పర్వతాలూ పక్షులు

hrk

 

 

 

నేనొక పల్చని రెక్కల పక్షిని, గర్వం నాకు, ఎగర గలనని.

నువ్వొక పర్వతానివి, గగన సీమల యొక్క వినయానివి.

నువ్వూ నేను ఒకటే గాని ఒకటి కాదు. నువ్వు నేనూ

అణువుల వలలమే. కణుపులు వేరు చెణుకులు వేరు.

 

ఆకాశం శూన్యం కాదు. అహంకార ఓంకారం అంతటా అన్నిటా.

కాస్మిక్ ధూళి. పాముల వలె మొయిళ్లు. నెత్తి మీద చంద్రుడు.

ఆకాశ చిరు శకలాన్ని నేను. కాస్త అహంకారం నా అలంకారం.

నక్షత్రాలతో సంభాషణ… లేదు నిఘంటువు, విన గలిగితే విను.

 srinivas1

ఎగురుతాను, లో లోపల రగిలి, వున్న కాసిని కండరాల్రగిలి.

వియద్గంగలో దప్పిక తీర్చుకుంటాను వూహల దోసిళులెత్తి.

పర్వతాగ్రపు చెట్టు చిఠారు కొమ్మన కూర్చుంటాను కాసేపు

ఒక చిన్ని బిందువులా లో లోపలికి రెక్కలు ముడుచుకుని.

 

ఎగిరెగిరి రాలిపోతాను, రాలిపోయే వరకు ఎగురుతూనే వుంటాను.

 

నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే వుంటావు బహుశా చివరి వరకు.

క్రియా రాహిత్యం నువ్వు పెదిమ విప్పి ప్రకటించని నీ పెను గర్వం.

నాకు నాదైన స్థలం లేదు. ఇక్కడ వుండిపోడానికి రాతి వేర్లు లేవు.

కాసేపుంటానికి వచ్చానని తెలుసు. శాశ్వతత్వం మీద మోజు లేదు.

 

ఇంతకూ ఎందుకు చెబుతావు పద్యాలు పద్యాలై ఏమీ లేకపోవడం గురించి,

ఎగిరి పడడం గురించి, రాలిపోవడం గురించి? ఓ పర్వత సదృశ అవకాశమా!

వుండూరు వదలక్కర్లేని శాశ్వతత్వమా! శిఖరమా! ఆకాశం నీది కాదు, నాది.

ఎగర వలసిన అవసరం నాది. రాలిపోవలసిన ఆవశ్యకత నాది, సవినయంగా.

 

                                                                                       – హెచ్చార్కె

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

మీ మాటలు

  1. బాగుంది, సర్.,

  2. rajaram thumucharla says:

    పర్వతాలకూ ,పక్షులకూ మానుషత్వ ఆరోపణ చేసి వొక జీవన తాత్వికతను అద్భుతంగా చెప్పారు.ధన్యవాదాలు

  3. Thirupalu says:

    //నాకు నాదైన స్థలం లేదు. ఇక్కడ వుండిపోడానికి రాతి వేర్లు లేవు//
    చాలా బాగా చెప్పరు సర్‌,

  4. మీ ప్రతి పద్యం ఓ కొత్త తాత్విక ఆలోచనను మనసులోకి ఒంపుతుంది సార్.. ధన్యవాదాలు..

  5. పర్వతాలూ పక్షులూ బాగున్నాయి.

    ఆకాశం నీది కాదు, నాది.
    ఎగర వలసిన అవసరం నాది. రాలిపోవలసిన ఆవశ్యకత నాది, సవినయంగా.

    సవినయంగా అనడం చాలా బాగుంది. very touching ending.

    ఆకాశం హద్దుగా ఎగిరే పక్షి గర్వం, భూదేవినంటుకునే ఉండే పర్వతం వినయం. ఎగిరెగిరి పడే గర్వం కూడా వినయం చిఠారు కొమ్మన విరామం తీసుకోవడం..
    “క్రియా రాహిత్యం నువ్వు పెదిమ విప్పి ప్రకటించని నీ పెను గర్వం.” – కదలలేని పర్వతానికి కూడా పెదిమ విప్పి ప్రకటించని పెను గర్వం. భలే వుంది కవిత.

    “అణువుల వలలమే. కణుపులు వేరు చెణుకులు వేరు.” పాటలా బాగుంది.

    కవిత్వం చాలా బావుంది హెచ్చార్కె గారు.

  6. Beautiful

  7. ఒక దృశ్య కవితావిష్కరణ

  8. dasaraju ramarao says:

    “ఎగిరెగిరి రాలిపోతాను, రాలిపోయే వరకు ఎగురుతూనే వుంటాను.” జీవన తాత్విక సత్యం తో పాటు సగర్వ దర్పం కలగలిసిన పోయెం. వాక్యాలుగా రాస్తూ కవిత్వాన్ని ఒలికించడం హెచ్చార్కె ప్రతేకత . అభినందనలు సర్.

Leave a Reply to Thirupalu Cancel reply

*