On Being Called a Film Critic…!

unnamed
ఏరా ఇంత ఆలోచిస్తూ సినిమాని అసలు ఎంజాయ్ చేశావా?” అన్నాడు మా అన్నయ్య ఆశ్చర్యపోతూ.
ఒక్క క్షణం ఆలోచించి…
“ఏమో…అలా ఆలోచిస్తూనే నేను సినిమాని ఎంజాయ్ చేస్తానేమో!” అన్నాను నేను. 
డిగ్రీ మూడో సంవత్సరంలో అనుకుంటాను, అప్పటికి లిటరరీ థియరీలు, ఫిల్మ్ క్లబ్ లో ప్రపంచ సినిమాలూ చూసి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న టైం అది. సినిమాని ఒక లిటరరీ టెక్స్టులాగా తీక్షణంగా చూసి, ఆలోచించి, అర్థాలుతీసి, విశ్లేషించకపోతే సరైన జస్టిఫయబుల్ అనుభవంలాగా తోచని కొత్తబిచ్చగాడి బిహేవియర్ సమయం అది. మా అన్నయ్య మాత్రం చల్లగా (జాలిగా అని నా డౌట్) “ఇవివి సత్యనారాయణ సినిమాకి ఇంత అనాలిసిస్ అవసరమా?” అని తేల్చిపారేసిన జ్ఞానోదయపు క్షణం అది.
కానీ ఎందుకో అలవాటుపోలేదు.
సత్యజిత్ రే, ఘటక్, శ్యామ్ బెనెగల్, మణికౌల్, అకిరాకురసోవా, మాజిది మాజిది లాంటి మాస్టర్స్ ని చూశాక మైండ్ లో ఏవో కొన్ని నరాలు మళ్ళీ అతుక్కోకుండా తెగిపోయాయనుకుంటాను. అప్పటివరకూ చూసి ఎంజాయ్ చేసింది ఏదో సిల్లీ ట్రివియల్ గ్రాటిఫికేషన్స్ లాగా అనిపించడం మొదలయ్యింది. అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని సినిమాలు తప్ప మిగతావి అంతగా గౌరవప్రదంగా అనిపించడం మానేసాయి.
దానికి యాంటీడోట్ యూనివర్సిటీలో పడింది.
ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. ఫిల్మ్ అప్రిసియేషన్, ఫిల్మ్ క్రిటిసిజం, అండర్ స్టాండింగ్ సినిమా సబ్జెక్టులు శ్రధ్ధగా చదవడంతో పాటూ బాలకృష్ణకి పిచ్చఫ్యాన్. దానికి తోడు, ఒకటిన్నర గంట ఉండే ఇంగ్లీష్ సినిమాకి నలభైరూపాయల టికెట్టు పెట్టి చూడటం “గిట్టుబాటు కాదు” అని, కేవలం తెలుగు, హిందీ సినిమాలు మాత్రమే చూడటానికి ఇష్టపడే ఒక ఇంట్రెస్టింగ్ నమూనా.
మేమెప్పుడైనా సరదాగా ఏడిపిస్తే, “యూ బ్లడీ ఎలీటిస్ట్ ఫెలోస్! లెట్ మీ ఎంజాయ్ మై కైండ్ ఆఫ్ సినిమా” అనేవాడు.
కొంచెం సీరియస్గా కల్చరల్ స్టడీస్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫర్ డెవలప్మెంట్ లాంటి సబ్జెక్టులు కలగలిపి చదువుతూ ఉంటే మా బాలకృష్ణ ఫ్యాన్ ఫిక్సేషన్ ఏమిటో, మేము నిజంగానే ఎలీటిస్టులం ఎలా అయ్యామో అర్థమయ్యింది.
హైబ్రో, లోబ్రో కల్చర్ల పాలిటిక్స్ మొదలు, సినిమా అనే కొత్త మతం ఇమేజెస్ తో మైండ్ ని ఎంతగా మానిప్యులేట్ చేస్తోందో తెలుసుకోవడంతో పాటూ, “టేస్ట్” పేరుతో మనలోనూ పెరిగే ప్రెజుడిస్ లో ఆధిపత్యభావజాలం ఎంతుందో అదీ అర్థమయ్యింది.
కానీ ఏంచేద్దాం….
మనిషన్నాక నాలెడ్జిని పెంచుకుంటాడు. దాన్ని బట్టి క్రిటికల్ థింకింగూ అలవర్చుకుంటాడు.
కేవలం చూసి, స్పందించి ఆనందించడంతో తృప్తిపడకుండా, విశ్లేషించి-వివరించి సంతోషపడతాడు.
ఎవడి జ్ఞానాన్ని బట్టి వారి గ్రాటిఫికేషన్. ఎవరి అండర్సాండింగుని బట్టి వారి అనాలిసిస్.
అందుకే క్రిటిసిజంలో…ముఖ్యంగా పాప్యులర్ ఆర్ట్ అయిన ఫిల్మ్ క్రిటిసిజంలో ఆబ్జక్టివిటీ అనేదానికి పెధ్ధప్రాముఖ్యతలేదు.
film_critic_1294385
ఒకే సినిమాకి పది వేరు వేరు రివ్యూయర్ల అభిప్రాయాలు పదిరకాలుగా ఉండొచ్చు. అంతాకలిపి కొన్ని సినిమాలకి ఒకటే కావొచ్చు. రేటింగుల్లో తేడాలుండొచ్చు. ఈ మధ్యకాలంలో బ్లాగులు, ఫేసుబుక్కూ, ట్విట్టర్ల పుణ్యమా అని ఆడియన్స్ రివ్యూలు క్షణక్షణం అప్డేట్స్ లాగా వచ్చేస్తున్నాయ్. దాన్నీ ఎవరూ ఆపలేం. చూసిన ప్రతివారికీ అభిప్రాయం చెప్పే హక్కుంటుంది. కాకపోతే “క్రిటిక్” అనేవాడు(అనుకునేవాడు/ఎవడో వాడు క్రిటిక్ అని చెప్పినవాడు) చెబితేమాత్రం కౌంటర్ అటాక్ లు ప్రారంభం అవుతాయి.
వాడేదో సినిమాకి పెద్ద ద్రోహం చేసేస్తున్నాడనే ఫీలింగ్. అభిప్రాయాల మీద క్రిటిక్ అనేవాడేదో గుత్తాధిపత్యం తీసుకున్నట్లు. అన్నమాటకు ఆధారాలు సరఫరాచేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. “చెత్త అన్నావ్! ఇప్పుడు ఆ సినిమా హిట్ అయ్యింది” అనో, “బాగుంది చూడండి అన్నావ్! కలెక్షన్లు నిల్ అంటా” అని ఎకసెక్కాలు పోతుంటారు. క్రిటిక్ అనేవాడు సినిమా చూస్తుండగా తను పొందిన అనుభవాన్ని, తనకున్న జ్ఞానాన్ని కలగలిపి సినిమా ఎలాంటిది అనే నిర్థారణకు వస్తాడుగానీ, ఆడియన్స్ అనే ఒక కాల్పనిక యూనిట్టు ఆ సినిమాకు ఏ విధంగా రియాక్టు అవుతుంది అనే బేరీజు వెయ్యడానికి రాడు. సినిమాపై తనకున్న అవగాహనతో సినిమా లోని మెరిట్స్ ని, లోటుపాట్లని ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తాడేగానీ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనే ప్రిమొనిషన్ కోసం రాడు.

షో పూర్తయిన గంటలోగా రివ్యూ రాయాల్సి వస్తున్న ఈ కాలంలో అంతకన్నా ఆలోచించే ఓపికా, సమయం సోకాల్డ్ క్రిటిక్ కి ఉండవు. ఫ్యామిలీ హీరోల అజెండాల్ని, బిగ్ బడ్జెట్ సినిమాల ఇంట్రెస్టుల్ని, ఓవర్సీస్ రైట్స్ రేట్లలో తేడాల్ని నిర్దేశించే క్రిటిక్స్ ని వదిలేస్తే మిగతావాళ్ళు కేవలం సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.

ప్రతి ప్రేక్షకుడూ పొటెన్షియల్ రివ్యూయర్/క్రిటిక్ అవుతున్న ఈ సమయంలో “సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్” అంటూ సినిమాల గురించి రాసేవాళ్లను ఆరళ్ళు పెట్టడమూ చెల్లదు. వీలైతే మీకున్న జ్ఞానంతో మీ రివ్యూ మీరు రాసుకోండి. అప్పుడు మీరూ క్రిటిక్ అవుతారు. సింపుల్.

-కత్తి మహేష్ కుమార్

మీ మాటలు

 1. సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.

  క్రిటిక్ అనేవాడు సినిమా చూస్తుండగా తను పొందిన అనుభవాన్ని, తనకున్న జ్ఞానాన్ని కలగలిపి సినిమా ఎలాంటిది అనే నిర్థారణకు వస్తాడుగానీ, ఆడియన్స్ అనే ఒక కాల్పనిక యూనిట్టు ఆ సినిమాకు ఏ విధంగా రియాక్టు అవుతుంది అనే బేరీజు వెయ్యడానికి రాడు.

  అద్భుతం! అంతే!

 2. laxman rao says:

  నైస్ ఎనాలిసిస్ :)

 3. మైథిలి అబ్బరాజు says:

  ఇంకా ఉంది కదా? ?? ఈ కొంచెమూ బ్రిలియంట్ గా ఉంది , పరంపర రావలసి ఉంది ….

 4. అనామకుడు says:

  మీ పేరుకు మల్లే కత్తిలా ఉంది.

  ఎనాలసిస్ అద్భుతః మీ భావావేశం అత్యద్భుతః

  చదివాక – కళ్ళు, బుర్ర, మనసు – మూడూ చల్లబడ్డాయి!

 5. sai padma says:

  హైబ్రో, లోబ్రో కల్చర్ల పాలిటిక్స్ మొదలు, సినిమా అనే కొత్త మతం ఇమేజెస్ తో మైండ్ ని ఎంతగా మానిప్యులేట్ చేస్తోందో తెలుసుకోవడంతో పాటూ, “టేస్ట్” పేరుతో మనలోనూ పెరిగే ప్రెజుడిస్ లో ఆధిపత్యభావజాలం ఎంతుందో అదీ అర్థమయ్యింది.
  –ఇది చాలా బావుంది .. ఇంకా డీప్ గా రాయండి , నాన్ ఫిలిం పీపుల్ ఇంకా , ఇప్పటి సినిమాల మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నవాళ్లకి అర్ధం అయేలా .. మంచి ప్రయత్నం mahesh గారూ

 6. చాలా చాలా చాలా బావుంది.. :) :) :) :)

 7. కత్తిలా ఉంది.

  ఎకసెక్కాలు, ఆరళ్ళు, అడపాదడపా లాంటి తెలుగు పదాలు వాడటం బాగుంది.

  చూడటం, విశ్లేషించడం ఒక ఎత్తు, మరొకరు చదివి ఆనందించేలా రాయడం మరొక ఎత్తు.

 8. మీ ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్టు లో ఉన్నందు వల్ల, మీ స్టేటస్ ల పైన మీ నోట్స్ పైన జరిగే గొడవ చూస్తాను కాబట్టి మీరు ఈ పీస్ రాయడానికి స్ఫూర్తి ఎక్కడిదో అర్థమయింది. చాల బాగ convey చేసారు ఒక Film Analyser యొక్క frustration ని. మీ అంత exposure మరియు knowledge లేకపోయినా, నేనూ empathize చేయగలిగాను- ఎన్నో రకాల సినిమాలు చూసి, ఫిలిం థియరీలు చదివిన Critical mind కి మన upbringing మరియు environment వల్ల ఏర్పడ్డ Emotional requirement కి చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది బుర్రలో. అది సరిపోదన్నట్టు, “ఈ దిక్కుమాలిన discussion లు పెట్టకు, సినిమాని అంత సిరియస్ గా తీసుకోకుండ ఎంజాయ్ చేయ” మనె స్నేహితులు కోకొల్లలు. Well written.

  మీకు ఈ చర్చ నచ్చుతుందని భావిస్తున్నాను- http://thebigindianpicture.com/2013/01/moveable-feast-critics/

Leave a Reply to Stork Cancel reply

*