కళ్ళారా చూసిన “ఖైదీ” షూటింగ్!

 

 memories-1

నాకు చిన్నప్పట్నుంచే సినిమా చూడ్డం ఒక్కటే కాకుండా దానికి సంబంధించిన అంశాల మీద కొంత ఆసక్తి ఉండేది. వజ్రాయుధం షూటింగ్ సమయంలో మా అమ్మ వాళ్ళు సోమశిల కి వెళ్లింది. అప్పట్లో నేనూ వస్తానని ఏడ్చానో లేక షూటింగ్ అంటే ఏంటో తెలియని కారణాన నేను ఆసక్తి చూపించలేదో తెలియదు కానీ, అమ్మ తిరిగొచ్చాక మాత్రం షూటింగ్ విషయాలు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా వజ్రాయుధం సినిమాలో పెద్ద పెద్ద బండ రాళ్లు పని వాళ్ల మీద పడి చనిపోయే ఒక సీన్ ఉంటుంది. మా అమ్మ వాళ్లు వెళ్లినపుడు అదే సీన్ షూటింగ్ జరుగుతోందట. ఆ బండరాళ్లన్నీ అట్టముక్కలతో చేసినవని చెప్పడం నాకు గుర్తుంది.

షూటింగ్ అనగానే గుర్తొచ్చే మరోక జ్ఞాపకం ఖైదీ సినిమా గురించి. ఖైదీ సినిమాలో చిరంజీవి ఆవేశంగా అరటి తోట ని నరికేసే సీన్ ఒకటుంటుంది. అది నెల్లూరు నుంచి బుచ్చి రెడ్డి పాళెం అనే ఊరికి వెళ్లే మధ్యలో వచ్చే ఒక తోటలో షూటింగ్ చేశారట. ఆ విషయం బస్సు లో వెళ్తుంటే మా మామ ఒక సారి చెప్పాడు. అప్పట్నుంచీ బస్ లో వెళ్తున్నప్పుడల్లా ఆ అరటి తోట చూసే వాడిని.

index

అప్పటి వరకూ షూటింగ్ గురించి వినడమే కానీ ఒక సినిమా షూటింగ్ ప్రత్యక్షంతా చూడ్డం మాత్రం ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చాలా యాక్సిడెంటల్ గా జరిగింది. ఆ రోజు రాత్రి నాకింకా బాగా గుర్తుంది. అప్పటికి నాకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది. వేకువజామునే ప్రయాణం. నెల్లూరు నుంచి విజయనగరం వెళ్లాలి. మా బాబాయి వాళ్ల రూం లో ఉన్నాం. ఇద్దరికీ నిద్ర పట్టటం లేదు. ఏం చెయ్యాలో తెలియక సినిమాకి వెళ్దామన్నాడు నాన్న. నెల్లూరు లోని హరనాథపురం నుంచి నర్తకి థియేటర్ కి బయల్దేరాం. దారిలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరకు రాగానే కాస్తా హడావుడిగా ఉండడంతో ఇద్దరం అక్కడ ఆగాం.

అర్జున్ నటించిన ఏదో సినిమా షూటింగ్ జరుగుతోంది. రైలు వస్తుండగా అర్జున్ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకాలి. అదీ సీన్. ఆ సినిమా ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ అప్పటికే మా పల్లెలో గోపాలుడు ద్వారా అర్జున్ కి వీరాభిమానిని నేను. కానీ చూసిన కాసేపటికే చిరాకొచ్చింది. అవతల షో టైం అవుతుందన్న కారణమొకటయ్యుండొచ్చు. లేదా అర్జున్ బదులు అతనిలా ఉండే డూప్ బ్రిడ్జి మీద నుంచి కింద ఉన్న అట్టపెట్టెల మధ్య వేసిన పరుపుల మీదకు దూకడం చూసి సినిమా అనేది పచ్చి మోసం అని తెలిసిరావడం కూడా అయ్యుండొచ్చు.

ఆ షూటింగ్ చూసిన చాలా రోజుల వరకూ నేను సినిమా షూటింగ్ కళ్ళారా చూశానని మా క్లాస్ మేట్స్ వద్ద గొప్పలు చెప్పుకునే వాడిని.  అ తర్వాత ఏడేళ్లకు ఒక పూర్తి స్థాయి సినిమా షూటింగ్ చూసే అవకాశం కలిగింది. మా స్కూల్లో దాదాపు నెల రోజుల పాటు భారీ తారాగణంతో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బొబ్బిలి సింహంసినిమా షూటింగ్ జరిగిన రోజులవి. అప్పట్లో నేను పన్నెండో తరగతిలో ఉన్నాను. అంటే స్కూల్లో మేమే కింగ్స్ అన్నమ్మాట. మిగతా జూనియర్స్ అందరినీ షూటింగ్ స్పాట్ లోకి రానీకుండా ఆపే బాధ్యత మాదే! ఆ బాధ్యత ఎలా నిర్వహించామో పక్కన పెడితే, ఆ సాకుతో షూటింగ్ చూడ్డానికి వెళ్లిపోయే వాళ్లం.

Bobbili Simham (1994)1

అలా మొదటి సారిగా బాలకృష్ణ, మీనా, రోజా, బ్రహ్మానందం, శారద లాంటి పెద్ద పెద్ద నటీనటులను నిజంగా చూడగలిగాను. కానీ వాటన్నిటికంటే ఎక్సైటింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఫిల్మ్ మేకింగ్ అనే ప్రక్రియ ను మొదటిసారిగా పరిశీలించి కొంత అర్థం చేసుకోగలగడం.

సినిమాలో ఒక సీన్ లో బాలకృష్ణ, రోజా (మీనా?)లతో బెడ్ రూం లో ఒక సీన్ ఉంటుంది. వాళ్ళు బెడ్ రూంలో ఉండగా శారద వాళ్లని కిటికీ లోనుంచి దొంగతనంగా చూస్తుంది. అయితే అక్కడ బెడ్ రూం గా తీసిన గది మా స్కూల్ లైబ్రరీ. శారద తొంగి చూసే కిటికీ అసలా బిల్డింగ్ లోనే లేదు; అక్కడెక్కడో దూరంగా ఉండే క్లాస్ రూం కిటికీ అది. కానీ ఈ రెండు షాట్స్ ని వరుసగా చూసినప్పుడు శారద వాళ్లనే చూసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తుంది.

షూటింగ్ చూసినప్పుడు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. కేవలం యాక్షన్, కట్ అనే పదాలు తెలిశాయి. కానీ సినిమా లో పైన చెప్పిన సీన్ చూశాక నాకు మొదటి సారిగా ఎడిటింగ్ అనే విషయం గురించి తెలిసొచ్చింది.

మా స్కూల్లో బొబ్బిలి సింహం షూటింగ్ రోజుల్లో, సాయంత్రం అయ్యాక కోదండరామి రెడ్డి గారు వాకింగ్ కి మా హాస్టల్ వైపు వచ్చేవాళ్ళు. అప్పటికే మణిరత్నం, వర్మ సినిమాలు చూసి పిచ్చెక్కిపోయి సినిమా దర్శకుడైపోవాలని కలలు మొదలయ్యాయి మాలో కొంతమందికి.  మాది నెల్లూరే మీదీ నెల్లూరే అనే చనువుతో వెళ్లి కోదండరామి రెడ్డి ని పలకరించాం. సినిమాల్లోకి రావాలన్న మా కల గురించి చెప్పాం. ఆయన మమ్మల్ని బాగా చదువుకోమని ప్రోత్సాహించారు. సినిమా పరిశ్రమలోని కష్టాలు చెప్పి మా ఆశల మీద నీళ్ళు చిలకరించారు.

ఆ తర్వాత పదిహేనేళ్లకు మొట్టమొదటి సారిగా ఒక సినిమా కి పూర్తు స్థాయిలో పని చేసే అవకాశం వచ్చినప్పుడు, ఆ సినిమా షూటింగ్ యాధృచ్చికంగా మా స్కూల్లో నే చెయ్యాలనుకోవడం, అందుకు కావాల్సిన పర్మిషన్ లు, గట్రా అన్నీ నేనే ఏర్పాటు చేయడం జరిగాయి. అంతే కాదు పదిహేనేళ్ల క్రితం సినిమాల్లో పనిచెయ్యాలనే కలతో బయటకు అడుగుపెట్టి, తిరిగి అన్ని రోజుల తర్వాత షూటింగ్ చెయ్యడానికే తిరిగిరావడం ఒక మధురమైన జ్ఞాపకం.

*****

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    బాగుంది.

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*