పాత చొక్కా: వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

Velturu2

అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

స్నేహితుల తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

 

1

IMG_6555

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే!

కవిత్వాన్ని గురించి మొత్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సమస్య మామూలే! కాని,  విడివిడిగా వొక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు  చెప్పే మాటలు కూడా నాకు అంతగా తృప్తినివ్వవు. కవిత చదివాక కలిగే వొకలాంటి తృప్తినీ, ప్రశాంతతనీ వచనంలో రాయలేకపోయినా, కనీసం కొంత మాట్లాడితే బాగుణ్ణు అనుకొని, గత కొద్ది కాలంగా కొన్ని కవితల ముందు ఎంతో కొంత నేర్చుకోవాలని తపించే విద్యార్థిలా నిలబడి, మాటలు కూడదీసుకుంటున్న సమయంలో అనుకోకుండా వర్మ రాసిన ఈ “పాతచొక్కా” కవిత తారసపడింది.

పాత చొక్కా…!

కవిమిత్రుడు హెచ్చార్కె కలిసినప్పుడల్లా తనకీ నాకూ జరిగే అనేకానేక సంభాషణల్లో ఈ పాత చొక్కా వొకటి. ఖమ్మంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హెచ్చార్కె తరచూ విప్లవ రచయితల సంఘం బాధ్యుడిగా ప్రసంగాలు ఇవ్వడానికి వస్తూండే వాడు. అతని ప్రసంగాలంటే నాకు ఇష్టంగా వుండేది. అంతకంటే ఎక్కువగా – అతనెప్పుడూ వేసుకొచ్చే వొక నీలంరంగు చొక్కా అంటే మరీ  ఇష్టంగా వుండేది. టీనేజర్ని కదా, నా జర్నీ కొంచెం అలాగే వుండేది! నాకు కూడా కచ్చితంగా అలాంటి నీలం రంగు చొక్కానే – సన్నటి వైట్ చెక్స్- తో వుండేది.  ఇద్దరమూ ఆ చొక్కాల మీద నిజంగానే   ఇష్టంగానే  మాట్లాడుకునే వాళ్ళం, విప్లవ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి!

కొంత కాలానికి మా స్నేహం పాతబడింది, ఆ నీలం చొక్కా మాదిరిగానే!

కాని, ఆ జ్ఞాపకం వుందే, అది ఇప్పటికీ వర్మ చెప్పినట్టు-  “మనసు కొక్కేనికి వేలాడుతూనే” వుంది ఎప్పటికప్పుడు  కొత్తబడుతూ!

ఇప్పుడు ఈ కవిత  చదివాక వెంటనే అనిపించింది, అసలు ఇన్నాళ్ళుగా నాతో వున్న, నాలో వున్న ఈ అనుభవాన్ని నేనే  ఎందుకు రాయలేకపోయానా అని. బహుశా, మంచి కవిత అనేది మనలోని అలాంటి వొక అశక్తతని కూడా కొన్ని సార్లు గుర్తుచేస్తుందేమో!

ఈ  కవిత మొదట చదివిన కొద్దిసేపటికి, ఆ తరవాత ఇంకో రెండు సార్లు చదువుకున్నాక ఇంకా అనిపించింది, రాసినా  నేను  ఈ కవిలా రాయలేను అని! మరీ దగ్గిరగా వుండే అనుభవం రాయడం ఎంత కష్టం!?

వొక  మంచి కవిత చేసే యింకో గొప్ప పని ఏమిటంటే — అది మన మనసు తెలిసో తెలియకో విధించుకున్న కొన్ని పరిమితుల్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పరిమితుల్ని తెగ్గొట్టి ఆ అనుభవాన్ని తిరిగి ప్రేమించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది!

అందరమూ అనుకున్నట్టు- ఇలాంటి పని చేసే కవిత్వానికి, ఆ శక్తి ఆ కవిత్వ వాక్యం నించి మాత్రమే రాదు. గొప్ప కవిత్వ వాక్యాలు రాసే కవులు మనకి చాలా మందే వున్నారు. కాని, వాక్యాలు ముందు పుట్టి తరవాత భావాన్ని చొక్కాలా వేసుకునేది మంచి కవిత్వం కాదని  ఖాయంగా చెప్పగలను.

2

ఈ కవితలో ప్రత్యేకించి చెప్పాల్సింది: metaphorization – పదచిత్రీకరణ.  సాధారణంగా చలనమున్న పదచిత్రాల్నీ(dynamic images),  ప్రతీకల్ని (ఉదాహరణకు: సెలయేరు) తీసుకోవడంలో వున్న సౌలభ్యం చలనరహితమైన పదచిత్రాల్ని(static images), ప్రతీకల్ని (ఉదాహరణకు: ఈ కవితలో పాత చొక్కా) తీసుకోవడంలో లేదు. ఇక అలాంటి చలనరహిత ప్రతీకల్ని చలనశీలమైన భావాల్ని పలికించడానికి ప్రయత్నిస్తే  చాలా సందర్భాల్లో కవిత శిల్పం దెబ్బతింటుంది. ఆ ఇబ్బందిని గట్టెక్కడం శిల్ప పరంగా ఈ కవితలో వొక నిర్మాణ  విశేషం.

ఆ ఇబ్బందిని గట్టెక్కడానికి ఈ కవి  చేసిన పనేమిటంటే, ఆ చలనరహితమైన ప్రతీకలూ వస్తువుల వెంటనే చలనశీలమైన వొక అనుభూతిని ఆసరా తీసుకున్నాడు.

ఉదాహరణకు ఇక్కడ “బొత్తాం” “చినుగు” చూడండి:

 1. బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ…(బొత్తాం – కళ్ళు చిట్లించి, ప్రేమ దారంతో  అమ్మ)
 2. స్నేహితుల తోపులాటలో చినిగి… ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న (చినుగు – దాన్ని కుట్టే నాన్న)

 

ఈ continuity ని  చివరంటా సాధించింది కవిత.

రెండో నిర్మాణ విశేషం: కవి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న క్రియా పదాలు. కవితలో రెండో పంక్తి లోని “వేలాడుతున్న” అనే పదం మొదలుకొని, చివరి పంక్తిలో వున్న “దాస్తున్న” దాకా క్రియ అనేది నిష్క్రియగా (dysfunctional)  కాకుండా, చాలా నిర్దిష్టమైన పని (very functional) కోసం వుపయోగించడం ఈ కవితలో బలంగా కనిపిస్తుంది.

మూడో విషయం: తన అనుభూతిని కవి ఎలాంటి frame నించి imagine చేస్తున్నాడో, ఆ ఊహకి ఎలాంటి రూపమిస్తున్నాడో అన్నదాన్ని బట్టి కూడా ఆ కవిత గుణం తెలుస్తుంది. అంటే, కవిత మొత్తంలో గుండె చప్పుడూ, ఆలోచనల అలజడీ కలగలిపే వాక్యాలు కొన్ని వుంటాయి. ఆ వాక్యాల్లో కవి పొదుపుగా దాచుకున్న అనుభూతి వినిపిస్తుంది. ఈ కవిత మొత్తం సాంద్రతని వొడిసిపట్టుకున్న వాక్యం నాకు అర్థమైనంత మటుకు ఇది:

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

3

ప్రతి బతుకు పుస్తకంలో అనేక  జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు.  అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

ఆ కొలమానంతో ఈ  కవిత – a celebration of the retrieval of a  memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

 – అఫ్సర్

మీ మాటలు

 1. NS Murty says:

  అఫ్సర్,

  మీ విశ్లేషణ బాగుంది. ముఖ్యంగా Dynamic and Static Images విషయంలో మీరు చెప్పింది. సరియైన ప్రతీక ఒక్కోసారి కవివాడిన పదాలలో చెప్పడానికి ఇమడనవీ, అంతకంటే ఎక్కువగా పాఠకుడి హృదయానికి తట్టే భావాలని స్ఫురింపజేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పదాలకున్న పరిధుల్ని ఒక మంచి ప్రతీక అధిగమించగలుగుతుంది. ఆలాంటి ప్రతీకని ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ ఆధారపడి ఉంటుంది.

  అభివాదములతో

  • అఫ్సర్ says:

   మూర్తి గారు, కవిత్వంలో ఇమేజ్ ఎంత బలంగా పనిచేస్తుందో ఇంకా విశ్లేషణలు రావాల్సే వుందని అనుకుంటున్నా. ఈ కవితలో చొక్కా ఇమేజ్ కొత్తది కాదు కాని, చలనరహిత ఇమేజ్ గురించి చెప్పడానికి మంచి ఉదాహరణ అనుకున్నా. మీ స్పందనకి ధన్యవాదాలు.

 2. rajaram thumucharla says:

  అపుడెపుడో ఒక కవితను తీసుకొని అనుభూతి పరంగా , భాషా పరంగా కూడా కవిత్వ నిర్మాణ విశేషాల్ని చేరా అందించి నట్లు జ్ఞాపకం.మళ్ళీ ఆ స్థాయితో పాత చొక్కా ను బతికొచ్చిన సంబరంగా అప్సర్ చేయడం చాలా బాగుంది.అప్సర్ నుంచి ఇంకా ఇలాంటి విశ్లేషణలు కోరుకొంటు అభినందనలు

  • అఫ్సర్ says:

   రాజారాం, థాంక్ యు. — చేరా దగ్గిర ఎక్కువ సాధనాలు వున్నాయి కదా, కవిత్వ అనుశీలనకి! నేను విద్యార్థినే ఇంకా! చూద్దాం ఇంకా ఏమేం నేర్చుకుంటానో!

 3. It’s a pleasure reading your articles on poetry. ఇంట్రో్‌లో మొదటి మూడు పేరాలు పాఠకుల స్పందనలకు సంబంధించిన కొన్ని మంచి రహస్యాలను విప్పాయి. చలనరహితశిల్పాలు- చలశీలభావలు గురించి మంచి గమనికలు వ్రాశారు. జ్ఞాపకం బతికొచ్చిన సంబరం ఎంత బాగుంటుందో, మీ విశ్లేషణా అంతే బాగుంది. థాంక్యూ.

  ఈ “వెలుతురు పిట్టలు” రవిగాంచని చోట్లకి కూడా ఎగరగలవని నమ్ముతూ, ఆసక్తిగా ఎదురుచూస్తూంటాము.

  • అఫ్సర్ says:

   చాలా థాంక్స్, మానస! “రవిగాంచని” చోటుకి వెళ్ళడం నిజంగా ఉంటుందా అన్నది నా ప్రశ్న! వున్నా, అంత దూరం ఎగరగలమా అని!

 4. రాజశేఖర్ గుదిబండి says:

  అద్భుతమైన కవిత , అంతే అద్భుతమైన విశ్లేషణ…
  ఈ కవిత ఇప్పుడే చదవడం నేను..

  “ప్రతి బతుకు పుస్తకంలో అనేక జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు. అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

  ఆ కొలమానంతో ఈ కవిత – a celebration of the retrieval of a memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!”

  ఎంత బాగా చెప్పారు!

  మీ విశ్లేషణ ద్వారా మరిన్ని కవితల్లోని సరికొత్త లోతుల్ని మేము కూడా చూడగలిగే అవకాశం కలిగిస్తారని ఆశిస్తూ..

 5. బలమైన విశ్లేషణ,. ,…

 6. balasudhakarmouli says:

  గొప్ప విశ్లేషణల గురించి మాట్లాడడం కంటే… వాటి నుంచి కవిత్వనిర్మాణ వ్యూహాలను వొంటబట్టించుకోవడం బహుశా సుళువేమో ! గొప్ప విశ్లేషణలెప్పుడూ గొప్ప పనే చేస్తాయి. థ్యాంక్యూ అఫ్సర్జీ, వర్మాజీ….

 7. చాలా నేర్చుకోవాలండీ! కవిత్వం రాయడమెలానో పక్కన పెట్టి ముందసలు చదవడమెలానో నేర్చుకోవాలి, నేను!

  చిక్కని విశ్లేషణ అఫ్సర్ గారూ… ధన్యవాదాలు.

  • అఫ్సర్ says:

   నిషిగంధ: రాయడమూ చదవడమూ వొకదానితో ఇంకోటి ముడిపడి వున్నవే! వొకటి పక్కన పెడితే ఇంకోటి వుండదు. రాయండి, చదవండి. ఇదీ ఇప్పుడు మన స్లోగన్!

 8. మైథిలి అబ్బరాజు says:

  ” మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ” నాకు అంతే వచ్చు, చాలు …శాస్త్రం తెలియదు. :) కాని రెండో భాగమూ బావుంది. నచ్చినదాన్ని మరీ మరీ తరచి చెప్పాలనిపించే యత్నం మనస్వులైన కవుల చేత ఇలా శోభిస్తుంది.

  • అఫ్సర్ says:

   మైథిలి గారు: మీకు శాస్త్రం తెలీదంటే నేను నమ్మను! మీ విశ్లేషణలు నాకు చాలా ఇష్టం. మీ మంచి మాటకి ధన్యవాదాలు.

 9. “అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను.” సచ్ కహా
  అఫ్సర్ భాయ్ .షుక్రియ .మీరు మాకెంతో ఇస్తున్నారు.

 10. Sumanasri says:

  అఫ్సర్ గారూ !

  మీ విమర్శ వ్యాసం చదివాను. మీ రచన రీడర్ రెస్పాన్స్ విమర్శకు ఒక ఉదాహరణగా అనిపించింది.
  ఆ కవిత మీద నా అనుభవైక విమర్శ మరొకలా ఉంటుంది.
  ఇలాంటి ప్రయత్నం నేనూ చెయ్యటానికి ప్రయత్నిస్తాను మీరు బాగుంటుందనుకుంటే.

  • అఫ్సర్ says:

   సుమనశ్రీ గారు, మీలాంటి పెద్దలు వొక మాట అంటే నాకు కాస్త ధైర్యం! కవిత్వ అనుభవం గురించి వీలయినన్ని ద్వారాలు తెరుచుకోవాలి. మీరూ రాస్తే బాగుంటుంది.

 11. జాన్ హైడ్ కనుమూరి says:

  ఈ కవిత చదవగానే గతంలో నేను రాసిన నీలంరంగు చొక్కా గుర్తుకువచ్చింది
  అఫ్సర్ గారూ మీ అనుబంధం నీలంరంగు చొక్కాతో ఉండటం ఒక థ్రిల్

  • అఫ్సర్ says:

   జాన్ గారు, అవును మీ కవిత గుర్తుంది. మరో సందర్భంలో మనిద్దరి నీలి చొక్కాల గురించి మాట్లాడుకోవాలి. అవును! మీ కవిత ఇక్కడ పెట్టండి, మిత్రుల కోసం మరో సారి!

   • జాన్ హైడ్ కనుమూరి says:

    నీలంరంగు చొక్కా
    బాల్యంలో
    ఓ లేతనీలం చొక్కా వుండేది

    బహుకరించిన ఆప్తులెవరో గాని
    అది తొడుక్కోవడమంటే మహా సరదా
    మెత్తగా వంటిని హత్తుకొనేది
    మెరుపేదో ఆ చొక్కాలోంచి ముఖంలో కనిపించేది

    దాన్ని భద్రంగా
    ఇస్త్రీ మడత నలగకుండా పెట్టెలోదాచి
    ప్రత్యేక సమయాలకోసం
    నిరీక్షించడంలో ఉత్సుకత వుండేది …………….
    http://alalapaikalatiga.blogspot.in/2007/07/blog-post_9996.html

   • జాన్ హైడ్ కనుమూరి says:

    నీలంరంగు చొక్కా
    బాల్యంలో
    ఓ లేతనీలం చొక్కా వుండేది

    బహుకరించిన ఆప్తులెవరో గాని
    అది తొడుక్కోవడమంటే మహా సరదా
    మెత్తగా వంటిని హత్తుకొనేది
    మెరుపేదో ఆ చొక్కాలోంచి ముఖంలో కనిపించేది

    దాన్ని భద్రంగా
    ఇస్త్రీ మడత నలగకుండా పెట్టెలోదాచి
    ప్రత్యేక సమయాలకోసం
    నిరీక్షించడంలో ఉత్సుకత వుండేది …………….
    http://alalapaikalatiga.blogspot.in/2007/07/blog-post_9996.html

 12. అఫ్సర్ says:

  మిత్రులందరికీ:

  మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు. కవిత్వ రూపం మీద ఎంతో కొంత ఆలోచన పెంచే ప్రయత్నం ఇది. అలాగే, కొత్త కవిత్వాన్ని చదవడానికి చదువరిని కాస్త సంసిద్ధం చేస్తుందనీ నమ్ముతున్నా. చూద్దాం!

 13. నాకున్న పరిమిత కవిత్వ స్పృహతో నా అనుభవాలని అనుభూతులను హృదయ స్పందనను వ్యక్తీకరించే సాధనంగా రచనను ఎంచుకున్న వాడిని. ఇది రాస్తున్నప్పుడు నాకు దీనిపట్ల నా పాత చోక్కాపై వున్న అభిమానం మాత్రమే వుండేది. కవిత్వ ప్రక్రియలో ఇంత లోతైన విశ్లేషణకు ఇది ఉదాహరణగా అఫ్సర్ సార్ తీసుకొని ఈ శీర్షికకు మొదటి కవితగా పరిగణింపబడడం మీ అందరి మాటలతో ప్రతిస్పందనలతో మరల ఆ చొక్కాను తొదుక్కున్నంత ఆనందంగా వుంది. అఫ్సర్ సార్ కు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞుడను.._/\_

 14. అఫ్సర్ కొత్త చొక్కా పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. నిజంగానే ఒక్క మనిషి జీవితం లో జ్ఞాపకాలు అలలు అలలుగా ఎగిసి పడుతుంటాయి.వాటిని అక్షర రూపంలో పెట్టడమే గొప్ప తనం. నా చిన్నప్పటి జ్ఞాపకాలతో రాసిన అమ్మ కోసం మీకు అందిందా మీ మెయిల్ id ఇస్తే పంపుతా

 15. అఫ్సర్ says:

  రజని: చాలా థాంక్స్! మీ వ్యాసం మళ్ళీ editor@saarangabooks.com కి పంపించగలరా?

 16. ఆర్.దమయంతి. says:

  కొన్ని జ్ఞాపకాల పరిమళాలు..
  మండుటెండల్లో మల్లెల్లా గుప్ఫుగుప్ఫు మంటాయి.
  సన్నని వెన్నెల మంటని రాజేసుకుంటూ..పోతాయి.

  బ్రతుకు ప్రయాణంలో ఎంతదూరం వెళ్లినా
  కొన్ని దారులు మనవెంటే రావడం..ఒక విఛి త్రానుభావం. చిత్రానుబంధం.
  ఏరు విడిచి కెరటాలు..గతం మరఛి మనుషులు వుండరేమో!

  ఒక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం..
  అన్నారు కానీ మతి కొచ్చిన సంబరమేమో అని నేననుకుంటున్నాను.
  చాలా బావుంది. మరో సారి చదవాలి.
  అభినందనలతో..

 17. కోడూరి విజయకుమార్ says:

  అఫ్సర్ … కవితని మళ్ళీ మళ్ళీ చదివేలా చేసిన చక్కని విశ్లేషణ … చాలా బాగుంది … అన్నట్టు, ‘పాత చొక్కా’ మాటున, తన విస్మృత (?) ప్రేమని కూడా కవి తడుముకుంటున్నాడు అని ఈ కింది పాదాలని చదివినపుడు మీకేమైనా అనిపించిందా?

  “యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
  ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

  వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
  దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

  ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
  తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు” ….

 18. అఫ్సర్ says:

  విజయ్:

  చాలా మంచి మాట చెప్పావ్!

  నిజానికి ఈ కవితలో నేను వస్తుపరంగా మాట్లాడలేదు. ఈ కాలమ్ ఉద్దేశం రూపశ్రద్ధ గురించి రాసేవాళ్ళలోనూ, చదివే వాళ్ళలోనూ వొక ఆసక్తి కలిగించడం!

  నువ్వు చెప్పాక మళ్ళీ ఈ కవిత చదివాను. అవును, నువ్వన్నది నిజం! ఘజల్ కవులు ప్రేమనీ సామాజిక భావనల్నీ అందంగా ముడిపెట్టారు, అలాగే, ఆధునిక సూఫీ కవులు కూడా అలాంటి పని చేస్తున్నారు ఇటీవలి ప్రపంచ కవిత్వంలో! వర్మ తనకి తెలీకుండానే వాటి ప్రభావంలో ఇలాంటి కవిత్వం రాస్తున్నాడని నాకు అనిపిస్తోంది. ఈ లక్షణం శ్రీకాంత్ కవిత్వంలో కూడా కనిపిస్తుంది.

 19. వాసుదేవ్ says:

  అఫ్సర్, వర్మ గార్లకు
  ఈ కవిత చదవటం మొదలుపెట్టగానే నాకు షేక్స్పియర్ రాసిన ఓ సానెట్ గుర్తుకొచ్చింది.దాని క్రమ సంఖ్య గుర్తులేదుకానీ (అది73 అనుకుంటా) దాంట్లొ అతనంటాడు ” నేనిలా వాడుతున్నపదాలే వాడుతున్నా కానీ అవే నాకు నచ్చుతున్నాయో లేదా అవే నన్ను నన్నుగా చెప్తున్నాయో” అని! అలా వర్మ కవితల్లో కొన్ని “నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది”, “రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా ” ఇలాంటివి కొన్ని వర్మని నిలబెడతాయి. ఇవి వర్మ వాక్యాలని చెప్పకనే చెప్తున్నట్లుంటాయి…ఈ కవిత చదవటంలో ఎంత ఆనందం ఉందొ దాన్ని సాహితీపరమైన సాంకేతికమైన విశ్లేషణలోంచి చూస్తూ చదవటం మరో గొప్ప అనుభూతి. ఇరువురికీ అభివందనం

  • వాదుదేవ్ గారు ధన్యవాదాలు. ఆ వంతెన దాటి రాలేకపోవడం నా లోపమే. సరికొత్త పద ప్రయోగం చేసేంత జ్ఞానం లేనివాన్ని.

 20. mercy margaret says:

  ఇంత లోతైన విశ్లేషణ చేయగలగాలంటే అంత తీక్షణంగా , ఇష్టంగా కవిత చదవాలి. కవిత్వాన్ని ప్రేమించాలి. ఇంత మంచి కవిత రాసిన వర్మ అన్నకి అభినందనలు.
  అఫ్సర్ గారు మరో సారి నాకు ఏది అవసరమో, ఏ దిశగా వెళ్ళాలో సూచిస్తున్నట్టుగా సాగింది మీ ఈ విశ్లేషణ. కవిత్వ విశ్లేషణతో పాటు వ్యక్తిగత దిశా నిర్దేశం నాకు మాత్రం. ఇంకా ఎంతో చదవాలి. ఎంతో నేర్చుకోవాలి.

 21. Gaddapati Srinivasu says:

  ఒక జ్ఞాపకం ఎప్పుడూ ఆ పాత చొక్కాలానే మదిగదిలో కొక్కోనికి వేళాడుతూనే ఉంటుంది…
  కొత్తగా కవిత్వం రాసే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంది సర్ విశ్లేషణ

 22. చాలా రోజులైంది కవిత్వం రాసి. సారంగ ఓపెన్ చేయగానే ఇలా సార్ కాలమ్ చూసి మరల చదువుకున్న మిత్రుల స్పందనలతో. మరల రాయాలన్న ఉత్సుకతను ఎలా రాయాలన్న దిశను నిర్దేశించే ఈ వ్యాసాలూ చదవడం గొప్ప అనుభూతినిస్తున్నాయి. ధన్యవాదాలు సార్.

మీ మాటలు

*