“అమ్మ” హేమలత తనకు తానే ఒక సైన్యం!

జోగిని బతుకుల్లో కాంతి "లత"

జోగిని బతుకుల్లో కాంతి “లత”

ఇది నా జన్మ భూమి

ఇది నా మాతృ భూమి
ఇది నా ప్రియతమ భారతి
దీని బాగు నా బాగు
దీని ఓగు నా ఓగు
“నా దేశం తప్పు అయితే దాన్ని దిద్దుతాను
నా దేశం ఒప్పు అయితే దాన్ని అనుసరిస్తాను ‘
అని కేక వేసిన ఒక దేశాభక్తుడైన నా సోదరుని కేకతో …
నా కంఠమూ కలుపుతాను …
అన్నదెవరో కాదు, మూఢ నమ్మకాలపై కన్నేర్రజేసి, తాయత్తు గమ్మత్తులను చిత్తు చేసి జోగినీ చెల్లెళ్ళ జీవితాల్లో వెలుగునింపిన, నేరస్థ జాతుల్ని జనజీవన స్రవంతిలో కలిపిన సంస్కరణోద్యమ ధీర వనిత,  కవికోకిల నవయుగ వైతాళికుడు జాషువా ముద్దుబిడ్డ కవితాలత హేమలత .   అమ్మ హేమలతాలవణం భౌతికంగా దూరమై అప్పుడే ఆరేళ్ళు.  కానీ ఆమె స్మృతులు  మా మదిలో సజీవంగానే ..  ఒక వ్యక్తిగా కాదు శక్తిగా ఆమె చేసిన సాంఘిక కార్యక్రమాలు కళ్ళముందు సజీవ చిత్రాలుగా కదలాడుతూనే ..
బాల్యములో అందరి ఆడపిల్లల్లాగే ఎదిగిన హేమలత వ్యక్తిత్వంలోకి తొంగి చూస్తే ఆవిడ ఏమిటో అర్ధమవుతుంది.
అస్పృశ్యత కూడా మూఢ నమ్మకమే . కుల భేదం , మత భేదం, మూఢ నమ్మకాలు … ఈ మూడూ మానవ కుటుంబాన్ని ముక్కలు చేసి వేరు చేసాయి.   నాటినుంచి ఈ నాటివరకు మానవ జాతి దీనిని ఎదుర్కుంటూనే ఉంది.  ఆనాడు మరీ కరుడుగట్టిన అజ్ఞానం, అగ్రకులం, కింది కులం, వారు గౌరవింప దగినవారు , వీరు దూరంగా ఉంచవలసినవారు అనే ఆచరణ పేరుకు పోయినరోజులు . ఒక్క మనుషుల మధ్యే కాదు ఈ బేధం . వస్తువుల మధ్య , పండుగల మధ్య , నీరు ఆహారాల మధ్య … అన్నింటి మధ్యా ఈ అంటరానితనం అడ్డుగోడ.   ఒక్క గాలి , ఎండ, వెన్నెలకే లేదు .  ఒక వేళ  వాటికీ అడ్డు పెట్టగలిగితే వీటిని కూడా అడ్డుకునే వారేమో !  అంటారామె .
బైబిలు చదివి , ప్రార్థనలు చేసి , తాతగారి క్రైస్తవ బోధనలు విని అప్పుడప్పుడు చర్చికి వెళుతుండే హేమలతతో ” అమ్మాయీ.., దేవుడు లేడు ” అనే మనిషిని చూసాను అన్న తండ్రి మాటలు దిగ్బ్రాంతి చెందించాయి.  ఆ మాటలు ఆమెను ఆకర్షించాయి.   తండ్రితో ఆ మాటలు అన్న వారిని చూడాలన్న, వారి మాటలు వినాలన్న జిజ్ఞాస గోరా, సరస్వతి గోరాలను కలవడానికి కారణమయింది.  వారి పరిచయం , వారు నడిపే “సంఘం” పత్రిక చదవడం ఆమె జీవిత విధానాన్ని మార్చివేశాయి. ఆమెను నాస్తికురాలిగా మార్చాయి.  గోరా , జాషువాల స్నేహం దిన దిన వర్ధమానమవుతున్న సమయంలో   గోరాగారి పెద్దకుమారుడు లవణం, జాషువాగారి  చిన్న కుమార్తె హేమలతకి పెళ్లి చేయ్యాలనుకున్నారు. సాంప్రదాయానికి విరుద్దంగా గోరాగారి ఆహ్వానంపై పెళ్ళికొడుకును చూడడానికి 1959 నవంబరులో జాషువా గారితో కలసి  హేమలత విజయవాడలోని నాస్తిక కేంద్రానికి వెళ్ళారు.  పెద్దలు అప్పటికప్పుడే వారి పెళ్లి 1960 జనవరి 12 వ తేదిన సేవాగ్రాం లో జరగాలని నిశ్చయించారు.
HEMALATHA LAVANAM___1
నాస్తిక కేంద్రంలో నిరాడంబరమైన జీవన విధానం హేమలతని ఆకట్టుకుంది.  కుల, మత రహిత సమాజం కోసం వారు తీసుకున్న నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆమెను ప్రోత్సహించాయి. గోరా గారి కుటుంబం ఏమి చెప్పే వారో అదే ఆచరించే వారు.  కట్న కానుకలకు , ఆడంబరాలకు తావేలేక పోవడం ఆమెను ఆకర్షించింది.
పెళ్ళికోసం సేవాగ్రాం వెళ్ళగానే ఆమెకు కలిగిన భావాలిలా అక్షరీకరించారు
“ఇదే నాడు శాంతి నివాసం
అదే నాదు బాపూ వాసం
ప్రేమఝరులు ప్రవహించేనిచ్చట
సత్యాహింసలు మొలచెనిచ్చట
శాంతి సస్యములు పడిన విచ్చట
త్యాగ చంద్రికలు విరిసిన విచ్చట
………
వినుకొండలో పుట్టి పెరిగిన హేమలత చదువు మద్రాసులో సాగింది. ఆమెకు తల్లిదండ్రులు , స్నేహితులు , బంధువులు , నవలలు, జీవత చరిత్రలు , సాహితీ గ్రంధాలు, సాహితీ సమావేశాలూ  తప్ప సామాజిక జీవన పరిస్థితులు తెలియదు. అత్తవారింట అందుకు భిన్నమైన వాతావరణం.  సాంఘిక దృష్టి, సాంఘిక సమస్యలు, సమాజపు మార్పు , నాస్తిక జీవన విధానం , సత్యాగ్రహాలు, శాస్త్రీయ పరిజ్ఞానం … కార్యక్రమాలు.. అంతా కొత్తగా .. అందరూ ఆప్యాయంగా  నాస్తిక జీవన విధానానికి అలవడుతున్న ఆమె ఆలోచనల్లో మార్పు. భావాల్లో మార్పు .. భయాలు పోయి మనసు విచ్చుకుంది.
మన వ్యక్తిత్వం మన జీవితాన్ని నడుపుతుంది.  అయితే జీవితపు దిశ , నిర్ణయం మలుపులు మన చేతిలోనే ఉంటుంది . అలా మన చేతుల్లో దిశా నిర్ణయం లేకుంటే మన జీవితపు దిశ ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది  అంటారు అమ్మహేమలత  .
నాస్తికమార్గంలో .. 
వివాహానంతరం అత్తింటికి చేరిన ఆమె ఉదయం లేచి చూసిన దృశ్యం వారి పూరింటి ముందు మామ గోరా ఊడుస్తూ , గేదెల పాకలో అత్త సరస్వతి పాలు పితుకుతూ , ఉసిరి చెట్టు నీడలోనున్న పాకలో లవణం, విజయం, సమరం ప్రెస్లో , మైత్రి, విద్యలు రాత్రి భోజనం తాలుకు అంట్లగిన్నెలు తోముతూ . కేంద్రమంతా ఎప్పుడో మేల్కొంది.  ఆలస్యమైనందుకు సిగ్గు పడింది. వారిపనులు వారు చేయడం, పనుల్లో ఆడ మగ తేడా లేకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది.  కులమత అడ్డు గోడలు లేని ఈ మానవ కేంద్రం ఆమె ప్రపంచాన్ని విశాలం చేసింది. విశ్వపుటంచుల్ని తాకి నిల్చేలా చేసింది. నాస్తిక జీవన విధానం లోని నిర్భయత్వాన్ని రుచి చూసింది.
ఒకరోజు హేమలత తాత గారు ఆమెను చూడడానికి వచ్చారు.  మాటల్లో అమ్మాయీ భగవంతుని ధ్యానం మరువ లేదు కదా అని అడిగారు.  నేను నాస్తికురాలిగా మారిన తర్వాతే ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ దేవుడు , పూజ , ప్రార్ధన అనే వాటికి తావు లేదని చెప్పి ఆయన కోపానికి గురైంది. చిరునవ్వే ఆభరణంగా , ఖద్దరు లేదా నేత బట్టల్లో ఆమె నిరాడంబర నాస్తిక జీవన మార్గంలోనే జీవించింది.
సంస్కరణ – నేపథ్యం  
హేమలత పెళ్ళయిన తర్వాత లవణం గారితో కలసి వినోభాభావే పాదయాత్ర జరుగుతున్న చంబల్ లోయకు వెళ్ళారు.  ఆ సమయంలో బందిపోట్ల క్రూర బీభత్సాన్ని , వారి హత్యల రక్తంతో తడిసిన భూమిని శాంతి ధామంగా మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు వినోభా .
ఆ రోజు అర్దరాత్రి దాటాక బందిపోట్లు లొంగిపోవడానికి వినోభా దగ్గరకు వస్తున్నారన్న వార్త  హేమలతని భయకంపితురాలిని చేసింది.  మాములుగానే దొంగలు అంటే వణికిపోయే సున్నిత మనస్కురాలైన హేమలత .. ఆ అర్ధ రాత్రి , ఆ లోయల్లో .. అంధకారంలో .. బందిపోటు దొంగలు ..  గజ గజలాడింది. మరుసటి రోజు ఆ బందిపోట్ల నాయకుడు పూజారి లుక్కారాం ‘బహెన్ బహెన్ ‘ అని పిలువడంతో ఆమె భయం పోయింది.  ఆ సంఘటన వాళ్ళూ మనుషులే కదా అన్న ఆలోచనకు , తర్వాతి కాలంలో స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణకు బీజం వేసింది.
వాసవ్య విద్యాలయం 
హింస కాదు అభివృద్ధి  – అహింస అభివృద్ధి
హింస కాదు పరిష్కారం  – శాంతి పరిష్కారం
అని నమ్మే హేమలత గోరా గారి ఆలోచన ప్రకారం ‘వాసవ్య విద్యాలయం ‘1961లో తన పెద్ద ఆడపడుచు మైత్రి తో కలసి ప్రారంభించారు. వాస్తవికత,  సంఘదృష్టి, వ్యక్తిత్వం లక్ష్యంగా నిర్వహించిన ఆ విద్యాలయంలో చదువంటే భయం లేకుండా, వత్తిడి లేకుండా ఆనందంగా బోధనా సాగేది.  spare the child, spoil the rod అన్న విధానంలో సాగేది విద్య.
 కులాంతర వివాహాలు 
కులాంతర , మతాంతర వివాహాలు అతి తక్కువగా ఉన్న సమయంలో కులాంతర , మతాంతర వివాహం చేసుకున్న హేమలత ఆ తరువాతి కాలంలో భర్త, అతని కుటుంబంతో కలసి  ఎన్నో కులాంతర , మతాంతర వివాహాలు జరిపించారు.
‘నా వివాహంతో నా  పుట్టింట మూసుకున్న కులాల మతాల తలుపులూ తెరుచుకున్నాయి . విశ్వమానవతా  పవనాలు చొరబడ్డాయి.  ఈ వివాహంతో చిన్నక్క కుటుంబంలో అన్నీ సమ సమాజ నిర్మాణానికి బాటలు వేసిన వివాహాలే జరిగాయి. స్వార్థపూరిత సాంఘిక కట్టుబాట్లను తెంచి ఈనాడు అందరూ అర్హమైన పదవుల్లో అలరారుతున్నారు’ అంటారు హేమలత
040
సంఘసంస్కర్తగా … 
మన దేశంలో స్వాతంత్రం  రాక ముందు ఎన్నో సంస్కరనోద్యమాలు జరిగాయి. కానీ స్వాతంత్ర్యానంతర ఉద్యమాలు రెండే రెండు అనుకుంటా .. ! అవి నేరస్థుల సంస్కరణ, జోగినీ దురాచార నిర్మూలన.  ఆ రెండూ హేమలతాలవణం దంపతుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం.
స్టువార్టుపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అక్కడి గజదొంగలే. ఆ పేరు వింటేనే అంతా  ఉలిక్కి పడతారు.  అలాంటి చోటుకి 1974లో హేమలత అడుగుపెట్టారు.  అది మామూలు అడుగు కాదు. ఒక సాహసోపేతమైన అడుగు. ఒక వినూత్నమైన సంస్కరణకు మార్గం వేసిన అడుగు.  వినోభా బావే నుండి పొందిన ఉత్తేజం ఆమెను ఆ అడుగు వేయించింది. అదే ఆమెనీ సాహస కార్యానికి పురిగొల్పింది.
అటు దొంగలకు ఇటు పొలీసు అధికారులకు మధ్య వారధిలా ఉండి సమావేశాలు నిర్వహించడం, ఆ దొంగల ఇల్లు ఇల్లు తిరిగి వారి జీవన స్థితిగతులు తెలుసుకోవడం … ఈ క్రమంలోనే వారికి ఆమెపై ఆమె చేసే కార్యక్రమాలపై నమ్మకం ఏర్పడింది.  ఆమె జీవన సహచరుడు లవణం, గోరాగారి కుటుంబం ఆమె పక్కన నిలబడి అండగా నిలిచి మనో ధైర్యాన్ని నింపారు. .
సువార్టుపురం వెళ్ళినప్పుడు వాళ్ళు కాఫీ ఇచ్చినా , భోజనం చేయమన్నా స్వీకరించేది కాదు.  మీరు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతో పెట్టే తిండి నాకు వద్దు.  మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనే స్వీకరిస్తాను అని నిర్మొహమాటంగా ఆమె చెప్పిన మాటలు వారిని బాధించినప్పటికీ, వారి మనస్సులో ఆలోచనను రేకెత్తించాయి.  కరుడుకట్టిన జీవితాల్లో మార్పుకు దోహదం చేశాయి.
1975లో “మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు  పొలీసు వారి నుండి రక్షణ కల్పించండి .  వాళ్ళ హింసకు తాళలేక పోతున్నాం ”  అని విన్నవించిన కుటుంబాల్లో నేడు సామాజిక మార్పు.  ఆ మార్పు పరిమాణం స్పష్టంగా ప్రపంచానికి అగుపిస్తూ… వారి ఆలోచనల్లో కొత్తదనం, తరతరాలుగా వస్తున్న నేరసంస్కృతిని, ప్రవృత్తిని చేధించే తత్వం .. సంకల్పమ్. జనజీవన స్రవంతిలో కలసిపోవాలన్న ఆరాటం .. మూడు తరాల సాంఘిక చైతన్యం కనిపిస్తుంది వారి మాటల్లో, నడతలో .
ఎంత గాడాంధకారంలోనైనా సన్నని వెలుగు కనిపించి మనకి మార్గం చూపుతుంది. అదే విధంగా ఎంతటి దుర్మార్గులలోనైనా మంచి ఎంతో కొంత ఏ మూలో దాకుని ఉంటుంది అని నమ్మి ఆ మంచి వెతుక్కుని దాని ఆసరాతో ముందుకెళ్ళే ఆశా జీవి హేమలత.  నేరస్థ సంస్కరణోద్యమంలో ఓ వైపు దొంగల్ని, మరో వైపు పోలీసుల్ని, ఇంకో వైపు సమాజం అన్నింటినీ సమన్వయ పరుచుకుంటూ పనిచేస్తూ ముందుకు సాగిన ధీర ఆమె.
దాదాపు నలబై ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న నేరస్తుల సంస్కరణోద్యమ కార్యక్రమాలు  ఇక అవసరం లేదనుకుంటా .. కారణం ఇపుడక్కడ బతకడం కోసం దొంగతనం చేసేవాళ్ళు, దొమ్మీలు , లూటీలు చేసే వాళ్ళు లేరు. వారి పిల్లలు చదువుకున్నారు. చదువుకుంటున్నారు.  శ్రమ జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి జీవితాల్ని వారు అమ్మ హేమలతాలవణం , ఆమె నెలకొల్పిన సంస్కార్.
అమ్మా అన్న పిలుపు 
దొంగతనానికి వెళ్ళినప్పుడు అయిన గాయం సలుపుతుంటే బల్లాని అంకయ్య అనే వారెంటు ఉన్న దొంగ బాధపడుతున్నాడు. అతన్ని పోలీసుల పర్మిషన్ తో ఆసుపత్రికి తీసుకెళ్ళింది హేమలత. బాధనుంచి ఉపశమనం పొందిన అతను మరుసటి రోజు హేమలతను కలసి “అమ్మా ! మీ దయ వల్ల  నొప్పి తగ్గింది. బాగా నిద్ర పోయాను తల్లీ !’ అన్నాడు ఆమె పాదాలకు నమస్కారిస్తూ .. అలా మొదటి సారి అతని నోట  అమ్మా అన్నపిలుపుతో పులకించిన హేమలత ఆ తర్వాతి కాలంలో వేలాది మందికి ‘అమ్మ ‘ అయింది. అది ఆమెకు బిరుదుగా మారింది.
జోగినీ దురాచార నిర్మూలన 
ఓ పక్క నేరస్థుల సంస్కరణ కార్యక్రమాలు, మరో పక్క కులరహిత సమాజం కోసం పనిచేస్తూ, ఉప్పెన వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందువరస నిలిచి ఆపన్నులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.  హేమలతాలవణం దంపతులు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలిసిన ఆనాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి ఆనాడు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు పని చేయవలసిందిగా ఆహ్వానించారు.  ఆ విధంగా జోగిని దురాచారాన్ని గురించి తెలుసుకున్న అమ్మ తీవ్రంగా చలించింది.  ఈ నాగరిక సమాజంలో సాంప్రదాయం ముసుగులో  అలాంటి అమానవీయ ఆచారాలు  కొనసాగడం, అణగారిన వర్గాలలోని మహిళలు ఆ ఆచారపు కోరల్లో చిక్కి గిజగిజలాడిపోవడం ఆమెను చలింపజేసింది.  వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎంత కష్టనష్టాలకైనా ఎదురొడ్డి నిలవాలని నిర్ణయించుకున్నఅమ్మ వెంటనే కార్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది.  బలంగా వేళ్ళూనుకుని ఉన్న దురాచారాన్ని రూపుమాపాలంటే ఈ దురాచారం గురించి ప్రజలలో ప్రచారం చేయడమే కాకుండా ఒక చట్టం అవసరమని భావించింది హేమలత.  ఆవిడ సంస్కార్ సంస్థ ద్వారా గట్టి ప్రయత్నం చేసింది. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చింది. ఫలితంగా  జోగిని, బసివి, మాతమ్మల దురాచార నిర్మూలనా చట్టం 1988లో వచ్చింది.
సమాజం అంగీకరించిన , సాంప్రదాయం ఆమోదించిన వికృతాచారపు కోరలనుండి వేలాదిమంది మహిళలు బయటపడేలాచేయడమంటే సామాన్య విషయం కాదు.  ఎంతో ప్రతిఘటన ఎదుర్కొంది.  దుర్భర దారిద్యంలో నిత్యం అవమానాలు అవహేళనలతో, తమ శరీరంపై తమకి హక్కులేని స్థితిలో  ఇది తమ తలరాత అనుకునే వారి తలరాతను మార్చింది అమ్మ. వారిని గౌరవంగా చెల్లీ అని పిలిచి సమాజం చేత కూడా అలా పిలిపించుకునే గౌరవాన్నిచ్చింది.
‘ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వెన్నెలా నీ బతుకు నల్లనీ రేతిరలే
ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వన్నెలా ని బతుకు వాడినా జోగిలా
ఓ! పోశవ్వ చెల్లీ!  ఓ లచ్చవ్వ తల్లీ !
ఎందుకున్నా వమ్మా మౌన మునిలా ?!
తిరగబడి నీ బ్రతుకు దిద్దుకో చెల్లెలా
ఎవరు మూశారమ్మ నీ నోరు మూగలా?!
నోరిచ్చి నీ పరువు నిలుపుకో చెల్లెలా
………………
నిప్పులే చెరుగమ్మా చెల్లెలా !
జోగి యాచారమ్ము బుగ్గి బుగ్గైపోవ !
నిప్పులే చేరుగమ్మ చెల్లెలా
బసివి యాచారమ్ము నుగ్గు నుగ్గై పోవ
అంటూ అమ్మ జోగినీ చెల్లెళ్ళని చైతన్యం చేశారు. ప్రశ్నించడం నేర్పారు. పెద్దలకు, భూస్వాములకు వినపడేలా ఒక నగారా మోగించారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు , ఆటుపోట్లు .. అన్నీ అధిగమిస్తూ ఆత్మవిశాసంతో సాగారు హేమలత.
 అమ్మ చేసిన అనేక సాహసోపేత నిర్ణయాలు, కార్యక్రమాల వల్లే  వారూ , వారి కుటుంబాలు ఇప్పుడు  గౌరవనీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు .  ఇప్పుడు వారికి అవమానం అంటే తెలిసింది. గౌరవప్రదమైన జీవితం ఏమిటో ఆర్ధమైంది.  నేడు నిజామాబాదు జిల్లాలో జోగిని ఆచారం రూపుమాసింది.  ఇప్పుడు వారి కుటుంబాల్లో పిల్లలకి కూడా జోగుపట్టం గురించి తెలియదు.  ప్రభుత్వం , సంస్కార్ సహకారంతో వారి జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చేసిన అమ్మ హేమలత ఎందరికో ఆరాధ్యనీయురాలు.
ఎన్ని సత్కారాలైనా తక్కువే!

ఎన్ని సత్కారాలైనా తక్కువే!

జాషువా ఫౌండేషన్ 
దారిద్ర్యం అంటే ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అందునా మహోన్నతమైన భావాలను నింపుకొని అక్షర వ్యవసాయం చేసే కవులెందరో అనుభవించిన దారిద్య్ర్యాన్ని కనులారా చుసిన్దామే. కవి పుత్రి అయిన హేమలత కవులను సన్మానించి, సమాదరించాలని భావించింది. కన్న తండ్రి జాషువా జ్ఞాపకార్ధం జాషువా ఫౌండేషన్ ద్వారా వివిధ భారతీయ భాషల్లోని ప్రముఖ సాహితీ వేత్తలను గుర్తించి వారికి జాషువా సాహిత్య పురస్కారం అందించారు.
గౌరవ డాక్టరేట్ అందుకుంటూ...

గౌరవ డాక్టరేట్ అందుకుంటూ…

రచయిత్రిగా 
నేరస్థుల సంస్కరణ అనుభవాలతో రాసిన పుస్తకాలు రెండు. ఒకటి నేరస్తుల సంస్కరణ , జీవన ప్రభాతం.  ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం పొందింది.  జోగినీ దురాచార నేపథ్యంలో నవల రాస్తున్న క్రమంలోనే అమ్మ మనకు దూరం కావడం సాహితీ లోకానికి ఎనలేని లోటు.  అసంపూర్తిగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆమె జీవన సహచరుడు లవణం గారు మనముందు ఉంచే ప్రయత్నంలో ఉన్నారు. మా నాన్నగారు , అహింసా మూర్తుల అమరగాదలు, జాషువా కలం చెప్పిన కథ, తాయత్తు గమ్మత్తు , మృత్యోర్మా అమృతంగమయ వంటి పుస్తకాలు వెలువరించారు అమ్మ.
HEMALATHA LAVANAM___2
నాకు కులం లేదు , మతం లేదు అనే అమ్మ హేమలత వటవృక్షంలా నిలిచి చేయి చాచి ఆపన్నులకు ఇచ్చిన చేయూతని, తద్వారా వారి కుటుంబాల్లో నిండిన వెలుగుని అనుభవిస్తున్న వారు  ఎప్పటికీ మరువలేరు.  సంస్కరణలో అలుపెరుగని యోధ , మానవతావాది , అహింసావాది అమ్మ హేమలతాలవణం బిడ్డలలో నేనూ ఒకరిని.  ఆమె బిడ్డలందరి తరపున అమ్మకి అక్షరాంజలి ఘటిస్తూ.. .
వి . శాంతిప్రబోధ

మీ మాటలు

*