మాటేత్తగానే అందరికంటే ముంది ఎమిలీ ఎగిరి గంతేసింది.

“క్రాస్ హాల్! పేరు భలే వుందే! అదే మీ ఎస్టేటు పేరా? ఎప్పుడూ ఎల్సీ మాట్లాడుతూ వుంటుంది దాని గురించేనన్న మాట. వెళ్దాం! వెళ్దాం!వెళ్దాం!” గంతులేసింది.

లిల్లీ కూడా,

“నాకూ చూడాలనే వుంది. స్టాన్లీని అడుగుదాం. తప్పక తీసికెళ్తాడు!”  అంది.

నిజానికి జేన్ కి స్కాట్లాండు ప్రయాణమే ఇష్టం లేకపోయినా విధి లేక ఒప్పుకుంది. ఇప్పుడు క్రాస్ హాల్ కి వెళ్ళడమంటే పాత ఙ్ఞాపకాలతో మనసుని మళ్ళీ గాయపర్చుకోవడమేనని తెలుసామెకి. అందుకే వెళ్ళకుండా వుండాలని చాలా ప్రయత్నం చేసింది. కాని ఆమె మాట ఎవరూ వినిపించుకోలేదు. విధిలేక అందరి వెంటా జేన్ కూడా ప్రయాణమైంది.

రైలు దిగగానే ఫ్రాన్సిస్ ఆమె కొరకు పంపిన గుర్రపు బగ్గీలోకెక్కారందరూ. స్టేషను నించి ఎస్టేటు అయిదు మైళ్ళ దూరం. తనకు బాగా అలవాటైన మేనమామ గుర్రపు బగ్గీలో, తను స్వతంత్రంగా తిరిగిన వూళ్ళో, ఇప్పుడు అతిథిలా, దిక్కూ మొక్కూ లేని అనాథలా తిరిగి రావడం జేన్ కి దుర్భరంగా వుంది.

బగ్గీలో ప్రయాణం చేస్తూ వుండగానే ఆమెకి విలియం డాల్జెల్ తన కొత్త భార్యతో సహా కనిపించాడు. ఎస్టేటు వెళ్ళేదారిలోనే వున్న మిస్ థాంసన్ గారి ఇంటి దగ్గర ఆగారు.

మిస్ థాంసన్ ఇంట్లో జేన్ మొదటిసారి ఫ్రాన్సిస్ ఎన్నికల ఏజెంటు సింక్లెయిర్ ని కలిసింది. అయితే ఆ యింట్లో సింక్లెయిర్ కన్నా ఆమెని ఆకర్షించింది మేరీ ఫారెస్టర్, మిస్ థాంసన్ మేన కోడలు. మేరీ ఊరికే కొద్దిరోజులు అత్త ఇంట్లో ఉండిపోదామని వచ్చింది. మిస్ థాంసన్ ఇంట్లో ఉండే మిగతా పిల్లల సమ్రక్షణ లో తల మునకలుగా వుంది.

మేరీ నవ్వు మొహమూ, తెలివితేటలూ, సౌమ్యతా జేన్ కి చాలా నచ్చాయి. శీతాకాలపు ఉదయం సూర్య కాంతిలా ఇల్లంతా పరచుకోని వుంది మేరీ, అనుకుంది జేన్. ఫిలిప్స్ పిల్లలూ, థాంసన్ ఇంట్లో పిల్లలూ క్షణాల్లో కలిసిపోయారు.

వాళ్ళని ఆటల్లో వదిలి మేరీ, జేన్ కబుర్లలో పడ్డారు. అప్పటికే మేరీ జేన్ గురించి ఎంతో విని వుండడం మూలాన కుతూహలంగా చూసింది జేన్ వైపు. వాళ్ళు మాటల్లో వుండగానే జేన్ మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది.

ఈ అమ్మాయి ఇదే వూళ్ళో ఉండేటట్టయితే, బహుశా ఫ్రాన్సిస్ ఈ అమ్మాయినే పెళ్ళాడొచ్చు, అనుకున్నదామె. ఆ ఊహకి ఆధారం లేదు, నిజానికి. అయితే ఆ ఊహ వల్ల తన మనసులో రేగే భావం ఎలాటిదో కూడా జేన్ తేల్చుకోలేకపోయింది.

“జేన్!  మీ గురించి నేనెంత విన్నానో చెప్పలేను. మిమ్మల్ని చూస్తూంటే నాకెంతో ఈర్ష్యగానూ వుంది. మీరు బయట ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారోనని ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురు చూసారంటే నమ్మండి.  స్టాన్లీ ఫిలిప్స్ గారి దగ్గర ఉద్యోగం లో చేరడం విని అందరూ తెరిపిన పడ్డారు.  మీ ఫ్రాన్సిస్ కూడా పదే పదే మిమ్మల్ని తలచుకుని బాధ పడేవాడు. ఆయన కూడా మీకు దొరికిన ఉద్యోగాన్ని చూసి సంతోషపడ్డారు. ఆయనలాటి సున్నిత మనస్కులకి మిమ్మల్ని నడివీథిలోకి నెట్టి ఆస్తి అనుభవించే మొరటుదనం వుండదు కదా?”  అన్నది.

“అవును మేరీ! ఫ్రాన్సిస్ ఎంత మంచి వాడో నాకు బాగా తెలుసు. అయినా, భగవంతుని దయవల్ల నేనూ మా చెల్లాయి ఎల్సీ క్షేమంగానే వున్నాము.”

“జేన్! నిజానికి నాకు మీతో పోల్చి నన్ను చూసుకుంటే సిగ్గుగా వుంటుందండీ! మిమ్మల్ని మీ మామయ్య గారు చదివించి పెంచి పెద్ద చేసినట్టే మమ్మల్నందరినీ మా అత్త మార్గరెట్ థాంసన్ చదివించి పెద్ద చేసింది. అయినా మేమే రకంగానూ పొట్ట పోసుకోలేకుండా ఆమెకి భారంగానే వున్నాము. నాతో సహా నలుగురం ఆడపిల్లలం వున్నాం. అందర్లోకీ చిన్నది గ్రేస్ ఒక్కతే ఇంకా స్కూల్లో వుంది. మిగతా అందరమూ పెద్ద వాళ్ళమే, అయినా ఉద్యోగం సద్యోగం లేకుండ ఇలా బంధువుల దయా ధర్మాలతో వెళ్ళదీస్తున్నాము. మీలాగే నేను బయటెక్కడికైనా వెళ్ళి ఉద్యోగం వెతుక్కుందామనుకున్నాను. అయితే, అత్త ఈ చలికాలం ఇక్కడే తనకి సాయంగా వుండమనీ, కావాలంటే ఆ తర్వాత వెళ్ళమనీ అంది. నాకూ ఏదైనా ఉద్యోగం వెళితే బాగుండు. మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారట కదా? అక్కడ నాకేదైనా ఉద్యోగానికి అవకాశం వుంటే చూస్తారా?” ఆశగా అడిగింది.

“అయితే ఈ చలికాలం అంతా ఈ ఊళ్ళోనే వుంటావన్నమాట!” అంది జేన్ ఆమె ప్రశ్నకి జవాబివ్వకుండా, ఆసక్తిగా.

“అవును. ఇక్కడ అత్తా వాళ్ళింట్లో నాకు బాగా అలవాటే. సింక్లెయిర్ కూడా చాలా సాయంగా వుంటారు.”

“మీ అత్తకి మా ఫ్రాన్సిస్ కూడా చాలా నచ్చినట్టున్నాడు కదూ?”

“ఆ మాటా నిజమే. అసలు మీరిక్కడ వున్నప్పుడే ఆయన కూడా మీతోపాటే వుంటే బాగుండేది కదా?” అంది మేరీ అమాయకంగా. జేన్ నవ్వి, ఆమెని హత్తుకుని, వీడుకోలు చెప్పి క్రాస్ హాల్ ఎస్టేటుకి బయల్దేరింది.

క్రాస్ హాల్ ఎస్టేటులో భవంతీ, గదులూ తాము వున్నప్పుడెలా వుండేవో సరిగ్గా అలాగే వున్నాయి. ఫ్రాన్సిస్ ఏదీ మార్చనీయలేదు. భోజనం చేసి, లిల్లీ, పిల్లలూ విశ్రాంతి తీసుకుంటుంటే, ఫ్రాన్సిస్ స్టాన్లీనీ, జేన్ నీ ఎస్టేటంతా తిప్పి చూపించాడు. ఎస్టేటు పనివాళ్ళ కోసం, పాలేర్ల కోసం తను కట్టించి యిచ్చిన పక్కా యిళ్ళూ, చిన్న చిన్న పొలం ముక్కలూ అన్నీ తిప్పి చూపించాడు. పని వాళ్ళూ, పాలేర్లూ అందరూ జేన్ ని గుర్తుపట్టి పలకరించారు. ఇంట్లో నౌకర్లయితే జేన్ తో అన్ని కబుర్లూ చెప్పించుకొని గానీ వదల్లేదు. ఉద్యోగం ఎలా వుందో ఎల్సీ ఆరోగ్యం ఎలా వుందో, అసలు పెగ్గీ ఇంట్లో ఎలా సర్దుకునారో, అన్ని విషయాలూ మర్చిపోకుండా అడిగి మరీ చెప్పించుకున్నారు.

అందరితో కరువు తీరా మాట్లాడి జేన్ తనకని కేటాయించిన గదిలోకి వెళ్ళింది. పూర్వాశ్రమంలో ఆ గదినే తానూ, చెల్లీ పదిహేనేళ్ళపాటు వాడుకున్నారు. అంతా తను ఉన్నప్పుడు ఎలావుండేదో అలాగే ఉంది. రాత టేబిలూ, పడకా, దిండూ, దుప్పటీ అన్నీ అలాగే సర్దించాడు ఫ్రాన్సిస్. జేన్ మనసంతా ఒకలాటి ఆనంద విషాదాల్తో నిండిపోయింది. తన పూర్వపు గదిని చూసిన ఆనందం, ఇక ఆ గదికీ తనకీ ఋణం తీరిపోతుంది కదా అన్న విషాదమూ అలముకున్నాయామెని.

“పెద్దమ్మాయి గారూ? ఏదైనా కావాలాండీ?” సూసన్ తలుపు తట్టి లోపలికొచ్చింది.

“లేదులే సూసన్,” అనబోయింది జేన్. కానీ ఈ క్షణం లో తనకి ఇంకో మనిషి తోడూంటే బాగుండనిపించింది.

“లోపలికి రా సూసన్. కొంచెం తల దువ్వుతావా? బాగా అలసటగా వుంది,” అంది.

సూసన్ లోపలికొచ్చి దువ్వెన తో జేన్ తల దువ్వసాగింది.

“ఇక్కడంతా మీకు బాగానే వుంది కదా అమ్మాయి గారూ? ఫ్రాన్సిస్ సారయితే మీకే ఇబ్బందీ కలగకూడదని లక్ష సార్లు చెప్పారు. మీ గది కూడా దగ్గరుండి సర్దించారు,” సూసన్ చెప్పింది.

“లేదు సూసన్. అంతా బానే వుంది. ఎల్సీ ఇప్పుడు ఇక్కడ నాతో వున్నట్టయితే నేనసలు ఇక్కణ్ణించి వెళ్ళిపోయానన్న విషయం కూడా మర్చి పోయేదాన్ని. మీరంతా కూడా హాయిగా బాగున్నారు. ఇహ నేనే దిగులూ లేకుండ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను.”

ఉన్నట్టుండి జేన్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆ ఇంటినీ, ఫ్రాన్సిస్ నీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలేమో అన్న ఆలోచన ఆమెని అతలాకుతలం చేసింది కాసేపు.

     ***

ఆ రాత్రి భోజనాల బల్ల దగ్గర కూడా జేన్ ఏమీ మాట్లాడలేకపోయింది. భోజనాలు ముగిసింతర్వాత ఫిలిప్స్ కుటుంబం నిద్రకి ఉపక్రమించారు. జేన్ లేచి వెళ్ళబోతూండగా

“జేన్, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మార్పులు చేసింతరవాత లైబ్రరీ గది కూడా చూడలేదు. అక్కడ కాసేపు కూర్చుందాం రా! మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానే ఏమో! నీకు నౌక దగ్గరికొచ్చి వీడుకోలు చెప్పే ధైర్యం నాకు లేదు.” ఫ్రాన్సిస్ కూడదీసుకుని అన్నాడు.

మౌనంగా జేన్ అతని వెంట లైబ్రరీ గదిలోకి నడిచింది. ఆ రోజు మేనమామ ఉత్తరాలు ఫ్రాన్సిస్ తో కలిసి చదివిన తర్వాత ఆమె ఆ గది మళ్ళీ చూడలేదు.

ఫ్రాన్సిస్ టేబిల్ సొరుగు తెరిచి కొన్ని కాగితాలూ, కొంచెం డబ్బు పట్టుకొచ్చాడు.

“జేన్! గుర్తుందా? నువ్వు మీ గదిలో వున్న సామానంతా అమ్మేసి ఆ డబ్బు మీకివ్వమని అడిగావు. ఆ సామాను నాకు చాలా ఇష్టం. ఈ ఇంట్లో అదీ ఒక ముఖ్య భాగమనిపిస్తుంది నాకు. అందుకే ఆ సామానంతా నేనే కొనేసాను. మార్కెట్ లో వాటి ధర ఎంతుంటుందో ఖచ్చితంగా లెక్క వేయించాను. ఆ లెఖ్ఖంతా ఈ కాగితాల్లో వుంది. ఇదిగో డబ్బు. ఈ డబ్బు నీదే. ధర్మంగా నీకు ఒక్క కానీ కూడా ఇవ్వడంలేదు నేను. నీ స్వాభిమానం ఎంత విలువైనదో నాకు తెలుసు. ఆస్ట్రేలియా చాలా దూర దేశం. ఈ డబ్బు నీకు పనికొస్తుంది. కాదనకుండా వుంచుకో!” డబ్బూ కాగితాలూ ఆమె చేతిలో పెట్టాడు.

మౌనంగా అవన్నీ అందుకుంది జేన్.

“జేన్, నేను ఎస్టేటులో చేసిన మార్పులు నచ్చాయా? పార్లమెంటులో నేను చేసిన ప్రసంగాలు నచ్చాయా?” ఆశగా అడిగేడు.

గొంతు పెకలని జేన్ మళ్ళీ మౌనంగా తలాడించింది.

“జేన్! ఇవాళ నేనీ స్థితిలో వున్నానంటే దానికి కారణం నువ్వే. నీ ప్రోత్సాహమూ, చేయూతా లేకపోతే నేను ఈ పనుల్లో ఒక్కటి కూడ చేయగలిగే వాణ్ణికాదు.  నన్నొదిలి అంత దూరం వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పుతుంది జేన్? నాకయితే ఎవరో నా ప్రాణాన్ని సగానికి కొసి పట్టుకెళ్తున్నంత బాధగా వుంది!”

“అది మనిద్దరికీ మంచిది ఫ్రాన్సిస్!”

“జేన్! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా నీకా విషయం అర్థమైందనుకుంటాను. ఎప్పుడైనా నీకూ నాలాగె నన్నొదిలి వుండడం బాధగా అనిపిస్తే వెంటనే నాకుత్తరం రాయి. మరుక్షణం నీ ముందు వచ్చి వాలతాను. నీ మాట మీదే నేనీ ఎస్టేటు వ్యవహారాలు తలకెత్తుకున్నాను. నీకంటే ఈ డబ్బూ ఆస్తీ నాకు ముఖ్యం కావు.”

“ఆ సంగతి నాకు తెలుసు ఫ్రాన్సిస్. అందుకే నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ఎస్టేటో, లేదా నేనో, ఏదో ఒకటే నీ జీవితంలో వుండగలిగే విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాం ఇద్దరమూ. ఈ ఎస్టేటూ డబ్బూ, రాజకీయ హోదా వుంటే నువ్వు బడుగు వర్గానికి ఎంతైనా మేలు చేయగలవు. అటువంటప్పుడు మన స్వార్థానికి లొంగి బాధ్యతలనించి పారిపోగలమా? ఆలోచించు!” జేన్ ఆవేదనగా అంది.

“సరే! నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ, ఒక్కసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకోనీ! నిన్న పెగ్గీనీ, పొద్దున మేరీనీ హత్తుకొని వీడుకోలు చెప్పావు. నన్నూ అలాగే చెప్పనీ! నీకోసం ఏదైనా వొదులుకోగలను నేను. నన్ను ఎప్పటికీ వదిలి వెళుతున్నావు జేన్!”

జేన్ మనసు కరిగిపోయింది. అతని దగ్గరగా వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా కౌగలించుకుంది.

“జేన్! ఆ పాపిష్టి వీలునామా మన జీవితాల్లోకి రాకపోయినట్టయితే, మనిద్దరికీ ఈ కౌగిలి శాశ్వతంగా దక్కి వుండేది. ఇప్పుడైనా మించిపోలేదు జేన్! మళ్ళీ ఆలోచించుకో. ప్రేమ లేకపోయాక ఎంత డబ్బూ, ఆస్తీ వుండి ఏం లాభం? ఈ పేద ప్రజల బాగుకోసం నేను నా ప్రేమని ఎందుకు వొదులుకోవాలి?” ప్రాధేయపడ్డాడు ఫ్రాన్సిస్.

“మన జీవితాలూ, ప్రేమలూ వీటన్నిటికంటే సంఘానికి మనం చేయగల మేలు ఎంతో పెద్దది ఫ్రాన్సిస్. ఇంకొన్నాళ్ళు పోతే నీకే ఈ విషయం అర్థమవుతుంది.”

“సరే! ఉత్తరాలు మాత్రం రాస్తూండు. నీ ఉత్తరాల బలంతోనే నేను బ్రతికున్నానని మర్చిపోవద్దు. వుంటా జేన్! ఎక్కడ వున్నా నువు సంతోషంగా క్షేమంగా వుండడమే నాక్కావల్సింది,” ఫ్రాన్సిస్ ఆమె చెక్కిలి నిమిరి వెళ్ళిపోయాడు.

జేన్ ఒంటరిగా ఆ గదిలో నిలబడిపోయింది. ఇదే గదిలో కొన్నాళ్ళ కింద విలియం డాల్జెల్ తో ఇలాగే అన్ని సంబంధాలూ తెంచుకుంది. ఆ రోజు ఇంత బాధా నొప్పీ అనిపించలేదు. తను చేస్తున్న పని సరికాదేమో నన్న అనుమానమే రాలేదు. బహుశా విలియం మనసులో తన పట్ల అంత పెద్ద ప్రేమ ఏదీ లేదన్న విషయం తన అంతరాత్మకి తెలిసి వుండడం వల్ల కాబోలు. ఇవాళ తన నిర్ణయం ఫ్రాన్సిస్ ని ఎంత నొప్పిస్తుందో తన మనసుకి స్పష్టంగా తెలుసు. అందుకే తను తీసుకున్న నిర్ణయం పట్ల తనకే నమ్మకం లేకుండా పోతూంది. తన జీవితంలో తనకి ఎదురైన ఒకే ఒక్క అద్భుతమైన ప్రేమని కాలదన్నుకుంటూందన్న భయం బాధిస్తూంది.

ఒక్క క్షణం ఆమెకి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలో పచార్లు చేస్తూ అద్దంలోకి చూసుకుంది. తనేమీ అద్భుతమైన అందగత్తె కాదు. చదువూ సంస్కారం తప్ప తనదీ అని చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో చిల్లి గవ్వ కూడా లేని మనిషి తను. తనని ప్రేమిస్తున్నానని ఫ్రాన్సిస్ అంటూంటే అది నిజమే అయుండాలి. తన దగ్గర ఏమాశించి అతను అబధ్ధాలాడతాడు? ఆశించడానికి తన దగ్గర ఏముందని? ఫ్రాన్సిస్ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడు. తనే మూర్ఖంగా, అర్థంలేని ఆదర్శాలతో చేతికందిన అదృష్టాన్ని కాలదన్నుకుంటోంది.

కానీ ఫ్రాన్సిస్ మంచి నాయకుడిగా రూపు దిద్దుకుంటున్న మాటా నిజమే. తన మాటను తూచ తప్పకుండా పాటించేంత నమ్మకం అతనికి తనమీద. తన ఆలోచనలూ, ఆశయాలూ అన్నీ అమలులో పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. పైగా తను ఫ్రాన్సిస్ ని పెళ్ళాడితే ఎల్సీ సంగతి? ఇక్కడే వుండి అతనికి దూరంగా వుండడం మాత్రం తనకి అసాధ్యం.

తన ముందున్న రెండు దారుల్లో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక జేన్ ఆ రాత్రంతా మథనపడింది.

తన చేత్తో తనే మూసుకున్న తలుపుల ముందు ఆమె మనసు చాలా సేపు తారట్లాడింది.

      ***

ఆ పైవారమే జేన్, ఎల్సీ, హేరియట్ ఫిలిప్స్, ఫిలిప్స్ కుటుంబాన్నీ, వాళ్ళ ఆశలనీ దిగుళ్ళనీ మోస్తూ వాళ్ళెక్కిన పడవ ఆస్ట్రేలియాకి బయల్దేరింది.

(సశేషం)

మీ మాటలు

*