కొత్తలు పెట్టుకుందాం

303675_500898139938384_2048672978_n

 

నవ్వేటపుడు నవ్వకపోతే ఎట్లా

కన్నీళ్ళతోనే నవ్వుతాం

యాజ్జేసుకుంటాం పేగులు నలి నలి కాంగా

మడిసిపెట్టుకున్న కలలు

కొప్పున ముడుసుకునే పువ్వులైనంక

ఇంత దుఃఖం ఓర్సుకుని, ఇన్ని బాధలు మోసినంక

ఇగో యిప్పుడు ఆత్మగల్లసుట్టం వొచ్చినపుడన్న

మనసిప్పి నవ్వకపోతే ఎట్లా

 

అడివిల పొద్దీకినట్లు కాలం యెల్లబోసిన రోజులు పాయె

పొద్దు దర్వాజమీద పొడిసినంకగూడ

వాకిట్ల ముగ్గులెక్క నవ్వకపోతె ఎట్లా

చేన్ల పంటలెక్క మురవకపోతె ఎట్లా

పర్రెకాల్వల వూటలెక్క పొంగకపోతె ఎట్లా

 538574_3603108479500_46248201_n

ఎన్ని యాదికొస్తయి ఎంత దుఃఖమొస్తది

ఎవలెవలు కొత్తతొవ్వల్ల దీపాలెత్తి పోయిండ్రు

ఎవలెవలు కొత్తపాటల మునుంలేసి పోయిండ్రు

ఎవ్వరికోసం తమ పానాలుధారవోసి

కొత్తపాలధారలై మన కడుపునింపుతుండ్రు

అన్ని యాదికొస్తయి అందరు మతికొస్తరు

 

నవ్వబోతే వాళ్ళ ముకాలు గుర్తుకొస్తయి

నవ్వబోతే వాళ్ళ మాటలు యాదికొస్తయి

నవ్వబోతే వాళ్ళు లేకపోయిరనిపిస్తది

వాళ్ళందరు మన నవ్వులకోసమేకద

వాళ్ళ జిందగీలు మనకిచ్చిండ్రు

మనం నవ్వుకుంట వాళ్ళపేరన దీపాలు పెట్టుకుందాం

మనం నవ్వుకుంట కన్నీళ్ళను తుడుసుకుందాం

మనకు బతుకునిచ్చిన బతుకమ్మలెత్తుకుని

నవ్వులపండుగ చేసుకుందాం రండ్రి

                                             –  ఎస్.హరగోపాల్

                                            చిత్ర రచన: ఏలే లక్ష్మణ్

మీ మాటలు

  1. బాగుంది, సర్,

  2. dasaraju ramarao says:

    ఎవలెవలు కొత్తతొవ్వల్ల దీపాలెత్తి పోయిండ్రు………నిజమే , అమరుల ఆత్మార్పణ తర్వాతనే తెలంగాణా పట్ల నిబద్దత పెరిగింది , అందరికి. మంచి వ్యక్తీకరణ .హరగోపాల్ గారు… అభినందనలు.

  3. నిజమే మన సంతోషాన్ని పంచుకోకపోతే ఎట్లా కడుపునిండుగా హాయిగా నవ్వితేనే కదా మన ఆనందం తెలిసేది
    బాగుందండి

Leave a Reply to rajani Cancel reply

*