కొంచెం అటు ఇటుగా

ashok3

కొంచెం అటు ఇటుగా మనమంతా ఒకటే
కొంచెం ఇటు అటుగా నువ్వూ నేనూ
మనమంతా ఒకటే
నాకు నేనెప్పుడూ ఆకాశంకేసి సగర్వంగా
కొంచెం పొగరుగా తలెత్తిన పర్వతంలా కనపడతాను

నీకు నీవెప్పుడూ నింగిన రివ్వున ఎగిరే పక్షిలా
కొంచెం నేలను వెక్కిరిస్తూ కనపడతావ్‌

శిఖరాలు కూలుతాయనీ
విరిగిన రెక్కలతో పక్షి రాలిపోతుందనీ
మనకెందుకో నమ్మాలనిపించదు

సముద్రాన్ని ఎన్నటికీ వీడని పడిలేచే కెరటాల్లా
మన లోలోపలి తీరాలకేసి తలలు బాదుకుంటాయి
మానవ సహజ సకల ఉద్విగ్నతలు

కొంచెం అటు ఇటుగా మనందరం ఒకటే
దేనినో అందుకునేందుకు చేతులు చాస్తాం
దేనినో పొందకుండా వుండేందుకు
చేతులు ముడుచుకుంటాం
ఒకే మొఖంపైన ఎనెన్నో పదచిత్రాల్ని ముద్రిస్తాం

అవే కళ్ళు అవే కళ్ళు
అవే కళ్ళు మిలమిలా మెరుస్తాయి
అవే కళ్ళు ఎడతెగని దుఖాన్ని కురుస్తాయి
అవే కళ్ళు సుర్మా అద్దిన చూపులో కవ్విస్తాయి
అవే కళ్ళు క్రోధంతో ఎర్రబడతాయి

ఒకే మొఖంపై ఉశ్వాస నిశ్వాసాల
తిరోగమన పురోగమనాలు
మీసం కింద కొద్దిగా విచ్చుకున్న చిరు పెదవులు
మోహపు మధువుల వగలమారి పెదవులు
చప్పున ముద్దు పెట్టుకునే పెదవులు
అవే పెదవులు
రెండుగా చీలిన సర్పం పెదవుల్లా
మాటల విషాన్ని చిమ్ముతాయి

కొంచెం అటు ఇటుగా మనందరం ఒకటే
మోహిస్తాం, కలహిస్తాం
నవ్వుతాం, దుఖిస్తాం
ఆగ్రహిస్తాం, అనుయయిస్తాం
తల ఎగరేస్తాం, తలవంచుతాం

చివరికి, అంతా ముగిసిపోయాక
మరేం చేయలేక
కొంచెం అటు ఇటుగా మనమంతా
ఈ లోకం మొఖంపైన వస్త్రాన్ని కప్పి
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాం
కొంచెం అటు ఇటుగా

-విమల

vimala1

మీ మాటలు

  1. శిఖరాలు కూలుతాయనీ
    విరిగిన రెక్కలతో పక్షి రాలిపోతుందనీ
    మనకెందుకో నమ్మాలనిపించదు
    మన VANITY ని వదులుకోవాలిని ప్రయత్నించం
    చాలా బావుంది!

  2. బాగుందండి,.

  3. Bavundandi

  4. టి. చంద్ర శేఖర రెడ్డి says:

    మంచి కవిత. ఆ నాలుగు ముద్రారాక్షసాలు లేకపోతే, అనుభూతి స్థాయిలో ఆ కాస్త వెలితి కూడా ఉండేది కాదు. వదనాన్ని “మొఖం” అని రాయటం మనం ఎప్పటినుంచో అంగీకరిస్తున్నా అదే పదాన్ని రిపీటెడ్ గా వాడటం వల్ల భాష మీద మనకు అవసరమైనంత నియతి ఉన్నా లేదనిపించే ప్రమాదం ఉంది. మనకి ఉన్నది లేదనిపించేలా కవిత్వం రాయటం ఆమోదయోగ్యమా? పునరాలోచించండి.

    భవదీయుడు
    టి. చంద్ర శేఖర రెడ్డి
    09866302404

మీ మాటలు

*