మాయజలతారు వలల్ని తెంపే కథ!

p-satyavathi

“కధల్ని,గొప్ప కధల్ని తిరిగి చెప్పుకోవడమంత రోతపని మరొకటి లేదు.డిసెక్షన్ అందాన్ని చంపుతుంది” అంటాడు శివారెడ్డి సత్యవతి గారి కధల పుస్తకం ’మెలకువ’ కి ముందుమాటలో.

అయినా అలాంటిపనే చేయకుండా ఉండలేని అశక్తత లోకి ఈ పుస్తకం లోని ప్రతి కధా నెట్టివేస్తోంది. మరీ మరీ డిస్టర్బ్ చేసి,కలవరపరిచి,అవసరమైన లోచూపు కు పురిగొల్పి,ఏ అగాధాల్లోకి ఎంత గమనింపు లేకుండా జారిపోతున్నామో చెప్పి, ఒకానొక మెలకువ లోకి నను నడిపించిన ఓ కధనిక్కడ కృతజ్ఞత తో తల్చుకోవాలనిపిస్తున్నది.

కధ పేరు “నేనొస్తున్నాను”.

ఈ కధ లో ఒక సఖి ఉంది. ఎలాంటిదామె?ముద్దొచ్చే మొహమున్నది.సమస్త జీవన కాంక్షలతో ఎగిసిపడే మనసున్నది.ఉత్సాహం తో ఉరకలు వేసే వయసులో ప్రపంచమంతా తనదేనన్న ధీమాతో వెలుగు దారాలతో రంగురంగుల పూలు కుట్టిన మూడు సంచులను(స్నేహాల,అభిరుచుల,జ్ఞాపకాల సంచులవి)భుజాన వేసుకుని,తన పాటనేస్తాన్నెప్పుడూ పెదాలపైనే ఉండేలా ఒప్పించుకుని జీవితం నది ని దాటడానికి బయలుదేరి ఈ ఒడ్డున నిలబడి ఉన్నది.

ఒక సఖుడున్నాడు.అందమైన పడవేసుకుని అలా వచ్చాడు.ఎలా ఉన్నాడు?ముసిముసినవ్వులతో ఉన్నాడు.ముచ్చటగా ఉన్నాడు.పడవెక్కమని చెయ్యందించాడు.ఆశల దీపాలు వెలిగే కళ్ళతో స్వాగతం చెప్పాడు.తన పాటనీ తన సంచుల్నీ తనతోపాటూ తెచ్చుకోమన్నాడు.

మొదలైంది ప్రయాణం. పచ్చదనం. నీలాకాశం. ఈలలు పాటలు మాటలు ఆశయాలు అభిప్రాయాలు కోరికలు చతుర్లు…ఈ ప్రయాణమిలా సాగిపోనీ ఎంతకాలమైనా అనుకుంటూ తన సహ ప్రయాణీకుడ్ని,పడవ నడిపే ఆ చిన్నవాడ్ని తన ఆంతరంగిక ప్రపంచం లోకి మనసు చాచి స్వాగతించింది.

ఆవలి ఒడ్డుకు కలసిమెలసి ప్రయాణం చేద్దామని పండువెన్నెల్లో మనశ్శరీరాల సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు.చెరి కాసేపు తెడ్డు వేశారా.. “బాగా అలసిపోయావు,విశ్రమించు ప్రియా..నీ కళ్లలో మెరుపు తగ్గేను” అన్నాడు.ఎంత అపురూపమో ఆమె తనకు!

-క్రమంగా దృశ్యం మారింది.సుఖవంతమైన జీవితం కోసమంటూ,నాణ్యమైన జీవనం గడపాలి గదా అంటూ పడవ నడిపే యంత్రం తయారీ తో మొదలుపెట్టి చెట్టులెంటా పుట్టలెంటా తిరిగి ఏవేవో తెచ్చి పోగేసే పనిలో పడిపోయాడతను.ఇప్పుడతనికి ఆమె పాట వినే తీరిక లేదు.ఆరాధన గా చూసే సమయం లేదు.

ఎంతలో ఎంత మార్పు!ఎంత బాధ పెట్టే మార్పు..ఎంత భయపెట్టే మార్పు.వర్తమాన జీవన సౌరభాల్ని విస్మరించి..భవిష్యత్ భద్రజీవనం కోసమంటూ,  “వస్తువు” కిందపడి మరణిస్తూ అసలా స్పృహే లేకుండా నిశ్శబ్దంగా అతను ఏ లోయల్లోకి ఎప్పుడు జారిపోయాడో!

అయితే ఆమె దీన్నెలా తీసుకున్నది?అతని కార్యదీక్షకి,సమర్ధత కి అబ్బురపడి మరింత ఆరాధనతో  అన్నీ అమర్చిపెడుతూ ఇష్టం గా,సంతోషం గా సేవలు చేస్తూ అతనితో పాటు ఆమె కూడా తనను తాను మర్చిపోయింది.

కొంతకాలానికి ఒకరోజు ఉలిక్కిపడి చూసుకుంటే పాట ఏదీ?హోరు భరించలేక పారిపోయింది.గట్టిగా పిలిస్తే వచ్చింది గానీ,ఎప్పుడూ ఆ హోరులో ఆమెను వెన్నంటి ఉండడం తనవల్ల కాదంది.అతనేమో తిండివేళ తప్ప కనిపించడమే లేదు.నవ్వుల్లేవు.ముచ్చట్లు లేవు.

ఇక అతనితో కాదని తన పూర్వ స్నేహాలు,అభిరుచులు,సరదాలతో కొనసాగాలనుకుని తన వెలుగుపూలసంచులకోసం చూస్తే ..ఎక్కడున్నాయవి? “మనం సేకరించిన సంపదనంతా నింపే క్రమం లో అడ్డమొచ్చి ఉంటాయి.గిరాటేసి ఉంటాం ఎటో” తేలిగ్గా జవాబిచ్చాడతను.

పడవ బరువెక్కుతోంది.శబ్దాల హోరు ఎక్కువైపోయింది.పాటమ్మ ఏమయిందో అయిపు లేదు.సఖుని దర్శనమే అపురూపమై పోయింది.-“అసలు నేనెక్కడికి బయల్దేరాను? ఏ గమ్యం కోరుకున్నాను?ఇతను పిలిచీ పిలవగానే సమ్మోహితురాలినై ఈ పడవలో ఎందుకు ప్రవేశించాను?తామిద్దరూ కలిసిపంచుకున్న అనుభవాలు,చెప్పుకున్న ఊసులు ఇప్పుడేవీ?ఎక్కడకు అదృశ్యమైపోయాయి? అసలు అతనేడీ?తను ఆత్మను,శరీరాన్ని అర్పించుకున్న వాడు,తనకోసం ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తానన్నవాడు ఇప్పుడెక్కడ?

అబ్బా,ఏం ప్రశ్నలివి?ఎలాంటి ప్రశ్నలివి?ఎంత కలవరపెట్టే ప్రశ్నలివి? మనల్ని గురించి మన వాళ్ళు వేసుకునేవో,మన వాళ్ళగురించి మనం వేసుకునేవో..బోలెడు వూసులు చెప్పుకుని,బోలెడు వాగ్దానాలు చేసుకుని ప్రయాణం మొదలుపెట్టి సహజీవనచారుల్నే కాదు,మనల్ని మనమే మర్చిపోయి ఎంతమందిమి ఎలా ఎడారులమైపోతున్నామో!

కధలోని సఖుని పాత్రలాగా వస్తువ్యామోహం కావచ్చు,లేక పదవి,కీర్తి మరొకటీ,మరొకటీ లాంటి నెగటివ్ వ్యామోహాలు కావచ్చు…ఫేస్ బుక్ లాంటి కాలక్షేపం కావచ్చు..చదువుకోవడం,రాసుకోవడం,కొత్తస్నేహాలు,కొత్త అభిరుచులు లాంటి పాజిటివ్ వ్యామోహాలైనా కావచ్చు.మనల్ని స్నేహిస్తూ,మోహిస్తూ,ప్రేమిస్తూ,మనతో కలిసి నడుస్తోన్న సహచరుల్నే కాదు,మనల్ని మనమే పట్టించుకునే తీరిక సైతం లేకుండా..మనమీదెక్కి కూర్చుని మనల్ని పరుగులు పెట్టిస్తున్న సవాలక్షబరువుల్ని స్పృహకు తెచ్చి దిగులు పుట్టిస్తుంది ఈ కధ.మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి కావలసిన దినుసులేవో అందిస్తుంది.

ఇలాంటి ఇతివృత్తం తో.. సంపాదనలోనో,వృత్తిలోనో,వ్యాపారం లోనో,ఉద్యోగం లోనో మరెందులోనో కూరుకుపోయి జీవనం తాలూకు ఆనందాన్ని చేజార్చుకోవడం వస్తువుగా చాలా కధలు,అపుడపుడు సినిమాలు కూడా చూసుంటామేమో.

కానీ ఈ కధ అలా పైపైన తాకి వెళ్ళిపోయేది కాదు.ఇలా చూసి అలా పక్కనపెట్టేది అంతకంటే కాదు.ఆలోచింపజేసేది.అంతర్నేత్రాలను తెరిపించేది,ఒక ఉలికిపాటుకు గురి చేసేది,ఒక మెలకువ లోకి నడిపించేది,మాయజలతారు వలల్ని తెంపిపారేయాలనే కృత నిశ్చయాన్ని ప్రోది చేసేది,’వస్తువు’ కిందపడి మరణిస్తోన్న మనిషిని ఒక ఆత్మీయస్పర్శతో బతికించేది .అమ్మా!సత్యవతీ!మా చల్లని తల్లీ! ఇంత మంచి సాహిత్యాన్నిచ్చినందుకు, ఇస్తున్నందుకు ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పడం?

 – రాఘవ రెడ్డి

1044912_497904126944760_602611104_n

 

 

మీ మాటలు

  1. చాల అందంగా ఉంది… :) సున్నితంగా బాగా వ్యక్తీకరించారు!

  2. చాలా సున్నితంగా మనసుని తాకింది. సఖుని గాఢపరిష్వంగంలో ఎన్నెన్ని కోల్పోతున్నామో గుర్తు చేసింది. థాంక్ యూ రాఘవరెడ్డి గారు. అవశ్యం మెలుకువ తెచ్చుకోవాలి .

  3. Thirupalu says:

    పరిచయం కవితాత్మంగా ఉంది రఘవరెడ్డి గారు, హేట్సప్‌!
    సత్యవతి గారికి, నా తరుపున కూడా కృతజ్నతలు.

  4. ఒక చక్కటి కథని గురించి అంతే చక్కగా పరిచయం/విశ్లేషణ రాశారు. బావుంది.

  5. గుండెను తాకి మనను మనం చూసుకునేట్లుంది కధ. దాన్ని పరిచయం చేసి తీరూ అంతే సున్నితం.

మీ మాటలు

*