ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !

muraliఛందోవిరహితమైన శబ్దం లేదనీ, శబ్దవర్జితమైన ఛందస్సు ఉండదనీ కవిత్వరచన వ్యవస్థితమైన పూర్వపు రోజులలో “ఛందస్సు లేని కవిత్వ”మన్న ఊహకే ఉపాధి ఉండేది కాదు. గద్యబంధంలో కూడా వృత్తగంధాన్ని సంవీక్షించి గద్యాన్ని ఛందోభేదంగానే పరిగణించిన ఒకనాటి లాక్షణికుల కావ్యశాస్త్రనిర్దేశపు ముత్యాలగొడుగుకింద మన కవులకు ముక్తచ్ఛందమన్న తిరుగుబాటు ఆలోచన రావటానికి అవకాశం లేకపోవటం సహజమే. ఆ అవకాశం మధ్యయుగాలను దాటి ఆధునికయుగంలో ప్రప్రథమంగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచిభాషలో సంచయించి, గతితార్కికభౌతికవాద ప్రభావం వల్ల సోవియట్ రష్యాలో బోల్షెవిక్కుల విజయానంతరం ప్రపంచకవితారంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మకమైన పరిణామాల కారణంగా వివిధరీతుల విస్తరించింది. ఛందోనియమాలతోపాటు కనీసం గుర్తింపదగిన గతివిధానమైనా లేని కేవల భావలయాత్మకవచనంలో వృత్తరీతి లేని అసమగణాల సంవిధానంతో పదపంక్తులను రూపొందించుకొని కవిత్వరచన చేయవచ్చుననే స్వచ్ఛందధోరణి సరిక్రొత్తగా ప్రచారంలోకి వచ్చి, అచిరకాలంలో ఆ వ్యవస్థ విశ్వమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్ల వచనానికి చైతన్యస్రవంతి శిల్పం ఎటువంటిదో – పద్యానికి ఛందోముక్త “వెర్స్ లిబర్” అటువంటిదని పాశ్చాత్య లాక్షణికులు భావించారు.

తనకాలం నాటికే ప్రభావశీలమై, భారతీయ కవిత్వంలోకి ప్రవాహవేగంతో చొచ్చుకొనివస్తున్న ఈ ప్రయోగవాదం అవ్యవస్థావాద సిద్ధాంతకర్తల ప్రాయౌగికదృష్టితో ముగ్ధుడై ఉన్న శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించటం సహజమే.

 

కమ్యూనిస్టు మేనిఫెస్టో చల్లని గొడుగునీడలో కర్తవ్యస్ఫూర్తిని పొందిన శ్రీశ్రీ ఆ భాషాకవుల మార్గంలో కొత్తదీపాల వెలుగులను చూశారు. దాని ఫలితమే మహాప్రస్థానం కావ్యసృష్టి. ఆ తర్వాతిది ఖడ్గసృష్టి.

 

ఖడ్గసృష్టిలో “ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి” పారేయాలన్న వచనకవిత్వ మౌలికసూత్రీకరణను శ్రీశ్రీ ‘కొంటెకోణాలు’ గేయంలో అలవోకగా చెయ్యలేదు. శబ్దస్ఫూర్తిని మించిన భావవ్యక్తి అందులో ఉన్నది. శ్రీశ్రీ విశాలమైన వైదుష్యనేపథ్యం ఉన్నది.

 

1928లో శ్రీశ్రీ తొలి పద్యకవితా సంకలనం ‘ప్రభవ’ వెలువడింది. భాషపై ఎంతో ప్రభుత్వాన్ని సంపాదించి, పద్యరచనలో కొంత పరిణతిని సాధించినా – స్వీయవిమర్శ చేసుకోగలిగిన శ్రీశ్రీకి ఆ ప్రస్థానం సంతృప్తి నివ్వలేదు. ఆ సంపుటిలో చేర్చిన

అలఘుధ్వాంతవితానసంభరితరోదోంతర్మహాగహ్వర

స్థలి యంభోనిధి యయ్యె; సంతతజలస్రావాతిరేకంబునన్

విలయాంభోధరఘోషసమ్మిళితగంభీరాట్టహాసధ్వనీ

చలితప్రాకటదిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా శంకరా!

వంటి రచనల కూర్పు వస్తువివేకసాధనకే తప్ప ఆయన అంతరాత్మ అందులో ధ్వనింపలేదు. అందులోని “ధ్వనీచలిత” వంటి వాచకదోషాలను గుర్తింపగల వివేకబోధ ఉన్నవాడు. పౌర్వికుల నీడలో నిలిచి ఉండే నిస్తేజస్వి కూడా కాదు. దానికితోడు తన భావోద్వేజనకు సంప్రదాయకవిత్వంలో ఉన్న పరిమితి కూడా శ్రీశ్రీ గుర్తింపుకు వచ్చింది. ఆ పరిణామవయోవస్థలోని సందిగ్ధావస్థను ఆ తర్వాత ఆయన తన ‘సుప్తాస్థికలు’ కవితలో పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మార్క్సిస్టు దర్శన కవితాదర్శనపు మహానిధి ఆయన చేతికి వచ్చింది. సరికొత్త ఛందోవిచితి సాక్షాత్కరించింది. ఆ అభిజ్ఞానం తోనే ఆయన నిగళాలను ఛేదించాలని నిశ్చయించుకొన్నారు.

 srisri

రష్యన్ భాషాచ్ఛందోనైపథ్యం

శ్రీశ్రీకి ఆంగ్లభాషాముఖంగా సోవియట్ సాహిత్యపరిచయం కలిగేనాటికే ఐరోపీయభాషాకుటుంబంలోని రష్యన్ ఛందోరీతులలో సంప్రదాయానువర్తన యుగం ముగిసి ఆధునిక ప్రయోగశకం పరాకాష్ఠకు చేరుకొన్నది. ఫ్రెంచి, జర్మను భాషానువాదాలతోనూ, జానపద సంగీత పరిచయంతోనూ అలెగ్జాందర్ పుష్కిన్ నూతన విద్యాద్వారాలను తెరిచి రష్యన్ ప్రజాజీవితాలలోకి ఆంగ్లేయులకు బైరన్ లాగా ఐరోపీయమారుతపోతాలను ఆహ్వానించాడు.  గెటే కవిత్వంలోని కాలాతీతమైన సౌందర్యదీధితి, షిల్లర్ ఆశావాదంతోడి ఆధ్యాత్మికభావసౌగంధ్యం,  షెల్లీ లలితభావవాదకల్పనాశిల్పంలో భావివిప్లవాల క్రాంతదర్శిత, బైరన్ శృంగారభంగీభణితిలోని అపురూపమైన రాజసం, బ్రౌనింగు ఆత్మాశ్రయధోరణి, హ్యూగో చిత్రణలోని విషాదకిర్మీరాలు, బార్బియర్ కవితలలోని అంతరంగసంగీతం పుష్కిన్ ఆవిష్కరించిన నూత్నచ్ఛందోగతులలోకి అడుగుపెట్టాయి. షేక్స్పియర్ సానెట్టుల విశ్వజనీన కావ్యవిశిష్టపదరచనారీతిని దెల్విగ్, ఓదోవ్‌స్కీ, పోలెజాఫ్‌లు; షెల్లీ కాల్పనికవాద లలితగీత సరణిని లెర్మొంతోవ్ ప్రవేశపెట్టి రష్యన్ ఛందోగతులకు నవీన యుగకర్త లయ్యారు. గొగోల్ నేర్పిన ధ్వన్యాత్మకవిప్లవశీలితను కవిత్వంలో ప్రవేశపెట్టి – పాతబడిన ఛందస్సులలో పరివర్తనను తీసుకొనిరావాలనీ, లేదా వాటిని పూర్తిగా పరిహరించి నవగతినిర్మితిలో స్వేచ్ఛాగానఝరుల సంగీతభంగీతరంగాలను నినదింపజేయాలనీ తుర్గెనీవ్, తొల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్)లు ప్రయత్నింపసాగారు. పాశ్చాత్య విద్యాభ్యాసం చేసివచ్చిన నవకవుల ప్రభావంతో చెహొవ్ సమకాలీన జీవితంలోని నైరాశ్యాన్నీ, పాలకుల పతనావస్థనూ, సమాజంలో లోపిస్తున్న ఆదర్శాలనూ గుర్తించి సాహిత్యానికి స్వతంత్ర దిశానిర్దేశం చేయాలని సంకల్పించుకొన్నాడు. అక్షరసంహతిలో ఛందోనియమరహితమైన నవ్యపథాన్ని అభిమానించాడు. ఆ సమయంలో రష్యన్ ఛందోగ్రంథాలలోనూ, ఆంగ్లచ్ఛందస్సులను వివరించే రష్యన్ పాఠ్యపుస్తకాలలోనూ సంప్రదాయచ్ఛందస్సులకు నిరసనగా ప్రొక్రూస్టియన్ బెడ్ అనే కొత్త వైమర్శిక పదబంధం వచ్చి చేరింది.  తనకు మార్గదీపకులైన క్రొపోత్కిన్, బకూనిన్ వంటి అరాచకవాద సామాజిక సిద్ధాంతకర్తల ప్రబోధాల మూలంగా శ్రీశ్రీకి దీని పరిచయం కలిగి ఉంటుంది.

 

ప్రొక్రూస్టియస్ తల్పం

గ్రీకు పౌరాణికగాథల నుంచి సాహిత్యక్రియాకల్పంలోకి ప్రవేశించిన ఆధునిక పదబంధం ఇది. ఏథెన్సు నుంచి ఎల్యూసిస్‌కు వెళ్ళే పవిత్రమార్గంలో ఉన్న కొరిడల్లాస్ పర్వతశ్రేణికి రాజు పొసైడాన్ కొడుకు ప్రొక్రూస్టియస్. వట్టి కుతంత్రపరుడు. అతని వద్ద ఒక మాయాతల్పం ఉండేది. అది ఎటువంటివాళ్ళకైనా సరిగ్గా సరిపోతుందని, దానిమీద పడుకొనేవారికి ఆహ్లాదం కలుగుతుందని అతను ఆ దారిని వచ్చినవాళ్ళను మభ్యపెట్టి దానిపై పడుకోమనేవాడు. ఆ ఆగంతుకులు మంచం కన్నా పొడుగ్గా ఉంటే కట్టుతాళ్ళు బిగించి, వాళ్ళ కాళ్ళుచేతులు అందుకు సరిపడేట్లు నరికి ప్రొక్రూస్టియస్ పైశాచికానందం పొందేవాడు. పొడుగ్గా లేనివాళ్ళ కాళ్ళుచేతులు సాగలాగి తెగనరకటం మాత్రం తప్పేది కాదు. పొట్టివాళ్ళు పడుకొంటే ఆ మంచం మరీ పొట్టిదయ్యేది. కాళ్ళుచేతులు తెగగొయ్యటం తప్పేది కాదు. కాళ్ళుచేతులు నరికినా తప్పులేదు కాని అవి మంచాన్ని మించకూడదని అతని వాదన.

రష్యన్ లాక్షణికులు ఛందస్సును ఈ ప్రొక్రూస్టియన్ మంచం తోనూ, వ్యతిక్రమాన్ని సహింపని ఛందోనియమాలను కట్టుతాళ్ళతోనూ సరిపోల్చటం శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. అంతకు మునుపే మయకోవ్‌స్కీ కాల్పనికవాదుల ఆత్మాశ్రయ కృత్రిమాదర్శాలు ఆగామి సామ్యవాద సమాజంలో ప్రొక్రూస్టియన్ శయ్యాగతికి నోచుకోక తప్పదని విమర్శించటం మనకు తెలిసిన సంగతే.

 

గ్రీకువీరుడు థెస్యూస్ వచ్చి ప్రొక్రూస్టియస్‌ను మాటల్లో పెట్టి అదే మంచానికి కట్టి చంపినపుడు – నిజానికి అతని వద్ద రెండు మంచాలున్నాయని, బాధితుల ఒడ్డుపొడుగులను బట్టి వాటిని మారుస్తుండేవాడని రహస్యం బయటపడుతుంది.

 

ఛందోవ్యవస్థలో ఈ రెండే గద్యం, పద్యం అని సంకేతితా లన్నమాట. పద్యానిర్మాణం చేసేవారు పాదాక్షర గణానుసారం సిద్ధిసాధనకు శబ్దంలోని దీర్ఘానికి లేని లఘిమను, లఘువుకు కూడని దీర్ఘిమను కల్పించినా తప్పులేదు కాని, ఛందోభంగాన్ని మాత్రం సహించేందుకు వీలులేదన్న నియమం – “అ‌పి మాషమ్ మషమ్ కుర్యాత్, ఛందోభంగం న కారయేత్” అన్నది ప్రొక్రూస్టియన్ శయ్యాసంస్థితమైన భాష దుఃస్థితికి అద్దం పడుతుంది.

 

లాటిన్ భాషాచ్ఛందోవిధానంలో ఇది మరొక విధంగా ఉన్నది. పాదాంతంలో పదచ్ఛేదం వల్ల సాధించే భావలయకు ప్రొక్రూస్టియన్ లయ అని పేరు. ఇది మన ఛందోనిబంధంలోని అంత్యప్రాస విధివిధానంలో ఉన్నదే. “అందంగా మధురసని / ష్యందంగా …”, “జాతి జాతి నిర్ఘాత పాత సం / ఘాత హేతువై …”, “జగతి మరపు, స్వప్నం, ని / శ్శబ్దం, ఇది …” వంటి పాదాలు ఈ అంత్యప్రాస నియతిలోని వివిధ భావగతులకు ఉదాహరణాలు.

 0148

ఇంగ్లీషులో దీనినే డ్రోలరీ (శబ్దడోలిక = తూగు) అంటున్నాము.  శ్రీశ్రీ ప్రయోగాలలో ఇది విస్తృతంగా కనుపిస్తుంది.

 

శ్రీశ్రీని ప్రభావితం చేసిన మహాకవులలో ఒకరైన ఎడ్గార్ ఆలెన్ పో “ది పర్లాయిన్‌డ్ లెటర్” అన్న కథలో పారిస్ నగర రక్షకభటులు నేరపరిశోధనసమయాలలో సడలింపు లేని చట్టాలకు ఒదిగి, పరిశోధనలో స్వేచ్ఛాసంచారం లేక చేతులు కట్టి పడవేసినట్లు ఉండవలసి రావటాన్ని ప్రొక్రూస్టియన్ తల్పంతో ఉపమించటం కూడా పో అభిమాని అయిన శ్రీశ్రీ దృష్టిపథంలో ఉండే ఉంటుంది.

 

కానీ రష్యన్ లాక్షణికులు పై దృక్కోణాలను అనుసరింపక ప్రొక్రూస్టియన్ తల్పాన్ని కేవలం ఛందోబందోబస్తుల ఏర్పాటుకు పర్యాయపదంగా మాత్రమే పరిగణించారు. ఆ సాహిత్యప్రభావమే శ్రీశ్రీ అమోఘమైన వాక్కులో ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి  అన్న వచనకవితాగతినిర్దేశక మార్గదీపక పదబంధంగా రూపుదిద్దుకొన్నది.

ఛందస్సుకు అక్షరగతులు, మాత్రానియమాలు కట్టుతాళ్ళన్న ప్రసక్తి లేకపోతే “ఛందో-బందోబస్తు” లన్న రూపణకు పద్యంలో స్థానం లేదు.

 

ఛందోరీతుల కల్పనలో సమకాలీన  తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. శ్రీశ్రీ సాధించిన ఛందోవిజయవిలాసం వల్ల తెలుగు సాహిత్యం మరింత ప్రజాసన్నిహితమై విశ్వతోముఖంగా వికసించిందనేది చర్వితార్థం.

 

 ఏల్చూరి మురళీధరరావు

మీ మాటలు

 1. వెల్లంపల్లి అవినాష్ says:

  ఏల్చూరి మురళీధర్ రావు గారూ,

  అన్యధా భావించకండి. నా స్పందన నిజాయితీగా చెప్తున్నాను.

  వ్యాసంలోని శైలి – కఠిన తత్సమ పద పటాటోపంతోనూ; సుదీర్ఘ సంస్కృత సమాసాలతోనూ నిండిపోయి, భాషావిజ్ఞాన ప్రదర్శన లా ఉంది. పక్కన శబ్దరత్నాకరం లేకుండా ఎవరికైనా సంపూర్ణంగా అర్థం అవుతుందా అంటే, నాకు అనుమానమే!

  పాషాణపాకమైన ఇట్లాంటి వ్యాసాలు పాఠకులను భయపెడతాయి, వికర్షిస్తాయి. మీరు చెప్పాలనుకున్న ఇంత మంచి విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే చేరుతుంది.

  • ఏల్చూరి మురళీధరరావు says:

   శ్రీ వెల్లంపల్లి అవినాష్ గారికి _/\_ !

   దయతో ఆసాంతం చదివి, మంచి మనస్సుతో మీరు వ్రాసిన వాక్యజాతానికి ధన్యవాదాలు. ‘పటాటోపం’ నా జీవితంలో, భావంలో, భాషలో లేకపోయినా; గంభీరమైన మీ భాషాభివ్యక్తి ముందు నా వాడుకే కొంత సరళమేమో అని నాకనిపించినా :) ; ఇంగ్లీషులో ఎంత ప్రౌఢంగా వ్రాసినా తప్పులేదు కాని, తెలుగు విషయం వచ్చేసరికి ప్రతిపాద్యవిషయానుసారం శబ్దరత్నాకరాన్ని ప్రక్కనుంచుకొని చదవవలసి రావటం తప్పన్న భావం అంతగా అంగీకర్తవ్యం కాదని నా అభిప్రాయమైనా (పైగా, వ్యాసంలో శబ్దరత్నాకరంలో లేని పదాలు కూడా ఉన్నట్లున్నాయి :) ) – మీ సహృదయసూచనను గుర్తుంచుకొని, ఈసారి వికర్షణను ఆకర్షణగా నిలుపుకొనే ప్రయత్నం తప్పక చేస్తాను!

   మీ విద్వత్తకు, విజ్ఞతకు, సౌజన్యానికి, సాధువాక్యానికి కృతజ్ఞుణ్ణి.

 2. మురళీధర్ గారికి అభినందనలు.అద్భుతమైన వ్యాసం.శీర్షికకు తగిన భాష.శ్రీశ్రీ గురించిన కొత్త సంగతులు,ప్రాక్రుస్టియన్ లయ, శబ్ద డోలిక లాంటి విషయాలు తెలుసుకొని సంతోషించాను .థాంక్స్.

  • ఏల్చూరి మురళీధరరావు says:

   శ్రీ నాగరాజు రామస్వామి గారికి,

   సౌజన్యస్ఫూర్తి నిండిన మేదురమైన మీ ఆదరానికి కృతజ్ఞుణ్ణి. _/\_ !

 3. మురళీధరరావుగారూ,

  ప్రొక్రూస్టియన్ కథ ఎక్కడో ఎప్పుడో విని ఉన్నాం కానీ, ఛందస్సుతో ఈ కథకు ముడిపెట్టిన సంగతి ఈ వ్యాసం చదివే నేర్చుకున్నాము. స్వయంచాలికమైన ఒక కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టిన కవి శ్రీశ్రీ. శబ్దపరంగా, శైలిపరంగా అతని ప్రయోగాలే అతని మహాకవిని చేశాయని నమ్ముతాన్నేను. వీటితో పాటు, ఈ శబ్దాధికారంతో పాటు, దృశ్యమానం చేయగల అద్భుతమైన శక్తి ఒకటి అతని కవితల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. (భిక్షు వర్షీయసి మొదలైన వాటిలో).

  వ్యాసంలో మీరు ప్రస్తావించిన మరో ఆసక్తికరమైన విషయం – పాదాంతంలోని పదచ్ఛేదం. దీనిని శ్రీశ్రీ సరిగ్గా వాడుకోలేదని నాకొక అసంతృప్తి ఉంది. ఉదాహరణకు “సంధ్యా సమస్యలు” అనే కవితలో మూడు పర్యాయాలు

  “ఎటు కేగుటో సమస్య తగిలిం
  దొక విద్యార్థికి”,
  “ఎంచుకునే సమస్య కలిగిన్
  దొక ఉద్యోగికి”

  ఇలా వాడటం కనిపిస్తుంది. వాటి వల్ల కవితకు అదనపు ఆకర్షణేమీ ఆపాదించబడలేదని కూడా నాకు తోస్తుంది. నాకు గుర్తున్నంతలో మరొక్క కవితలో మాత్రమే (మహాప్రస్థానమొక్కదాన్నీ గమనించినపుడు) ఇలాంటి లయ కనిపిస్తుంది.

  ఫ్రెంచ్, రష్యన్ కవిత్వాల్లో ఉదయించిన విప్లవాత్మక పరిణామల నుండి ఎంత ప్రేరణ పొందినా, వారి మార్గాల్లో నడిచినా, తనదైన ఓ ముద్రని ప్రతీ కవితలోనూ విడిచిపెడుతూ నిత్యస్మరణీయుడైనాడు శ్రీశ్రీ.
  స్విన్‌బర్న్ కవి ప్రభావం తనే మహాప్రస్థానంలో చెప్పుకున్నా, ” A Match” కవిత చూపిన మార్గానికి కృతజ్ఞతతో వ్రాసిన “అద్వైతం” కవితలోనూ శ్రీశ్రీ మార్క్ చూసి ఆశ్చర్యపోని పాఠకులుండరేమో.

  శ్రీశ్రీ శైలి, శిల్పాల గురించి మంచి పరిశీలనలతో, సమాచారంతో, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ వ్యాసాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  నమస్కారాలతో,

  • ఏల్చూరి మురళీధరరావు says:

   సహృదయిని మానస గారికి,

   ప్రతిరచనలోని భావప్రతీతిని అంతఃప్రజ్ఞతో ఆవిష్కరింపగలిగిన మీ ప్రతిభకు, ప్రత్యభిజ్ఞకు ధన్యవాదాలు. దయతో ఆసాంతం చదివి సహృదయంతో స్పందించినందుకు _/\_ !

 4. ఛందోరీతుల కల్పనలో సమకాలీన తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. ,.. శ్రీశ్రీ సృష్టించినవి,. కొత్త ఛందోరీతులా,… ,. నేనేదో నరుక్కుంటూ పోతే,.. దాన్నీ ఓ రీతిగా మార్చి,.. నాస్తికత్వమే దేవుడైనట్లుగా లేదు,,. ఇది. శిష్ట్లా ప్రభావాన్ని శ్రీశ్రీ ఒప్పుకున్నట్లే కనిపిస్తుంది,. ఆ సమయంలో రాసిన చాలామంది,. శ్రీశ్రీలానే రాసారు తెలుగులో కూడా, ముందు వెనుకలుగా,. …..వారు వెనకపడ్డారు,…, శ్రీశ్రీ నిలబడ్డారు,.,

  • ఏల్చూరి మురళీధరరావు says:

   శ్రీ కొండ్రెడ్డి భాస్కర్ గారికి,

   మీ స్పందనకు ధన్యవాదాలు. గతానుగతికమైన పథాన్ని “నరుక్కుంటూ వెళ్ళటమే” గాక శ్రీశ్రీ తన సహకవులతో కలిసి ఒక సరికొత్త దారిని నిర్మింపగలిగారు. ఆ దారిలో ఆయన ఒక కొత్త వస్తువు రూపానికి, సంవిధానానికి, ఛందోరీతులకు, కవితాసామగ్రికి, అలంకారాలకు అతివిస్తారంగా ప్రచారాన్ని కల్పించిన సంగతిని కాదనలేము. అది కేవలం ప్రయోగదృష్టితో కాక బలమైన సంప్రదాయపు ప్రాతిపదికమీద వర్తమానకాలగతివివేకంతో జరిగినందువల్ల ఆయన తన సాటికవులకంటె సుస్థిరమైన నాయకత్వాన్ని పొందగలిగారని నేననుకొంటున్నాను. ఆయనతో విభేదించే కవులు కూడా ఆయన కవిత్వప్రభావం నుంచి బయటపడటం కష్టం. _/\_ !

 5. J K Mohana Rao says:

  The comments I am making here have nothing to do with SrI muraLidhararAvu gAri essay, which is quite interesting. I don’t agree that SrISrI really broke all the shackles of Chandassu once for all. Though he started to write in the prevalent metres used by Telugu poets, he gave it up later. He used mAtrA Chandassu, based on syllabic instants. mAtrA Chandassu has been in use in prAkRta for more than 1500 years. Sankara used it with telling effect in his religious stOtrAs like bhajagOviMdaM, jayadEva used it in gItagOviMda and kaMdukUri rudrakavi used it in janArdanAshTakamu. Many yakshagAna metres are all based on mAtrAChandassu. mAtrA Chandassu is also Chandassu that has many mathematical properties. mAtrAgaNAs too have names like Ta, Tha, Da, Dha, Na. Some of these aspects were discussed in an article entitled SrISrI ChaMda@hSilpamu at http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 In my opinion SrISrI himself is not exactly right in claiming so. It is an extremely misleading claim. Never believe him!

  • ఏల్చూరి మురళీధరరావు says:

   Respected Sri Mohana Rao gaaru,
   _/\_ !

   Thank you very much for the update and the kind comment.

   I may point out that SriSri never claimed anything in regard of his being a pioneer in breaking the shackles of prosodic metre-s. His Articles on ముత్యాలసరములు show his deep understanding of long-established systems and the emergent Vers libre. He retained his fondness for ఛందోబద్ధకవిత and మాత్రాచ్ఛందస్సులు and displayed his firm command over traditional patterns of rhythm and sound very often, even in his casual writings. Not many know that he could recite వసుచరిత్రము and other Telugu Kavya-s from right to left. It is his uninitiated followers, who indeed carried away by their own eloquence keep attributing to him a multitude of fanciful ideas that he never entertained himself.

   Songs and Verses, set to music formally or informally would always contain the flourish of మాత్రాచ్ఛందస్సు and remain in popular realm, irrespective of their content and form. One cannot imagine that SriSri could have been unenlightened of this. He had his own flip-flops and mood swings but was also well aware of his defining place in history and did not write anything that would not stand the test of close critical observation in future.

 6. శ్రీ శ్రీ గురించి నాలుగు ముక్కలు వ్రాయాలన్నా చదవాలన్నా కనీస భాషా జ్ఞానం ఉన్నవాళ్లే ఉపక్రమిస్తారు. నేను హెచ్ ఎస్సీ తరవాత తెలుగు చదువుకోలేదు. అయినా మీ వ్యాసం అర్ధం చేసుకొవడానికి నాకు నిఘంటువు అవసరం రాలేదు. శ్రీ శ్రి గారి రచనలు కొన్ని చదవక పొవడంతో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందులో వ్యాస కర్త లోపమేమీ లేదు.

  • ఏల్చూరి మురళీధరరావు says:

   శ్రీ సూరి సీతారాం గారికి,

   మీ భాషానురక్తి, సాహిత్యాసక్తి నిజంగా అభినందనీయాలు. ఔదార్యపూర్ణమైన మీ స్పందనకు, సమ్మతికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

   _/\_ !

మీ మాటలు

*