గింజలు

47x37_custom_two_birds_in_a_cherry_blossom_branch_original_painting_42b066fd

అక్కా, చెల్లెలూ.

గూటిలోంచి దూకి కొమ్మ మీద వాలాయి.

ఇంకా పొద్దు పొడవలేదు.

చెట్టు చుట్టూ నిశ్శబ్దం.

తూర్పున ఎరుపుముసుగు లేస్తుంది.

ఆకలిగా ఉందక్కా అంది చెల్లెలు.

నేనెళ్ళి గింజలు వెతుక్కొస్తానంది అక్క.

ఒద్దు, పోవొద్దు, అమ్మ లేస్తే, నువ్వు లేక పోతే… అమ్మ భయపడుతుంది, అంది చెల్లులు.

తొందరగా వస్తాగా, గింజలు తెస్తాను. అమ్మకు పని తప్పుతుంది, అంది అక్క.

చిన్ని రెక్కలు విప్పుకుని ఎగిరిపోయింది.

పడమటిగా.

 

ఎండుపొలాలు దాటి,

కొండలు దాటి,

వాగులు దాటి,

పెద్ద వన భూమికి చేరింది అక్క.

అబ్బా, ఎన్ని గడ్డిమొక్కలో!

ఎన్ని గింజలో!

ఆకలి తీరా తిన్నది అక్క.

చెల్లికీ అమ్మకూ గింజలు తీసుకెళ్ళాలి.

పెద్ద కంకి నోట గరిచి కొమ్మెక్కింది.

ఇది రెండురోజులకు సరిపోతుందేమో.

మళ్ళా గింజల కోసం బతుకాట.

 

కొమ్మ మీద గూడు కట్టింది అక్క.

ఒక్కొక్క కంకి తెచ్చి గూట్లో దాచింది.

అమ్మ ఎంత గర్వ పడుతుందో నా బిడ్డ ఇన్ని కంకులు పోగుచేసిందని.

గింజలు పోగుచేస్తూ వచ్చిన కారణం మర్చిపొయింది అక్క.

 

రోజులు గడిచాయి.

అక్క ఒంటరైంది.

చుట్టూ ఎన్నో పక్షులున్నా,

వాటి పలుకు వేరు.

రూపాలు వేరు.

తమ చెట్టు పక్షి ఒక్కటీ లేదిక్కడ.

ఒంటరై పోయింది అక్క.

అయ్యో, గింజల గోల్లో పడి ఇలా అయిపోయానే అనుకుంది.

అప్పుడప్పుడూ తూర్పు వైపు చూస్తుంటుంది.

 

వెళ్ళి పోదామనుకుంది చాలా సార్లు.

కానీ, ఇన్ని గింజలు వదిలేశా? మనసొప్పలేదు.

వీటికోసమేకదా అమ్మ వెతికేది రోజూ?

మరో రోజు ఆగి పోయింది అక్క.

 

అమ్మను కనిపెట్టుకుని ఉంది చెల్లెలు.

ఒక్కో రోజు ఆకలిగానే పడుకుంటుంది.

కాని అమ్మను వదిలేసి వెళ్లలేక పోయింది.

తనుకూడా గింజలకోసం వెళ్తే?

కానీ, భయం.

పాపం ఒక్కతే అయిపోతుంది అమ్మ.

పైగా ఈ వయసులో.

అక్క తప్పకుండా వస్తుంది.

మళ్ళా అందరూ బాగుండే రోజు వస్తుంది.

ఆశగా పడమటి వైపు చూస్తూ ఉంటుంది చెల్లెలు అప్పుడప్పుడూ.

 

రోజులు గడుస్తునాయి.

అక్క ఇంకా రాలేదు.

అమ్మేమో రేపో మాపో అంటుంది.

చుట్టుపక్కల పక్షులు వచ్చిపోతున్నాయి అమ్మను చూట్టానికి.

తల్లికి గింజలు సంపాయించి పెట్టలేని పనికిమాలిన దానివి అంటున్నాయి కొన్ని పక్షులు.

దద్దమ్మను చూసినట్లు చూస్తున్నాయి.

పెద్ద కూతురే ఉంటేనా… ఆమెకీ కష్టాలొచ్చేయి కాదు, అందొక పక్షి.

 

ఇప్పటికీ ఏదో ఒక బంధువు పక్షి ఆమాటలు అంటూనే ఉంటుంది.

విన్నప్పుడల్లా చెల్లి చూపుల్లో ఓ నవ్వు తళుక్కు మంటుంది.

కానీ నవ్వులా ఉండదు.

అది సంతోషమో,

విషాదమో,

అసూయో,

ఉన్మాదమో

ఎవరికి తెలుసూ?

కొమ్మ మీద కూర్చుని దూరంగా చూస్తూ ఉంటుంది చెల్లెలు.

 

-ఆరి సీతారామయ్య

photo

 

 

 

 ఆరి సీతారామయ్య గారు వృత్తిరీత్యా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్. కథకుడిగా తెలుగు సాహిత్యజీవులకు బాగా తెలిసిన పేరు. పదేళ్ళ కిందట ఆయన రాసిన కథలు “గట్టు తెగిన చెరువు” శీర్షికగా ప్రచురితమయ్యాయి. త్వరలో మరో కొత్త కథ సంపుటి రాబోతోంది.

మీ మాటలు

  1. ఈ అక్క తెల్సినట్లే ఉంది ! బావుంది .

మీ మాటలు

*