ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 14 వ భాగం

16

(గత వారం తరువాయి )

14

ఊరు.. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ.. వరంగల్లు.
స్థలం : జనఫథం
తేదీ : ఆగస్ట్‌ 20
సమయం : ఉదయం 10.30 గం.
వేదికపైన ఒక బేనర్‌ ఉంది.. జనసేన పరిచయసభ
వేదికపై నలుగురు వ్యక్తులున్నారు.. నేలపై.. తెల్లని పరుపులపైన.. ఎదురుగా నేలపై తెల్లని జంపుఖానల మీద దాదాపు వందమంది ఆహుతులు..
ఆచార్య డాక్టర్‌ గోపీనాథ్‌. రామం. క్యాథీ.. శివ.
ముందున్న వాళ్ళలో.. దాదాపు అన్ని తెలుగు న్యూస్‌ ఛానళ్ళ బాధ్యులు.. ప్రముఖ దినపత్రికల సంపాదకులు.. నగరంలోని సీనియర్‌ పౌరులు.. పౌరహక్కుల మేధోజీవులు.. యిదివరకు అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ ఐఎఎస్‌, రిటైర్డ్‌ ఐపిఎస్‌, ప్రజాసంఘాల వరిష్ఠ పౌరులు.. భారత దేశాన్ని స్వాతంత్ర సిద్ధిపూర్వం, తర్వాత లోతుగా ఎరిగినవాళ్ళు.. జీవితపు లోలోతులు పూర్తిగా, బాగా తెలిసినవాళ్ళు..,
డాక్టర్‌ గోపీనాథ్‌ ప్రారంభించాడు.. ”మిత్రులారా.. ఒక పెద్ద సామాజిక పెనుమార్పు అనివార్యంగా యధా యధాహి ధర్మస్య.. అనే రీతిలో కాలధర్మానికి అనుగుణంగా కూడా.. ఒక తుఫానువలె, ప్రజాచైతన్యం ఒకటి ఉప్పెనవలె ఉవ్వెత్తున రావలసిన సమయం ఇప్పుడాసన్నమైంది. అరవై సంవత్సరాల పూర్వం ఎంతో విలక్షణమైన స్వాతంత్య్ర సమరం సాగించి సాధించిన స్వేచ్ఛ యిప్పుడు చిన్నా భిన్నమై విచ్చలవిడితనంతో, అరాచకత్వంతో, అవసరానికంటే మించిన అధిక స్వంతత్రతో, హద్దులమీరిన వ్యక్తిస్వేచ్ఛతో రోగగ్రస్తమైపోయి ఉంది. ఏ కోణంలో, ఏ రంగంలో చూచినా బహుముఖంగా, భారత సమాజం భ్రష్టుపట్టి కుళ్ళిపోయి ఉంది. చూచినా, విన్నా జుగుప్స కల్గించే రీతిలో అవినీతి, లంచగొండితనం, బహిరంగ దోపిడీ, గుండాయిజం, మాఫియా కార్యకలాపాలు పెరిగి పెరిగి ఒక సాధారణ పౌరుడెవ్వడూ క్షోభననుభవించకుండా ప్రశాంతంగా జీవించే స్థితిలో లేరు.. ఈ నేపథ్యంలో.. మిత్రులారా.. నిన్న మనం మీడియాలో మనందరం సిగ్గుపడే మంత్రి వీరాంజనేయులు స్కాం గురించి కథనాలను విన్నాం.. చూశాం.. యిటువంటివి కోకొల్లలు. ఈ దుస్థితినుండి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి ఎలా పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ ఈ కూలిపోతున్న వ్యవస్థను పునర్నిర్మించాలన్న ఒక దుఃఖపూర్వక అంతర్జ్వలన నుండి ఈ మన ‘జనసేన’ అవిర్భవించింది.
‘జనసేన’ ఒక రాజకీయ పార్టీ కాదు. దీనికి రాజకీయ అధికారం వద్దు. ఎలక్షన్లలో పోటీచేసి గెలిచి రాజ్యాధికారం చేపట్టాలనే సంకల్పమూ లేదు. ఇది ప్రజలకోసం పుట్టి, ప్రజలతో పెరిగి.. ప్రజలతోనే జీవించి ఉంటూ ప్రజలను రక్షించుకునే పవిత్రకార్యంతో ఎల్లప్పుడూ కొనసాగాలనే ఆదర్శ లక్ష్యంతో ఆవిర్భవిస్తున్న ప్రజావేదిక..’డాక్టర్‌ గోపీనాథ్‌ చాలా సంక్షిప్తంగా. క్లుప్తంగా.. మాట్లాడుకుంటూ పోతున్నాడు.
అక్కడప్పుడు ఒక హృదయ జ్వలనానుభవ వినిమయం జరుగుతోంది.
”మొదట నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్‌ గోపీనాథ్‌. జీవితకాలమంతా ఒక ఫిజీషియన్‌గా, ప్రొఫెసర్‌గా జీవించినవాణ్ణి. వరంగల్లు ప్రజలకు నేను బాగా తెలుసు. యిప్పుడు నా వయస్సు డెబ్బయి రెండేళ్ళు ‘సమాజం ఎలా ఉండాలి… ఎలా ఉంది.’ వంటి ఆరు పుస్తకాలు రాశాను. పార్టీలు ఏవైనా అనేకానేక వ్యక్తిగత కారణాలవల్ల ప్రస్తుత భారతదేశంనిండా కేంద్రంనుండి రాష్ట్రందాకా ముసలికంపు కొడ్తున్న వృద్ధ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. వెంటనే ఈ ముసలివర్గాలను వేదికపైనుండి దింపి సామాజిక రంగాల్లో యువరక్తాన్ని నింపాలని బలంగా నమ్ముతున్నవాణ్ణి. ఐతే అపారమైన అనుభవమున్న ఈ సీనియర్‌ సిటిజన్ల విలువైన సేవలను అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకునేందుకు తగిన నిర్మాణాన్ని చేపడ్తే సమాజం ఎంతో ఆరోగ్యవంతంగా, హుందాగా రూపుదిద్దుకుంటుందని నా విశ్వాసం.. యిప్పుడు.. మిస్టర్‌ రామం..” గోపీనాథ్‌ కూర్చున్నారు.
రామం లేచి నిలబడి రెండు చేతులు జోడించి అందరికీ వినమ్రంగా నమస్కరించి.. ” నాగురించి చాలా క్లుప్తంగా మీకు పరిచయం చేసుకుంటాను..” అని చుట్టూ ఒకసారి కలియజూచి.,
ఆ హాలులో ఉన్న అందరూ ఈ దరిద్రపు కక్షుద్ర, నీచ, స్వార్థ రాజకీయాల్తో విసిగి విసిగిన అలసటలోనుండి ఏదో ఒక కాంతిరేఖవలె తారసపడ్డ ఈ యువకెరటమన్నా ఓ ఆశావహమైన మార్పునూ. చైతన్యాన్నీ, భవిష్యత్తునూ రూపొందిస్తుందేమో అన్న జిజ్ఞాసతో పరిశీలనగా చూస్తూండగా.,
”పెద్దలు.. జీవితాన్నీ, సమాజాన్నీ, ఈ దేశాన్నీ ఎంతో లోతుగా ఎరిగిన విజ్ఞులారా.. నా పేరు రామం. నేను జన్మతః వరంగల్లువాణ్ణి. నా తండ్రి గత సంవత్సరమే పోయాడు. ఆయన మీకందరికీ తెలుసు. జీవితకాలమంతా రీజనల్‌ ఇంజినీరింగు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌గా పనిచేసిన సామాజిక వేత్త డాక్టర్‌ రామనాథం. నేను ఆర్‌.ఇ.సి. వరంగల్లులో డిగ్రీ పూర్తి చేసి, ఐఐటి మద్రాస్‌ నుండి ది హైయ్యర్‌ డిస్టింక్షన్‌లో ఎమ్‌టెక్‌ చేసి.. కాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికై..భారతదేశపు అత్యుత్తమ విద్యావంతులైన యువత విదేశాలపాలైనట్టుగానే డాలర్ల, సుఖాల వ్యామోహంలో అమెరికా వెళ్లి పదకొండు సంవత్సరాలు నివసించివచ్చిన వాణ్ణి. ఐతే ప్రస్తుత భారత, ప్రధానంగా తెలుగు సమాజంలో..ఉంటే పుస్తకాల పురుగులు, లేకుంటే దిక్కుమాలిన వెధవలుగా తయారౌతున్న ఒక చిత్రమైన స్థితినుండి … రాజకీయాలంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒక అంటరాని కలుషితరంగమని దూరంగా ఉంచుతున్న వర్తమానం నుండి.. నాన్న రాసిన అనేక పుస్తకాలను విపులంగా అమెరికా వెళ్లిన తర్వాతే అధ్యయనం చేసి.. చేసిన తప్పును తెలుసుకుని, చెంపలేసుకుని.. ఆలస్యంగానైనా.. ఈ పవిత్ర భారతదేశ పౌరునిగా నా బాధ్యతలను మదింపు చేసుకుని చాలా స్పష్టమైన లక్ష్యాలతో, ప్రణాళికతో అవినీతి నిర్మూలనకోసం, విలువల పునఃప్రతిష్టకోసం రంగప్రవేశం చేస్తున్నవాణ్ణి..”
అంతా నిశ్శబ్దం. వింటున్నారందరూ ఆసక్తిగా.. ఐతే ఎంతోగాఢమైన చింతనగల ఆ మేధోజీవులెవరికీ యింకా రామం గురించిన విలక్షణత ఏమీ కనబడలేదు.
”ప్రవేశం చాలా ఆలస్యంగానే జరుగుతోంది. పోల్చుకోవడం సరికాదేమోగాని.. గాంధీ తన నలభై ఆరవ సంవత్సరంలో ప్రజాఉద్యమంలోకి ప్రవేశించాడు. నెహ్రూ 32 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి దూకారు. మావో ముప్పయ్యయిందేడ్ల తర్వాత, నెల్సన్‌ మండేలా నలభై సంవత్సరాల వయసులో ప్రజాజీవితంలోకి వచ్చారు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా సరియైన సమయంలోనే నేను మీ అందరి ముందుకు వస్తున్నాని అనుకుంటున్నాను.”
”మిత్రులారా.. బ్రిటిష్‌ పాలకుల కబందహస్తాలనుండి విముక్తమైన భారతదేశం స్వాతంత్య్రానంతరం స్వదేశీయుల నీచరాజకీయాల్లో కూరుకుపోయి పరాయిపాలకులకంటే అతి భయంకరంగా దోపిడీ చేయబడ్తోంది. నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయాయి. లంచగొండితనం, అవినీతి చాలా బహిరంగంగా ఒక పౌరహక్కుగా మారి విలయతాండవం చేస్తోంది. క్రమశిక్షణ అనేది అన్ని రంగాల్లో లుప్తమైపోయింది. జవాబుదారితనం అనేది ఎక్కడా, ఎవరిదగ్గరా లేదు. విచ్చలవిడితనం, అతిస్వేచ్ఛ, సంస్కృతి విధ్వంసం, అరాచకత్వం అన్నీ తారాస్థాయికి చేరి పరిహసిస్తున్నాయి. ప్రజలకు కనీస ఉపాధి.. సరియైన ధరలకు సరుకులు, నాణ్యమైన సామాజిక జీవావరణ.. ఇవేవీ లేవు. అంతిమంగా అన్ని రంగాల్లోనూ ఎవరిపైనా ఎవరికీ నియంత్రణలేని, ఎవరికీ పట్టని ఉదాసీన, నిర్లక్ష్య, అసమర్థ వ్యవస్థ విస్తరించి సమాజం నిర్వీర్యమై చచ్చిన పాములా పడి ఉంది.”
చటుక్కున.. అనూహ్యంగా ఆహూతుల్లోనుండి ఎవరో ఆవేశంగా చప్పట్లు చరిచారు. అందరూ ఎవరా అది అని వెనక్కితిరిగి చూచారు. వెనుకవరుసలో ఎవరో ఓ యువకుడు.. బహుశా విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తేమో.
”మిత్రులారా.. సారీ మీ సమయాన్ని తీసుకుంటున్నాను. కాని ఈ మాత్రం వివరణాత్మక పరిచయం అవసరమే అనుకుంటున్నాను. ప్రజల్లో రాజకీయనాయకులంటే విశ్వాసం, పూర్తిగా నశించిపోయింది. రాజకీయమంటే క్విక్‌ మనీమేకింగు యాక్టివిటీగా ముద్రపడింది. ప్రజలసేవకోసమే రాజకీయాలు అన్న స్పృహ అస్సలే లేదు. అందువల్ల మేము మా ప్రాథమిక ధర్మంగా ప్రజలకు మాపై నమ్మకమేర్పడే విధంగా ముందుగా మా వ్యక్తిగత జీవితాలను ఆదర్శంగా జీవించి చూపించదలుచుకున్నాం. దయచేసి విజ్ఞులు ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలను శ్రద్ధగా విని మాకు అవసరమైతే మార్గదర్శనం చేయాలని విన్నవించుకుంటూ.. ఒకటి.. ఇప్పుడు మనందరం కూర్చున్న కుటీరంవంటి నిరాడంబరమైన సౌకర్యాలున్న ఈ ప్రాంగణమే మా వసతి. ఇదే జనసేన కార్యాలయం. కార్యస్థలం. నిరంతరం దీని తలుపులు ప్రజలకోసం తెరిచిఉంటాయి. రెండు.. ఈ క్షణంవరకు మాకున్న సర్వసంపదనూ ఒక ట్రస్టీగా ఏర్పాటుచేసి దాని నిర్వహణలోకి తెస్తున్నాం. యికముందు మాకెవ్వరికీ వ్యక్తిగత ఆస్తులనేవి ఉండవు. మూడు.. జనసేన ఒక రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని ఏవేవో చేస్తామని వాగ్దానాలు చేసి దారితప్పే సంస్థ అసలేకాదు. కాని ప్రజలను చైతన్యవంతులనుచేసి మున్ముందు ‘జనసేన’ ఆమోదం ఉన్నవాళ్లనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకునేస్థాయిలో రాజకీయ పక్షాలను ప్రభావితం చేసి తను ఒక మార్గదర్శక సంస్థగా మాత్రమే భావిప్రభుత్వాలను నడిపిస్తుంది. మిత్రులారా.. యిక్కడ ఒక విషయం ప్రత్యేకంగా మనవి, కాదు గుర్తుచేయాలి. బహుశా అనుకుంటాను ప్రపంచంలోనే ఎవరూ చేయని అద్భుత ప్రయోగాన్ని మన పూర్వీకుడైన గాంధీ చేసి చూపించాడు. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. చేపట్టలేదు. కాని ప్రజలనూ, ప్రభుత్వాలనూ తన నిబద్ధతతో, వ్యక్తిత్వంతో విపరీతంగా ప్రభావితం చేశాడు. ‘జనసేన’ పంథాకూడా సరిగ్గా అదే. ఇప్పుడు మీముందున్న ఈ టీంలో ఎవ్వరుగానీ, మున్ముందు ఎటువంటి సంస్థాగత పదవులను చేపట్టరు. నాల్గు .. ‘జనసేన’కు  హింసమీద నమ్మకంలేదు. ‘అహింస ద్వారానే గాంధీమార్గంలో అన్నీ సాధిస్తుంది. ఐతే ‘భయా’నికి మాత్రమే లొంగే మనిషిని భయపెట్టి పనులు చేయించేందుకు, సరియైన మార్గంలో పెట్టేందుకు వాడు చేస్తున్న తప్పులను ప్రజల సమక్షంలో బహిరంగపరిచి.. సిగ్గుపడేలా, తలవంచుకునేలా చేసి భయపెడ్తుంది. వెంటపడ్తుంది. సరియైన దారిలో పెడ్తుంది. దేనికీ లొంగని మనిషి ప్రజల సమక్షంలో దోషిగా నిలబెట్టబడ్డప్పుడు తప్పకుండా తన తప్పును ఒప్పుకుంటాడనీ, ప్రజలమాట వింటాడనే పరమసత్యాన్ని ‘జనసేన’ పూర్తిగా విశ్వసిస్తో ంది. ఆ సిద్ధాంతంపైననే పనిచేస్తుంది.”
అనూహ్యంగా వెనుకనుండి మళ్ళీ చప్పట్లు వినబడ్డాయి. ఐతే ఈ సారి ఒక వ్యక్తినుండి కాదు. ఐదారుగురు సంతోషాతిరేకాలతో స్పందించారు.
”ఐదు. సరియైన దిశానిర్దేశం జరుగకపోవడం, నైతిక బాధ్యతను వహించి విద్యాసంస్థలు.. అంటే ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాలదాకా ఎవరూ ఈ తరానికి, నైతిక ప్రవర్తన గురించీ, నీతి నియమాల గురించీ, బాధ్యతల గురించీ, చెప్పవలసినంతగా ఏ స్థాయిలోనూ చెప్పకపోవడంవల్ల ఏర్పడ్డ దురదృష్టకర ఖాళీని .. వెంటనే నైతిక విద్యాబోధన ద్వారా ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమస్థాయిలో చేపట్టి విజయవంతం చేయడం. ఈ క్రమంలో యిప్పటికే మనవద్ద సుశిక్షితులైన ఎనమిది వందల ఎనభై ఆరుమంది కార్యకర్తలున్నారు. అరవై నాల్గు జనసేన విభాగాలేర్పడ్డాయి రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమమే జనసేనకు ప్రాణవాయువు. జీవం. జనసేన దీన్ని ఒక బహిరంగ మహోద్యమంగా చేపట్టబోతోంది మున్ముందు.. ఐదు.. ఒక చిన్న పిల్లాడిని నిలబెట్టి ఓ రూపాయి బిళ్లని ఉచితంగా ఇస్తే. ‘ఏమిటిది.. ఎందుకిస్తున్నారు.’ అని ఎంతో ఆత్మాభిమానంతో, రోషంతో ఎదురు ప్రశ్నిస్తాడు. ‘ఊర్కే ఉంచుకో’ అంటే పౌరుషంతో మన రూపాయి బిళ్లను మన ముఖానకొట్టి ”నేను బిచ్చగాణ్ణి” కానని తన ఆత్మగౌరవాణ్ణి ప్రదర్శిస్తాడు. కాని సిగ్గులేని అనేక భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను దండుకోవడంకోసం ప్రజాకర్షక పథకాలను.. పిల్లవానికి ఉచితంగా రూపాయినిచ్చి అవమానించినట్టు ఉచిత కలర్‌ టి.విలు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత నగదు.. ఇలా అనేక ఉచితాలను ఆశచూసి పేద ప్రజలను యాచకులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా మారుస్తున్నాయి. అట్టడుగు జనం ఈ దిక్కుమాలిన నిషావంటి జీవితాల్లో కూరుకుపోయి ప్రభుత్వమే తెచ్చి వాకిట్లోపెట్టి కవ్విస్తూ అమ్ముతున్న మద్యం అలవాటుకు బానిసలై ”హూమన్‌ గార్బేజ్‌” గా మారతున్నారు. కొద్దిగా ఉన్నవాడు ఇంకా ఇంకా సంపాదించుకునేందుకు అనేక అక్రమ మార్గాలద్వారా సాధ్యమౌతుంటే పేదలింకా నిరుపేదలుగా మారుతూ ఒక సన్నని విభజనరేఖ మనుషులను హావ్స్‌ అండ్‌ హ్యావ్‌నాట్స్‌గా వర్గీకరిస్తోంది. ఈ దుస్థితికి తోడుగా కులవ్యవస్థను కూలదోయవలసిన ప్రభుత్వం కులసంఘాలను ప్రోత్సహిస్తూ పాలనను కులాల ప్రాతిప్రదికన వాటాలు వేస్తోంది. మంత్రులకూ వాళ్లు నిర్వహించే శాఖలకు అసలు సంబంధమేలేదు. వెనుకట ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను, అవసరమనిపిస్తే చట్టసభల్లో లేనివాళ్లను పిలిపించి మంత్రులగా నియమించి పరిపాలనకు న్యాయం చేసేవాళ్లు. యిప్పుడు తమ కుల, రాజకీయ నేపథ్యాన్ని బట్టి బహిరంగంగా, నిస్సిగ్గుగా డబ్బును దండిగా దండుకోగలిగే శాఖలను డిమాండ్‌ చేసి లాక్కుని మరీ అనుభవిస్తున్నారు. లక్షలకోట్ల స్కాంలు ఋజువుల్తో సహా బయటపడ్తున్నా ఎవడూ ఎవనిపైన చర్యలే తీసుకోవడంలేదు. ఏమిటీ నిర్వీర్యత.. ఏమిటీ నిష్క్రియాపరత్వం. ఎన్నోసార్లు అసలు ప్రభుత్వాలున్నాయి లేవా అనే సందేహం అరచి ప్రశ్నిస్తోంది. వేలకోట్ల రూపాయల ఖనిజాల అవినీతి, టెలికమ్యూనికేషన్ల అవినీతి, భూకుంభకోణాల అవినీతి, మెడికల్‌ ఇంజినీరింగు కాలేజీల అవినీతి.. ఇలా లెక్కలేనన్ని స్కాంల వెల్లువల్తో దేశం గబ్బుపట్టిపోతోంది. చివరికి ‘రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడౌతాడనే’ విధంగా పూర్తిపతనం జరిగింది. ఐతే మేధావులు, బాధ్యతాయుతమైన పౌరులు కొందరు టి.వి. చర్చల్లో కొట్లాడుకోవడం తప్పితే క్రియాశీలకంగా చేసిన ఉద్దరణ చర్యలేవీలేవు.. ఇప్పుడెలా.?
దేశం వృద్ధ నాయకుల చేతుల్లో ఉంది. బంట్రోతు ఉద్యోగానిక్కూడా కనీస విద్యార్హతలను నిర్ధేశిస్తున్న మనం ఈ రాజకీయ పదవులకు కనీస విద్యార్హతలనెందుకు నిర్ధేశించడంలేదు. రాజకీయాలకు వయోపరిమితులెందుకు లేవు. కదలలేని వాడుకూడా కుర్చీలపై కూర్చుని స్వారీ చేయడమెందుకు?
ఇప్పుడు మనం చుట్టూ ముక్కుపుటాలు పగిలిపోయే దుర్గంధాన్ని భరిస్తూ.. శ్రీశ్రీ అన్నట్టు సందులలో పందులవలె కొనసాగడమా..మనవంటి బుద్ధిజీవులు యికనైనా కొరడా ఝుళిపించి ప్రజల సత్తా ఏమిటో చూపించడమా.. ‘ప్రజలు’ అనే నిర్వచనం యిప్పుడున్న ఈ జనానికి వర్తిస్తుందో లేదో నాకు తెలియదుకాని. ఎందుకంటే నాయకులు, ప్రభుత్వాధికారులు ఏవిధంగా నీతి రీతి తప్పి పశువులకన్నా హీనంగా ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలుకూడా ఎవడు ఏదిస్తే అది తీసుకుని, ఎవనిముందు వాని పాటపాడి, తానతందాన రీతిలో తమ అవిద్యను, అజ్ఞానాన్ని జోడించి అతిగా, స్మార్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా మనచుట్టూ ఓ పెద్ద భూమిపుండులా విస్తరించి ఉంది. ఈ భూమిపుండులో చిక్కుకున్న మేకవలె కదుల్తున్నకొద్దీ యింకా యింకా లోపలికి కూరుకుపోతూ.. చూస్తూండగానే మరణం దగ్గరికి చేరుకుంటోంది.
మిత్రులారా.. యిక్కడున్న మనలో ప్రతివారూ నేనిప్పుడు చెప్పిన సంకక్షుభిత సందర్భం గురించే మథనపడ్తున్నారని నేననుకుంటున్నా.. యిక ఉద్యమిద్దాం.. ఉదాసీనత యిక ఏమాత్రం తగదు. అడుగులు ముందుకు వేద్దాం.. అందుకు మేం నడుంబిగించి సంసిద్దులమై ఉన్నాం. మీరు మాతో చేరి..లేక మమ్మల్ని మీతో కలుపుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుద్దాం.. కొత్త ప్రపంచ ద్వారాలను తెరిచి నూతన చరిత్రను సృష్టిద్దాం.”
రామం ఆగాడు వడగళ్ళవాన ఆగినట్టు..ఒక తుఫాను క్షణకాలం స్తబ్దించినట్టు.. నిశ్శబ్దం.
దాదాపు అందరూ అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. కొందరు యువకులైతే అబ్బా యిన్నాళ్ళకు మాకు ఓ కాంతిరేఖ కనిపిస్తోందన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దీర్ఘమైన చప్నట్లతో పెల్లుబికే ఆవేశాన్ని ప్రదర్శించారు.
”ధన్యవాదాలు మిత్రులారా..” అని రామం కూర్చున్నాడు.
హాలునిండా ఒకరకమైన రిక్తత చోటు చేసుకుంది. అది భూమిలోనుండి పొరలను చీల్చుకుని మొలక ఈ విశాల విశ్వంలోకి తలెత్తుకున్నప్పటి బీభత్స నిశ్శబ్దం.
కొద్ది వ్యవధి తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌.. ” యిప్పుడు మిస్‌ జేమ్స్‌ హెచ్‌. క్యాథీ తనను పరిచయం చేసుకుంటారు.” అన్నారు ముక్తసరిగా.
క్యాథీ లేచి నిలబడి ఒకసారి అందరివంకా వినమ్రంగా చూచింది..మొట్టమొదటిసారిగా రెక్కలను సవరించుకుంటున్న ఎగురబోయే పక్షిలా.
అందరూ ఆమెవంక ఆసక్తిగా చూశారు.. ఆమె విదేశీయురాలు కావడం, ఆ వేదికపై ఆమె ఉండడం వెనుక ఆమె పాత్రపై ఉత్సుకత అందరికీ..వింటున్నారు శ్రద్ధగా.
”పెద్దలందరికీ నమస్కారం..” స్పష్టమైన తెలుగు. ”నా పేరు జేమ్స్‌ హెచ్‌. క్యాథీ. నేను అమెరికన్‌ జాతీయురాలిని. అమెరికాలోనే పుట్టి, అక్కడే పెరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంనుండి 1997లో యూనివర్సిటీ టాపర్‌గా ఎంబిఎ పట్టా పుచ్చుకున్నదాన్ని. స్వతహాగా పరిశ్రమలు నడుపుతూ వ్యాపారంలో ఉన్న వ్యక్తిని నేను. రామంగారితో పదేళ్లక్రితం ఏర్పడ్డ పరిచయం.. స్నేహం.. ఒక వ్యక్తి ఒక మహోన్నత నిర్వచిత లక్ష్యంవైపు నడుస్తున్నపుడు వెంట ఉండడానికి యిష్టపడి.. పాలు పంచుకోవాలని తపించి ఒక అనుచరురాలిగా.. అతనితో ఈ విప్లవాత్మక.. నేను దీన్ని అహింసాయుత విప్లవమనే నిర్వచిస్తున్నాను. ఈ విప్లవాత్మక గమ్యాన్ని చేరేందుకు ఆయన వెంట నీడలా ఉందామని నిశ్చయించుకుని.. మీ భాషను, మీ మహోన్నత సాంస్కృతిక నేపథ్యాన్ని, మీ చరిత్రను, వారసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేసి..ఐచ్చికంగా మీ ముందు నిలబడ్డదాన్ని.. నన్ను మీరు ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తాను..” అని రెండు చేతులనూ జోడించింది వినయంగా.
చప్పట్లు.. ప్రశంసా పూర్వకమైన వ్యక్తీకరణ.
క్యాథీ కూర్చుంది.
తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌ పరిచయం చేస్తూండగా, ముప్పయ్యేళ్ల శివ వేదికపై లేచి నిలబడ్డాడు. చిన్నగా పెరిగిన గడ్డం. సన్నగా నిరాడంబరమైన వేషధారణ, లాల్చీ.. ప్యాంట్‌. కళ్ళద్దాలు. ముఖంపై నిశ్చలమైన స్థిరత్వం.
”నేను శివ. మాస్టర్‌ ఇన్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ.. గుండె ఆపరేషన్లు చేయడం నా వృత్తి. ఐతే హృదయం గురించి తెలిసినవాణ్ణి. ఈ మన వర్తమాన భారత సమాజంలో హృదయంలోపిస్తోంది. దాన్ని పునఃప్రతిష్టించడం కోసం రామంగారి వెంట.. రాముని వెంట హనుమంతునిలా ఉందామని..అంతే..”
చప్పట్లు..
”మిత్రులారా.. ఇప్పుడు మనం ఓ పదిహేను నిముషాలు తేనీటి విరామం తీసుకుని.. మనం గడిపిన ఈ గంటసేపట్లో తెరపైకి తెచ్చిన కొత్త ఆలోచనలను పరస్పరం ఎవరికివారుగా పంచుకుని.. మళ్లీ సమావేశమౌదాం..” అని మైక్‌లో ప్రకటించారు డాక్టర్‌ గోపీనాథ్‌.
అప్పట్నుండీ ఏకబిగిన కొనసాగిన గంభీరత సడలి.. దాదాపు అందరూ లేచి నిలబడి.. ఊపిరి తీసుకుని.. బయటికి వరండాలోకి నడిచారు ఎవరికివారు.
వరండాలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన తేనీటి టేబుల్స్‌.. ప్రక్కనే బిస్కెట్లు.. పళ్ళ ముక్కలు.. కొందరికోసం పళ్ళ రసాలు..ప్రతి టేబుల్‌ దగ్గర వాలంటీర్స్‌.. క్రింద చుట్టూ పచ్చని గడ్డి.. పూలమొక్కలు. అక్కడక్కడ పావురాలు ఎగురుతూ.. మంచి అందమైన ల్యాండ్‌స్కేపింగును ఎవరో మంచి అభిరుచి ఉన్న మనిషి చేయించినట్టుగా.. మొత్తంమీద అంతటా క్రమశిక్షణ నిండిన అదోరకమైన గంభీర వాతావారణం ఆవరించి ఉంది చుట్టూ.
వచ్చిన వ్యక్తులందరూ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని సందర్భాన్ని అర్థవంతంగా ఆలోచించగల మేధోజీవులే. పాజిటివ్‌ అటిట్యూడ్‌తో పరిస్థితులను స్వీకరించడం మనిషికి అత్యంత అవసరమైన సంస్కారం. ఐతే దురదృష్టవశాత్తు వర్తమాన సామాజిక విశ్లేషకుల్లో ఎవనికివాడు ఓ ప్రపంచస్థాయి మేధావిగా భావించుకుంటూ ఎదుటిమనిషిలోని లోపాలను అన్వేషించడమేగాని తానుఎంతవరకు సహనశీలంగా, అంగీకార తత్వాన్ని కలిగి ఉన్నాడో ఆత్మపరీక్ష చేసుకోడు. ఈ తత్వంగలిగి కేవలం మాటలకు, చర్చలకు మాత్రమే పరిమితమయ్యే సూడో మేధావులను ఉద్యమకారులు గుర్తించి వారిని దూరంగా ఉంచడమో, తామే దూరంగా జరుగడమో చేయాలి. లేకుంటే వీరు కర్ణునిలాంటి మహావీరునికి శల్యసారధ్యం వహించినట్టు ఉద్యమహననానికి కారకులౌతారు. రామంకు, క్యాథీకి, డాక్టర్‌ గోపీనాథ్‌కు ఈ సంక్లిష్టమైన సున్నితమైన విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉంది.
”నాకెందుకో.. యిన్నాళ్ళకు ఏదో ఒక ఆశారేఖ కనిపిస్తోంది రామారావుగారూ..” అన్నాడు ప్రముఖ రచయిత, కవీ, నిజాయితీకి మారుపేరైన కాంతారావు తన ప్రక్కనే టీ చప్పరిస్తున్న పౌరహక్కుల నేత రాములుతో
”ఔను.. నాక్కూడా. దానికి సిద్ధాంతరీత్యా రెండు హేతువులున్నాయి. ఇంతవరకూ ఎవడు రాజకీయాల్లోకొచ్చినా అధికారాన్నీ, కుర్చీని ఆశించీ, రాజ్యాధికారం లక్ష్యంగానే వచ్చాడు. వచ్చిన మర్నాటినుండి డబ్బును దోచుకోవడమే వ్యాపకంగా పెట్టుకున్నాడు. వీళ్ళు మాకు అధికారం వద్దంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. కాగా ఈ ఆదర్శ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న రామం..ఇతర వ్యక్తులందరూ స్వంత ఆస్తులనేవీ లేకుండా ప్రజలకోసమే ప్రజల సమక్షంలో పారదర్శకంగా, నిరాడంబరంగా జీవించేందుకు సిద్ధపడి రంగంలోకి దిగుతున్నారు. మనిషి స్వార్ధాన్నీ, సుఖవాంఛలనూ విడనాడితే క్రమంగా ముముకక్షువుగా మారుతాడు. యిది ఎంతో ఆరోగ్యవంతమైన పరిణామం.. చూద్దాం.. దీన్ని సమర్థించడం వెంట ఉండడం, వెంటనడవడం మన బాధ్యత.”
”ఔను.. నాకూ అలాగే అనిపిస్తోంది.”
ఇంతలో రామం, క్యాథీ వాళ్ల దగ్గరకొచ్చారు ఒక్కొక్కరిని పలకరిస్తూ, రామారావు. రాములు కరచాలనాలు చేసి తమను తాము సంక్షిప్తంగా పరిచయం  చేసుకుని.. ”బెస్టాఫ్‌లక్‌ రామం. వుయార్‌ హైలీ హోప్‌ ఫులాఫ్‌ సం బెటర్‌ థింగ్సు టు అక్కర్‌..” అన్నాడు రాములు ప్రసన్నంగా.
”థాంక్యూ సర్‌.. మనం కలిసి నడుద్దాం సర్‌..”
తర్వాత ఒక టి.వి న్యూస్‌ చానల్‌ అధినేత రాజేందర్‌రాజు రామంను పలకరించి.. ”కంగ్రాట్స్‌ రామంగారూ.. బెస్టాఫ్‌ లక్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌..” అంటున్నాడు.
ఇంతలో లోపల్నుండి.. ఎవరో మైక్‌లో అందరినీ తిరిగి తమ తమ సీట్లలోకొచ్చి ఆసీనులు కావాల్సిందిగా అనౌన్స్‌ చేస్తున్నారు.
లోపలికి కదిలారు ఒక్కొక్కరే.
ఇప్పుడు వేదికమీద ఎవరూ లేరు. ఒక్క డాక్టర్‌ గోపీనాథ్‌ మాత్రమే ఒకే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నవాడు లేచి మైక్‌ ముందుకొచ్చి.. ”మిత్రులారా.. మనసులో ఒక ప్రణాళికగా ఉన్న ‘జనసేన’కు సంబంధించిన ఆలోచనలను మీ ముందుంచాం. ఈ శక్తివంతమైన ఊహకు రిహార్సల్‌గా నిన్న.. గూడెం అడవుల్లో భద్రాచలం గోదావరీ పరీవాహప్రాంత గిరిజన, మూలవాసీ సంఘం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఒక ‘నిలతీత’ కార్యక్రమం జరిగింది. దాదాపు ముప్పయి ఏడు లక్షల ప్రపంచబ్యాంకు నిధులను వేయని రెండు రోడ్లను వేసినట్టు, అవి కొట్టుకుపోయినట్టు మంత్రి వీరాంజనేయులు నుండి చీఫ్‌ ఇంజినీర్‌, ఇ.ఇ. ఇత్యాది అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వరకు కుమ్మక్కై పంచుకున్న సత్యాన్ని సోదాహరణంగా ఋజువు చేసి.. అందరినీ కస్టడీలోకి తీసుకునేలా చేసిన సంగతి ఈ రోజు మీడియా ద్వారా మీకందరికీ తెలిసిందే. దీంతో జనంలో అధికారుల్లో, రాజకీయవర్గాల్లో ఒక వణుకు పుట్టింది. ఇది మన తొలి విజయం. ఈ సందర్భంగా మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలను యిక్కడ ఉటంకించడం ప్రధానమని భావిస్తున్నాను. ఏమిటంటే ఒక సామన్య పౌరుణ్ణి ఎక్కడైనా పోలీసులు ఏదో నేరంపై అరెస్ట్‌ చేస్తే అతను తానునిజంగా నిరపరాధినని ఎంత మొత్తుకొని తన వాదనకు ఆధారాలను చూపేందుకు ప్రయత్నించినా పోలీసులు అతని మాటను వినరు. నువ్వు చెప్పదల్చుకున్నదంతా పోలీస్‌స్టేషన్‌ కొచ్చిన తర్వాత అక్కడో లేక కోర్టులోనో చెప్పుకో అని గదమాయిస్తాడు. కాని ఇదే న్యాయాన్ని పెద్దలకూ, రాజకీయులకూ వర్తించకుండా పోలీసులు వాళ్లను వెనకేసుకొస్తున్నారు. ఋజువులను చూపించినా అవి కోర్టులో నిరూపణయ్యేదాకా వారు నిర్దోషులేననే వితండవాదం చేస్తూ కొంత వెసులుబాటు నివ్వడం, ఆలోగా వాళ్ళ లాయర్స్‌ కోర్టుద్వారా బెయిల్‌ తీసుకుని రావడం, ఈలోగా నిందితునికి షరా మామూలుగా గుండెనొప్పి రావడం – ఆస్పత్రిలో చేర్పించడం.. ఇదంతా ఓ డ్రామాగా మారింది. కాబట్టి ఈ కేస్‌లో మంత్రికీ, మిగతా అధికారులకూ జీప్‌ ఎక్కిన మరుక్షణమే గుండెనొప్పులు వస్తాయని ముందే ఊహించి, కస్టడీలోకి తీసుకుంటున్నపుడు ఒక హృద్రోగ నిపుణుణ్నికూడా వెంట సహాయయకునిగా ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తున్నాను.” అని.. ఇది నిజంగా ఒక అపూర్వమైన విజయం.. ఇంటువంటివి మున్ముందు ఎన్నో మనం తప్పకుండా సాధిస్తామనీ, ప్రజల్లో నిప్పువంటి చైతన్యాగ్నిని రగిలించగల్గుతామని విశ్వసిస్తూ.. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు ‘అగ్ని’ వార్తా ఛానల్‌ అధినేత మూర్తిగారిని ఆహుతులనుద్దేశించి తమ ప్రతిస్పందనను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.”
మళ్ళీ నిశ్శబ్దం.. నిశ్శబ్ద గంభీరం.
యాభై ఆరు సంవత్సరాల ద్వారంపూడి కృష్ణమూర్తి.. పాత్రికేయ వర్గాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలను పొందుతున్న.. ఒకప్పటి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు సంపాదకుడు, ప్రస్తుతం ‘అగ్ని’ న్యూస్‌చానెల్‌కు సిఇవో ఐన మూర్తి చాలా నిలకడగా నడచి వేదికపైకి వచ్చి.,
స్థిరమైన గొంతుతో..”మిత్రులారా.. ఈ రోజు ఎంతోసుదినం. ఈ మనుషుల గురించి, ఈ భారత పౌరుల గురించి, ఈ వ్యవస్థ గురించి రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతున్న దుష్ట రాజకీయ వికృత చర్యల గురించీ సీరియస్‌గా ఆలోచిస్తున్న కొద్దిమంది బుద్ధిజీవుల మనోవేదననూ, అసంతృప్తినీ, ప్రేక్షకపాత్ర మాత్రమే వహించక తప్పని అనివార్య పరిస్థితులనూ ఒక అతి ప్రధానమైన సందర్భంగా గుర్తించి ఈ దురవస్థనుండి బయటపడే మార్గాలను అన్వేషించడానికి ఈవిధంగా అంకితభావంతో మనందరం, సమావేశం కావడమే నాకు పరమ ఆనందాన్ని కల్గిస్తోంది. ఇటువంటి ప్రయోజనకరమైన సందర్భాన్ని సృష్టించినందుకు, మనందర్ని యిక్కడకు ఆహ్వానించినందుకు రామంకు క్యాథీకి డాక్టర్‌ గోపినాథ్‌ గారికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్లను అభినందిస్తున్నాను.”
వాతావరణం చాలా గంభీరంగా ఉంది.
”మిత్రులారా.. వ్యాపారమేదైనా దాని సక్సెస్‌ కేవలం రెండు విషయాలపైననే ఆధారపడి ఉంటుంది. అవి..ఒకటి వస్తువు యొక్క గరిష్టమైన నాణ్యత.. అతి తక్కువ ధర. అదేవిధంగా సుదీర్ఘమైన మానవ పరిణామ వికాసాల చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేస్తే తేలే విషయమేమిటంటే.. ఒక మనిషేకాదు. జీవి ఏదైనా అంతిమంగా ”భయా”నికి మాత్రమే లొంగుతుంది. ఏదో ఒక భయం లేనిది మనిషి వినడు. తప్పుచేస్తే అమెరికావాడు విపరీతమైన ఫైనేస్తాడని భయం. ఆరబ్‌ దేశాల్లో తప్పుచేస్తే చేతులుకాళ్లు నరికేస్తారని భయం.. చెప్పినట్టు వినకుంటే తాలిబన్లు ప్రాణాలు తీస్తారని భయం.. ఆలస్యంగా ఆఫీస్‌కు పోతే అబ్సెంటేస్తారనీ, జీతం కట్‌ చేస్తారనీ భయం.. చివరికి ఏ ఇంట్లోనైనా కూడని పని చేస్తే పిల్లలను ‘తండ్రి’ తంతాడని భయం.. ఐతే ఏ భయమూ లేకుండా నిస్సిగ్గుగా, జంకూగొంకూ లేకుండా బహిరంగంగా ఈ దేశఖజానాను, ఈ దేశ భూమిని, భూమిని తవ్వుకుని ఖనిజాలను, అడవులను, బొగ్గును, అప్పులు కూడా చేసి ఆ లక్షలకోట్ల డబ్బును.. తింటూనే,  ఏండ్లకు ఏండ్లుగా ఏళ్ళ పర్యంతం యింకా తినే కార్యక్రమాలను కొనసాగిస్తున్న రంగం..మన భారత రాజకీయ రంగం భ్రష్టుపట్టిపోయింది. ఈ భారత రాజకీయ నాయకులు ఎటువంటి భయమూ, సిగ్గూ లేకుండా ఈ దేశాన్ని తినీతినీ అంతా ఖాళీచేసి యిక దీన్ని ఎవ్వరూ రిపేర్‌ చేయలేని దయనీయస్థితికి తెచ్చిపెట్టారు. యిప్పుడీ దేశం బంగారురంగు అట్టపెట్టెలో ఏమీలేని ఒట్టి ‘డొల్ల’గా మిగిలి ఉంది. వీళ్ళకిప్పుడు..ఉచ్ఛలుపోయించే ఏదో ఒక ‘భయం’ కావాలి – ఆ ‘భయాన్ని’ సృష్టించగల్గితే మనం మన ఆలోచనలు.. మన ప్రయత్నాలు సఫలమైనట్టే..”
రామం చాలా జాగ్రత్తగా వింటున్నాడు మూర్తిగారి ప్రసంగాన్ని. మేనేజ్‌మెంట్‌ సైన్స్‌లో ఒక ప్రిన్స్‌పుల్‌ ఉంది. అది ‘లెటిట్‌ కం ఫ్రం అదర్‌సైడ్‌ ఆల్వేస్‌” అని .. విషయం ఎంత ప్రధానమైందైనా ఎదుటివ్యక్తితో మనం ప్రతిపాదిస్తే దాని విలువ అంతగా ఉండదు. అదే ప్రతిపాదన ఎదుటి వ్యక్తినుండి వస్తే సందర్భం ఉత్తేజకరంగా ఉంటుంది. అందువల్ల ఒక మంచి మేనేజర్‌ ఎప్పుడూ తనకు కావలసిన ప్రతిపాదన ఎదుటివ్యక్తినుండి వచ్చేట్టుగా పరిస్థితులను సృష్టిస్తాడు. బంతిని ఎంత బలంగా గోడకేసి కొడ్తామో అది అంత బలంగా వేగంగా తిరిగొస్తుందనే గ్రహింపుతో నిర్వహనక్రీడను కొనసాగిస్తాడు. అతనికి..సరిగ్గా ఊహించిన విధంగానే విజ్ఞుడైన మూర్తిగారు ప్రతిస్పందిస్తూండడం చాలా ఆనందాన్ని కల్గించింది.
”మిత్రులారా.. భయం అంటే చాలామంది.. కొట్టడం, చంపడం.. లేదా జైల్లోపెట్టడం.. నక్సలైట్లయితే హత్యలు చేసి పేల్చివేయడం.. లాంటి చర్యలతో భయానికి తప్పు నిర్వచనం ఇచ్చారు. ఇన్నాళ్ళూ?. అసలు భయం మనిషిని ప్రజల సమక్షంలో నిలబెట్టి ఋజువుల్తో సహా నిలదీసి దోషిగా ప్రూవ్‌ చేసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంత కిరాతకుడైనా ప్రజలమధ్య దోషిగా నిల్చున్నప్పుడు సిగ్గుతో తలవంచుకుని ‘క్షమ’నో, ‘శిక్ష’నో ఐచ్చికంగా కోరుకుంటాడు. దీనికి సజీవ ఉదాహరణ.. ఈ మధ్య టి.వి. ఛానళ్ళలో తప్పుచేస్తూ రెడ్‌హ్యాండ్‌గా పట్టుబడ్డప్పుడు చెట్టుకు కట్టేసి మహిళలు వాణ్ణి చెప్పుతో కొడ్తూంటే కిక్కురమనకుండా వాడు చెప్పుదెబ్బలు పడ్తున్న నిస్సహాయ దృశ్యాల్నే ఉదాహరణ. నేనీ తప్పు చేస్తే ప్రజలు ఋజువుల్తోసహా నడివీధిలో నన్ను నిలదీస్తారనే భయాన్ని మనం క్రియేట్‌ చేయగల్గితే.. చాలు.. మనం మన లక్ష్యం చేరుతాం. ఇది జరగాలంటే చాలా నిమగ్నతతో సమాచార సేకరణ జరగాలి.. అంకితభావంతో నిస్వార్థంగా పనిచేసే వందల వేలమంది నికార్సయిన, నీతిపరులైన కార్యకర్తలు కావాలి.. ఎటువంటి అధికార వాంఛాలేని నేతృత్వం కావాలి.. అవన్నీ మనకున్నాయి.. కాబట్టి మన ప్రయత్నం తప్పకుండా విజయవంతమౌతుంది.”
వెల్లువలా చప్పట్లు.. హర్షాతిరేకతతో నిండిన ప్రతిస్పందనలు..,
”ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా.. కరడుగట్టి పునాదులు బలపడి దుర్భేద్యంగా మనముందు నిలబడ్డ ఈ అవినీతి దుర్గం యింత సుళువుగా కూలిపోతుందా, నిర్మూలించబడ్తుందా అనే సందేహం మనలో కొందరికి కలగొచ్చు.. అడవి పెద్దదే కాని .. దాన్ని భస్మీపటలం చేయడానికి చిన్న అగ్గిపుల్ల చాలు. ఐతే కొన్ని సత్యాలు ప్రతిపాదనల స్థాయిలో ఉన్నపుడు నమ్మశక్యంగా ఉండవు. కాని ఋజువై కార్యరూపం దాల్చిన తర్వాత ఒక అద్భుతంగా మిగిలిపోతాయి చరిత్రలో.. ఒక ఉదాహరణ చెప్తా.. మొట్టమొదటి 1839లో స్కాటిష్‌క్‌ చెందిన ఒక సాధారణ కుమ్మరి మాక్‌ మిల్లన్‌ బైసికిల్‌ను కనిపెడ్తున్నపుడు.. రెండు చక్రాలతో ఒక యంత్రం నిట్టనిలువుగా పడిపోకుండా నిలబడ్తుందనీ, దానిపై ఒక మనిషి ఎక్కి కూర్చుని ప్రయాణం కూడా చేయవచ్చనీ, కాగా అతివేగంగా ముందుకు దూసుకుపోతుందనీ చెప్పినపుడు అందరూ హేళనగా నవ్వారు. వినే మా అందరి చెవుల్లో పువ్వులు కనిపిస్తున్నాయా అని గేలిచేశారు. పరిహసించారు. ఆ విషయాన్ని .. యిప్పటిక్కూడా మనం ఊహామాత్రంగా దృశ్యిస్తే నమ్మబుద్దికాదు. కాని నిజమైందికదా. ఒక నమ్మశక్యంకాని సత్యం సైకిల్‌గా రూపుదిద్దుకుని థాబ్దాలుగా సామాన్యుని వాహనమై ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తూనే ఉందికదా.. అందువల్ల ఒక ఆవిర్భావస్థితిలో కొన్ని పరమ సత్యాలు విశ్వసనీయంగా అనిపించవు. కాని అవి పరమాతిపరమ సత్యాలుగా ఋజువై చరిత్రలో నిలిచిపోతాయి. మిత్రులారా.. నాకు పూర్తి నమ్మకముంది. రామం ఎంతో దీర్ఘదృష్టితో, నిర్మలమైన హృదయంతో, నిస్వార్థంగా, ఎటువంటి అధికారకాంక్ష లేకుండా చేపట్టిన ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమం తప్పకుండా విజయవంతమౌతుంది. భారత రాజకీయ, సాంఘిక జీవితాల్లో పెనుమార్పును తెస్తుంది. యిప్పుడు మనందరం చేయవలిసింది ఆలోచనలను అమలుకాగల కార్యక్రమాలుగా ట్రాన్స్‌లేట్‌ చేయడం..చేద్దాం ఐకమత్యంతో. నేను నావంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తాననీ, మీ అందరి వెంట నడిచి నా విద్యుక్తధర్మాన్ని నెరవేరుస్తాననీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. జైహింద్‌.. జై జనసేన…”
”జై జనసేన..” హాలు దద్దరిల్లింది.. పదులనుండి వందల సంఖ్యకు కంఠాలు పెరిగి.. చినుకులు సెలయేరుగా మారుతున్నట్టు..,
రామం ఒళ్ళు పులకించింది. శరీరంనిండా రోమాలు నిక్కి నిలబడ్డాయి. మాటలకందని దివ్యానుభూతి ఏదో అతన్లో విద్యుత్‌వలె ప్రవహిస్తోంది.. మౌనంగా ప్రక్కనే ఉన్న క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెకూడా పరవశించిపోతూ నిండుసముద్రంలా నవ్వింది.
”మూర్తిగార్కి ధన్యవాదాలు.. ఒక వరిష్ట పాత్రికేయులుగా ఎంతో దీర్ఘదృష్టితో వర్తమాన సంకక్షుభిత సందర్భాన్ని స్పష్టంగా విప్పిచెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ.. మా వెంట ఉంటానని భరోసా యిస్తూ మన ‘జనసేన’కు ఊపిరినందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇప్పుడు .. ప్రముఖ పౌరహక్కుల నేత.. సమాజంపట్ల ఎంతో బాధ్యతతో జీవిస్తున్న చింతనపరుడు ప్రొఫెసర్‌ రాములుగారు తమ అభిప్రాయాలను మనకు తెలియజేస్తారు.. ”డాక్టర్‌ గోపీనాథ్‌ చెబుతున్నారు మైక్‌లో.
చాలా క్రమశిక్షణ.. అనేకం ఏకమై.. ధారలు ఏరులై.. చినుకులు ప్రవాహమై.. ఒక నిశ్శబ్ద పరివర్తన.. ఆలోచనలు ఆలోచనలుగా మనుషులు వికసిస్తున్న సందర్భమది
చుట్టూ .. అంతా ప్రశాంతంగా ఉంది.

(సశేషం)

మీ మాటలు

 1. అంతర్జ్వలన నుండి జనసేన ఆవిర్భావం ,… జనసేన రాజకీయ పార్టీ కాదు ,.ఆదర్శ లక్ష్యం తో కొనసాగే ప్రజా వేదిక అంటూ రచయిత ఒక ఆశావహ దృక్పధం తో సీరియల్ ఆసాంతం చదివించేలా సాగుతున్నది .భవిష్యత్ ఎలా వుంటుందో ?!

 2. DrPBDVPrasad says:

  కాలనాళిక నుండి తీసిన(తీస్తూ ఉన్న) కాలజ్ఞానంలా ఉంది
  నవల ప్రారంభించినప్పుడు గతమేమో అనిపించింది.తరవాత్తర్వాత ఊహ్ సమకాలీనమే అనిపిస్తూ..భవిష్యత్తును చూపిస్తొంది

  • raamaa chandramouli says:

   ప్రసాద్ గారూ,
   గతంలోనుండి వర్తమానంలోకి..వర్తమానంలోనుండి భవిష్యత్తులోకి ..మనిషి నిరంతరం చేసే ఒక అనంతయానమే మానవ చరిత్ర.
   మీరన్నది నిజమే.గతంలోనుండి మొదలైన కథ..ఇక భవిష్యత్తులోకి అభిక్రమించబోతోంది.
   చూడాలి విజ్ఞులు ఎంతవరకు ఈ పరిష్కారాన్ని ఆమోదిస్తారో.
   ధన్యవాదాలు.
   – మౌళి

 3. i read this serial in small chunks…ది నీద అఫ్ ది hour ఇస్ తో షాకే పీపుల్ అవుట్ అఫ్ కంప్లేసున్స్…వెన్ రైటర్స్–థెయ్ అలొనె కాన్–ఏమ్బర్క్ ఆన్ ది మిషన్ అఫ్ బ్రింగింగ్ చేంజ్ ఇంతో ఠిస్ ముచ్ చ్లిచెద్ లివింగ్…బి మేకింగ్ పీపుల్ థింక్ అండ్ లుక్ వితిన్ నో చేంజ్ కాన్ బె ఎఫెక్టివ్. ది థాట్ ప్రాసెస్ నీద్స్ తో బె రెఫినెద్ న నొనె బట్ అ సొచిఅల్ల్య్ చొన్స్చిఒఉస్ రైటర్ ఇస్ చపబ్లె అఫ్…టైం రైటర్స్ బెచొమె సోషల్ అచ్తివిస్త్స్ ఇన్ థెఇర్ ఓన్ రైట్…

మీ మాటలు

*