ఆ ఎండాకాలాలు రమ్మన్నా రావు కదా మళ్ళీ!

Photo0025

ఇటీవల దొంతమ్మూరులో నేను, మా అన్నయ్య, మేనల్లుళ్ళు భాస్కర్, చినబాబు

నా కంటే 13 ఏళ్ళు పెద్ద అయిన మా పెద్దన్నయ్య, పదేళ్ళు పెద్ద అయిన మా చిన్న అన్నయ్య ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుచేత మా తాత గారూ, బామ్మా గారూ వాళ్ళిద్దరినీ, కలిసి పెరుగుతున్న మా మేనత్తల కొడుకు అయిన  హనుమంత రావు  బావనీ చాలా గారాబం చేసే వారు.  అంచేత ఆ ముగ్గురూ కలిసి నానా అల్లరీ చేసే వారు… ట….అందులో నాకు బాగా జ్జాపకం  ఉన్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఒకటేమో మా చిన్నన్నయ్య ఎప్పుడూ సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయంలో మా నాన్న గారి గది పక్కనే ఉన్న ఒక పెద్ద నేరేడి చెట్టు ఎక్కి కూచునే వాడు. (ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా అస్సలు నేరేడి చెట్టు అనేదే చూడ లేదు. ఔట్ ఆఫ్ ఫేషన్ అనుకుంటాను.) ఎవరు పిలిచినా భోజనానికి వచ్చే వాడు కాదు.

ఇక అందరి భోజనాలు అయిపోయాక, మా బామ్మ గారు ఒక బంగారం తాపడం చేసిన వెండి గిన్నెలో పులుసూ, అన్నం కలిపి “ఒరేయ్ చిన్న బుజ్జీ,  రారా,  నీ కోసం బంగారం పులుసు చేశాను ..అంటే గుమ్మడి కాయ పులుసు అన్న మాట …నాకు ఆకలి వేస్తోంది రారా.” అని బతిమాలే వారు. మా తాత గారు “ఒరేయ్ ఇదిగో రా నీ కోసం సరి కొత్త అర్ధణా కాసు తెచ్చానురా” అని లంచం చూపించే వారు. అప్పుడు మా చిన్నన్నయ్య కిందకి దిగి భోజనం చేసే వాడు.

ఇక వాళ్ళు ముగ్గురుకీ..అంటే మా పెద్దన్నయ్య, చిన్నయ్యా, హనుమంత రావు బావా…  దీపావళి అంటే భలే ఇష్టం. ఇంట్లో తెలిస్తే మా నాన్న గారు తిడతారని మెయిన్ రోడ్డు  లో అప్పటి కాకినాడ లాండ్ మార్క్ అయిన సిటీ ఎంపోరియం ఎదురుగుండా ఉన్న వానపల్లి ప్రకాశ రావు కొట్టులో ఖాతా మీద .. ఐదారు వందలు పెట్టి బాంబులు, టపాసులు, తారాజువ్వలు వగైరాలు తిన్నగా బస్సులో దొంతమ్మూరు పట్టుకెళ్ళి పోయే వారు.  ఒక సారి, బహుశా తన పదిహేనేళ్ళప్పుడు,  ఒక పెద్ద బాంబుని , ఒక పెద్ద ఇత్తడి బిందె లో పెట్టి వైరు బయటకి కనెక్ట్ చేసి చెరువు గట్టు మీద పెట్టి పేల్చగానే ఆ చుట్టు పక్కల పాకల్లో ఉన్న నాలుగైదు ఆవులు, గేదెలు ఠపీమని గుండె ఆగి చచ్చి పోయాయి. మా పెద్దన్నయ్యకి రెండు చెవులూ గళ్ళు పడిపోయాయి. ఆ తరువాత జన్మంతా  వినికిడి లోపంతో ఇబ్బంది పడ్డాడు. నాకూ ఒక చెవి కి వినికిడి లోపం ఉంది కానీ ఎందుకో తెలియదు. అందుకే నేను ఎవరినీ మాట్లాడనియ్యకుండా. నేనే గడ, గడా వాగుతూ ఉంటాను….అని అనుకుంటాను.

మరొక విశేషం ఏమిటంటే, తను తెలివైన వాడే అయినప్పటికీ మా పెద్దన్నయ్య ఎస్.ఎస్.ఎల్.సీ లో ఒక సబ్జెక్ట్ లో పరీక్ష తప్పాడు. ఇక చస్తే మళ్ళీ చదవను అనీ, మళ్ళీ రెండో పరీక్షలకి వెళ్ళమని  బలవంతం చేస్తే గన్నేరు కాయలు తిని ఆత్మహత్య చేసుకుని చస్తాను అనీ అందరినీ బెదిరించాడు. అప్పటి యింకా మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. మా నాన్న గారు ఐదు వందల ఎకరాల వ్యవసాయం చేస్తూ, ప్రతీ వారం కాకినాడ-జేగురు పాడు-దొంతమ్మూరు-చిన జగ్గంపేట తిరగ లేక అలిసి పోతూ ఉన్నారు. అంచేత వారి సలహా మా నాన్న గారు మా పొలాలన్నీ మా పెద్దన్నయ్యకి అప్పగించేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇది సుమారు 1950 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత 1983 లో ఆయన పోయే వరకూ మా నాన్న గారు మా “లోకారేడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే శేరీ పొలం” వెళ్ళ లేదు.  పొలం యాజమాన్యం అంతా మా పెద్దన్నయ్య చేతిలో పెట్టేశారు.

నేను ఎస్.ఎస్.,ఎల్. సి లో ఉండగా ..అంటే 1960 లో కరప కరణం గారు శ్రీ చాగంటి సుబ్బారావు గారి రెండో కూతురు సుబ్బలక్ష్మి తో  మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. మా ఇంట్లో జరిగిన, నాకు బాగా గుర్తున్న, అతి సరదా అయిన మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఇప్పుడు (2014) మా పెద్దన్నయ్య పోయి ఏడాది దాటింది. మా పెద్ద వదిన గారు అప్పుడు ఎంత సౌమ్యంగా, అమాయకంగా, ఆప్యాయంగా, పొడుగ్గా ఉండే వారో ఇప్పుడూ అంతే! వారి పెళ్లి అయి కాపురం పెట్టేంత వరకూ మేము వేసవి శలవులకి ఎప్పుడు మా మేనత్త రంగక్కయ్య ఇంటికే దొంతమ్మూరు వెళ్ళే వాళ్ళం. నాకు అస్సలు జ్జాపకం లేదు కానీ బాగా చిన్నప్పుడు దొంతమ్మూరు లో రోజూ పొద్దున్నే నాకు స్నానం చేయించి మా బామ్మ గారి వంద కాసుల బంగారం గొలుసు వేసి గోడ మీద  నుంచి పక్కింటి వెలమ దొరల రాణీ గారికి అప్పజెప్పేవారుట.  ఎందుకంటే తెల్లగా, బొద్దులా ఉండే నేనంటే ఆవిడకి   చాలా ఇష్టంట. పైగా నా పేరే రాజా కదా! వాళ్లకి ఘోషా కాబట్టి ఎప్పుడూ బయటకి వచ్చే వారు కాదు. కానీ సాయంత్రం దాకా నన్ను వాళ్ళింట్లోనే  ఉంచేసుకునే వారుట.  పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి,   చంటబ్బాయి, బోడబ్బాయి అని వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండే వారు. వారింటి పేరు పోశిన వారో, పడాల వారో నాకు ఇప్పటికీ తెలియదు.   ఇటీవల కాకినాడ వెళ్ళినప్పుడు పని కట్టుకుని దొంతమ్మూరు వెళ్ళి, కూలిపోయిన మా  మేడ అవశేషాలతో ఉన్న స్థలమూ, చిన్నప్పుడు వెలమ దొరల రాణీ గారి ముచ్చట తీర్చడానికి నన్ను దాటించిన ఆ  గోడ దగ్గర  నేను మా సుబ్బన్నయ్య, ఆ మేడ/స్థలం నలుగురు వారసులలో ఇద్దరు … అనగా..మా హనుమంత రావు  బావ రెండో కొడుకు ప్రకాశు అనే చిన్న బాబు (అవును…మా తాత గారి పేరే!), ఆఖరి వాడు భాస్కర్ ల తో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఆ గోడ వెనకాల కనపడుతున్న ఆధునిక మేడ నన్ను పెంచిన రాణీ గారి ముని మనుమరాలిదిట. ఆ తలుపు తట్టే ధైర్యం నాకు లేక “మళ్ళీ ఇక్కడికి వస్తే గిస్తే అప్పుడు చూద్దాం లే” అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

పాత మకాం

పాత మకాం

నాకు అప్పటికి అక్షరాభ్యాసం జరిగిందో లోదో తెలియదు కానీ, ఒక సంగతి  మటుకు ఇప్పటికీ భలే గుర్తుంది నాకు. అప్పుడు దొంతమ్మూరు లో  నిజమైన పాఠశాల లేదు. కానీ చింతా జగన్నాథం అనే ఆయన అసలు ఉద్యోగం ఏమిటో తెలియదు కానీ ఊళ్ళో నలుగురు పిల్లలనీ ఇప్పుడు కూలి పోయిన అప్పటి రాముల వారి కోవెల ఎదురుగుండా ఉన్న కుంటముక్కల నరసింహం గారి ఇంటి పెద్ద అరుగుల మీద కూచో బెట్టి “దుంపల బడి” నడిపే వారు. ఒక రోజు ఊళ్ళోకి మలేరియా నివారణ వారో, టీబీ కో టీకాలు వేసే వాళ్ళు వచ్చారని తెలియగానే పిల్లలందరూ కకావికలై పారిపోయారు. అలా పారిపోలేక వెర్రి మొహం వేసుకుని దొరికిన వాడిన నేనే.  అందు చేత ఆ రోజు ఊరి మొత్తానికి నాకే టీకాలు పడ్డాయి. మాములుగా ఆ టీకాలు నుదిటి మీద వేస్తారు. జన్మంతా ఆ మచ్చ  మిగిలి పోతుంది. కానీ ఆ టీకాలబ్బాయి  ఎర్రగా, బొద్దుగా ఉన్న నన్ను చూసి పోనీలో పాపం అని టీకాలు నా నుదిటి మెడ కాకుండా భుజాల మీద వేశాడు.  దాని తాలూకు మచ్చ కూడా ఇప్పుడు లేదు. కానీ నా మొహం మీద ఇప్పుడు చూసిన వాళ్ళు  నాకు చిన్నప్పుడు మశూచికం వచ్చిందనుకుంటారు. అవి మశూచికం తాలూకు కాదనీ, యవ్వన దశ ప్రారంభంలో ఎడా, పెడా వచ్చిన మొటిమలకి మందు వాడకుండా గిల్లేసుకోవడం  వలన మిగిలిన అవశేషాలు అనీ  మనవి చేసుకుంటున్నాను. చిన్నపుడు చికెన్ ఫాక్స్ వచ్చే ఉంటుంది కానే, నాకు గుర్తు లేదు. ఈ తరం వారికి తెలియదేమో కానీ టీకాలు అంటే నిజానికి ఒక పెద్ద సూది మందు. ఆ రోజులల్లో కొందరు ఒక కాల్తున్న పెద్ద చుట్టని నుదుటి మీద పెడితే మశూచికం రాదు అని కూడా అనుకునే వారు. దాని తాలూకు మచ్చ జన్మంతా ఉంటుంది మరి.

అన్నట్టు ఆ కుంట ముక్కల వారు (పెద్దబ్బాయి గారు అనే వారు ఆయనని) జమీందారులు. మా మేనత్త కుటుంబం వారూ కుంటముక్కల వారే! ఆ జమీందారుల (నరసింహం గారు & రామాయమ్మ గారు) రెండో కూతురు రాజా ని మా చిన్నన్నయ్య చిన్న వయసులోనే ప్రేమించి పెద్దదయ్యాక పెళ్లి చేసుకున్నాడు.

ఇక వేసవి శలవులలో మా పొలంలో అతి ముఖ్యమైన పనులు వేసిన కోతలయ్యాక వేసిన కుప్పలు  నూర్చడం, నూర్చిన ధాన్యం ఆరబెట్టి బస్తాలలోకి ఎక్కించి కుట్టడం, కాటా తూచి ధాన్యం మిల్లులకీ, వ్యాపారులకీ అక్కడికక్కడే అమ్మడం. ఊళ్ళో  మకాం ఉన్నప్పుడు రాత్రి జరిగే కుప్ప నూర్పులకి మా చిన్న పిల్లలని తెసుకెళ్ళేవాడు కాదు మా పెద్దన్నయ్య. కానీ పొద్దున్నే లేచి చద్దన్నం తిని, పొలం గట్ల మీద నుంచి మూడు కిలో మీటర్లు మా బావా వాళ్ళ మిరాసీ మీదుగా నడిచి  శేరీ చేరుకునే వాళ్ళం. మా ఉద్దార్డుడు నాగులో, మరొక   పాలికాపో కూడా  ఉండే వాడు.  ఇప్పటిలా అప్పుడు ట్రాక్టర్లు ఉండేవి కాదు. కుప్ప నూర్పులంటే పొలం లో ఒక కళ్ళం చేసి , పేడతో అలికి , మధ్య లో ఒక రాట పాతి, అంచెలంచెలుగా పాతిక పశువుల చేత కళ్ళం లో పరిచిన వరి ధాన్యం మొక్కలని తొక్కించే వారు. ఒక యాభై బస్తాల కుప్పకీ సుమారు ఒక రాత్రి అంతా పట్టేది. కుప్ప మీద నుంచి మొక్కలు కళ్ళెం లో వెయ్యడం, కళ్ళం పడిన లో ధాన్యాన్ని బండి మీద ఎక్కి పెద్ద చేటలతో గాలి లోకి ఆరేసి, రాలిన ధాన్యాన్ని  వేరే కుప్పగా వెయ్యడం మొదలైన పనులన్నీ మా పెద్దన్నయ్య అజమాయిషీ లో యాభై మంది  పాలికాపులు పది రోజుల పాటు పని చేసే వారు. ఇప్పుడు పాలికాపుల బదులు వారిని వ్యవసాయ కూలీలు అనడం వింటున్నాను.  ఇక పొద్దున్నే ఏ పది గంటలకో పొలం చేరుకున్న మా కుర్ర కారు సాయంత్రం దాకా చెరువు గట్ల మీదో, కళ్ళం లో ఉన్న ధాన్యం కుప్పల చాటునో ఆడుతూ, పాడుతూ గడిపేసే వాళ్ళం. మాతో సాయం వచ్చిన పాలికాపులు మమ్మల్ని మా అన్నయ్యకి అప్పగించేసి వెనక్కి మళ్ళీ ఊళ్ళోకి వెళ్లి, మా మేనత్త రంగక్కయ్య సద్దిన రెండు కేరియర్ల భోజనం పట్టుకుని తిరిగి వచ్చే వారు.  మధ్యాహ్నం నిప్పులు చెరుగుతున్న వేసవి కాలం ఎండలో చెరువు గట్టు మీద కూచుని అన్నాలు తినే వాళ్ళం.  రాత్రి అంతా కుప్ప నూర్పులు నూర్చిన పాలికాపులు ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన పనులకి కొత్త బేచ్ వచ్చే వారు.  మా పెద్దన్నయ్య పనులు చూసుకుంటూ ఉంటే మేము పొలం గట్లమ్మట తిరుగుతూ, తాటి ముంజెలు జుర్రుకుంటూ, తేగలు కాల్చుకుని తింటూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, జిగురు కోసం తుమ్మ చెట్లకి గంట్లు పెట్టుకుంటూ, చెరువు గట్టు మీద మామిడి కాయలు కోసుకుని, ముక్కలు చేసి ఉప్పూ, కారం నల్చుకుని తింటూ “శుభ్రంగా పాడై పోయే వాళ్ళం”.  సాయంత్రం చీకటి పడే లోపుగా మళ్ళీ ఇంటికి వెళ్లి పోయేవాళ్ళం.

ఇక నా  జీవితంలో  సాహిత్య పరంగా చెప్పాలంటే నేను వేసవి శలవులకి పదిహేనేళ్ళు వచ్చే దాకా దొంతమ్మూరు వెళ్ళినప్పుడు  అక్కడ చదివిన “చందమామ” పత్రికలనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ మేడ మీద రెండు    పెద్ద గదులు ఉండేవి, ఒక గదిలో రెండు, మూడు భోషాణం నిండా కొన్ని వందల “చందమామ” పత్రికలు ఉండేవి. ఇవి ఖచ్చితంగా మా హనుమంత రావు బావ కలెక్షన్ అయి ఉండాలి. మేము శేరీలో కుప్ప నూర్పులకి వెళ్ళకుండా ఊళ్ళోనే ఉన్నప్పుడు 1950- 1960 లలో వచ్చిన ఈ చందమామలు చదవడమే అద్భుతమైన కాలక్షేపం.  అప్పుడు అది కేవలం కాలక్షేపమే. కానీ నాకు కాస్తైనా  బుద్ది వికసించింది అని ఎవరికైనా అనిపిస్తే దానికి బీజాలు అప్పటివే!

ఆ నాటి కాల భంజకా, కంకాళా, చతుర్నేత్రుడు, మంత్రాల దీవి,  పక్కనే జిల్లేళ్ళ దిబ్బ, చుట్టూ భయంకరమైన మొసళ్ళతో ఉన్న మందాకినీ సరస్సు, దాని ఒడ్డున ఊడల మర్రి, ఏకాక్షి, తోకచుక్క, మకర దేవతా, పొట్టి రాక్షసుడూ, గీక్షసుడూ, దొంగముచ్చూ, పరోపకారి పాపన్నా, బండ రాముడూ, శూరసేన మహరాజూ, జిత్తుల మారి నక్కా, తెనాలి రామలింగడూ, కీలు గుర్రం, పట్టువదలని విక్రమార్కుడూ, అతనికి మౌనభంగం కలగగానే శవంతో సహా మాయమయిన బేతాళుడూ, అమర సింహుడూ మొదలైనవి మహత్తరమైన కాల్పనిక సాహిత్య సృష్టి. మహా భారతమూ, రామాయణమూ, ఇంచుమించు అన్ని ఇతిహాసాలూ నీతి కథలూ నేను చందమామలోనే ఎక్కువగా చదువుకున్నాను. అప్పుడు రచయితల పేర్లు చూసి చదివే వయసు కాదు. కొ.కు. గారు, దాసరి గారు వ్రాసే వారు అని తెలియదు, కానీ వ.పా గారు, చిత్రా గారు బొమ్మలు వేసే వారు అని తెలుసు. ఎందు కంటే ఆ బొమ్మలు చూస్తూ, మేము మేకప్పులు చేసుకుని, కిరీటాలు, కత్తులూ, ఇతర జానపద, పౌరాణిక, కాల్పనిక పాత్రలన్నింటినీ ధరించి ఆటలాడుకునే వాళ్ళం.

పెద్దన్నయ్య పెళ్లి 1960

పెద్దన్నయ్య పెళ్లి 1960

ఈ వయసు దాటాక, మా పెద్దన్నయ్య పెళ్లి అయ్యాక, పొలం పనుల మీద కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాత్రుళ్ళు ఉండిపోవలసి వస్తే దొంతమ్మూరు వెళ్ళకుండా పొలంలోనే ఉండడానికి వీలుగా మా అన్నయ్య ఒక మకాం కట్టుకున్నాడు. అంటే ఒక మూడు గదుల పెద్ద పాక అన్నమాట. అందులో ఒక వంట గది, ఒక పడక గది, మధ్య గది. ముందు వరండా, ఆ వరండాకి అటు, ఇటూ సామాను గదులు ఉండేవి. తాత్కాలింగా ఇది కట్టుకుని, తరువాత పెంకుటిల్లు కదదామనుకున్నాడో లేదో తెలియదు కానీ,  అప్పటి నుంచీ ఆ “పాత మకాం”  ప్రతీ వేసవి కాలం లోనూ మాకు విడిది గృహమే! ఆ మకాం ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో లో ఆ మకాం “నీరసం” గా, నిర్మానుష్యంగా ఉంది కానీ నా చిన్నప్పుడు , ముఖ్యంగా వేసవి కాలంలో, కళ, కళ లాడుతూ ఉండేది. ఆ “కళాకారుల” బృందంలో ప్రధాన భాగస్వాములం  నేనూ, మా తమ్ముడూ, నా పైవాడు సుబ్బన్నయ్య, మా ఆఖరి మేనత్త కొడుకు అబ్బులు బావ, మా పెద్ద వదిన పెద్ద తమ్ముడు వెంకట్రావు, రెండో తమ్ముడు కంచి రాజు, అప్పుడప్పుడు మా అందరికంటే పెద్దవాడే అయినా చిన్నవాడిలా మాతో కలిసిపోయే మా అమలాపురం పెద్ద బావ ఇలా చాలా మంది అ పాత మకాం లోనే రెండు, మూడు నెలలు ఉండిపోయే వాళ్ళం.  అక్కడ కరెంటు ఉండేది కాదు. రాత్రి అవగానే కిరసనాయిల్ లాంతర్లు, పెట్రో మేక్స్ లైట్లే !

ఆ పెట్రో మాక్స్ లైట్ల వెలుతురు లో రాత్రుళ్ళు  కుప్పలు నూరుస్తూ మా పాలికాపులు పాడుకున్న పాటలు నాకు యింకా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా “తాచు” అనే వాడు రాగం ఎత్తుకుంటే ఒళ్ళు గగుర్పొడిచేది. వాడు “గోంగూర” పాట పాడితే  పది సార్లు పాడించుకునే వాళ్ళం. సగం మగ కూలీలు, సగం ఆడ కూలీలు పోటాపోటీ గా నిఘం గానే సరసాలాడుకుంటూ,  ఆడుతూ, పాడుతూ పని చేసుకుంటూ కళ్ళారా చూసిన వాణ్ణి నేను.  పక్కనే ఉన్న గడ్డి మెట్ల మీద పై దాకా నిచ్చెన వేసుకుని ఎక్కి, నా దగ్గర ఉన్న ఒక పెద్ద నక్షత్రాల పటం పరిచి, చిన్న బేటరీ లైట్ వేసి, పైన ఆకాశం లో ప్రతీ నక్షత్రాన్నీ, క్రింద ఈ మ్యాప్ లో గుర్తించి అక్కడ ఉన్నన్నాళ్లు కొన్ని గ్రహాలూ, నక్షత్రాల గమనాన్ని కాగితాల రాసుకుని  అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందిన చిన్నవాణ్ణి నేను.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక కొన్ని రోజుల పాటు ఏ ప్రతీ రాత్రీ నేను చూసిన ఒక అతి పెద్ద  తోకచుక్క నీ, మొత్తం ఆకాశంలో బహుశా మైళ్ళ కొద్దీ పొడుగ్గా ఉన్న అద్భుతమైన ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను.

ఒక్క పేరాలో చెప్పాలంటే …..పైన ఆకాశంలో ప్రస్ఫుటంగా ఒక తోక చుక్క, చుట్టూ దూరంగా నక్షత్రాలు, క్రింద భూమి మీద ప్రేమగా, పల్లెపడుచులు పేడతో అల్లిన కళ్ళం లో తాళ్ళతో కట్టేసిన రాట చుట్టూ తిరుగుతూ, కాళ్ళతో తొక్కుతూ కింద వరి కంకుల నుంచి ధాన్యం గింజల్ని వేరు చేస్తున్న మా పాడి పశువులు, ఆ ధాన్యాన్ని దగ్గరకి చేర్చి కుప్పగా వేస్తూ, కొత్త వరికంకుల్ని వేస్తున్న మా పాలికాపులు, పైన ఎక్కడో గడ్డి మేటు మీద ఆకాశం, నక్షత్రాల పటం చూస్తూ, అందరికీ వివరిస్తూ నేను, ఎక్కడైనా పాటలు వస్తాయేమో అని మా ట్రాన్సిస్టర్ రేడియో తో తంటాలు పడుతున్న వెంకట్రావో, మరొకరో….ఎవరికైనా కాఫీలు కావాలా అని అడుగుతూ మా పెద్ద వదిన గారూ, ధాన్యం కుప్పల మీద సెక్యూ రిటీ కోసం “ఆంజనేయ స్వామి” మట్టి ముద్ర లు వేస్తూ మా తమ్ముడూ, మా సుబ్బన్నయ్యా,  పెట్రోమేక్స్ లైట్ వెలుగులోనే పేక ముక్కలూ పంచుతూ మా అబ్బులు బావా ..ఈ మొత్తం సీనరీ అంతటినీ అజమాయిషీ చేస్తూ “ఆవకాయ ..నా బెస్ట్ ఫ్రెండ్ “ అని ఆ మాత్రం భోజనానికే అఖండంగా ఆనందించే మా పెద్దన్నయ్యా…ఇదే “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే  శేరీ” లో నేను గడిపిన మా చిన్నప్పటి వేసవి శలవుల తీరుతెన్నుల కి నేను ఇవ్వగలిగిన పరిమితమైన అక్షర రూపం.

– వంగూరి చిట్టెన్ రాజు

మీ మాటలు

 1. రమణ బాలాంత్రపు says:

  ఆహా…ఎమిచెప్పుదు గురునాథా ! స్వర్గసీమ అయిన మన పల్లె సీమను ఇంత టూకీగా ఇంత గొప్పగా వర్ణించిన ఆత్మ కథ, బాల్య గాధ ఇది.

 2. సుజాత says:

  ఇవన్నీ చదువుతుంటే ఆ పాకతోనూ పొలాలతోనూ ఏ బంధమూ సంబంధమూ లేని నాకే వాటిని శిధిలావస్థ లో చూసి గుండె బరువెక్కుతుందే, మీకెలా ఉందో ఏవిటో?

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ఉన్న మాట చెప్పాలంటే నాకు గుండె బరువెక్కదు కానీ ఆ నాటి మా ఆనందం మా పిల్లలకి లేదే అని విచారం వేస్తుంది. అతి చిన్న విషయాలలో అఖండమైన ఆనందం పొందిన వాళ్ళం మా తరం వాళ్ళం అనడంలో అసత్యం లేదు. ఏమంటారు ?

 3. ఈ అక్షరాల్లో మీరు చూపెట్టిన వేసవి చిత్రాలు మహా అందంగా ఉన్నాయండీ!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మొన్నటి ఫిబ్రవరిలో నేను కోనసీమ లో చాలా ఊళ్ళు తిరిగే అవకాశం వచ్చింది. అంతటి సస్యశ్యామలమైన పొలాలు ఇంకెక్కడా లేవు అనిపించింది. కానీ ఈ రోజుల్లో ఎండలు ఎక్కువ గా ఉండి భయం వేస్తోంది మళ్ళీ వేసవి కాలం లో అక్కడికి వెళ్ళడానికి.

మీ మాటలు

*