పున్నాగపూల పరిమళం !

2(1)

ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి.
‘‘కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలేయాలి. కొన్ని పుస్తకాలని చదివి జీర్ణం చేసుకోవాలి.’’  అని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న జ్ఞాపకం. అలా చదివి జీర్ణం చేసుకోవల్సిన పుస్తకం ఎదురైతే మనం మనలాగా ఉండలేము కదా! అందుకే మరో వైపు మిత్రులతో ఈ సంభాషణ.
‘‘దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి తన అవసరాల కోసం వస్తువులను సృష్టించుకొన్నాడు. వస్తు మయ ప్రపంచంలో మనిషి మస్తుగా కూరుకుపోయిన తరువాత సాటిమనుషులను తనను సృష్టించిన దేవున్ని ప్రేమించడం మానేసి వస్తువులను ప్రేమించడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మనిషి మనిషిలాగా లేకుండా ఒక వస్తువులాగా మారిపోయాడు.’’ అని తరచూ ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఉపన్యసిస్తూఉంటారు.
ఒక వస్తువుగా మారిన మనిషి మరలా మనిషిగా మారాలంటే ఏం చేయాలి? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆహ్లాదంగా ఉంచడానికి మనిషిలో ఎలాంటి మెటామార్ఫసిస్‌ జరగాలి? అతడి అంతరంగంలో ఎన్ని యుద్ధాలు జరగాలి? ఈ సంగ్రామంలో ఎన్ని సార్లు క్షతగాత్రులవ్వాలి?
”The Greatest Discovery of My Generation is that Human beings by changing the inner attitudes of their needs can change the outer aspects of their lives”    అని కదా హెన్రీజేమ్స్‌ అన్నది. తమ తమ సోకాల్డ్‌ అవసరాల అంతర్గత దృక్పధాలను ఎలా మార్చుకోవాలి. అలా మార్పును పరిపూర్ణంగా పొందే ప్రాసెస్‌ ఎంత హృద్యంగా, ఎంత సహజంగా జరగాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే నేను ఇటీవల చదివిన పుస్తకం. ఆ పుస్తకం పేరు పున్నాగపూలు. ఒక తెలుగు నవల. రచయిత్రి జలంధర.Jalandhara Garu
పున్నాగపూలని ఒక నవల అనడం కంటే అనేకానేక బాధిత వ్యక్తిత్వాలు అనే పున్నాగపూలను మార్పు కోసం చేసే ప్రయత్నం అనే దారంతో గుదిగుచ్చి పాఠకుడి మెడలో వేసిన వసివాడని హారం అంటే బాగుంటుంది.
రాధ ఒక అందమైన మంచి అమ్మాయి. మంచి ఇల్లాలు. మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్‌ రోల్‌ లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారయిపోతారు. అట్లా రూపుదిద్దుకున్న ఇల్లాలు రాధ.
సదరు రాధ తన భర్త రాజారావుకి జబ్బుచేస్తే జి.కె. హాస్పిటల్స్‌లో చేర్పించడానికి వెళుతుంది. అక్కడ హాస్పటల్‌ లో తనను తాను పూర్తిగా కనుగొని, సంపూర్ణమైన వ్యక్తిగా తయారు కావడం ఈ నవల యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇలా మారడం అనేది ఒక రోజులోనే, ఒక రాత్రిలోనో, ఒక క్షణం లోనో జరిగిన మెటామార్ఫసిస్‌ కాదు. హాస్పిటల్‌కి వచ్చే రక రకాల వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళకు ఎదురైన సమస్యలు, వాళ్ళు ఎన్నుకున్న పరిష్కారాలు ఇవన్నీ రాధను సంపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా రాధ ఆలోచించడం నేర్చుకుంటుంది.
ఈ క్రమంలో జలంధర తనదైన స్వరంతో చాలా విషయాలు మాట్లాడింది.
‘‘పిల్లలను పెంచుతూ మాటలు నేర్పిస్తాము. పాటలు నేర్పిస్తాము. టేబుల్‌ మేనర్స్‌ నేర్పిస్తాము. ఆలోచించడం మాత్రం చాలా తక్కువ సార్లు నేర్పిస్తాము. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగిచూడగలమో, ఆ తలపు తీయడమెలాగో మాత్రం నేర్పించము. తెలివితేటలు నేర్పించే చదువు వేరు. వివేకము జీవితానికి అది ఇచ్చే ఎరుక వేరు. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. కాని నేర్పించము’’. అంటుంది జలంధర.
నిజమే! మన పిల్లలకి మనం ఆలోచించడం నేర్పిస్తున్నామా? గర్భస్త పిండంగా ఉండగానే కార్పోరేట్‌ స్కూలుకి డొనేషన్‌ ఇచ్చి సీటు రిజర్వు చేసుకొంటాము. 3వ ఏట నుండే, వీలుంటే ఇంకా ముందే ప్రీ స్కూల్‌లకి పంపిస్తాము. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించడమే నాణ్యమైన విద్య అందించడం అనుకుంటాము. కానీ ఆ విద్య పిల్లలను మరమనుషులుగా మారుస్తున్నదని గుర్తించము. తీరా వాళ్ళు మనం ఆశించినట్లుగా తయారవకపోతే నింద మాత్రం మొత్తం వ్యవస్థ మీద వేస్తాము.
ట్రూత్‌ కెనాట్‌ బి టాట్‌
టీచింగ్‌ మీన్స్‌ హెడ్‌ టు హెడ్‌
ట్రూత్‌ ఈజ్‌ ట్రాన్స్‌మిషన్‌
ఫ్రం హార్ట్‌ టు హార్ట్‌
అన్న విషయం మనకే తెలియదు. మనం పిల్లలకి ఏం అనుభవం లోకి తీసుకొనివస్తాము. పై పెచ్చు మన మిడి మిడి జ్ఞానంతో వాళ్ళ ఆకుపచ్చటి లోకాన్ని పాడుచేస్తాము. శరీర శాస్త్రం ప్రకారం మనిషికి ఒక మెదడు ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా మనిషికి హెడ్‌ బ్రెయిన్‌, బాడి బ్రెయిన్‌ అని రెండు రకాల మెదడులు పనిచేస్తాయి.ఈ రెండిరటిని సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరు వేరని కొంతమందిని చూస్తే తెలుస్తుంది. మన లోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచనా స్రవంతులు తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల మెదడులు, వాటి ప్రభావం మన మర్చిపోకూడదు.
పసిపిల్లలు సాధారణంగా తమ బాడీ బ్రెయిన్‌ చెప్పిన మాటను వింటారు. వాళ్ళకు ఇష్టం లేనివి వద్దు అనుకుంటారు. నచ్చని పిల్లలను దగ్గరకు రానివ్వరు. మనం మన పెంపక దోషంతో ముందు పిల్లల ఇష్టా ఇష్టాలను అర్ధం చేసుకోకుండా మనకు మంచిది అన్నది. వాళ్ళమీద రుద్దుతారు. మన ప్రవర్తన, మన మాట వలన ఎదుటివాళ్ళు ఏం అనుకుంటారో, నిజం చెప్తే అంటూ మెల్లగా పిల్లలను ఆ బాడి బ్రెయిన్‌ విస్మరించి హెడ్‌ బ్రెయిన్‌తో ఆపరేట్‌ చేయించడం నేర్పిస్తాము.
మన బాడీ బ్రెయిన్‌ మన గురించి నిజాలు చెప్తుంది. మన హెడ్‌ బ్రెయిన్‌ నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్‌ అవుతుందో నీ నుండి ఏం కోరుకుంటుందో చెప్తుంది. మన అసలు భరించలేని మనుషులను ఒప్పుకొని భరిస్తే మిగతా ప్రపంచం మనల్ని సహన శీలి అని, మంచి వ్యక్తి అంటారనే ఆలోచనతో వాళ్ళను భరిస్తాము. ఈ భరించడం వెనుక హెడ్‌ బ్రెయిన్‌ ఉంటుంది. కానీ మన బాడి బ్రెయిన్‌ అనుక్షణం సన్నటి గొంతుకతో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది కాదు నీకు కావలసిందీ అని. బాడీ బ్రెయిన్‌ని ఎంత త్వరాగా మనం గుర్తిస్తే మనకది అంత త్వరగా మంచి గైడ్‌ అవుతుంది.
ఠాగూర్‌ అనే తెలుగు సినిమాలో శవాన్ని హాస్పిటల్‌కు తీసుకొని వస్తే నానా హడావుడి చేసి డబ్బు సంపాదించే డాక్టర్ని మన చూశాం. కాని ఈ జి.కె. హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్‌ కృష్ణ అలాంటి డాక్టర్‌ కాదు. ఒక పేషెంటు తన సంతోషం కొద్దీ కోటి రూపాయలు తెచ్చిఇస్తే ఆ డబ్బును తీసుకోకుండా చెడుమార్గంలో వచ్చిన డబ్బు చెడు వైబ్రేషన్స్‌ని కలుగజేస్తుందని తిప్పి పంపిస్తాడు. ప్రతి మనిషి ఇలాంటి హాస్పిటల్‌ ఒకటి మన దగ్గర ఉంటే ఎంత బావుంటుంది అనుకునేంత బావుంటుంది ఈ హాస్పిటల్‌. లోపలికి వెళ్ళగానే కనిపించే మొదటి బోర్డు మీదే ఇలా వుంటుంది.
Here the Patient understands that body heals, and not the Therapy  ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటానికి హాస్పిటల్‌లో రక రకాలు పద్దతులు అవలంభిస్తారు. ధ్యానం నుండి చిత్రలేఖనం దాకా. ఈ పద్దతులను చదువుతున్నపుడు మనం మొదట్లో ఆశ్చర్యపోతాం. కాని వాటి వెనుక ఉన్న రీజన్‌, తర్కము తెలిస్తే అద్భుతం అనిపిస్తుంది.
19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కేవలం నొప్పి తగ్గించడానికి మందు వేసుకొనే పద్దతి అమలు లోకి రాగానే వీలయినంత వరకు నొప్పికి కారణాలను అన్వేషించడం మనిషి మానేశాడు. ఎప్పుడైతే ఫిజికల్‌ పెయిన్‌ కి ఫిజికల్‌ లెవల్‌లో మాత్రమే కారణాలు వెతికి అంతర్లీనమైన కారణాలను కొంపలు అంటుకుపోతే తప్ప వెతకడం అనవసరం అనే స్థితికి వైద్యుడు, పేషెంటు ఇద్దరూ వచ్చేశారో అప్పుడే వైద్య రంగంలో మందులు పెరిగి నిజమైన వైద్యం తగ్గుముఖం పట్టింది. మనిషిలోగల అంతర్గమమైన శక్తికి ప్రాముఖ్యం తగ్గిపోయింది.
ఈ అంతర్గతమైన శక్తిని పునరుత్తేజితం చేయడానికే ధ్యానం. ఎఫర్మేషన్స్‌. ఎఫర్మేషన్స్‌ అనగానే మనకు మంత్రోపదేశం గుర్తుకొస్తుంది కదా. జలంధర ఇలా అంటోంది. ‘‘అర్దం చేసుకొని చదివితే అవన్ని ధ్యాన శ్లోకాలు. విజువైలేజేషన్‌ టెక్నిక్స్‌. సంకల్పాలు, స్తోత్రాలు, ఫల స్తుతులు, అఫర్మేషన్స్‌!’’ న చమాత్సార్యం, న లోభో, నాశుభామతి:’’ అని రోజు చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. వాటికి అర్దంతో పాటు సౌండ్‌, వైబ్రేషన్‌ కలిపి ప్రాక్టీస్‌ చేసినపుడు మన లోపల, మన ఆరాలోను, చుట్టుప్రక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది. అలా నీ వైబ్రేషన్స్‌కి తగిన మంత్రం ఇచ్చి నీ వైబ్రేటరీ లెవెల్స్‌ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం. కొంత మంది గురువులు తాము సిద్ది పొందిన మంత్రం ఇవ్వగలరు. కాని నీ జన్మకు ఏది కావాలో తెలుసుకొని, నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి, తన ఆత్మ శక్తితో నిన్ను నిరంతంర గైడ్‌ చేస్తూ జన్మ జన్మలకు కాపాడుకుంటూ వచ్చే గురువు దొరికితే అద్భుతం’’
నిజం. శ్రీ చక్రార్చన నిత్యం చేసేవాళ్ళు, గురువు దగ్గర మంత్రోపదేశం పొంది నిత్యం ధ్యానించేవాళ్ళ చాలామంది మొహాల్లో కనపడవలసినంత ప్రశాంతత కనపడదు. కొద్ది మంది బాబాలు గురుదేవులు కూడా ఇందుకు మినహాయింపుకాదు.
ఇక్కడ నా వయక్తిక అనుభవాన్ని ఒక దానిని చెప్తాను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు పనిచేస్తున్న బ్రాంచికి బదిలీ అయి వచ్చాను. మొదటి వారం రోజులలోనే ఒక వంద మంది దాకా నన్ను బాబాగారి దర్శనం అయిందా అని ప్రశ్నించారు. అప్పటిదాకా ఒక బాబా ఆ ఊళ్ళో ఉన్నాడని తెలుసును కాని, అంతగా జనాన్ని ప్రభావితం చేశాడని నాకు తెలియదు. పైగా ఆ బాబాగారు నిత్యాన్నదానం కూడా చేస్తారు. అప్పటికే పాల్‌ బ్రంటన్‌తో మొదలుపెట్టి చాలా పుస్తకాలు చదివి ఉండటం చేత బాబా అంటే అంతర్గతంగా ఉన్న ఉత్సుకతతో, ‘‘సత్సంగత్‌యే, నిత్సంగత్వం, నిత్సంగత్వవే నిర్మోహత్వం’’ అని భజగోవిందం శ్లోకం చదువుకుంటూ బాబా గారిని దర్శించుకుందామని ఒక మధ్యాహ్నం వేళ వెళ్ళాను. నేను వెళ్ళే సరికే అన్న దానం కార్యక్రమం జరుగుతోంది. అది అయిపోయింతర్వాత బాబాగారి దర్శన బాగ్యం కలిగింది. బాబా అంటే ఆశ్రమ వాతావరణం ఉంటుందనుకున్నాను. కాని అది మూడంతస్తుల బిల్డింగు. ఏదో కనస్ట్రక్షన్‌ వర్కు జరుగుతున్నది. బాబాగారు పనివార్లకు సూచనలు ఇస్తున్నారు. ఆయన కుడిచేతి రెండు వేళ్ళ మధ్య నిత్యాగ్ని హోత్రంలాగా రగులుతున్నది సిగరెట్టు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బాబాగారి కాళ్ళమీద పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న సాయిరాం స్వీట్స్‌ ప్యాకెట్టులోనుండి తీసి తలా ఒక లడ్డూ ఇచ్చారు. దాన్నే మహా ప్రసాదం అనుకొని అందరూ తీసుకొన్నారు.
బాబా అన్న మాట వినగానే, ఆశ్రమానికి వెళుతున్నపుడు, నా మనసులో కౌపీనం కట్టుకొని కూర్చొని మౌన ముద్రలో ఉంటే, చుట్టూ చేరిన కోతులు అల్లరి చేస్తూ మహా చిరాకు పెడుతున్న ధ్యాన ముద్ర చెదరని మహా మౌని ముద్ర ఉంది. ఈ బాబా రూపు చూడగానే నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. ఇలాంటి బాబా ఎలాంటి ఎఫర్మేషన్స్‌ ఇస్తాడు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను మొదటి సారి కలిసిన బాబా ఉదంతం ఇది.
ఇప్పుడు మంత్రోపదేశం గురించి జలంధర రాసిన ఈ మాటలు చదువుతుంటే నాకు అనివార్యంగా ఈ బాబా గుర్తుకొచ్చారు.
ఐ లవ్‌ మై సెల్ప్‌, ఐ యాక్సెప్ట్‌ మై సెల్ప్‌. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ బలహీనతలు బలాలు అన్నింటితోనూ నిన్ను నీవు ఒప్పుకోగలగటం ఎంత కష్టమో ప్రాక్టీసు చేస్తుంటే కాని అర్ధంకాదు. ఎదుటి వారిని ప్రేమించగలిగిన వాళ్ళు చాలా మంది త్యాగాలు చేస్తూ అనాధలకు సేవలు చేస్తూ త్యాగమూర్తులుగా కనపడేవాళ్ళు చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు. తమను తాము భరించలేరు. అన్నింటిలోకి తనను తాను భరించడమే కష్టం అంటుంది జలంధర.
ఇలా ఈ నవల గురించి ఎంతయినా చెప్పవచ్చు. ఏ కథతో అయితే జీవింతంలోని ఒక భాగం అర్ధం అయినట్లు ఉంటుందో అది మంచి కథ అని పెద్దిభొట్ల  సుబ్బరామయ్యగారు ఒక సారి అన్నారు. అది నవలకు కూడా వర్తిస్తుంది. ఈ పున్నాగ పూలు ఒక సారి చదవండి. మీ మానసిక ప్రపంచంలో ఏదో ఒక తలుపు తప్పక తెరుచుకుంటుంది.
ఈ వ్యాసంలో చాలా మాటలు నావి కాదు. అవన్నీ జలంధరవి. అందుకే ఈ వ్యాసం జలంధరతో కలసి వంశీరాసిన వ్యాసమని మీరనుకుంటే నాక్కొంచెం తృప్తి.

—వంశీ

మీ మాటలు

  1. Vijaya Karra says:

    మంచి నవలని పరిచయం చేసారు – త్యాంక్స్.

  2. పబ్లిషర్ ఎవరు? ఎక్కడ దొరుకుతుంది ఈ బుక్?

    • మైథిలి అబ్బరాజు says:

      నవోదయ పబ్లిషర్స్ విజయవాడ

  3. మైథిలి అబ్బరాజు says:

    జలంధర గారి గురించీ పున్నాగపూల గురించీ రాసినందుకు ఎన్నో ధన్యవాదాలండీ

  4. ఈ వారమే నేను ఈ పుస్తకం చదవడం పూర్తి చేసానండి. ఇంకా ఆ పుస్తకంలోని విషయాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, ఈ లోగా మీ పరిచయం కనపడింది.

    జలంధర గారి కథలు ఇదివరకు చాలానే చదివాను. ఆవిడ రచనా శైలి నాకు చాలా నచ్చుతుంది. మనకు తెలిసినా, మనం పట్టించుకోని, లేదా మరచిపోయిన ఎన్నో విషయాలని, చాలా ఎఫెక్టివ్ గా గుర్తు చేస్తారు ఈ పుస్తకంలో.

    “ఎక్కడినుంచైనా మన దగ్గరకు ఒక గ్లాసు పరాయివాళ్ళది వస్తే, మన ఇంటినుంచి వెండి గ్లాసు పోతుంది” (కృష్ణ, కాంతం గారు తెచ్చిన డబ్బు తిరస్కరించేటప్పుడు) ఈ మాట చిన్నప్పట్నుంచి మా అమ్మ దగ్గర వింటూ పెరిగాను. ఏ వస్తువుకైనా ఒక వైబ్రేషన్ ఉంటుందని, అది నీ దగ్గరికి ఎలా వచ్చిందో ఆ మార్గానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం అంటూ ఒకటుంటుందని. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే అది నిజమేనా అని ఒక సందేహముండేది. కానీ ఇప్పుడు పెరిగిన వయసు నేర్పిన జీవితానుభవం నుంచి తెలుసుకున్న విషయం, ఇది 100% నిజం.

    డాక్టర్ గోపాల కృష్ణ గారి గురించి ఈ మధ్యే ఎక్కడో ఎస్.పి.శైలజ గారి ఇంటర్వ్యు లో కూడా చదివాను. ఇంతమంది జీవితాలని ఇన్స్పైర్ చెయ్యగలిగిన ఆయన్ని ఎప్పటికీ కలవలేనే అని బాధ వేసింది.

    పుస్తకాల విషయంలో మహా క్రిటిక్ అయిన మా అమ్మ ఈ పుస్తకాన్ని ఎంతో ఇష్టపడి నాకోసం ప్రేమతో పంపింది. తనకీ పుస్తకం ఎందుకింత నచ్చిందో చదివిన తర్వాత బాగా అర్థమయ్యింది.

    “ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి”
    నా స్వానుభవం…మనం అనుకున్నా, అనుకోకపోయినా, ఈ పుస్తకం చిన్నప్పటి జ్ఞాపకాల్లో నిండిపోయిన ఏదో గొప్ప అనుభూతిలాగా, మన మనసుని ఎప్పటికీ వదలదు.

  5. Jagadeeshwar Reddy Gorusu says:

    వంశీ కృష్ణ గారూ .. జలంధర గారి పున్నాగ పూల పరిమళం మీ అక్షరాల్లో ఘనీభవించింది . ఆర్ . వసుంధరా దేవి గారి తర్వాత తాత్విక దృష్టి తో రాస్తున్న ఏకైక రచయిత్రి ఆమె. వియద్గంద కథ నుండి జలంధర గారి రచనలు కనిపిస్తే వదలకుండా చదువుతున్నాను. పున్నాగ పూల కోసం అప్పుడే నా అన్వేషణ ఆరంభమైంది – గొరుసు

  6. కె.కె. రామయ్య says:

    వంశీ కృష్ణ గారూ .. జలంధర గారి పున్నాగపూలు పరిచయము చేసినందుకు ధన్యవాదాలు.

    ఆన్ లైన్లో ఆర్డర్ చేసి నవోదయ బుక్ హౌస్ కాచిగూడా హైదరాబాదు నుండి కూడా పుస్తకము తెప్పించుకునే సౌకర్యము కలదు.

    http://www.telugubooks.in/collections/teluguprint/products/punnagapoolu

Leave a Reply to sai Cancel reply

*