ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1

venu

‘వర్తమాన కాలమూ గత కాలమూ

బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి

భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది

కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే

కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి టి ఎస్ ఇలియట్.

 

‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్నాడు చరిత్రకారుడు ఇ ఎచ్ కార్.

 

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఒక కలనేత. ఒక పిచికగూడు. వినీలాకాశంలో రకరకాల చిత్తరువులు గీసే మేఘమాల. తెలంగాణలోనైతే దసరా పండుగరోజున శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించే ప్రాచీన గతమూ, ఊరేగింపులో అటూ ఇటూ ఊగుతున్న, అప్పటికప్పుడు కోసిన జొన్న కర్రల వర్తమానం. పీరీ ఎత్తుకుని ఊగుతున్న అబ్బాసలీ కాళ్ల మీద బిందెడు నీళ్లు గుమ్మరించిన పెద్దింటి హిందూ అగ్రవర్ణ ముత్తైదువు కన్నీటి బిందువుగా రాలుతున్న ఆశన్న – ఊశన్నల అమరత్వం, ఇవాళ్టి గునుగు తంగెడు కట్ల బంతి గొట్టం రకరకాల పూల బతుకమ్మల ముందర ఏడేడు తరాల గాథల పాటల చప్పట్లు తవ్విపోస్తున్న సబ్బండవర్ణాల అక్కచెల్లెళ్ల ఆనందహేల. ఏ వర్తమాన దుఃఖానికైనా తాతముత్తాతల శోకాన్ని ప్రవహించే మా ఇంటి ముందరి చాకలి లచ్చవ్వ రోదన… ఎన్నెన్నో దృశ్యాలు అల్లుకుపోతున్న తెలంగాణ వర్తమానంలో, కాదు గతవర్తమానభవిష్యత్తుల మధ్య విభజన లేని లిప్తలో ఇది రాస్తున్నాను.

 

‘సారంగ’కు ఏదైనా శీర్షిక రాయమని అఫ్సర్ అడిగినప్పుడు, నేనేదో రాయగలనని కాదు గాని, తనతో ముప్పై ఏళ్లకు పైబడిన గాఢమైన స్నేహం వల్ల మాట తీసేయలేక ఒప్పుకున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో గత వర్తమానాల సంభాషణ గురించి రాయడానికి ఈ శీర్షికలో ప్రయత్నించ వచ్చుననుకున్నాను. గతమూ వర్తమానమూ కేవలం కాలసూచికలు మాత్రమే కాదు, నిరంతర చలనశీలతకు చిహ్నాలు. ఇవాళ వర్తమానమైనది రేపటికి గతమైపోతుంది. గతమూ నిశ్చలం కాదు. ఇవాళ గతం అనుకున్నదాన్ని కొత్తగా చూసే ఆకరాలు, ఆధారాలు ఆవిష్కృతమై గతం మారుతూనే ఉంటుంది. కాగా వర్తమానం అనే మాటకే కాలసూచికగా మాత్రమే కాక, వార్త, సమాచారం, సందేశం, వృత్తాంతం అనే అర్థాలు కూడ ఉన్నాయి. అందువల్ల కాలానికీ, సమాచారానికీ, వృత్తాంతానికీ, విశ్లేషణకూ, మరో చూపుకూ, కొత్త చూపుకూ అవకాశమిచ్చే ‘గతవర్తమానం’ శీర్షిక ఎంచుకున్నాను.

 

ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో జరిగిన ఒక మతాంతరీకరణ మీద అప్పుడే వెలువడిన ఒక పుస్తకాన్ని ఇప్పుడు కొత్తగా చూసి ఏమి ఆలోచించవచ్చునో రాయడంతో ఈ శీర్షిక ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఈలోగా నిరంతర గతమూ, నిరంతర వర్తమానమూ, అనంత భవిష్యత్తూ అయిన నా కన్నతల్లి తెలంగాణ లేతమొగ్గలా పువ్వులోకి విచ్చుకుంటున్న సందర్భం, భవిష్యత్తులోకి గెంతుతున్న సంరంభం నా ఈ శీర్షికకు నాందీప్రస్తావనగా మారాయి.

కుటుంబరావు గారి ‘చదువు’లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోయి జర్మనీ గెలిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు “ఏమవుతుందీ? … ఇంగ్లీషు మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు” అని జవాబు చెప్పించినట్టు, తెలంగాణ ఎన్నడూ ఓడిపోకుండానే తనది కాని మరొక భాషలో, కాకపోతే మరొక మాండలికంలో, మరొక యాసలో పాఠాలు చదువుకోవలసి వచ్చింది. ఇప్పుడిక్కడ నేను రాస్తున్న భాష, కనీసం అతి ఎక్కువ పదాలు, క్రియాంతాలు నేను మాట్లాడే భాషవి కావు. ఈ దేశంలో పాలకవర్గాలు బలప్రయోగం అవసరం లేకుండానే పాలితులను లొంగదీయ గలిగాయని కొశాంబీ అన్నట్టు, బలప్రయోగం అవసరం లేకుండానే, ఏ యుద్దంలోనూ ఓడిపోకుండానే నా భాష నాకు దూరమైపోయింది. కనుమరుగైపోయింది. నా భాష మాత్రమే కాదు, తెలుగు భాషలోని అద్భుతమైన మాండలికాల సొగసులన్నీ అణగిపోయాయి. తన కాలానికీ, సుదూర భవిష్యత్తుకూ కూడ గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని వ్యక్తం చేసిన గురజాడ అప్పారావు కూడ “…ప్రామాణికమైనదిగా గుర్తింపుపొందిన ఒక వ్యవహార భాష ఉందని ప్రసిద్ధ పండితులూ, తెలుగుదేశ ప్రజలూ అంగీకరిస్తున్నారు. అది కృష్ణా, గోదావరి జిల్లాల తెలుగు తప్ప మరొకటి కాదు” (డిసెంట్ పత్రం) అని, ఈ “ప్రామాణిక” భాష పెత్తందారీతనానికి లొంగిపోయారంటే ఈ అంకుశం ఎంత మెత్తనిదో, ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

 

ఆ మాట అన్నందుకు ఆయనకు ఏదో దురుద్దేశాన్ని, స్వార్థ ప్రయోజనాన్ని అంటగట్టనక్కరలేదు. ఏ దురుద్దేశమూ, స్వార్థ ప్రయోజనమూ లేకుండానే భావజాలపు మత్తు తన పాత్ర నిర్వహిస్తుంది. ఆ భావజాలపు మత్తే తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదన్నది. అసలు తెలంగాణకు భాష లేదన్నది. సాహిత్యం లేదన్నది. చరిత్ర లేదన్నది. మర్యాద తెలియదన్నది. తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య సృజించారని తేలినవారి స్వస్థలాల గురించి కూడ అపనమ్మకం ప్రకటించింది. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని కాలువలు వచ్చి, కాలువల కింద వ్యవసాయం వచ్చి, వ్యవసాయంలో మిగులు వచ్చి, ఆ మిగులు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు, ముద్రణ, ప్రచురణ, ప్రచార మాధ్యమాల రంగాలకు, సినిమాకు వ్యాపించి తన భాషే ప్రమాణం, తన జీవన విధానమే ప్రమాణం అని స్థిరీకరించింది.

 

ఒక బహుళ సమాజంలో, వైవిధ్య భరిత సమాజంలో మిగిలిన అంశాలన్నిటినీ తోసివేసి, అణచివేసి, ఒకేఒక్క “ప్రమాణాన్ని” నిర్ణయించడం రెండు దుష్పరిణామాలకు – అనుకరణకైనా, న్యూనతకైనా – దారి తీస్తుంది. అణచివేతకు గురైన సమూహాలన్నీ తామూ ఆ “ప్రమాణాన్ని” అందుకోవాలని వెంపరలాడతాయి, అనుకరిస్తాయి. అనుకరణ సంస్కృతి ప్రబలుతుంది. తమ మూలాలను మరచిపోయి, తొక్కివేసి “ప్రమాణాన్ని” అనుకరించాలని ప్రయత్నించేవారు పెరుగుతారు. మరి ఆధిపత్య ప్రమాణం ఇలా చేరవచ్చేవారందరినీ చేర్చుకోజాలదు గనుక ఆ “ప్రధానస్రవంతి” లోకి కొందరికే ప్రవేశం దొరుకుతుంది. కాగా అణచివేతకు గురైన అసంఖ్యాకులు తాము ఆ ప్రమాణాన్ని అందుకోలేమని, తమకు అది అందుకునే అర్హత, యోగ్యత, సామర్థ్యం లేవని ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అందువల్ల “ప్రమాణపు” బలం మరింత పెరుగుతుంది.

kancharlagopana

తెలంగాణలో పుట్టిన సాహిత్యకారులలో, తెలంగాణ సాహిత్య సంప్రదాయంలో కనీసం ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచీ ఈ అనుకరణనైనా, న్యూనతనైనా గుర్తించవచ్చు. హైదరాబాదులో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1901), స్థానిక ప్రభువైన మల్కిభరాముడినో (ముల్క్ ఇబ్రహీం కుతుబ్ షా), ఆ గోల్కొండ రాజ్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగానార్యనో, ఆ ప్రాంతంలోనే అద్భుతమైన వాగ్గేయకారుడిగా ఎదిగిన కంచర్ల గోపన్ననో కాకుండా ఆ ప్రాంతంతో ఎన్నడూ సంబంధం లేని, ప్రామాణిక తెలుగు సాహిత్య చరిత్ర కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టడం ఈ అనుకరణ – ఆత్మ న్యూనతా సంస్కృతికి చిహ్నమే. అలాగే హనుమకొండలో ఏర్పడిన రెండో తెలుగు గ్రంథాలయానికి (రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1904), తెలుగు జాతినంతా ఏకం చేసిన స్థానిక ప్రభువంశం కాకతీయుల పేరు కాకుండా, స్థానిక కవి పోతన పేరు కాకుండా ఒక చిన్న తెలుగు ప్రాంతాన్ని పాలించిన, హనుమకొండతో ఏ సంబంధమూ లేని రాజరాజ నరేంద్రుని పేరు పెట్టడమూ ఈ అనుకరణ-ఆత్మన్యూనతల ఫలితమే. ఈ సంప్రదాయమే ఇవాళ నేను వాడే భాష దాకా, నా భాష వాడడానికి బెరుకు పడేదాకా కొనసాగుతున్నది.

అయితే ఈ సంప్రదాయాన్ని తోసిరాజని తన ప్రత్యేక అస్తిత్వాన్ని, తన సంస్కృతిని, తన భాషా సాహిత్యాలను, తన ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపట్టిన సంప్రదాయం కూడ కనీసం 1930ల నుంచీ ఉంది. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న వ్యాఖ్యకు స్పందనగా 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక 354 మంది తెలంగాణ కవులను చూపింది. అయినా ఇరవై సంవత్సరాల తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి తన తొలి నవల ప్రజల మనిషి వెలువరిస్తూ, అందులో తెలంగాణ జనసామాన్యం వాడే భాష వాడినందుకు “చాలా భయంతో ఈ నవలను బైటికి తెస్తున్నాను” అని ప్రకటించారంటే తెలంగాణ సాహిత్యకారులు అనుభవించిన ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

విలీనం తర్వాత, సోదరులనీ, ఒకే భాషకు చెందినవారనీ చెప్పిన తర్వాత ఆధిపత్య, ప్రామాణిక భాషతో పోల్చుకుని ఈ “భయం” తగ్గలేదు సరిగదా పెరిగింది. తెలంగాణ భాష, “ప్రామాణిక” భాషకు, “ప్రామాణిక” నిఘంటువులకు తెలియని తెలంగాణ పదాలు ఇంకా అవహేళనకూ, అవమానానికీ గురవుతూనే వచ్చాయి. తెలంగాణ భాష అయితే తౌరక్యాంధ్రమో, కాకపోతే అలగా జనాల మొరటు భాషో అయిపోయింది. దాదాపు సగం ప్రాంతంలో జనవ్యవహారంలో ఉన్న మాటలు కేవలం తమకు తెలియనందువల్ల, తమ నిఘంటువుల్లోకి ఎక్కనందువల్ల అవమానించదగినవని మహాఘనత వహించిన కోస్తాంధ్ర సాహిత్యకారులు అనుకున్నారు. కోస్తాలో కొన్ని కులాల, చిన్న చిన్న ప్రాంతాల భాషను, చిన్న సమూహాల నుడికారాన్ని తెలంగాణ పాఠకులు చదువుతూ, నేర్చుకుంటూ, ఆనందిస్తూ, తమ పదజాలంలో భాగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే తెలంగాణ మాండలికం విస్మరణకు, అవహేళనకు  గురయింది.

 

ఇటువంటి అవహేళనలకు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తన మొదటి కవితాసంపుటం ‘చలినెగళ్లు’ లో ఒక కవితలో ‘శ్మశానంలో కోర్కెలు తీరని బొక్కల వలె’ అని వరవరరావు రాస్తే, ఒక సుప్రసిద్ధ కోస్తా సాహిత్య విమర్శకుడు తెలంగాణలో ‘బొక్కలు’ అంటే ఎముకలు అని తెలుసుకోకుండా, తనకు తెలిసిన ‘రంధ్రాలు’ అనే అర్థమే సర్వస్వమైనట్టు ఇంత అశ్లీలం రాయడమా అని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత పునః ప్రారంభమైన సృజన లో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగపోరాటాల వెల్లువలో కరీంనగర్ మాండలికంలో అల్లంరాజయ్య కథలు వెలువడుతున్నప్పుడు చాల మంది ప్రగతిశీల రచయితలు కూడ మాండలిక రచన సరైనది కాదంటూ, సృజన అల్లం వాసన వేస్తున్నదంటూ చర్చోపచర్చలు నడిపారు.

D98571616a copy ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం కాళోజీ చెప్పినట్టు “రెండున్నర జిల్లాల రెండున్నర కులాల దండిబాస” లోనే ఉంది. ఆ భాషను అందరూ ఆదరించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో వచ్చిన రచనలనూ తెలుగు సాహిత్యమంతా సాదరంగా ఆహ్వానించింది. కాని తెలంగాణ మాండలికంలో సాహిత్య సృష్టి మాత్రం అపరాధమైపోయింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలకు గొంతు ఇవ్వడానికి ప్రయత్నించి ‘మీ వాయిస్ కల్చర్ సరిగా లేదు’ అని తిరస్కారానికి గురైన తెలంగాణ పాత్రికేయులు, రచయితలు ఎందరో ఉన్నారు. 2002లో వెలువడిన నా కవితా సంపుటానికి పావురం (పక్షి కాదు, తెలంగాణలో ప్రేమ, నెనరు, వాత్సల్యం) అని పెట్టాలనుకున్నప్పుడు ఏ ఒక్క “ప్రామాణిక” నిఘంటువులోనూ ఆ మాట చేరలేదని గుర్తించాను. “ఎన్నో తెలంగాణ మాండలిక పదాలకు ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఐనా ఇవి ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కలేదు” అంటూ శబ్దరత్నాకరంలో స్థానం పొందని శబ్దాల జాబితా 1988లోనే ఒక పుస్తకం రాశారు రవ్వాశ్రీహరి. ఆ కృషినే కొనసాగించి ప్రధానంగా తెలంగాణ పదాలతో ఒక నిఘంటువు తయారుచేశారు. నలిమెల భాస్కర్ కూడ ఆ ప్రయత్నం చేశారు.

ఇది కేవలం భాష విషయంలో, కొన్ని పదాల విషయంలో మాత్రమే జరిగినది కాదు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సాహిత్యకారుల ప్రతిపత్తి, తెలంగాణ చరిత్ర వంటి అన్ని విషయాలలోను ఈ చిన్నచూపు, వివక్ష, నిర్లిప్తత, లోతైన పరిశోధన లేకుండానే తీర్పులు చెప్పడం వంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి.

ఉదాహరణకు కాకతీయుల మీద చాల సమగ్రమైన పరిశోధన చేసిన పి వి పరబ్రహ్మ శాస్త్రి 1978లో ప్రచురితమైన తన గ్రంథాన్ని ‘తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల శాసన పరిశోధన కష్టమయింది’ అనే అర్ధ సత్యంతో ప్రారంభించారు. కాని అప్పటికి డెబ్బై ఏళ్లుగా కొమర్రాజు లక్షణరావు, లక్ష్మణరాయ పరిశోధనా మండలి, మారేమండ రామారావు, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్రరావు, యాజ్దాని వంటి ఎంతో మంది పరిశోధకులు సాగించిన కృషిని ఇలా ఒక్కమాటతో కొట్టివేయడం ఆశ్చర్యమే గాని అసహజం కాదు.

ఇటువంటిదే మరొక ఉదాహరణ చెప్పాలంటే 1944లో హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో కీలకశక్తి, ప్రచురణకర్త, స్వయంగా రచయిత, బ్రిటిషాంధ్ర లో నిర్బంధ పరిస్థితులవల్ల హైదరాబాదు నుంచి తెలుగుతల్లి పత్రిక తేదలచినప్పుడు దాన్ని నిర్వహించినవాడు, 1945 మహాసభల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. కాని 1947లో ఆయనను నిజాం ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి నిరాకరించింది. ఆయనను రచయితగా అరెస్టు చేశారనడానికి ఆధారం లేదని తీర్మానాన్ని తోసిపుచ్చారు. తెలంగాణ రచయితల సాహిత్య ప్రతిపత్తి గురించి కోస్తా రచయితల వైఖరి అది.

ఇక బమ్మెర పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని సకల ఆధారాలూ ఉన్నప్పటికీ ఆయనను కడపకు తరలించడానికి ఒక శతాబ్దం పాటు సాహిత్యకారులనుంచి రాజకీయ నాయకులదాకా ఎందరెందరో ఎంత ప్రయత్నించారో చెప్పనక్కరలేదు.

రెండు తెలుగు భాషల మధ్య, రెండు సాహిత్య సంప్రదాయాల మధ్య, “ప్రామాణిక”, ప్రామాణికేతర సాహిత్య ధారల మధ్య కొన్ని దశాబ్దాలుగా సాగిన సంబంధంలో ఒక పార్శ్వం ఇది. దీన్ని ధిక్కరిస్తూ స్వాభిమానాన్ని ప్రకటించిన పార్శ్వం కూడ అంతే బలమైనది. ఒకరకంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన ఆ స్వాభిమాన కాంక్ష, వాస్తవచరిత్ర రచనాకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో బలోపేతమయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సాహిత్య చరిత్ర పునర్లేఖనం – వాస్తవ లేఖనం – జరగవలసి ఉంది. వర్తమానం గతంతో సంభాషించవలసి ఉంది. వర్తమానం ప్రసరించే కొత్త వెలుగులో గతం భాసిల్లవలసి ఉంది. గతవర్తమానాల మేలుకలయికగా భవిష్యత్తును సంపద్వంతం చేయవలసి ఉంది.

 

మీ మాటలు

 1. buchi reddy gangula says:

  వేణు గారు
  చాల చక్కగా వివరించారు —కొత్త చరిత్ర రచన అవసరం — రావాలి

  ———————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 2. rajaram thumucharla says:

  కొత్త చరిత్ర రచన జరిగి తీరాలి నిస్సందేహంగా.తెలంగాణ మాండలికం నిజంగా మాణిక్య వీణానాదమే.ఆ భాష న్యూనతకు గురికావడం వెనుక నేపథ్యాన్ని చక్కగా విశ్లేషించారు.

 3. ఇది ఒక చారిత్రక అవసరం. ఈ వ్యాస పరంపర పాఠకులకి తెలియజేయవలసినది చాలా వుంది. ఈ తరానికి మాత్రమే కాదు..భవిష్యత్తరాలకు కూడా. మంచి ప్రయత్నం వేణు. అఫ్సర్‌కి, మీకు అభినందనలు.

 4. వెల్లంపల్లి అవినాష్ says:

  తెలంగాణ సాహిత్య చరిత్రను తిరగరాయడం ప్రస్తుతం ఒక చారిత్రక అవసరం. తెలంగాణ మాండలికం లాగే, రాయలసీమ, కళింగాంధ్ర మాండలికాలు కూడా అవహేళనకు గురవుతున్నయ్. వాళ్ళను కూడా కలుపుకుపోవడానికి ప్రయత్నించాలి.

  • UMAMAHESWARA RAO C says:

   Standardization of any language will be done according to the political economical hegemony, no doubt, but at the same time it serves purpose of communication in bourgeois order, definitely a leap ahead, from its former state. And the endeavours should not be derogated as an exploitative one. Dr. Gopal Reddy was critical about this standardization of this Krishna Godavari dialect. Because of its proximity with Urdu dialect more words have flown into this standardization. (Ref. Telakapalli Ravi’s column on Telugu words in Prajasakthi) If we really assess certain districts of Rayala Seema speak dialect nearer to Telugu classical language. And the standard language should be conducive to take in more words from its different dialects and from other languages for its convenience. Mere slangs or dialects can not differentiate the people of one language and can not be a contention of alienation. There was no communication gap in the experiences between the village and hamlet bound people and toiling masses of Telangana and the comrades those have gone from Krushna, Guntur, Rayalaseema and other Telugu speaking places in Telangana armed struggle. Mr Venugopal’s reference of Mahakavi Gurazada Apparao is unwanted. It is not fair to say Mahakavi was driven by the authoritative culture. As standardization of language is not yet complete in Telugu still there is chance for rich inputs. (I am living in Chennai) I have observed so many words from the Telangana dialect have flown into other parts of the combined state because of proximity of Hyderabad electronic media (when ever I visited Hyderbad, Vijayawada and Vizag.) A methodical research is not done in Telugu culture and literature. Before the emergence of rationale probing the people’s literature is fully ignored and undermined, we know. Formation of Telangana is welcome if it reflects the culture of the toiling masses and in AP also the culture of people should reign.

 5. మహోజస్ మర్రిపూడి says:

  Standardization is an inevitable process of language as its speakers get more and more connected and civilized. In this process, a more evolved dialect will lead the rest. Ita is not possible to sustain dozens of dialects simultaneously as literary languages in a well-connected society of language-speakers. In the case of Telugu, its Mid-coastal dialect is such a highly evolved and expressive speech which can compete with international languages like English while writing on topics like science and translating them. If we don’t have a common standard dialect, we can never hope to spread our language among non-Telugu speakers.

మీ మాటలు

*