కాగితమ్మీద వొలికిన జీవితం ఇది!

Mohan Rushi

“Poetry is the essence of life, life is the truth of I-awareness. Essence is the reflection of the universe in the truth of his individuality” అని ఎవరో అన్నట్టు మోహన్ రుషి కవిత్వమంతా మిర్యాల గూడ గతంలో తెలీని భవిష్యత్తును హైద్రాబాద్ భవిష్యత్తులో మర్చిపోలేని గతాన్ని ఎప్పటికప్పుడు పోల్చుకుని తన అస్తిత్వాన్ని తను తవ్వుకోవడం , ఆ పై చొక్కా పైగుండీ విప్పి గతుకులరోడ్లమీద ఈదడం, చివరగా రెండు కన్నీటిబొట్లు గొంతులోకుక్కుకుని నవ్వుకోవడం..ఒక విధంగా ఈ కవిత్వమంతా కన్ఫెషనల్ కవిత్వమే..(అసలు కవిత్వమంటేనే కన్ఫెషనల్) కానీ తెలుగునాట ఇలాంటి దుఃఖసహిత కన్ఫెషనల్ కవిత్వం రావడం అరుదాతి అరుదు..

దేశభక్తిగీతాలు ప్రకృతిపాటలు పక్కనపెడితే ఆధునికత వికటించినప్పుడల్లా కాందిశీక దేహానికీ నీడకీ జరిగే వైయుక్తిక సంఘర్షణే కవిత్వ కారకమౌతుంది..నగరజీవనం సుఖభరితం ఔతున్నకొద్దీ జీవితం అంత నిర్లిప్తంగా తయారౌతుంది, ఐతే చాలాసార్లు ఈ అంతర్బాహిర్ యుధ్దం కవిత్వానికి అస్పష్టతను ఆపాదిస్తుంటుంది సహజంగా, కానీ మోహన్ రుషి కవిత్వం అలా దారితప్పకుండా నడిచొచ్చిన దార్లూ నడిపించిన వేర్లూ మర్చిపోలేని అమాయకత్వం తోడై అకస్మాత్తుగా పాతమిత్రుడు కనిపించి కౌగిలించుకునే ఒక ప్రేమాస్పద స్పర్శగా చదువరుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది..

1

కవిగా మోహన్ రుషి “తల్లి”ని కన్నాడు.. –అమ్మలంతా ఒకవైపు– రెండుగా విభజించవలె, ఆమె రాత్రి దుఃఖాన్ని, లేదూ, రెండింటా ఉన్నది , కావొచ్చు, ఒకే దుఃఖము, విశ్లేషించడం మన తెలివి/తక్కువతనం-..

డయాబెటిస్ తో అమ్మ వేలిగోళ్ళు వాచి ఊడిపోయే ఒకానొక బాధామయ క్షణాల్ని ఏరుకుని గొంతులో గుచ్చుకుంటూనే ఇలా అంటాడు,

–అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు– వాళ్ళ గురించి వాళ్ళు అడిగే పాపాన వాళ్ళెన్నడూ పోరు వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం అందుకు ఆనవాలు అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు అన్నాక

–లెక్కలేదు పత్రం లేదు– ఆమె యుధ్దం చరిత్ర గాలే ఆమె బత్కు లెక్కలకు రాలే ఒక మిశ్నిలెక్క/ ఒక కట్టెలెక్క/ ఒక దండెం లెక్క/ ఉన్నదా అంటె ఉన్నది నామ్ కెవాస్తె బత్కలేక సావురాక ….. అని బహురూప స్త్రీ దుఃఖాన్ని నిర్నిమిత్తంగా మనకు బదిలీ చేస్తాడు..

ఇంట్లో రెండు పెద్దబీరువాల పుస్తకాల్ని పోషిస్తూనే పుట్పాత్ మీది అక్షరాన్ని కళ్ళకద్దుకుంటాడిలా మోసం చేసే మనుషులుండొచ్చేమో కానీ/ మోహం కుదిరాక/ పాతబడిపోయిన పుస్తకాల్లేవ్….

రుషి పదాల వాడకంలో ప్రదర్శించే పీనాసిత్వం తన కవిత్వానికి చాలా పదును తీసుకొస్తుంది.. ఎంతో మంచి శూన్యం/ జీవితం… ప్రేమ లేదని కాదుగానీ/ తేపకోసారి తేమను నిరూపించడం నా వల్ల కాదు…

నువ్వు మొదలూ కాదు/ కథ నేటితో ముగిసేదీ కాదు, ఈ ప్రయాణం / రాత్రి తెల్లారేవరకు కాదు/ నీ బతుకు తెల్లారేవరకూ తప్పదు..

అని ఎలాంటి పదాల ఆర్భాటమూ ( ప్రచారార్భాటం కూడా) లేకుండా అనేసి సభ వెనకకుర్చీలో సాగిలబడి జరుగుతున్న సామాజిక సర్కస్లను చూస్తూ చిర్నవ్వుకోగలడు

మనలో చాలామంది కనీసం గుర్తించడానికైనా ఇష్టపడని మనుషులు రుషి కవిత్వంలో రక్తమాంసాలు నింపుకుంటారు,

–విజేతలు వాళ్ళు– అల్కాపురి వీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ/ ఆమె అడిగింది ఒక్కటే ” గంప కిందికి దించాలి సారూ”..

–నేర్చుకోవాలి– షేరింగ్ ఆటోగుండా ప్రయాణిస్తాం/ అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా/ ప్రేమైకమూర్తులు, సాయిబాబాగుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా/ అయినప్పుడు. ” రోడ్లు సల్లంగుండ” అంటూ, కోపంలోనూ నోరు జారని/ వాళ్ళు, పాఠాలు తెలియనివాళ్ళు, పాటలను మించినవాళ్ళు..

ఇలాగే “బస్ ఇత్నాసా ఖ్వాబ్ హై”, “ఇల్లు సమీపిస్తున్నప్పుడు”, “కమ్యూనిటీ హాల్ మూలమడ్త మీద”, “ఒక్క అమ్మకు పుట్టలేదంతే”, “పునఃదర్శన ప్రాప్తి రాస్తూ”, “దిల్షుక్ నగర్ చౌరస్తా” వంటి కవితల నిర్మాణం మూసని బద్దలుకొడుతూ ఆశ్చర్యానికీ ఆనందానికీ గురిచేస్తాయ్,

ఇదేకవి “మీన్ కాంఫ్” అన్న కవితలో ఏమాటకామాటే చెప్పుకోవాలి/ ఎవరూ పాడని గీతంగా మిగిలిపోవాలి/ అతిథిలా ఆగడం/ ముసాఫిర్ లా ముందుకు సాగడమే ఇష్టం/ బంధం గంధం పూసుకు తిరగలేను/ ఎవరెంత చెప్పినా భవిష్యత్తులో బ్రతకలేను అని,

“ఒక కరుత్తమ్మ కోసం” కవితలో ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ వచ్చినంక నాతోటే ఉంటదా పోతదా/ తర్వాత ముచ్చట, ఊరుపేరు తెల్వదుగానీ/ యాడ్నో బరాబర్ ఉంటదని నమ్మకం/ ఇయ్యాల గాకపోతే రేపైనా/ రాకపోద్దా అని ఆశ, ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ లేకపోతె ఈడ నాకేం పని, అనడం కాస్త అసంబధ్దంగా అనిపించినా కాలానుగుణంగా కవిలో కలిగే మార్పు తాలూకూ భావచైతన్యంగానే ఊహకందుతుంటుంది.. ..

Mohan Rushi

2

“Tragedy is a joy to the man who suffers”

బాధపడే మనిషికి విషాదం మరింత ఆనందాన్ని కల్గిస్తుందని తెలిసిన ఈ కవి అందుకేనేమో స్వీయ నిరానందాన్నే ఎక్కువగా కవితాంశగా తీసుకుంటాడిలా..

–3.47A.M– బైటకూ వెళ్ళలేక, లోపలికి వెళ్ళే ధైర్యం చెయ్యలేక, నిద్రరాక, మెలకువ/ లేక, ఈ ధాత్రిపై ఇది ఎన్నవ రాత్రి? ఏమి నేర్చుకుని? ఏ అసంబధ్ద/ అల్పానందాల తీవ్ర ఫలితాల్లోంచి నిన్ను నువ్వు పురుడు పోసుకుని? ..

మాండలికాల్లో మాట్లాడ్డమే అవమానకరం అనుకునేంత ఙ్నానం ప్రబలిన గ్లోబలైజేషన్లో తియ్యటి తాటిముంజలాంటి తెలంగాన మాండలికంలో మన “దూప” తీరుస్తాడు మోహన్ రుషి..

ఒక తెల్లార్ గట్ట లేశినోన్ని లేశినట్టు పక్కబట్టల్ గిట్ట మడ్తబెట్టకుండ అసల్ పక్కకే జూడకుండ నడుసుడు మొదల్ బెడ్త నడుస్త…/ ఉరుక్త../ ఎండ గొట్టదు/ వాన దాకదు/ సలి దెల్వదు/ పట్నం మొకమ్మీద కాండ్రిచ్చి ఊంచుకుంట నడుస్త/ ఉరుక్త/ నేను మా మిర్యాలగూడెంల బడ్త…

3

తన జీవితాన్నే ఎలాంటి మొహమాటాల్లేకుండా కవిత్వీకరించుకున్న “రాబర్ట్ లోవెల్” లాగానే ఇది ఉట్టి కవిత్వం కాదు, జీవితం.. మోహన్ రుషి జీవితం ఇదంతానూ.. మిర్యాల్ గూడ టు హైద్రాబాద్ వయా జీరో డిగ్రీ…

 

– వంశీధర్ రెడ్డి

vamshi

మీ మాటలు

 1. కోడూరి విజయకుమార్ says:

  చాలా బాగా రాశావ్ వంశీ !

 2. srikanth.. says:

  రివ్యూ చాలా బాగుంది.. మంచి కవిత్వంపై మంచి వ్యాఖ్యానం!!

 3. review చాలా బాగుంది. శ్రీ శ్రీ గారి మహాపస్థానం లోని ముందు మాటలు చదువుతున్నట్టుగా మంచి విశ్లేషణ

 4. narayanasharma says:

  చాలబాగుంది వంశీగారూ….రుషి కవిత్వానికి కవితాత్మక విశ్లేషణ

 5. రాజశేఖర్ గుదిబండి says:

  “అమ్మలంతా ఒకవైపు” కవిత చదివినాక వీరి అభిమానినైపోయాను….అలాగే ” విజేతలు వాళ్ళు” కూడా ..

  వంశీ గారూ మీ రివ్యూ చాలా బాగుంది … త్వరగా చదవాలనే ప్రేరణ కలిగిస్తుంది…..

 6. balasudhakarmouli says:

  రిషి అన్నా … కంగ్రాట్యులేషన్స్ …..

 7. ఈ కవిత్వం ఘనీభవించిన దుఖం కావొచ్చు. అందుకేనేమో జీరో డిగ్రీ అని పేరు పెట్టారు. మనుషులందరూ కలిసి మాటాడుకున్నట్టు ఉంటుందీ కవిత్వం. దుఖం అంటే నాది మాత్రమే కాదు అంటూ , తన అనుభవాల్లోని దు:ఖ సంపదను మనకూ పంచేస్తాడు. మంచి కవిత్వం, మంచి విశ్లేషణ….. వంశీ, రిషీ ఇద్దరికీ థాంక్స్

 8. వంశీ ,

  చాలా చక్కని పరిచయం . ఒక సాటి ఆధునిక కవినుండి, కవితా వస్తువులో, వ్యక్తీకరణలో వింతవింత ప్రయోగాలు చేసే వంశీ నుండి ఈ సమీక్ష రావడం ఎంతైనా ముదావహం.

  మీకు ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు.

మీ మాటలు

*