ఒక్కోరోజు..

1173881_719118168118659_732866424_n

ఒక్కోరోజు..
ఎవరి భారాన్నో
వీపుమీద మోస్తున్నట్టు
ఆలోచన తిప్పుకోదు ఎటువైపు

ఒక్కోరోజు..
కాకి రెక్కలు కట్టుకొని
ఎక్కడికీ ఎగిరిపోదు
రావిచెట్టు రాలు ఆకుల నడుమ
ఏ పిచ్చుక పిచ్చిరాగం తీయదు

ఒక్కోరోజు..
శూన్యం మరీ సంకుచితమై
మూసుకున్న తలుపులు, కిటికీల మధ్య
అలికిడి లేని అలజడి అవుతుంది
బయటకు నడిచిపోదు గది ఎప్పుడు

1932330_10202661888241320_485832493_n

ఒక్కోరోజు..
ఒక కరస్పర్శ కోసం
ఒక కమ్మని కంఠధ్వని కోసం
అలమటిస్తుంటాం- స్వీయశిథిలంలో

ఈ మానవ మహా సముద్రం మీద
ఇరుకిరుకు ఒంటరి ప్రయాణం
కాసింత ఉప్పునీటి ద్రవం కోసం
ఒక ఎడారి గుండె గాలింపు.

– కాంటేకర్ శ్రీకాంత్

చిత్రరచన: అన్నవరం శ్రీనివాస్

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    ‘ఈ మానవ మహా సముద్రం మీద
    ఇరుకిరుకు ఒంటరి ప్రయాణం’

    జీవితం గురుంచిన ఫిలాసఫీ ని చక్కటి పదాలతో ‘ ఒక్కోరోజు లో” చాల అద్భుతంగా రాసారు శ్రీ కాంత్!
    మీ నుంచి మరిన్ని మన తరంగాలో రావాలని,అభినందన లతో
    మణి వడ్లమాని

  2. టి. చంద్ర శేఖర రెడ్డి says:

    ఒక మౌనవేదనని అక్షరబద్ధం చేసిన విధం, విధానం వినూత్న పద్ధతిలో ఉంది. ఎటువైపుని-ఎటువైపూ గా; పిచ్చుకని పిచ్చుకా గా; ఎప్పుడు ని, ఎప్పుడూ గా; మార్చి మీ కవిత ని కవి ముసుగు తొలగించుకొని పాఠకుడి ముసుగుతో నా కోసం ఒకసారి చదవండి. కవితాప్రవాహం సంతరించుకున్న వేగం విస్పష్టంగా మీకే అవగాహన అవుతుంది.

    డబ్బు నీటి ద్రవం నాకు అభ్యంతరం. నీరే ద్రవం-మళ్ళీ ద్రవం అనటం verbose. “కాసింత” పదాన్ని గుక్కెడుతో ప్రతిక్షేపించండి. ఒక కొత్త ఊగూ తూగూ మీకే మైమరుపు కలిగిస్తుంది.

    కవిత వేరే ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్లాలి. మధ్యలో కవి, పఠిత చేతిని వదిలేసిన అనుభూతి కలిగించరాదు.

    భవదీయుడు
    టి. చంద్ర శేఖర రెడ్డి
    09866302404

    • ధన్యవాదాలు సర్. మీ సూచనలను తప్పకుండా స్వీకరిస్తాను…

Leave a Reply to టి. చంద్ర శేఖర రెడ్డి Cancel reply

*