” సారంగ ” రెండో అడుగు!

1

 Saaranga_Logo

 

ఇవాళ “సారంగ” రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

ఈ రెండో అడుగు వేసే ముందు నిన్నటి అడుగుని కాసేపు తరచి చూసుకోవాలన్న తపనే ఈ నాలుగు మాటలూ!

“నెలకీ, రెండు నెలలకీ వచ్చే పత్రికలే నడవడం కష్టంగా వుంది. మీరేమిటి వార పత్రిక అంటున్నారు? చాలా కష్టం! చాలా పని! అసాధ్యం!”

సారంగ “వార” పత్రిక అనే ఆలోచనని మొదటి సారిగా నలుగురితోనూ పంచుకున్నప్పుడు తక్షణమే వచ్చిన ప్రతిస్పందన అది. అలాంటి ప్రతిస్పందనలో ఆశ్చర్యమేమీ లేదు.

ఇంకో వెబ్ పత్రిక నిర్వహణ కష్టం అని మిత్రులు హెచ్చరించడం వెనక – సారంగకి ముందే అనేక వెబ్ పత్రికలు  వుండడం వొక కారణం. గత కొన్ని దశాబ్దాలుగా  సమకాలీన వెబ్ పత్రికలు   చేసిన/ చేస్తున్న కృషికి అప్పటికే మంచి గుర్తింపు వుంది.  2000 సంవత్సరం తరవాత పుస్తక పఠనం వొక మంచి అభిరుచిగా స్థిరపడడంలో ఈ- పత్రికలు తోడ్పడ్డాయి. అదనంగా బ్లాగులు చేస్తున్న కృషి కూడా చిన్నదేమీ కాదు. బ్లాగుల వల్ల రచయితకి కొత్త అభివ్యక్తి స్వేచ్చ దక్కింది. ఏది సాహిత్యం ఏది కాదు అన్న మౌలికమైన ప్రశ్నతో సంబంధం లేకుండా, అభివ్యక్తి వుంటే చాలు అనే భావన ప్రధానమైంది. అత్యాధునిక సాహిత్యానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన మార్పు. అలాగే, తెలుగు సాహిత్యంలో ప్రయోగ దృక్పథం పెరగడానికి కూడా ఈ అభివ్యక్తి స్వేచ్చ అవసరం.

దీనికి తోడు, అచ్చు పత్రికల ప్రాముఖ్యం, ప్రాచుర్యం కూడా పెరిగింది గతంతో పోలిస్తే! అచ్చు పత్రికలూ గతంలో పెట్టుకున్న మూసల్ని తొలగించుకొని, కొత్త వ్యక్తీకరణలకు స్వాగతం పలకడం మేలు మలుపు.  అన్నిటికీ మించి,  పుస్తకాల అందుబాటు చాలా అంటే చాలా పెరిగింది. ఇటీవలి కాలంలో  అచ్చు పుస్తకాల అమ్మకాలు పెరిగాయని రచయితలూ చెప్తున్నారు, పుస్తకాల వ్యాపారులూ చెప్తున్నారు. అంతర్జాలం వాహికగా ఈ-పుస్తకాల వ్యాప్తికి  కొన్ని సంస్థలు నడుం బిగించడం  ఇంకో మలుపు.

అంతర్జాలం వల్ల ఇతర భాషా సాహిత్యాల గురించి తెలుసుకునే/ నేర్చుకునే వనరులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇంతకూ ముందెన్నడూ లేనంతగా తెలుగు రచయితకి పరభాషా రచయితలతో సమాచార బంధం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో వెలువడిన ప్రతి పుస్తకం ఆఘమేఘాల మీద తెలుగు రీడర్ కి అందుతోంది. “రీడర్” అంటే- చదువరి – స్వభావంలో కూడా మార్పు వచ్చిందని ఇటీవలి సర్వేలూ, అధ్యయనాలూ చెప్తున్నాయి. ఆ మాటకొస్తే, సాహిత్య సిద్ధాంత పరిభాషలో “రీడింగ్” అనే ప్రక్రియకి  అర్థమే మారిపోయింది, అది వేరే సంగతి!

ఈ నేపథ్యంలో ‘సారంగ’ వొక వారపత్రికగా చేయాల్సిందేమైనా వుందా అన్న ప్రశ్నతో మా ప్రయాణం మొదలయింది. వ్యక్తులుగాని, సంస్థలు గాని, పత్రికలు గాని చేయాల్సింది ఎప్పుడూ ఎదో వొకటి వుండనే వుంటుంది. కొన్ని సార్లు ఈ లక్ష్యాలు  స్పష్టంగా  వుండకపోవచ్చు, మరికొన్ని సార్లు బల్లగుద్ది చెప్పినంత స్పష్టంగానూ వుండవచ్చు.  వొక అడుగు వేసినప్పుడు ఆ అడుగు ఎటు వెళ్తుందని ముందే అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కొన్ని సార్లు కొన్ని అడుగులు మాత్రమే వొక  మొత్తం ప్రయాణపు అనుభవాన్ని ఇవ్వచ్చు.

అలాంటి చిన్ని అడుగుల ప్రయాణ అనుభవాల్ని మాత్రమే నమ్ముకొని  “సారంగ” మొదటి అడుగేసింది. ఈ తొలి అడుగు  తన హృదయంపై చెరగని ముద్ర వేసిందని మాత్రం  ఇప్పటికిప్పుడు ఖాయంగా నమ్ముతోంది “సారంగ”.

163172_1692339581282_7888317_n                                                      

   2                                          

వొక ఏడాది కాలంలో సాధించేది ఎంత వుంటుందో లెక్కలు తెలియవు ‘సారంగ’కి!

సాహిత్యం ఎంత కాదన్నా- ప్రసిద్ధ విమర్శకుడు రాచమల్లు రామచంద్ర రెడ్డి గారన్నట్టు- ‘హృదయ వ్యాపారం’! ఎంత హృదయగతమైన పని అయినా, తీరికలేని వృత్తి వ్యాపకాల మధ్య పత్రికని వారం వారం వివిధ శీర్షికలతో, నిండుగా  తీసుకురావడం కష్టమే. అయినా, ఈ ఏడాది కాలంలో వొక్క వారం కూడా “సారంగ” గైర్ హాజరీ లేదు. ఇలా ప్రతి  గురువారం  “మై హూ” అనుకుంటూ వేళ తప్పక మీ ముందు వుండడమే ఈ ఏడాది ‘సారంగ’ సాధించిన పెద్ద విజయం!

అయితే, ఈ విజయం ‘సారంగ’లో భాగస్వాములైన మీ అందరిదీ. ముఖ్యంగా, ఎప్పటికప్పుడు సారంగ గడువుల్ని దాటకుండా రచనలు పంపిన ప్రతి వొక్కరిదీ. ఈ ఏడాది కాలంలో ఎంతో మంది పాత కొత్త రచయితలు ‘సారంగ’ లో రాశారు. రచయితలకు వాళ్ళకి అంతకుముందే వున్న కీర్తికిరీటాల్ని బట్టి కాకుండా కేవలం “రచన” మాత్రమే ఏక ప్రమాణంగా “సారంగ” రచనల్ని ఆహ్వానించింది. కొత్త కాలమిస్టులని తెలుగు పత్రికాలోకానికి పరిచయం చేసింది. కొన్ని సందర్భాల్లో ఉత్తమ పాఠకుల్ని రచయితలుగా అరంగేట్రం చేయించింది.  మంచి పుస్తకాలు కనిపించినప్పుడల్లా భేషజం వీడి, ఈ పుస్తకం గురించి మీరు  రాయచ్చు కదా అని వుత్సాహపరచింది. ఇది రచన అవుతుందా కాదా అన్న సత్సంశయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు “అవును, అది రచనే!” అని వెన్ను తట్టింది.  సకాలంలో రచనలు పంపుతూ, తోటి రచయితల రచనల మీద వ్యాఖ్యానాలు చేస్తూ, సారంగని నలుగురితోనూ పంచుకుంటూ, చర్చల్లో సారంగకి కాస్త చోటిస్తూ మీ అందరూ చూపించిన అభిమానం…వీటన్నిటినీ లెక్కలు కట్టే కొలమానాలు  మన దగ్గిర లేవు, కనీసం మా దగ్గిర లేవు!

3

ఏడాది కిందట సారంగ తొలి సంపాదకీయంలో ఇలా రాసుకుంది:

రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలనీ, లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల.

తెలుగు సమాజం ఎన్నో వొడిదుడుకుల్ని, వొక ప్రాంతీయ  విభజననీ ఎదుర్కొన్న ఈ ఏడాది తరవాత కూడా ‘సారంగ’ కల అదే!

నిజంగా చెప్పాలంటే, తెలుగు సమాజం, సాహిత్యం  ఇంతకుముందెన్నడూ అనుభవంలోకి రాని అచ్చంగా వొక సవాల్ వంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఇప్పటిదాకా తెలుగు అంటే వొకటే రాష్ట్రం, ఇక నించి తెలుగు అంటే రెండు రాష్ట్రాలు.

మనలో చాలా మంది వొకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో బతికిన వాళ్ళమే! ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్ళదే! మారుతున్న ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక అవసరాల వల్ల ఇప్పుడు అందరమూ కలిసే వుంటాం అంటే కుదరదు. కలిసి వుండాలి అనుకోవడం అందమైన కల! నిజమైతే బాగుణ్ణు అనిపించే కల. కానీ, విడిపోవాలి అన్న భావన వచ్చిన తరవాత బలవంతంగా కలిపి వుంచాలనుకోవడం వాస్తవికతని అర్థం చేసుకోలేక పోవడమే అవుతుంది. ఇది కుటుంబాల విషయంలోనే కాదు, సమాజాలు, వాటి  సాంస్కృతికత విషయానికి వస్తే ఇంకా బలంగా కనిపించే భావన. విడిగా వుండడం అనేది వొక పాలనా సౌకర్యం అనీ, అందులో ఇద్దరికీ వొద్దికైన  వెసులుబాట్లు వుంటాయని ఇంకా మనం అర్థం చేసుకోవాల్సి వుంది. ఈ అర్థం చేసుకునే క్రమం (process) లో చాలా దుఃఖం వుంది. అయినా, వాస్తవికత మన అన్ని దుఃఖాల కన్నా బలమైన శక్తి. మరీ ముఖ్యంగా, తెలుగు రచయిత ఇక నించి తనని కేవలం “ఆంధ్ర” రచయితగానే కాకుండా  తెలంగాణా రచయితగా కూడా ఎట్లా చూసుకోవాలో వొక పెద్ద సవాల్! రాజకీయ విభజనని సాంస్కృతిక, సాహిత్య ‘విభజన’గా ఎట్లా అవగాహనకి చేసుకోవాలో మనకి అనుభవంలో లేని విషయం. ఈ విభజన అసలు సాహిత్య రంగంలోకి ఎట్లా అనువాదమవుతుందో కూడా జీర్ణం కాని విషయం.

కాని, ఈ అనుభవంలోంచి మనం నేర్చుకోవాల్సిన సాంస్కృతిక పాఠం వొకటి వుంది. స్త్రీవాదం వచ్చేంత దాకా  మనలోపల స్త్రీ/పురుష ప్రపంచాలు విడిగా వుండవచ్చు అన్న నిజాన్ని మనం జీర్ణించుకోలేక పోయాం. స్త్రీ ‘స్వరాన్ని’ పురుషుడు కాకుండా స్త్రీ మాత్రమే వినిపించినప్పుడు ఆ అనుభవం ఎంత బలంగా వుండవచ్చో మనకి స్త్రీవాద సాహిత్యం నిరూపించింది. అలాగే, దళితులూ ముస్లింలూ వాళ్ళ వాళ్ళ గొంతు విప్పే దాకా వాళ్ళ సమస్యల తీవ్రత మనకి అర్థం కాలేదు. ఆ అస్తిత్వాలు మన సాహిత్యాన్ని ఎంతగా మార్చాయో ఇప్పుడు చరిత్ర చెప్పక్కరలేదు. తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వం దీనికి భిన్నమైనదేమీ కాదు. ఆ అస్తిత్వాలు ఆత్మ గౌరవం నిలుపుకోవడానికి కొన్ని సార్లు తీవ్రంగా పోరాడాల్సి వుంటుంది. ఇవాళ తెలంగాణా పడుతున్న వేదన కూడా అదే! ఈ వేదనని ఎవరైనా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ప్రపంచ  బాధని తన బాధగా పలికించగల సాహిత్య లోకం! ఈ అస్తిత్వ ఉద్యమాల స్వరాన్ని నిరాకరించడం మన సాహిత్య చరిత్రని మనమే అవమానించడం! మనలో వస్తున్న మార్పుని మనమే నిరాకరించడం!  అస్తిత్వ ఉద్యమాల విలువని ‘సారంగ’ వార పత్రిక గౌరవిస్తుంది,  అవి సాహిత్య చరిత్రని మంచి మలుపు తిప్పేంత వరకూ! మన సంస్కారాల్ని వీలయినంత ఉత్తమ స్థితికి నడిపించేంత వరకూ!

375519_2750719010296_83144504_n

4

వారపత్రిక అనగానే నిజంగానే బోలెడు పని!

నిజమే, ఇది ఏదో మూడు చేతుల మీదుగా – అవీ ఇతర రోజువారీ పనుల మధ్య వుండి – తీరిక చిక్కించుకొని పని చేస్తున్న చేతులు. అందుకే, రచయితల్ని మేం పదే పదే కోరింది వొక్కటే- వీలయినంత మటుకు దోషరహితమైన ప్రతులు పంపించమని! ఇప్పటికీ కొన్ని రచనల్లో అక్షరదోషాలు వస్తూనే వున్నాయి. వాటిని తొలగించడంలో రచయితల సహకారాన్ని కోరుతున్నాం.

రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతూ “సారంగ” కొన్ని కొత్త శీర్షికలని మీ ముందుకు తీసుకు రాబోతోంది.

1. ముఖ్యంగా ఇప్పుడొస్తున్న కథల మీద తగినంత చర్చా, విశ్లేషణ ఇంకా జరగాల్సే వుంది. ఈ కథా చర్చకి నాందిగా అరిపిరాల సత్యప్రసాద్, డి. చంద్రశేఖర రెడ్డి, బీ.వీ. రమణ మూర్తి లు “నడుస్తున్న కథ” శీర్షికలో ఏ నెలకి ఆ నెల వెలువడుతున్న కథల మీద చర్చ చేయబోతున్నారు. ఈ చర్చలో మీరూ పాల్గొనండి. కొత్త కథల మీద, వాటి బలాలూ బలహీనతలు చెప్పే విధంగా మీ విమర్శక గొంతు వినిపించండి. ఈ శీర్షిక నిర్వహణకి ఎంతో సమయమూ, వోపికా, ఆలోచనా పెడ్తున్న ఈ ముగ్గురు కథాప్రేమికులకు “సారంగ” ధన్యవాదాలు చెప్పుకుంటోంది.

2. ఒక కథా రచయిత సమకాలీన జీవితం గురించి, మారుతున్నసాంస్కృతిక జీవనం గురించి డైరీ రాసుకుంటే ఎలా వుంటుంది? అన్న ఆలోచనలోంచి పుట్టిన శీర్షిక ప్రముఖ కథకుడు కూర్మనాధ్ కాలమ్ “My Space.”

౩. రెండు తెలుగు రాష్ట్రాల ముందు వున్న ప్రస్తుత సాహిత్య సమస్య: తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం. ప్రముఖ సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు ఎన్. వేణుగోపాల్ అందిస్తున్న శీర్షిక “గత వర్తమానం.”

4. యాత్రా స్మృతుల గురించి, ప్రత్యామ్నాయ సినిమాల గురించి, ఇంకా అనేకానేక సమకాలీన విషయాల గురించి లలిత కలం నుంచి రానున్న ” చిత్ర యాత్ర” .

5. సున్నితమైన ఆలోచనా, స్పందించే మనసూ వున్న వ్యక్తికి ప్రతి సంఘటనా ప్రతి అనుభవమూ వొక చిన్న యుద్ధమే. అలాంటి సంవేదనల చిత్తర్వు ప్రముఖ సాహిత్య విమర్శకుడు జీ. యస్. రామ్మోహన్ అందిస్తున్న కానుక ఈ సంచికతోనే ప్రారంభం.

ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే! ఇంకా  కవిత్వ, వచనప్రక్రియలకు సంబంధించిన కొన్ని శీర్షికలు రూపు దిద్దుకుంటున్నాయి. వాటి గురించి వీలు వెంబడి వివరాలు అందిస్తాం.

ఇక ఇప్పటి వరకూ వున్న పాత శీర్షికలు యథాతధంగా కొనసాగుతాయి.  కథా సారంగ 2013 నిర్వహణలో మాకు పూర్తి సహాయసహకారాలు ఇచ్చి  కొన్ని మంచి కథల్ని అందించడంలో మాకు తోడ్పడిన వేంపల్లె షరీఫ్ కి ధన్యవాదాలు. ప్రతి ఏడాది వొక రచయితకి కథా సారంగ నిర్వహణ పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలన్నది మా నిర్ణయం. కథా సారంగ 2014 కొత్త ఎడిటర్ పేరుని త్వరలో ప్రకటిస్తాం.

*

(చిత్రాలు: అన్నవరం శ్రీనివాస్, ఏలే లక్ష్మణ్)

మీ మాటలు

 1. mercy margaret says:

  “సారంగ “కి అభినందనలు మరిన్ని మైలురాళ్ళు ,దాటి సాహిత్య సేవలో ముందుండాలని కోరుకుంటున్నాను ..

 2. rajaram thumucharla says:

  సారంగ రెండో అడుగు వేస్తున్నందుకు నిర్వాహకులు అందరికీ అభినందనలు.ఇంకా ఎన్నో ఎన్నెన్నో అడుగులు వేస్తు ముందుకు సాగాలని ఆశిస్తూ..
  . . . . . .రాజారామ్

 3. అభినందనలు.

 4. సంతోషం..మీతో అడుగువేసినందుకు..మరో అడుగు కలిసి వేద్దాం!

 5. వార్షికోత్సవ వేళ సారంగ సంపాదకులకు, రచయితలకు, పాఠకలకు అభినందలు. పత్రిక మరింత పురోగమించాలని ఆశిస్తూ…
  కొల్లూరి సోమ శంకర్

 6. సంపాదకవర్గానికి హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రయాణంలో కొన్ని శీర్షికలు ఎంతగానో అలరించాయి. ఈదేసిన గోదారి, తోకచుక్కల్లాంటి శీర్షికల్లో నవ్యత బాగుంది. ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి ఇలా క్రమం తప్పకుండా వైవిధ్యంగా పరిచయాలనూ, మచ్చుగా కవితలను అందించిన పత్రిక మరొకటి లేదు. బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాసాలు ఆగిపోవడం బాగా నిరాశ కలిగించింది. ఎంచక్కని పద్యాలను రసవత్తరంగా అందించిన ఆ శీర్షిక కొనసాగితే బాగుంటుందనిపించింది. అలాగే తరంగ కవితలు సారంగకు కొత్త సొబగులద్దాయి. కొందరి కవితాత్మక వచనాలకు (ఉదా: ప్రసూనా రవీంద్రన్) ఇందులో భాగం కల్పించడం సముచితమనిపించింది. కవిత్వానికీ వచనానికీ మధ్యనుండే సన్నని గీతను చక్కగా పట్టుకున్నారనిపించింది. సారంగకు శుభాకాంక్షలతో.

 7. కల్లూరి భాస్కరం says:

  సారంగ రెండో వార్షికోత్సవంలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు. మంచి అభిరుచితో, ప్రమాణాలతో సారంగను తీర్చి దిద్దుతున్న కల్పన, అఫ్సర్, ఇతర సంపాదక మిత్రులకు మరీనూ.

 8. amarendra says:

  పుట్టగానే పరుగులు పెట్టడం నేర్చిన సారంగకు అప్పుడే ఏడాది నిండడం..చాలా సంతోషంగా ఉంది..మరో దశాబ్దం వరకూ అయినా ఈ పరుగు ఆగరాదని నా ఆకాంక్ష ..హ్యాపీ birthday saarnagaa !!

 9. A Very Happy Birthday to Saaranga. My hearty wishes to the editorial Team, and all the writers who contributed. Many happy returns

 10. సారంగ ఏడాది ప్రయాణంలో నేనూ ఉన్నానన్న భావనే చాలా సంతోషాన్నిస్తోంది. యిందుకు సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు. ఇకముందు సారంగతో కొనసాగుతూ నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు కృషి సాగిస్తాను. సారంగ సంపాదక వర్గానికి మిత్రులకు హృదయపూర్వక అభినందనలు.

 11. అఫ్సర్ గారూ!

  సారంగ రెండో అడుగు సందర్భంగా మీకు హృదయ పూర్వక అభినందనలు. మీ కృషి ఇలానే నిరాటంకంగా సాగాలని కోరుకుంటున్నాను. మీరు ఎంపిక చేసి వేసిన రెండు చిత్రాలు – ముఖ్యంగా ఏలె లక్ష్మణ్ గారిది – అద్భుతం.

 12. alluri gouri lakshmi says:

  Hearty congratulations to సారంగా Team..

 13. Afsar, Kalpana and others behind this mile stone, hearty congratulations. Surge ahead, you guys are doing great job.

 14. Jagadeeshwar Reddy Gorusu says:

  సారంగ వార్శికోత్సవ సందర్భంగా నా హృదయ పూర్వక అభినందనలు
  – గొరుసు

 15. Vamsee krishna says:

  రెండో సంవత్సరం లోకి సారంగ అడుగు పెడ్తున్న సందర్భం లో హృదయ పూర్వక శుభాకాంక్షలు
  ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను

  వంశీ కృష్ణ

 16. balasudhakarmouli says:

  సాహిత్య సేవలో భాగంగా పనిచేస్తున్న సారంగకు నా శుభాకాంక్షలు ….

 17. రెడ్డి రామకృష్ణ says:

  రెండవ సవత్సరం లోకి అడుగు పెడుతున్న సారంగకి అభినందనలు.మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతుందని ఆశిస్తూ ..

 18. raamaa chandramouli says:

  ఒక సాహసోపేతమైన అడుగుతో మొదలైన ‘ సారంగ’ ప్రయాణం ఈరోజు అనేకమంది రచయితల జైత్రయాత్రగా కొనసాగుతోంది.వెబ్ పత్రిక అంటే ‘సారంగే’ అని హృదయాల్లోకి ఇంకిపోయి చాటిచెబుతోంది.’విజయానికి’ ఇంతకన్నా ఋజువు అవసరంలేదు.
  జయహో.
  సంపాదకులను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను.
  మీ వెంట మేమంతా ఉంటాం.
  -ప్రొ.రామా చంద్రమౌళి,వరంగల్.

 19. హృదయపూర్వక అభినందనలు.
  వారం వారం పత్రికని అప్‌డేట్ చేయడం చాలా కష్టమైన పని. మీ కృషికి ధన్యవాదాలు.

 20. అఫ్సర్ గారికి, కల్పన గారికి, రాజ్ గారికి,

  హృదయ పూర్వక అభినందనలు!
  పత్రికను ఇంత అందంగా, వారం వారం క్రమం తప్పకుండా తీసుకురావడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. Great job! kudos to you!

  -రవి

 21. m.viswanadhareddy says:

  ఫేసుబుక్కులు twittarlu ఆన్ లైన్ చాటింగులు చీటింగులతొ నెట్ సాలేగుడును .. దారిమల్లించి సాహిత్య సౌరబాలతో నింపి మీ వ్యక్తీ గత కాలాన్ని సారంగ్ కు వెచ్చించి నందుకు కేవలం ధన్యవాదాలు సరిపోవు అంతకుమించి అభినందన నందనాలు

 22. satyanarayana says:

  కొంత కాలంగా ,సారంగా పాఠకుడిని,
  ఎడిటోరియల్ బోర్డు కి కొన్ని సలహాలిద్దామని ,నా అభిప్రాయాలు తెలియ చేద్దామని ,సంపాదకుల ఇ-మెయిల్ అడ్రస్ కోసం వెదికాను ,ఎక్కడా కనిపించలేదు .
  కల్పనా రెంటాల గారికి ,అలాగే ఇతర సంపాదకులకి మెయిల్ చేయడమెలా ?
  చివరికి ,ఏమి చేయాలో తోచక,
  ఇలా సంప్రదిస్తున్నాను ,
  సారంగా సారధుల,మెయిల్ అడ్రస్ ,ఎక్కడ ?
  నాకే కనిపించట్లేదా ?
  అసలు magazine కి ,అభిప్రాయాలు ఎలా పంపించాలి ?రచనలు ఏ అడ్రస్ కి పంపాలి ?

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

*